amitabh bachchan

17:41 - November 8, 2018

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించగా, ధూమ్ 3 ఫేమ్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రం, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.
భారీ అంచనాల మధ్య, హిందీతో పాటు, తెలుగులోనూ ఈరోజు రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్  సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : 


దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాపారం నిమిత్తం ఇండియాకు వచ్చిన బ్రిటీష్ వాళ్ళు, ఇక్కడి సంస్థానాలనీ, రాజ్యాలనీ తమ ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటుంటారు.
ఆ నేపథ్యంలో, రోనక్‌పూర్ అనబడే స్వతంత్ర్య రాజ్యంపై కన్నేసిన బ్రిటీష్ పాలకుడు జాన్ క్లైవ్, రోనక్‌పూర్ రాజుని, అతని కొడుకుని అంతమొందించి, రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. అప్పుడు యువరాణి జఫీరా, రాజ్య సంరక్షకుడు ఖుదా బక్ష్ సాయంతో రాజ్యం నుండి తప్పించుకుంటుంది. మరోపక్క థగ్స్‌గా పిలవబడే ఒక ముఠా, దారి దోపిడీలతో బ్రిటీష్ వారిపై విరుచుకు పడుతుంటుంది. తన అవసరాల కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తన తెలివితో ఎంతటివారినైనా బురిడీ కొట్టించే ఫిరంగి మల్లయ్యను, థగ్స్  నాయకుడైన ఖుదా బక్ష్‌ను పట్టుకోవడానికి నియమిస్తాడు జాన్ క్లైవ్. మరి ఫిరంగి మల్లయ్య, ఖుదా బక్ష్‌ని బ్రిటీష్ వారికి అప్పజెప్పాడా, లేదా అనేదే ఈ థగ్స్ కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


అమితాబ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను చాలా వరకూ డూప్ సాయంతో లాగించేసారు. నటన పరంగా ఓకే అనిపిస్తారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ నవ్వించే ప్రయత్నం చేసాడు కానీ, తెలుగులో ఆయనకి వాయిస్ సూట్ కాలేదు. తెరపై అమీర్‌ని చూస్తున్నంత సేపు..  పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌లో జాక్ స్పారో పాత్రే గుర్తొస్తుంది. కత్రినా సురైయ్యాగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫాతిమా సనా షేక్ పాత్ర అలరిస్తుంది.
అజయ్ - అతుల్ కంపోజ్ చేసిన పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు కానీ, జాన్ స్టివార్ట్ బ్యాగ్రౌండా స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.  మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే సామెత ఈ సినిమాకి చక్కగా సూటవుతుంది. 1839లో వచ్చిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ది థగ్ నవల ఆధారంగా, రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది, పైగా, అమితాబ్, అమీర్ కాంబో  అనగానే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఆ అంచనాలకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. దర్శకుడు సెట్స్ మీదా, కాస్ట్యూమ్స్ మీదా, యాక్షన్ ఘట్టాల పైనా పెట్టిన శ్రద్థ, కొంచెమైనా స్ర్కీన్‌ప్లే పై కూడా పెట్టుంటే థగ్స్ ఇంకోలా ఉండేది. 


థగ్స్.. పైన పటారం, లోన లొటారం. 

తారాగణం :  అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్

        కెమెరా    :            మనుష్ నందన్ 

       సంగీతం   :         అజయ్ - అతుల్ 

నేపథ్య సంగీతం  :         జాన్ స్టివార్ట్ 

         నిర్మాత   :         ఆదిత్య చోప్రా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :     విజయ్ కృష్ణ ఆచార్య

రేటింగ్  : 2/5

 

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

16:49 - November 1, 2018

ఢిల్లీ : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఎవరెస్ట్ మసాల, యూ ట్యూబ్ వారికి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రసారమవుతున్న ప్రకటనలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రసారం చేయడానికి చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నట్లు సమాచారం. వెంటనే ప్రకటనకు సంబంధించిన ప్రసారాన్ని నిలిపివేయాలని, భవిష్యత్‌లో కూడా ఎలాంటి ప్రకటన ప్రసారం చేయవద్దని నోటీసుల్లో పేర్కొంది. వెంటనే పది రోజుల్లో స్పందన తెలియచేయాలని సూచించింది. గతంలో కూడా ఓ కంపెనీకి చెందని బంగారు ఆభరణాల ప్రకటన విషయంలో కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అందులో అమితాబ్ వ‌ృ‌ద్ధుడిగా నటించాడు. ఈ ప్రకటనతో బ్యాంకు ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం కల్పించింది. 

