anantapur

08:14 - January 15, 2018

అనంతపురం : వృత్తి గొర్రెల కాపరి.. ప్రవృత్తి ప్రకృతిని చిత్రించడం.. పగలంతా పశువులు కాస్తూ.. రాత్రిపూట చిత్రాలు వేయడం నేర్చుకున్నాడు. పేదరికం వేధిస్తున్నా.. తనలోని కళాకారుడికి పదునుపెట్టాడు. నట్టడవిలో సంచరిస్తూ నలుగురూ మెచ్చే చిత్రాలు వేస్తున్నాడు..అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరమణ. 
వృత్తిరీత్యా గొర్రెలకాపరి
ఇక్కడ పేపర్‌మీద చకచకా బొమ్మలేస్తున్న ఈ కళాకారుడిపేరు వెంకటరమణ. అనంతపురం జిల్లా శింగనమల గ్రామంలో ఉండే ఈ కళాకారుడు వృత్తిరీత్యా గొర్రెలకాపరి. పొద్దుపొడుపు నుంచి పొద్దుకూకే వరకు కొండకోనలు పట్టుకుని తిరిగే వెంకటరమణకు చిన్ననాటి నుంచే బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుతుండగానే చిత్రాలు వేస్తూ నలుగురితో శహభాష్‌ అనిపించుకున్నాడు. 
పేదరికంతో కష్టాలు పడుతున్నా
పేదరికంతో కష్టాలు పడుతున్నా.. తనలోని కళాకారుణ్ని మాత్రం రంగులు ప్రపంచంలో విహరింపజేస్తాడు వెంకటరమణ.  ఈ వర్ణచిత్రాలన్నీ ఈ పేద చిత్రకారుడి కుంచెనుంచే జాలువారాయి. చిన్ననాడే చదువుకు దూరమైనా.. చేయితిరిగిన కళాకారులకే సాధ్యం అయ్యేలా ఆలోచింపచేసే చిత్రాలు వేస్తున్నాడు.  పొద్తున్నే అడవిబాట పట్టింది మొదలు హృదయాంతరాళంలో మెదులుతున్న  ఊహాలకు  రాతిబండలపైనే రూపం ఇస్తాడు. రంగు,రంగుల చాక్ పీసులను తీసుకెళ్లీ .. గొర్రెలను మేపుతూనే బొమ్మలు వేయడంలో ప్రావీణ్యం సాధించాడు. 
ఏడో తరగతి చదువుతుండగా తండ్రి మృతి
ఏడవతరగతి చదువుతుండగా తండ్రి చనిపోయాడు.. కుటుంబ భారం మీదపడింది. 12ఏళ్ల పసిప్రాయంలో పశులకాపరిగా మారాడు. ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లకు తానే తల్లి-తండ్రి అయ్యాడు. తండ్రి వారసత్వంగా ఇచ్చిన గొర్రెలను మేపుతూ.. జీవనం సాగిస్తున్న వెంకటరమణకు ఇపుడు చెల్లెళ్ల పెళ్లి ఒక సవాల్‌గా మారింది. పేదరికంలో మగ్గుతున్న  తననుఆదుకోవాలని దాతలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. గొర్రెలు కాస్తేనే తన కుటుంబం గడుస్తుందని..పేదరికం నుంచి బయటపడేందుకు చేయూత నిస్తే.. దేశం గర్వించే కళాకారుడినవుతాని వెంకటరమణ చెబుతున్నాడు. ఈ పేదకళాకారుణ్ని ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది.  

 

15:32 - January 14, 2018
10:31 - January 13, 2018

నల్గొండ : సంక్రాంతి పండుగతో సిటీజనం పల్లెబాటపట్టారు. సొంతవాహనాల తోపాటు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నల్లగొండజిల్లాలోని పలు టోల్‌గేట్లవద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

14:12 - January 12, 2018

అనంతపురం : జిల్లాలోని కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిరంతరం ప్రజా సమస్యలను స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న 10టీవీకి చాంద్‌ బాషా అభినందనలు తెలిపారు. అందరికీ చాంద్‌ బాషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

11:40 - January 12, 2018

అనంతపురం : తాడిపత్రిలోని పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలనాటి పండుగల ఆచారాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో ముగ్గులు వేసి.. రంగురంగుల బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మి దేవతల రూపంలో పిల్లలు అలరించారు. హరిదాసు వేషాలతో పిల్లలు.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

 

