amaravathi

11:00 - May 21, 2018

తిరుమల : తిరుమలలో విధుల నుంచి తొలగించబడిన రమణ దీక్షితులు - టీటీడీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. శ్రీవారి కైంకర్యాలు, నిత్య నివేదనల్లో అధికారులు, పాలక మండలి జోక్యం పెరిగిపోయిందని రమణదీక్షితులు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకమండలి.. రమణదీక్షితులకు 65 ఏళ్ల వయోపరిమితితో రిటైర్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో రమణదీక్షితులు శ్రీనివాసుని ఆభరణాలు, సంపద పక్కదారి పడుతున్నాయని వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వందల ఏళ్లనాడి రూబీ వజ్రం స్వామివారి ఖజానా నుంచి మాయం అయిందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

శ్రీనివాసుని ఆభరణాల భద్రతపై ఆందోళనలు
తిరుమల శ్రీనివాసుని ఆభరణాల భద్రతపై మరోసారి ఆందొళనలు వ్యక్తం అవుతున్నాయి. విధుల నుంచి తప్పించిన తర్వాత పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పలు ఆసక్తి కర విషయాలు వెల్లడిస్తున్నారు. టీటీడీ బోర్డుపై తీవ్రస్థాయిలో అరోపణలు చేస్తున్నారు.

రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలంటు డిమాండ్‌
స్వామివారి ఆభరణలు, ఇతర విలువైన సంపద మాయం అవుతోందని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. శ్రీవారికి రూబీ వజ్రం కనిపించడం లేదని.. ఇటీవల జెనీవా నగరంలో వేలానికి ఉంచిన గులాబీరంగు వజ్రం అదే కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. స్వామివారి సంపద మాయం కావడంపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

రమణదీక్షితులు ఆరోపణలను ఖండిస్తున్న అర్చకులు..
అయితే 2001 నుంచి రూబీ వజ్రం కనిపించకుండా పోయిందన్న రమణదీక్షితులు ఆరోపణలను మిగత అర్చకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వాస్తవానికి 2001లో శ్రీవారి ఆభరణాలను టీటీడీకి అప్పగించింది. రమణదీక్షితులేనని.. రూబీ మాయం కావడం మిగతా వారికంటే ఆయనకే ఎక్కువగా తెలిసి ఉంటుందని అంటున్నారు. మరోవైపు రమణ దీక్షితులు ఆరోపణలను టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ ఖండించారు. శ్రీవారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏటా శ్రీవారి ఆభరణాలను భక్తుల కోసం ప్రదర్శించేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. స్వామివారి నివేదనలు, కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రయుక్తంగానే జరుగుతున్నాయని ఈవో సింఘాల్‌ చెప్పారు.

కట్టడాలను కూల్చివేస్తున్నారంటు రమణదీక్షితులు ఆరోపణలు
మరోవైపు వేల ఏళ్లనాడి కట్టడాలను అనవసరంగా కూల్చివేశారన్న రమణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ వివరాలన్నీ బయటపెట్టింది. పోటు మరమ్మతు పనులతోపాటు వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు.. రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆలయ౦లోని వకుళామాత పోటులో... ఎటువంటి తవ్వకాలు జరపలేదని.. కేవలం మరమ్మతులను మాత్రమే చేశామని టీటీడీ స్పష్టం చేసింది.

పరిణామాలు బాధాకరం : అర్చకులు వేణుగోపాల దీక్షితులు
కాగా శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసేలా రమణదీక్షితులు ఆరోపణలు చేశారని అన్నారు. రమణదీక్షితులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

18:53 - May 14, 2018

అమరావతి : పోలవరాన్ని అడ్డుకునేందుకు జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా.. వాటన్నింటిని అధిగమించి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా కొనసాగుతుండడంతో.. అడ్డుకునేందుకు మళ్లీ కొత్త కొత్త కేసులు వేస్తున్నారన్నారు. జూన్‌ 11 వరకు డయా ఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తామన్నారు దేవినేని. 