10:30 - October 13, 2018

మెగాస్టార్ చిరంజీవి, తన 151వ సినిమాగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా,  సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ఈస్ట్‌ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహా రెడ్డి బృందానికీ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కీ,  బిగ్‌బి అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లుక్‌కీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది.. ఇంతలోనే సైరా నుండి మరో కొత్త అప్‌డేట్ వచ్చింది.. దసరా సందర్భంగా సైరా నరసింహా రెడ్డి నుండి మరో టీజర్ రీలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది.. ఈ వార్త కనక నిజం అయితే,  పండగనాడు మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.. జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్న సైరాలో, కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు..  

11:26 - October 12, 2018

మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.. నిన్న బిగ్‌బి అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లుక్‌కి మంచి స్పందన వస్తోంది.. ఇంతలోనే సైరా నుండి మరో కొత్త లుక్ వచ్చింది..
కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తన్నారు.. అమితాబ్, నరసింహా రెడ్డి గురువు గోసయి వెంకన్నగా  కనిపించబోతున్నాడు.. విజయ్, నరసింహా రెడ్డి కుడిభుజంగా తమిళుడైన ఓబయ్య పాత్రలో నటిస్తుండగా, సుదీప్, అవుకు రాజు అనే పాత్ర పోషిస్తున్నాడు... వీళ్ళిద్దరూ పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం, మెలితిరిగిన మీసకట్టుతో వీరుల్లా ఉన్నారు.. జార్జియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహా రెడ్డి బృందానికీ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి  2019 సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది...

14:00 - March 13, 2018

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న అమితాబ్ అనారోగ్యం బారిన పడటంతో వెంటనే.. స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం ఆయన కోలుకున్నారని... ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు బిగ్ బీకి చికిత్స అందించడానికి ముంబై నుంచి జోధ్‌పూర్‌కు ప్రత్యేక వైద్య బృందం కూడా బయలుదేరింది. అమితాబ్ కొంత కాలంగా మెడ నొప్పి, వెన్నునొప్పితో బాధ పడుతున్నారు. 70 ఏళ్ల వయసున్న అమితాబ్... ప్రస్తుతం... థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతో పాటు బ్రహ్మస్త్రా, 102 అనే చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

21:29 - November 6, 2017

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన పనామా పేపర్స్‌, బోఫోర్స్‌ స్కాంలో తన పేరు రావడంపై బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. ఈ వయసులో నాకు ప్రశాంతత కావాలి... నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు హాయిగా గడపాలనుకుంటున్నానని తన బ్లాగ్‌లో వివరణ ఇచ్చారు. నా పేరు హెడ్‌లైన్స్‌లో వచ్చినా నేను పట్టించుకోనని తెలిపారు. ఇప్పటివరకు అక్రమ కట్టడాలు, ఆస్తుల విషయాల్లో నాకు నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొన్నేళ్లుగా స్కాంలలో ఇరుక్కున్నామంటూ నా గురించి నా కుటుంబం గురించి వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డామని... ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని అమితాబ్‌ అన్నారు. బాధ్యతగల పౌరులుగా ఈ విషయంలో మేము అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తాజాగా ప్యారడైజ్‌ పత్రాల జాబితాలో అమితాబ్‌ బచ్చన్‌ పేరు వచ్చిన విషయం తెలిసిందే. 

