amaravati

18:49 - June 14, 2018

విజయవాడ : టీడీపీపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ మొన్నటి వరకు ఎన్డీయేతో కలిసి రాష్ట్రాని దెబ్బతీసిందన్నారు. ఇందులో భాగంగానే కడప ఉక్కు కర్మాగారాన్ని తుక్కుతుక్కు చేయాలనే పధకం వేశారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలని మభ్యపెట్టి.. ఓట్లు సాధించుకునేందుకు కొత్త పథకం వేశారన్నారు అంబటి. 

21:34 - June 12, 2018

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ సమన్వయ కమిటీ ఆరోపించింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ.. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏపీ అభివృద్ధికి చారిత్రక అవసరమని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు... ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం..
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఆధారాలు లేకుండా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న టీడీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు తెలుగుదేశం ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రధానంగా చర్చించారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ప్రపంచంలో రెండు భిన్నధృవాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శాంతి కోసం సింగపూర్‌లో కలిసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అలాంటి సింగపూర్‌ ప్రభుత్వం.. ఏపీని నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. వైపీసీ ప్రయోజనాలు కాపాడేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారంటూ... దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించింది.

సరిగా పనిచేయకపోయినా బహిరంగ విమర్శలు చేస్తున్న నాయకులు
మరోవైపు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించిన చంద్రబాబు.. కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ముదురుతున్న అంతర్గత కలహాలను ప్రస్తావించారు. పరోక్షంగా కడప టీడీపీ నేతలు వరదరాజులురెడ్డి, సీఎం రమేశ్‌ వ్యవహారాన్ని గుర్తు చేశారు. కొందరు నేతలు సరిగా పనిచేయకపోయినా... బహిరంగ విమర్శలకు దిగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. పనిచేయకపోయినా మారతారన్న ఉద్దేశంతో ఇంతకాలం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధినేత ఏమీ పట్టించుకోవడం లేదంటూ.. ఏదైనా చేయొచ్చనుకుంటే పొరపాటని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రోజు ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన వద్ద ఉన్నాయని, తాను తీసుకునే చర్యలకు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేబోనని తేల్చిచెప్పారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కూడా చంద్రబాబు మండిపడ్డినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.చంద్రబాబు సూచనలను తెలుగుదేశం నాయకులు ఎంతవరకు వంటపట్టించుకుంటారో, హెచ్చరికలను ఎంతవరకు ఖాతరు చేస్తారో, పద్ధతులు ఎంతవరకు మార్చుకుంటారో చూడాలి. 

16:42 - June 12, 2018

అమరావతి : టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చందబాబుపై ఈ పార్టీల నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న వాస్తవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించింది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో... ప్రతిపక్షాలది కుట్రల కూటమి అని విమర్శించారు. జగన్‌ ప్రయోజనాలను కాపాడేందుకే కమలనాథులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.  

16:17 - June 12, 2018

అమరావతి : రాజధాని అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నేతలకు దిశా నిర్ధేశం చేశారు. జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులుగా వున్నవారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం సూచించారు. మీడియాలో వచ్చే ప్రతీ విషయానికి నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనీ..ఎక్కువగా స్పందించవద్దని చంద్రబాబు క్లాస పీకారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఆదేశించారు. అలాగే ఎన్నికల సమయంలో ఈవీఎంల దుర్వినియోగంపై నేతలంతా అప్రమత్తంగా వుండాలని మంత్రి యవనమల సూచించారు. కాగా ఈ సమావేశానికి పలువురి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాకపోవటంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

12:44 - June 12, 2018

గుంటూరు : చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల్లో జరగాల్సిన ధర్మ పోరాట సభలపై చర్చిస్తున్నారు.

 

11:50 - June 12, 2018

గుంటూరు : కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. జిల్లాల అధ్యక్షులు చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. 

