aadhaar card

16:43 - December 6, 2018

ఢిల్లీ  : ఆధార్ కార్డుతో దేశంలో పలు మార్పులొచ్చాయి. ఏ గుర్తింపుకైనా ఆధార్ కార్డే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయాలంటే ఆధార్ వుండాల్సిందే. ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధారే ఆధారంగా వుంది. కాగా విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ వర్తించాలంటే ఈ ఆధార్ కార్డే ఆధారం. 
ఇటీవ‌ల ఆధార్‌ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఆధార్ చ‌ట్టంలోని 57వ సెక్ష‌న్‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థ‌లు వినియోగించుకోరాద‌ని త‌న ఆదేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకించింది. 
కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు..
దీంతో ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్ర‌తిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి కూడా. దీంతో దేశ పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది. 
18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం..
దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్ర‌తిపాద‌నలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఎవ‌రైనా త‌మ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌నున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన న్యాయ‌శాఖ‌.. దీన్ని ప్ర‌తి పౌరుడికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 
పాన్ కార్డు లేని వారికి కొత్త నిబంధ‌న ఉప‌యోగం..
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54 కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది. 

06:57 - September 26, 2018

ఢిల్లీ : ఆధార్‌.. ఆధార్‌.. ఆధార్‌.. అన్నిటికీ ఆధారే ఆధారమైపోయింది. ప్రభుత్వంతో ముడిపని ఏపనికైనా ఆధార్‌ తప్పనిసరైపోతోంది. అంతేకాదు... వ్యక్తిగతమైన అవసరాలకూ ఆధార్‌ ఆధారమవుతోంది. ప్రతీ దానికి ఆధారే కీలకమైపోతుండడంతో వ్యక్తిగత సమాచార భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు వ్యక్తమవుతుండంతోనే కొంతమంది సుప్రీంను ఆశ్రయించారు. వేలిముద్రలు, ఐరిష్‌ స్కాన్‌ తప్పనిసరి చేయొద్దంటూ పిటిషన్‌ వేశారు. ఆధార్‌ చట్టబద్దత, చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో సుప్రీంతీర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది.

మనదేశంలో పసిపాప నుంచి పండు ముసలి దాకా అందరికీ ఆధార్‌ తప్పనిసరి అయింది. సెల్ ఫోన్‌ వాడాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌కార్డ్‌..ఇలా ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందే. ఇప్పటికే వంద కోట్ల భారతీయులు ఆధార్‌ను కలిగి ఉన్నారు. దీన్ని ఐడెంటిటీ ప్రూఫ్‌గా వాడుతున్నారు. ఐతే ఆధార్ కార్డ్‌ అమలు తీరుపై , వ్యక్తిగత సమాచారం లీకేజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆధార్ లో ఉండే 12 అంకెల యుఐడీ నంబర్ ద్వారా సదరు వ్యక్తి సమాచారం తెలుసుకోవచ్చు.  ఇప్పటికే కోట్ల మంది తమ ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్‌ సంస్థల్లో గుర్తింపు కార్డు ప్రూఫ్‌గా ఆధార్‌ను సమర్పించారు. దీంతో తమ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉండబోదన్న సందేహాలు మొదలయ్యాయి. 

రాజ్యాంగం ఇచ్చిన గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఆధార్ ఉల్లంఘిస్తోందంటూ..దాని చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో 37 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని 38 రోజుల పాటు విచారణ జరిపింది. ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. కేంద్రం మాత్రం ఆధార్‌ను అనేక వాటితో అనుసంధానం చేయడాన్ని సమర్థించుకుంటోంది. అవినీతిని నిరోధించడం, బ్లాక్ మనీని అరికట్టడం,  నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతోనే ఆధార్‌ అనుసంధానం చేపట్టామని చెబుతోంది. ఆధార్‌ డేటా భద్రంగా ఉంటుందని ఎట్టిపరిస్థితుల్లోనూ హ్యాక్‌ చేయడం కుదరదని తెలిపింది. 