21:27 - November 6, 2017

ఢిల్లీ : పనామా పత్రాల వ్యవహారం ఇంకా మరవకముందే ఇపుడు ప్యారడైజ్‌ పత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రహస్య కంపెనీల ద్వారా బడాబాబులు చేస్తున్న ఘరానా మోసాన్ని ప్యారడైజ్‌ పత్రాలు బట్టబయలు చేశాయి. 180 దేశాలకు సంబంధించిన నల్లకుబేరులతో పాటు 714 మంది భారతీయుల పేర్లు కూడా ఈ పత్రాల్లో వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పనామా పత్రాల వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే మరో అవినీతి బండారం వెలుగులోకి వచ్చింది. 'ప్యారడైజ్‌ పత్రాల' పేరుతో ఐసిఐజె ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్లకుబేరుల జాబితాను విడుదల చేసింది. ప్యారడైజ్‌ పేపర్‌ స్కాంలో కోటి 34 లక్షల పత్రాలను బహిర్గతం చేశారు. పనామా పత్రాలు మాదిరిగానే జర్మనీ వార్తాపత్రిక సుడేషీ జుటంగ్‌ వీటిని సంపాదించింది. దాదాపు 19 దేశాల కంపెనీ రిజిస్ట్రీలు, రెండు న్యాయవ్యవహారాల కంపెనీల నుంచి పత్రాలను సేకరించింది. ఈ పత్రాలను పరిశీలన జరపాల్సిందిగా ' ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌'-ICIJను కోరింది. పన్ను ఎగవేత ద్వారా కూడబెట్టుకున్న సొమ్మును దాచుకునేందుకు స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ICIJ బయటపెట్టింది.

ఈ పత్రాల్లో 180 దేశాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌ 19వ స్థానంలో ఉంది. ప్యారడైజ్‌ పత్రాల్లో 714 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ భార్య మాన్యతా దత్‌ తదితరుల పేర్లు ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నట్లు సమాచారం.

'ఒమిడ్‌యార్‌ నెట్‌వర్క్‌' కంపెనీకి జయంత్‌సిన్హా ఎండీగా ఉన్న సమయంలో అమెరికాకు చెందిన డి.లైట్‌ డిజైన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. దీనిపై జయంత్‌ సిన్హా వివరణ ఇచ్చారు. ఆ సంస్థ వివరాలన్నీ చట్టబద్దమైనవేనని, తాను గతంలో భాగస్వామిగా ఉన్నానని, ప్రస్తుతం వీటితో తనకు సంబంధం లేదని ట్వీట్‌ చేశారు. బిజెపికి చెందిన మరో ఎంపి రవీంద్ర కిశోర్‌ సిన్హా పేరు కూడా వెలుగు చూసింది. దీనిపై స్పందించడానికి ఆర్‌కె సిన్హా నిరాకరించారు. అక్రమాస్తుల కేసులో విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా పేరు కూడా పారడైజ్‌ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

10:42 - November 6, 2017

ప్రపంచ దేశాల నల్ల కుబేరులతో పాటు ఇండియాలో పన్ను ఎగ్గొట్టి ఆస్తులు పోగేసుకున్న 714 మంది పేర్లని పారడైజ్ పేపర్స్ బయట పెట్టింది. దీనితో నల్ల కుబేరుల గుండెల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. పనామా పేపర్స్ సృష్టించిన సునామీని మర్చిపోకముందే పారడైజ్ పేపర్స్ వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్ లోని లనల్లకుబేరుల గుండెల్లో పారడైజ్ పేపర్స్ రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలకు న్యాయ సేవలు అందించే ‘అప్లెబీ’ నుంచి లీకైన సమాచారం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల మెడకు చుట్టుకుంటోంది. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించి పెట్టుబడులు పెట్టిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం 13.4 మిలియన్ పేపర్లు లీక్ కాగా అందులో 180 దేశాలకు చెందిన కుబేరులు ఉన్నారు. వీరిలో 174 మంది భారత మిలియనీర్లు కూడా ఉండడం గమనార్హం.