21:50 - May 9, 2018

గుంటూరు : 2029 కంటే ముందే దేశంలో ఏపీ  నంబర్‌వన్ రాష్ట్రం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఇన్నోవేటర్స్ ఏపీకి వచ్చేలా  కార్యక్రమాల రూపకల్పన జరగాలన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలన్నారు. ఉండవల్లిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెండో రోజూ పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు. 
సమష్టి కృషితో అద్భుతాలు : సీఎం చంద్రబాబు
సమష్టి కృషితో అద్భుతాలు సాధించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు నాయకులు సమన్వయంతో  పనిచేసి.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామికగా నిలపాలన్నారు. ఉండవల్లిలో జరగుతున్న కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వివిధ శాఖల అధికారులపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2029 కన్నా ముందే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  అధికారులను చూశాక ఆ నమ్మకం మరింత పెరిగిందన్నారు. ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలకు ఏపీ వేదిక కవాలన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఈ విషయంలో ముందుందని, గ్రామాలకు సంబంధించి సమస్త సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడం అభినందనీయమన్నారు.
కాల్‌సెంటర్‌తో అవినీతిపై యుద్ధం 
కలెక్టర్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలు ' కాల్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు సమర్థంగా పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సమాచారాన్ని ఆర్టీజీ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తామని.. ఈ సమాచారాన్ని అధికారులు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. 
అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం 
గత నాలుగేళ్లుగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఫలితాల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్న ముఖ్యమంత్రి... విజయం అనేది నిరంతరం శ్రమతో సాధ్యమని, కొద్దిపాటి మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. అమరావతి లాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదేనని.. తాము చేపడుతున్న కార్యక్రమాలు ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోతున్నాయన్నారు.  నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంవో అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. 

 

16:24 - May 9, 2018

గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. రోజా రాజకీయాలు మానుకుని సినిమాలు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. రాజకీయాలంటే జబర్దస్తీ సీరియల్‌ కాదని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే ఒక ఎంటర్‌టైన్‌ మెంట్‌గానే రోజా భావిస్తున్నారంటున్న ఆదినారాయణ రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. రాజకీయాలకు రోజా తగరని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై నోటికి వచ్చినట్టు రోజా  మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-

11:04 - May 9, 2018

విజయవాడ : ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగిందని, సమిష్టి కృషి..అందరి కృషి భాగస్వామ్యంతోనే ఇది జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షోభంంలోనూ సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి సాధించడం జరిగిందని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని బాబు సూచించారు. 

13:14 - May 8, 2018

విజయవాడ : వైసీపీపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు లేదన్నారు. ఆంధ్రా రాష్ట్రానికి వెన్నుపొడిచిన వ్యక్తి జగన్ అని, బీజేపీతో చేతులు కలిపారని పేర్కొన్నారు. కేసులు నుండి బయట పడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద పణంగా పెట్టారని, కర్నాటక రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

12:43 - May 7, 2018

విజయనగరం : జిల్లాలో 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ పాల్ రాజు ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. 

12:21 - May 7, 2018

గుంటూరు : జనాభా నియంత్రణలో కేరళ రాష్ట్రం ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. జనాభా నియంత్రణ ఒకేసారి సాధ్యం కాదన్నారు.  అందరి అంతిమ లక్ష్యం పేదరిక నిర్మూళనేనని పేర్కొన్నారు. పేదరిక నిర్మూళన కోసం అనేక విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూడటం లేదని వాపోయారు. విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం చేయడం లేదని విమర్శించారు. 

11:32 - May 7, 2018

గుంటూరు : అమరావతిలో విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ఏపీ సీఎం చంద్రబాబు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీతోపాటు 5 రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొన్నారు. ఏపీ, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నియమనిబంధనలపై చర్చిస్తున్నారు. 

 

10:29 - May 7, 2018

గుంటూరు : మహిళలు, బాలికలపై జరుగుతోన్న లైంగిక దాడులను అరికట్టేందుకు ఆడబిడ్డకు రక్షగా కదులుదాం పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య ర్యాలీలు నిర్వహించనుంది ప్రభుత్వం. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలు ఎక్కడా జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. విజయవాడలో నిర్వహించే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ర్యాలీని ప్రారంభించి ఇందిరాగాంధీ క్రీడా మైదానంకు చేరుకుంటారు. అనంతరం నిర్వహించే సభలో సీఎం ప్రసంగిస్తారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - amaravathi