amendments

16:38 - October 12, 2017

హైదరాబాద్ : సామాన్యుడికి అదో బ్రహ్మాస్త్రం. అవినీతి జలగల పాలిట అదో పాశుపతాస్త్రం. గోప్యత లేని సమాజం కోసం రూపుదిద్దుకున్న ఆ చట్టానికి నేటితో పన్నేండేళ్లు నిండాయి.   ఎన్నెన్నో విజయాలతో   మరెన్నో ఒడిదుడుకలతో... ముందుకెళుతన్న సమాచార హక్కు చట్టంపై 10టీవీ స్పెషల్ స్టోరీ.
అవినీతి, కుంభకోణాలను బయటకు తీసిన ఆర్టీఐ
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం... ఉపాధిహామీ చట్టం, అటవీ హక్కుల చట్టంతోపాటు సమాచారహక్కు చట్టం తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలు పోరాడి సాధించికున్నవే.  సమాచార హక్కు చట్టం ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాల ఒత్తిడి కారణంగా 2005లో అది చట్టరూపం దాల్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌ 12న సమాచార హక్కుచట్టం కార్యరూపం దాల్చింది. ఈ చట్టం వచ్చి నేటికి సరిగ్గా 12ఏళ్లు పూర్తయ్యాయి.  ఈ 12ఏళ్లలో ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చట్టం తనదైన ముద్రవేసింది. అంతేకాదు అనేక అవినీతి చర్యలను, కుంభకోణాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
104 దేశాల్లో అమల్లో ఉన్న సమాచార హక్కుచట్టం
సమాచార హక్కుచట్టం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాల్లో అమల్లో ఉంది. అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడం, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయాలన్నా, ప్రభుత్వాలు, వాటి అంగాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, తద్వారా అవినీతి అరికట్టబడాలన్నా ఆయా అంశాలపై ప్రజలకు విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వాలు, ప్రభుత్వాంగాలు ఎలాంటి గోప్యత లేకుండా తాము చేస్తున్న  పనులు, వాటి వివరాలు, ఆయా సంస్థల విధులు, వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ చట్టం లక్ష్యం. 
సమాచార హక్కుచట్టంతో బయటపడ్డ పాలకుల అవినీతి
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటినుండి అనేక అవినీతి విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా వివిధ కుంభకోణాలు వెలుగుచూశాయి. అంతేకాదు.. సంస్థలు, ప్రభుత్వ శాఖలు, అధికారులు పారదర్శకంగా నడుచుకోవడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. సమాచారాన్ని తెలుసుకోవడం, దానిని ప్రజలందరికీ తెలియజేయడం, ప్రభుత్వాలను , అధికారులను ప్రశ్నించే గొంతుకగా సమాచార హక్కుచట్టం నిలుస్తోంది. అప్పటికీ స్పందనరాకుంటే కోర్టులను ఆశ్రయించి , ఫలితాలు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు సమాచార హక్కు కార్యకర్తలు. ఈ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్న చాలామంది పలు కీలక అంశాలను వెలికితీసి ... పాలకులు, అధికారుల తీరును ఎండగడుతున్నారు. అక్కడక్కడ సమాచార హక్కు చట్టాన్ని పాలకులు, అధికారులు తొక్కిపట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారాన్ని అడిగినప్పుడు ఇవ్వకుండా,  లేదా తప్పుడు సమాచారాన్ని లేదా పాక్షిక సమాచారాన్ని ఇస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ నిత్యం ప్రజలకు అందించాల్సిన సమాచారంలో అలసత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఆర్టీఐ వినియోగిస్తున్న జర్నలిస్టులపై దాడులు
సమాచార హక్కుచట్టంలో అతిముఖ్యమైనది 4(1)(బి). ఈ సెక్షన్‌ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, తమకు వస్తున్న నిధులు, వారు చేస్తోన్న ఖర్చులు, పథకాల అమలు , వాటి లబ్దిదారులవంటి వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించాలి. మొత్తంగా ఓ 17 అంశాలను ఎవరు అడిగినా, అడగకపోయినా స్వచ్చందంగా వెల్లడించాలి. అలా చేస్తే ప్రభుత్వ  కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. దీంతో దరఖాస్తులు కూడా తగ్గిపోతాయి. ఈ విషయాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చెయ్యడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడానికి ఉపయోగపడుతుంది. సమాచార హక్కుచట్టం పలు అవినీతి అక్రమాలను బయటకు తీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సమాచార హక్కు కార్యకర్తలపైన, ఈ హక్కును బాగా వినియోగిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు పెరుగుతున్నాయి.  దీనిని నిలువరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆర్టీఐపై అవగాహన కల్పించాలి..
సమాచార హక్కుచట్టం వచ్చి 12ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహనలే లేదు. ప్రభుత్వాలు, సమాచార కమిషన్లు ఈ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడే అధికారుల్లో బాధ్యత, అవినీతిపరుల్లో భయం పెరుగుతుంది.