11:38 - January 12, 2018

హైదరాబాద్ : సంక్రాంతికి స్పెషల్‌  దోపిడి  కొనసాగుతోంది. పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రయాణీకుల నుంచి  ప్రైవేట్‌ ట్రావెల్ష్‌ మొదలుకొని ఆర్టీసీ, రైల్వేదాకా అందరూ అదనపు వసూళ్ళకు తెరలేపుతారు. ఒక్క సంక్రాంతి అనేకాదు... పండగ ఏదైనా ఇదే తంతు. ప్రతియేటా ప్రయాణీకులపై ఈ ప్రత్యేక బాదుడు మాత్రం తప్పదు.  సంక్రాంతి అంటే మరింత స్పెషల్‌గా బాదాలని చూస్తారు. అటు ఆర్టీసీ, ఇటు రైల్వే బహిరంగ దోపిడీకి పాల్పడుతుంటే... మేమేం తక్కువా అన్నట్లు ప్రైవేటు ట్రావెల్స్ కూడా సంక్రాంతిని క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నాయి. 
సంక్రాంతికి అదనపు ఛార్జీలు
ప్రజలు పండగ చేసుకుంటారో లేదో కానీ... ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు ట్రావెల్స్‌కు మాత్రం పండగే పండగ. సంక్రాంతి పండుగ ప్రజలు సరిగ్గా చేసుకుంటారో లేదో తెలియదుకానీ... రవాణా సంస్థలు మాత్రం అధిక ధరలతో చేసుకుంటున్నాయి. అసలు పండుగ ఆనందమంతా వారిదే అన్నట్టు ఉంది పరిస్థితి.  సంక్రాంతి పండుగకు ఆర్టీసీ 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తోంటే... ప్రైవేటు ట్రావెల్స్‌ మళ్ళీ ఈ  ఛాన్స్‌ రాదేమో అన్నట్లు... ఇష్టానుషారంగా  ప్రయాణీకుల నుంచి వసూళ్ళు చేస్తున్నారు.. సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు అధిక రేట్లను నిర్ణయిస్తూ... ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నారు. 
8రోజులు ప్రత్యేక సర్వీసులు
జనవరి 12నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో 8రోజులు పాటు ప్రధాన రూట్లలో ప్రత్యేకంగా 829 బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, చెన్నై, బెంగుళూరు నగరాల మధ్య 12వతేదీన 112 బస్సులను నడుపుతోంది. ఇక  14 నుంచి 17వ తేదీవరకు రోజూ 125 సర్వీసులను  నడుపుతోంది.
అన్ని రూట్లలోనూ అదనపు ఛార్జీలే
విజయవాడ, హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు ఛార్జీ సాధారణ రోజుల్లో  355 రూపాయలు.  సంక్రాంతి పండుగకు మాత్రం 530 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం సాధారణ ఛార్జీ  480రూపాయలు కాగా... ప్రస్తుతం 620 వసూలు చేస్తున్నారు. విజయవాడ-బెంగుళూరుకు సాధారణ ఛార్జీ 850 రూపాయలు కాగా.. ప్రస్తుతం 1275 తీసుకుంటున్నారు. విజయవాడ-చెన్నై సాధారణ ఛార్జీ 580 కాగా... 870 రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సీట్లన్నీ ముందుగానే నిండిపోయాయి. 14, 15, 16 తేదీల్లో ఆర్టీసికి ఎన్నడూ లేని డిమాండ్‌ ఏర్పడింది. 
వెయ్యి రూపాయలకు పైగా వసూలు 
విజయవాడ హైదరాబాద్‌ మధ్య సాధారణంగా ఏసీ సర్వీస్ ధర 600 రూపాయల వరకూ ఉంటుంది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక నాన్‌ ఏసీ ధర 350 ఉండగా...  850 వరకూ వసూలు చేస్తూ ప్రయాణీకుల నడ్డి విరిస్తున్నారు.  గుంటూరు నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా  ఏసీలో 600, నాన్‌ ఏసీలో 400 కాగా.. ప్రస్తుతం ఏసీ 1300, నాన్‌ ఏసీ 1100 వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.  విజయవాడనుంచి బెంగుళూరుకు  ఏసీ బస్సుకు సాధారణ ఛార్జీ 1200, నాన్‌ ఏసీకి 800 ఉండతగా... ఏసీకి పండుగ సీజనంటూ 2500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. నాన్‌ ఏసీకి 1500 వరకు గుంజుతున్నారు. గుంటూరు నుంచి బెంగుళూరుకు కూడా ధరలు భారీగానే పెంచేశారు. సాధారణంగా ఏసీకి 900, నాన్‌ ఏసీకి 800 ఉంటే..  ఇప్పుడు ఏసీ 2500, నాన్‌ ఏసీ 1500 వరకూ వసూలు చేస్తున్నారు.
ప్రధాన నగరాలకు ప్రత్యేక బస్సులు
రాయలసీమ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగుళూరు నగరాలకు 13వతేదీ వరకూ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చెన్నై, బెంగుళూరుకు 20, రాయలసీమకు 94, విశాఖ సహా కోస్తాంధ్రకు 202 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక రైల్వే కూడా ఏమీ తక్కువ తినలేదు. పండుగ  రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచేసింది. నిన్న మొన్నటి వరకు పది రూపాయలున్న ప్లాట్‌ఫామ్‌ ధరను.. ఏకంగా 20 రూపాయలు చేసింది. ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు ట్రావెల్స్ ఇలా ప్రతీ సంస్థ పండగను అవకాశంగా తీసుకుని అదనపు మోత మోగిస్తున్నారు.  పెంచిన ఛార్జీల ధరలు భరించలేక పేదలు కష్టపడుతుంటే... ఆర్థిక స్థోమత ఉన్నవారు... డబ్బుపెట్టి కూడా కూర్చునేందుకు చోటు లేక ఫుట్‌బోర్డు ప్రయాణంతో పడరాని పాట్లు పడుతున్నారు.