 

21:12 - June 1, 2018

విజయవాడ : ఏపీలో శనివారం నుంచి నవనిర్మాణ దీక్షలు జరుగనున్నాయి. విజయవాడ వేదికగా సాగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 నుంచి రెండు గంటల పాటు దీక్షను నిర్వహిస్తారు. అదే సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు.. ప్రజలను కలుపుకు పోతూ.. నవనిర్మాణ దీక్షను చేపడతారు. రాష్ట్ర విభజన తర్వాత.. ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్నట్లే.. ఈసారీ జూన్‌ రెండో తేదీ నుంచి.. ఏపీలో నవనిర్మాణ దీక్షలు చేపట్టనున్నారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా విజయవాడ వేదికపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షలో పాల్గొంటారు. బందరు రోడ్డులోని బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 గంటల నుంచి 11 వరకూ దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

బెంజ్‌ సర్కిల్‌లో నవనిర్మాణ దీక్షకు దాదాపు 25 వేల మందిని సమీకరించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని దీక్షాస్థలి వద్ద నాలుగు వైపులా కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రాథమిక చికిత్సలు అందించేందుకు వైద్య బృందాన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. దీక్షలో పాల్గొన్న వారితో సీఎం ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విభజన చట్టం హామీలు, వాటి అమలు తీరుతెన్నులపై దీక్షలో సీఎం ప్రసంగించనున్నారు.

నవనిర్మాణ దీక్షలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దీక్ష సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జూన్‌ 1వ తేదీ రాత్రి నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌ మళ్లింపు అమలులో ఉటుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

విజయవాడతో పాటు.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 970 గ్రామ పంచాయితీలు, 275 మున్సిపల్‌ వార్డుల్లో నవనిర్మాణ దీక్షలు సజావుగా జరిగేలా నోడల్‌ ఆఫీసర్లకు, మండలస్థాయిలో స్పెషల్‌ ఆఫీసర్లకు కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు బాధ్యతలు అప్పగించారు. జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నవనిర్మాణ దీక్షలు చేపడతారు. బెంజ్‌ సర్కిల్‌లో నవనిర్మాణ దీక్ష చేపట్టడం పై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కల్గించే చర్యలు ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.

21:03 - June 1, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా తనకు జీవన్మరణ సమస్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. ధర్మపోరాటం కొసాగుతుందన్న చంద్రబాబు.. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా ఏపీలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. అభివృద్ధిలో ప్రజలను పునరంకితులును చేసేందుకు శనివారం నుంచి వారం రోజుల పాటు ఏపీలో నవ నిర్మాణ దీక్షలు చేపడతున్నారు. అధికారులు, ప్రజలు ఈ దీక్షల్లో భాస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నవ నిర్మాణ దీక్షల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. ఇది తనకు జీవన్మరణ సమస్య అని చంద్రబాబు చెప్పారు. విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని అడిగితే.. అణగదొక్కాలని చూస్తే సహించబోమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నవ నిర్మాణ దీక్షలు జరిగే వారం రోజుల పాటు నిత్యం ఒక్కో అంశంపై సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

13:25 - June 1, 2018

గుంటూరు : చంద్రన్న బీమా 3వ ఏడాది కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 2016లో 2.13 కోట్ల మందితో బీమా పథకం ప్రారంభమైంది. రెండేళ్లలో లక్షన్నర కుటుంబాలకు రూ.2 వేల కోట్లు బీమా చెల్లించారు. రెండున్నర కోట్ల మందితో దేశంలోనే పెద్ద బీమా పథకంగా చంద్రన్న బీమా పథకం గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనులు సమర్థవంతంగా ఉండి పేదలకు న్యాయం చేసేవారే తన మిత్రులు సీఎం అన్నారు. సహాయం ఇన్ టైమ్ లో చేయాలన్నారు. సహాయం చేసేది బాధపెట్టే విధంగా ఉండకూడదని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సంక్షేమ పథకాలు సజావుగా ప్రజలకు చేరాలన్నారు. గతంలో దెయ్యాలు పించన్లు తీసుకునేవని.. చనిపోయిన వారి బదులు వేలి ముద్ర వేసి పించన్లు తీసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని...అర్హులు మాత్రమే పించన్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

 

11:33 - May 31, 2018

గుంటూరు : నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈసమావేశంలో 10వ పీఆర్ సీ కేటాయింపులపై చర్చించనున్నారు. అగ్రిగోల్డు బాధితుల సమస్యలపైనా చర్చ జరుపనున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - amaravati