 

12:41 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాట్ బిల్లు సవరణలకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ వ్యాట్ బిల్లు సవరణల బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు. మొబైల్ ఫోన్లపై 14.5శాతం ఉన్న వ్యాట్ ను 5 శాతానికి తగ్గించారు. సెల్ ఫోన్ పై వ్యాట్ తగ్గింపును బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు స్వాగతించారు. బీజేపీ నేత మాట్లాడుతూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లపై వ్యాట్ తగ్గింపును స్వాగతిస్తున్నామని తెలిపారు. సాధారణ ప్రజలు ఒకరోజు ఉపవాసం ఉండైనా రిచార్జ్ చేసుకుంటున్నారన్నారు. సెల్ ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మొబైల్ ఫోన్లపై వ్యాట్ ను తగ్గించడం సంతోషదాయకమన్నారు. 

 

 

07:40 - February 24, 2016

 ఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగానికి సీపీఎం సవరణలు ప్రతిపాదించింది. రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం ఆమోదం సందర్భంలో రాజ్యసభలో  సవరణలతోపాటు ఓటింగ్‌ కోరాలని పార్టీ నిర్ణయించింది. గతేడాది కూడా రాష్ట్రపతి ప్రసంగానికి సీపీఎం ప్రతిపాదించిన సవరణలు ఆమోదం పొందిన నేథ్యంలో ఈసారి  కూడా ఇదే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయంలో  గతంలో మాదిరిగా ఈసారి కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్ డిఎ సర్కార్‌కు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 
సవరణలు ప్రతిపాదిస్తూ సీతారాం ఏచూరి సవరణలు 
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగానికి సీపీఎం సవరణలు ప్రతిపాదించింది.  రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న సీతారాం ఏచూరి రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తూ నోటీసులు ఇచ్చారు. దేశంలో చోటుచేసుకుంటున్న ప్రధాన పరిణామాలపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడాన్ని పార్టీ తప్పుపట్టింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల, జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్హయ కుమార్‌ అరెస్ట్, నిత్యావసర సరకులు ధరల పెరుగుదల, ప్రజలపై జరుగుతున్న దాడులు, దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని సీపీఎం తప్పుపట్టింది. వీటన్నింటిపైనా సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. 
గతేడాది సీపీఎం ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం 
రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తూ సీతారాం ఏచూరి ఇచ్చిన నోటీసులు ఎన్డీయే పాలకులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత ఏడాది కూడా సీతారాం ఏచూరి... రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపాదించిన సవరణలు రాజ్యసభలో  ఆమోదం పొందాయి. అప్పట్లో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనకు తీసుకున్న చర్యలను  రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఈ అంశాలపై ప్రతిపాదించిన సవరణలు కోసం ఆయన ఓటింగ్‌ కోసం పట్టుపట్టారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయడు... సవరణలపై ఓటింగ్‌ సాంప్రదాయమే లేదని, సవరణలను ఉపసంహరించుకోవాలని సీతారాం ఏచూరిని కోరారు. కానీ ఏచూరి ఓటింగ్‌కు పట్టుబట్టడంతో రాజ్యసభ  చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఓటింగ్‌ నిర్వహించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలకు బలం ఉండటంతో  సీపీఎం ప్రతిపాదించిన సవరణలు  ఆమోదం పొందాయి. దీంతో సీతారాం ఏచూరి ప్రతిపాదించిన సవరణలను రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాల్సి వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపాదించిన సవరణలు ఆమోదం పొందడం మన పార్లమెంటరీ చరిత్రలో  ఇదే మొదటిసారి. దీంతో ఈ  అనూహ్య పరిణామానికి  ఎన్డీయే ఖంగుతినాల్సి వచ్చింది.  మోదీ సర్కార్‌కు ఇది ఇబ్బందికరంగా మారింది. 
సవరణలను ఉపసంహరించుకోవాలని సర్కార్‌ కోరే అవకాశం 
గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి కూడా సీతారాం ఏచూరి రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ తర్వాత ఆమోదానికి వచ్చినప్పుడు సవరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని మోదీ సర్కార్‌ కోరుతుంది. కానీ  నోటీసులు ఇచ్చిన సీతారాం ఏచూరి ఓటింగ్‌కు పట్టుపడతారు.  సభలోని మిగిలిన ప్రతిపక్షాలు ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది మాదిరిగానే రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఈసారి కూడా  ఓటింగ్‌ చేపడితే... రాజ్యసభలో ఎన్డీయే కంటే ప్రతిపక్షాలు బలంగా  ఉండటంతో సవరణలు ఆమోదం పొందే అవకాశం ఉంది.  దీంతో మోదీ సర్కార్‌కు మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 

 

Don't Miss

Subscribe to RSS - amendments