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ కూడా పది మిలియన్ పౌండ్లను తరలించినట్టు ఆరోపణలు వస్తుండగా, ఈ జాబితాలో కెనడా ప్రధాని పేరు కూడా కనిపించింది. ప్రధాని జస్టిన్ ట్రూడూ సీనియర్ సలహాదారు అయిన స్టీఫెన్ బ్రాన్ఫ్‌మాన్ పెద్ద ఎత్తున విదేశాలకు నిధులు తరలించినట్టు పారడైజ్ పేపర్స్ వెల్లడించాయి. పన్నులకు స్వర్గధామమైన దేశాలకు కుటుంబ వ్యాపారం ద్వారా ఆ సొమ్మును తరలించినట్టు పేపర్ల ద్వారా వెల్లడైంది.

నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది పూర్తి...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసి నవంబర్ 8 కి ఏడాది కాలం పూర్తి కానుంది. ఆ రోజుని యాంటీ బ్లాక్ మని డే గా ప్రభుత్వం జరపనుంది. దీనికి రెండు రోజుల ముందు ఈ వ్యవహారం బట్ట బయలు కావడంతో పారడైజ్ పేపర్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

15:58 - September 28, 2017

బాలీవుడ్ మెగా స్టార్ 'అమితాబ్ బచ్చన్' వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కోన్ బనేగా కరోడ్ పతి' షోల ఎంత పాపులార్టీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ షో మళ్లీ టెలికాస్ట్ అవుతోంది. ఈ షోలో ప్రముఖులు..ఇతరులు పాల్గొని ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. తాజాగా ఈ షోలో ప్రముఖ బ్యాడ్మెంటెన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు హాజరయ్యారు. ఈ విషయాన్ని 'అమితాబ్ బచ్చన్' సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఫొటోను 'అమితాబ్' త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన ప్ర‌పంచ ఛాంపియ‌న్ పీవీ సింధును త‌న షోకి రావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని తెలియచేశారు.

రియో సెంట్రో ఎరీనా వేదికగా ముగిసిన..సస్పెన్స్ థ్రిల్లర్ గోల్డ్ మెడల్ ఫైట్ లో ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ తో సింధూ తుదివరకూ పోరాడి రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింధూపై ప్రశంసల జల్లు కురిశాయి. ఒలింపిక్స్ ఫైనల్స్ చేరిన భారత తొలి మహిళ మాత్రమే కాదు..రజత పతకం సాధించిన ప్లేయర్ గా రికార్డుల్లో చేరింది. మరి హాట్ సీట్ లో అమితాబ్ అడిగిన ప్రశ్నలకు పీవీ సింధు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

10:51 - September 28, 2017

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టగలరా ? కష్టంగానే ఉంది కదా...కానీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాగా వేషం మాత్రం వేసుకున్నాడు..కానీ ఎవరనేది తెలియడం లేదు అంటున్నారా ? కానీ నిజంగా మాత్రం అమితాబ్ మాత్రం కాదు.

పలువురు హీరోలు..హీరోయిన్స్ లు ఇతర నటీ నటులను అనుకరిస్తుండడం చూస్తూనే ఉంటాం. వారిల్లాగా డైలాగ్ లు పలుకుతూ..అచ్చం వారిలాగే తయారయ్యి తమ అభిమానులను అలరిస్తుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి 'శిల్పా శెట్టి' చేరిపోయారు. దర్శకురాలు..కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ ఓ కామెడీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా 'శిల్పాశెట్టి' బిగ్ బి 'అమితాబ్' లా తయారయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారిపోయింది. అమితాబ్ పై ప్రేమ, గౌరవంతో ఇలా చేయడం జరిగిందని, తాను చేసిన అతి కష్టమైన టాస్క్ ఇదేనని 'శిల్పా శెట్టి' పేర్కొన్నారు.  ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. శిల్పాశెట్టి బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 'సాహస వీరుడు సాగర కన్య', 'ఆజాద్', 'భలేవాడివి బాసూ' చిత్రాల్లో నటించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - amitabh bachchan