18:30 - September 5, 2018

ఢిల్లీ : ఆధార్ ఇప్పుడు అన్నింటికి అదే ఆధారం. ఇది లేకుంటే ఏపనీ జరగదు. ఇది ప్రతీ భారతీయుడు హక్కు. అన్నింటికి అధారే ఆధారం. ఈ క్రమంలో ఆధార్ కార్డు లేదని స్కూల్లో పిల్లకు అడ్మిషన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన సందర్బం వెలుగులోకి వచ్చింది. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పందించింది. ఆధార్ కార్డు లేని కారణంగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు నిరాకరించరాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది. ఇలాంటి కారణంతో అడ్మిషన్లు నిరాకరించడం చట్టవిరుద్ధమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ చర్యలకు బదులుగా స్థానికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆధార్ కార్డుల కోసం ఎన్ రోల్ మెంట్ చేయించాలని యూఐడీఏఐ సూచించింది.

ఇటీవలి కాలంలో కొన్ని పాఠశాలలు ఆధార్ లేదన్న వంకతో విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని యూఐడీఏఐ తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆధార్ కోసం పాఠశాలలు ఒత్తిడి చేయడంతో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని..విద్యార్థుల వద్ద ఆధార్ లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటు యూఐడీఏఐ సర్క్యులర్ జారీచేసింది. 

11:28 - November 4, 2017

ఇప్పుడు ఏ బ్యాంకులో అకౌంట్ తీయలన్న ఆధార్ తప్పనిసరి మరి ఇదివరకు బ్యాంకు అకౌంట్ ఉన్నవారు ఆధార్ ను లింక్ చేసుకోవాలి. ఆధార్ లింక్ చేసుకోవాలని బ్యాంకుల నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. అయితే ప్రతి వ్యక్తి వ్యక్తిగతవగా బ్యాంకు కు వెళ్లి తన ఆధార్ లింక్ చేసుకోడం సాధ్యం కాదు ఎందుకంటే అకౌంట్ హోల్డర్లలో వృద్ధులు, వికలాంగులు ఉంటారు. వీరు బ్యాంకు వచ్చి ఆధార్ లింక్ చేసుకోవడమంటే కష్టంగా ఉంటుంది. ఈ అంశంపై ఏస్ బీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, డిప్యూటీ మేనెజింగ్ డైరెక్టర్ నీరజ్ వ్యాస్ మాట్లాడుతూ ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్ ను బ్యాంకు అధికారులకు ఫోన్ ద్వారా అందిస్తే చాలని స్పష్టం చేశారు. బ్యాంకు బ్రాంచ్ వారు ఓ ఫోన్ నెంబర్ ఇస్తారు అదే ఫోన్ నెంబర్ కు ఖాతాదారులు ఫోన్ చేసి ఆధార్ నెంబర్ చెప్పాలని సూచించాడు. బ్యాంకు అకౌంట్ నెంబర్ తో ఆధార్ లోని పేరు, లింగం, వయస్సు సరిపోలకుంటే ఖాతాదారు బ్యాంకు రావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 31, 2017వరకు అకౌంట్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం చేయాలి లేకుంటే ఆధార్ లింక్ చేసేవరకు అకౌంట్ ను నిద్రవస్థలో(హోల్డ్) లో ఉంచుతారు.

21:31 - November 3, 2017

ఢిల్లీ : ఆధార్‌ను తమ ఖాతాలతో అనుసంధానం చేసుకోకుంటే అకౌంట్లు నిలిపివేస్తామని బ్యాంకులు, మొబైల్‌ కంపెనీలు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ ఒత్తిడి పెంచడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్ లింకింగ్ సందేశాలు పంపితే అందులో కచ్చితంగా చివరి తేదీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ నెంబర్లతో ఆధార్‌ అనుసంధానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లపై బదులివ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ కోసం డిసెంబర్‌ 31, మొబైల్‌ నెంబర్‌కు ఆధార్‌తో లింకేజీ కోసం ఫిబ్రవరి 6 గడువు విధించినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.

13:02 - July 28, 2016

ఢిల్లీ : ఆధార్‌ కార్డ్‌ అంశంపై రాజ్యసభ అట్టుడికింది. ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. ఆధార్ కార్డులు లేని పేదల జీవితాలతో కేంద్రం ఆటలాడుతుందని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఆధార్‌ కార్డులు లేవన్న వంకతో రేషన్‌ కార్డులు, పెన్షన్లు, గ్యాస్‌ కనెక్షన్లు రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన సబ్సిడీపై కోత విధించవద్దన్నారు. వెంటనే కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. 100 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు ఇచ్చేందుకు పనులు యుద్ధప్రాతిపదిన జరుగుతున్నాయని వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. డైరెక్ట్ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానం ద్వారా ప్రజలకు మరింత మేలు కలుగనుందని స్పష్టం చేశారు. అయినా విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