 

17:19 - January 9, 2018

అనంతపురం : జిల్లా పుట్టపర్తి వద్ద హైకోర్టు ఉత్తర్వులతో హంద్రీ-నీవా పనులు పునఃప్రారంభమయ్యాయి. పుట్టపర్తి దగ్గరి తొమ్మిదో ప్యాకేజీలో 15 ఎకరాల భూసేకరణ అంశం.. హైకోర్టులో గత మూడేళ్లుగా విచారణ కొనసాగింది. కాలువ నిమిత్తం కోల్పోతున్న భూమి వ్యవహారంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ .. రైతులకు వాదనకు మద్దతుగా సింగిల్‌ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. పిటిషన్‌ విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రిజర్వులో ఉంచింది. ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. రైతులకు పరిహారం మొత్తం చెల్లించాలన్నారు.

భూములకు ఎకరాకు కోటి 62 లక్షలు
పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వ పక్షపాత ధోరణి అవలంభిస్తోందని రైతులు ఆరోపించారు. తమ భూమి పక్కనే ఉన్న భూములకు ఎకరాకు కోటి 62 లక్షలు ఇచ్చారని.. తమకు మాత్రం కేవలం 23 లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పరిహారంలో అధికారులు ఇంత వ్యత్యాసం చూపడమేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు తాము ఏమాత్రం వ్యతిరేకంకాదని... అయితే తమకూ అందరితో సమానంగా పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని కోరారుతమకు పరిహారంపై న్యాయం చేసి పనులు చేపట్టాలంటూ రైతులు పనులకు అడ్డుతగిలారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను లాగేసి పనులు చేపట్టారు. 

20:44 - January 8, 2018

అనంతపురం : పట్టణంలోని.. పాత ఊరులో.. యశోదమ్మ అనే దాత సాయంతో.. సీడీ ఆస్పత్రిలో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన.. అమిలినేని వకీలు కొండప్ప కుమార్తె యశోదమ్మ.. 18 లక్షలు విరాళం ఇవ్వడంతో... సీడీ ఆస్పత్రిలో అసంపూర్ణంగా నిలిచిపోయిన భవనాన్ని నిర్మించడం జరిగింది.. ఈ మేరకు ఆ భవనాన్ని సోమవారం.. దాత యశోదమ్మ, కలెక్టర్‌ వీర పాండ్యన్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన యశోదమ్మను సత్కరించారు. ప్రతి ఒక్కరూ..  వారి జీవితంలో.. ఏదో ఒక మంచి పని చేయాలని.. యశోద సూచించారు. 

 

13:42 - January 5, 2018

అనంతపురం : ప్రజాసమస్యలను చూపించడంలో 10టీవీ ముందుంటుందని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో 10టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మరింత ముందుకు 10టీవీ దూసుకుపోవాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు, 10టీవీ సిబ్బందికి.. యాజమాన్యానికి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

06:41 - January 5, 2018

అనంతపురం : ప్రపంచీకరణ ప్రభావం భారత సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్యాత్య సంస్కృతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. పాశ్యత్య విషసంస్కృతి వ్యామోహంలో యువత పెడదారి పడుతోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజా నాట్యమండలి వంటి సంఘాలు కృషి చేయాలని కోరారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అనంతపురంలో మూడు రోజుల పాటు జరిగిన బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ అంశాలపై ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఓ బాలుడి ప్రదర్శన అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

బళ్లారి రాఘవ ప్రజా సాంస్కృతిక ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్‌ డైరెక్టర్‌ తమ్మారెడ్డి భరద్వాజ..సామాజిక విలువలు పతనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజానాట్య మండలి మళ్లీ క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక రంగం - నేటి సవాళ్లు అన్న అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రపంచీకరణ తర్వాత సంస్కృతిలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్తావించారు. యువతను పెడదోవ పట్టించేలా ఉన్న విష సంస్కృతిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అవరసం ఉందని సదస్సులో ప్రసంగించిన వక్తలు సూచించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - anantapur