12 ఏళ్లు

13:59 - July 10, 2018

హైదరాబాద్ : చెత్త బాధల నుంచి తమకు విముక్తి కలిపించాలంటూ.. జవహర్‌ నగర్‌  ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారు. కొన్నేళ్ళుగా పేరుకుపోయిన చెత్తతో ఇక్కడ జీవనమే ప్రాణాంతకంగా మారింది. కాగా.. ప్రజలకు చెత్త సమస్యలు తొలగించి.. ఆరోగ్యకరమైన వాతావరణం కలిపిస్తామని హామీ ఇస్తోంది బల్దియా.. ఇంతకీ ఇక్కడి ప్రజల బాధలేంటీ.. ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటో చూద్దాం..
విషతుల్యంగా  మారిన గాలి, నీరు, భూమి 
దాదాపు 12 ఏళ్లుగా హైదరాబాద్‌ నగర పరిధిలోని చెత్తనంతటినీ జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డులో పోగేశారు. దీంతో పరిసరాలన్ని విపరీతమైన కాలుష్యంతో నిండిపోయాయి.  గాలి, నీరు, భూమి విషపూరితంగా తయారయ్యాయి. ఈ సమస్యలనుంచి తమకు విముక్తి కలిపించాలని ఇక్కడి ప్రజలు ఎప్పట్నుంచో పోరాటాలు చేశారు. జవహర్‌నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీతోపాటు.. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, పాదయాత్రలు సైతం చేపట్టారు.
2001 నుంచి జవహర్‌నగర్‌కు చేరుతున్న చెత్త
2001 నుంచి చుట్టు ప‌క్కల మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల‌ చెత్తను జ‌వ‌హర్ న‌గ‌ర్ డంపింగ్ యార్డుకు  త‌ర‌లిస్తున్నారు.  2005 త‌రువాత నుంచి హైద‌రాబాద్‌లోని చెత్తను కూడా ఇక్కడికే తెచ్చిపోస్తున్నారు. దీంతో ఇక్కడ ఒక కోటి 20 ల‌క్షల ట‌న్నుల చెత్త పోగైంది. ఇది 135 ఎక‌రాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. దీన్నుంచి వ‌చ్చిన మురుగుతో చెరువుల‌ు, భూగ‌ర్బ జ‌లాల‌ క‌లుషితం అయ్యాయి. ఇక్కడి నీటిలో జీవులు ఏమాత్రం బత‌క‌లేవంటే ఏ స్థాయిలో కలుషితమైందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పటికే ఆరున్నర ల‌క్షల కిలో లీట‌ర్ల లీచ‌ట్ ఉత్పతి అయింది.
చెత్తను శాస్త్రీయ ప‌ద్ధతుల్లో నాశ‌నం చేసే ప్రాజెక్టుకు శ్రీకారం 
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక.. జవహర్‌ నగర్ యార్డుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనకి తెలుసని సీఎం కేసీఆర్‌   చెప్పారు. వారి సమస్యలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నట్లుగానే.. అందుకోసం చెత్తను శాస్త్రీయ ప‌ద్ధతుల్లో నాశ‌నం చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీన్ని రాంకీ ఎన్వీరో సంస్థకు జీహెచ్ఎంసీ క‌ట్టబెట్టింది.

 