14:50 - November 25, 2015

విశాఖ : ఆధార్ కార్టు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఆ కార్డు పొందాలంటే మాత్రం రాజకీయ నేతల చుట్టూ తిరిగేలా నిబంధనలు పొందుపరిచింది. కొత్త కార్టు కోసం దరఖాస్తు చేసేవారికి ఆ ప్రాంత ఎమ్మెల్యేల గుర్తింపు ధ్రువ పత్రం ఉంటే తప్ప కార్డు ఇవ్వబోమని విశాఖలోని కార్వీ సంస్ధ పెడుతున్న ఆంక్షలు ప్రజలకు అష్ట కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

ఇప్పటికీ రకరకాల నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ..

ఆధార్ కార్డు.. ప్రతి ఒక్కరికి అత్యవసరం.. ఇది సర్కారు చెప్పే మాట. ఆధార్ కోసం ఇప్పటికీ రకరకాల నిబంధనలు పెట్టిన ప్రభుత్వం .. కొత్తగా ఎమ్మెల్యేల ధ్రువ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఆయా ప్రైవేటు ఏజెన్సీలకు పరోక్షంగా ఆదేశాలు సైతం జారీచేసింది. కొత్తగా ఎవరైనా ఆధార్ కార్డు కోసం వెళ్తే .. నియోజకవర్గ ఎమ్మెల్యే ధ్రువపత్రం తప్పనిసరి చేస్తూ విశాఖలోని కార్వీ అనే ఏజెన్సీ ప్రజలకు ముప్పతిప్పలు పెడుతోంది.

ఎమ్మెల్యే ధ్రువ పత్రం అవసరం లేకపోయినా...

వాస్తవానికి ఎమ్మెల్యే ధ్రువ పత్రం అవసరం లేదు. కళాశాలలో చదివే విద్యార్ధులకు ఆయా కాలేజీ నుంచి గుర్తింపు పత్రం చాలు. కొన్నింటికి గెజిటెడ్ అధికారి గుర్తింపు అవసరం. మరీ అవసరమైతే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే గుర్తింపు పత్రం అవసరం అని నిబంధనల్లో పెట్టారు. కాని విశాఖలోని కార్వీ సంస్ధ వచ్చే ప్రతివారికి ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే కార్డు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు.

ఇసుక తోట ప్రాంతంలో ఉన్న కార్వీ ఏజెన్సీలో....

విశాఖ ఇసుక తోట ప్రాంతంలో ఉన్న కార్వీ ఏజెన్సీలో ఆధార్ కార్డుల కోసం గుర్తింపు ధ్రువప్రతాలు, ఐరిస్ గుర్తింపు జరుగుతోంది. కార్డుల కోసం వచ్చేవారికి సంస్ధ ప్రతినిధులు ఇస్తున్న సమాధానాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఆధార్ కార్డుల మంజూరుకు రాజకీయాలు జోడించడం.. టిడిపి ఎమ్మెల్యేల ప్రాంతాలలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గుర్తింపు ధ్రువపత్రం ఉండాలని హుకుం జారీచేస్తున్నారు. దీంతో ఆధార్‌ గుర్తింపు విశాఖ వాసులకు కష్టాలు తెప్పిస్తోంది.

06:33 - July 21, 2015

హైద్రాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్ల ఏరివేతపై సర్కార్‌ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ కార్డుకు ఆధార్‌తో అనుసంధానాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. దాన్ని 20 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్‌ సీఎంతో భేటీ అయ్యారు. హైద్రాబాద్‌లో దాదాపు 15 లక్షల బోగస్ ఓటర్లున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66 శాతం ఓటర్లు ఉండాల్సి ఉంది. కాగా హైద్రాబాద్‌లో ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని సీఎం అన్నారు. బోగస్ ఓట్లు రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారు.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితా రూపొందాలని సీఎం అన్నారు. హైద్రాబాద్‌లోని ఓటర్లంతా తమ ఆధార్ కార్డుతో అనుసంధానం కాకుంటే ఓటు హక్కు ఉండదని కూడా స్పష్టం చేశారు. అందుకే వయోజనులందరూ.. తమ ఓటును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనికి ప్రజలు, పార్టీలు సహకరించాలన్నారు. ఆధార్ అనుసంధానంపై ప్రజల్లో అవగాహన కల్పంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

Don't Miss

Subscribe to RSS - aadhaar card