16:38 - October 12, 2017

హైదరాబాద్ : సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం. అవినీతి జలగల పాలిట అదో పాశుపతాస్త్రం. గోప్యత లేని సమాజం కోసం రూపుదిద్దుకున్న ఆ చట్టానికి నేటితో పన్నేండేళ్లు నిండాయి.   ఎన్నెన్నో విజయాలతో   మరెన్నో ఒడిదుడుకలతో... ముందుకెళుతన్న సమాచార హక్కు చట్టంపై 10టీవీ స్పెషల్ స్టోరీ.
అవినీతి, కుంభకోణాలను బయటకు తీసిన ఆర్టీఐ
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం... ఉపాధిహామీ చట్టం, అటవీ హక్కుల చట్టంతోపాటు సమాచారహక్కు చట్టం తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలు పోరాడి సాధించికున్నవే.  సమాచార హక్కు చట్టం ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి కారణంగా 2005లో అది చట్టరూపం దాల్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌ 12న సమాచార హక్కుచట్టం కార్యరూపం దాల్చింది. ఈ చట్టం వచ్చి నేటికి సరిగ్గా 12ఏళ్లు పూర్తయ్యాయి.  ఈ 12ఏళ్లలో ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చట్టం తనదైన ముద్రవేసింది. అంతేకాదు అనేక అవినీతి చర్యలను, కుంభకోణాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
104 దేశాల్లో అమల్లో ఉన్న సమాచార హక్కుచట్టం
సమాచార హక్కుచట్టం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాల్లో అమల్లో ఉంది. అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, ప్రభుత్వాలు, వాటి అంగాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, తద్వారా అవినీతి అరికట్టబడాలన్నా ఆయా అంశాలపై ప్రజలకు విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వాలు, ప్రభుత్వాంగాలు ఎలాంటి గోప్యత లేకుండా తాము చేస్తున్న  పనులు, వాటి వివరాలు, ఆయా సంస్థల విధులు, వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ చట్టం లక్ష్యం. 
సమాచార హక్కుచట్టంతో బయటపడ్డ పాలకుల అవినీతి
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి అనేక అవినీతి విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ కుంభకోణాలు వెలుగుచూశాయి. అంతేకాదు.. సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారులు పారదర్శకంగా నడుచుకోవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సమాచారాన్ని తెలుసుకోవడం, దానిని ప్రజలందరికీ తెలియజేయడం, ప్రభుత్వాలను , అధికారులను ప్రశ్నించే గొంతుకగా సమాచార హక్కుచట్టం నిలుస్తోంది. అప్పటికీ స్పందనరాకుంటే కోర్టులను ఆశ్రయించి , ఫలితాలు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు సమాచార హక్కు కార్యకర్తలు. ఈ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్న చాలామంది పలు కీలక అంశాలను వెలికితీసి ... పాలకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. అక్కడక్కడ సమాచార హక్కు చట్టాన్ని పాలకులు, అధికారులు తొక్కిపట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారాన్ని అడిగినప్పుడు ఇవ్వకుండా,  లేదా తప్పుడు సమాచారాన్ని లేదా పాక్షిక సమాచారాన్ని ఇస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ నిత్యం ప్రజలకు అందించాల్సిన సమాచారంలో అలసత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఆర్టీఐ వినియోగిస్తున్న జర్నలిస్టులపై దాడులు
సమాచార హక్కుచట్టంలో అతిముఖ్యమైనది 4(1)(బి). ఈ సెక్షన్‌ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, తమకు వస్తున్న నిధులు, వారు చేస్తోన్న ఖర్చులు, పథకాల అమలు , వాటి లబ్దిదారులవంటి వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలి. మొత్తంగా ఓ 17 అంశాలను ఎవరు అడిగినా, అడగకపోయినా స్వచ్చందంగా వెల్లడించాలి. అలా చేస్తే ప్రభుత్వ  కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. దీంతో దరఖాస్తులు కూడా తగ్గిపోతాయి. ఈ విషయాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చెయ్యడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడానికి ఉపయోగపడుతుంది. సమాచార హక్కుచట్టం పలు అవినీతి అక్రమాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సమాచార హక్కు కార్యకర్తలపైన, ఈ హక్కును బాగా వినియోగిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు పెరుగుతున్నాయి.  దీనిని నిలువరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆర్టీఐపై అవగాహన కల్పించాలి..
సమాచార హక్కుచట్టం వచ్చి 12ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహనలే లేదు. ప్రభుత్వాలు, సమాచార కమిషన్లు ఈ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడే అధికారుల్లో బాధ్యత, అవినీతిపరుల్లో భయం పెరుగుతుంది.

 

Don't Miss

Subscribe to RSS - 12 ఏళ్లు