Anantapur News Updates

13:13 - July 14, 2018

అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గెరడౌ పరిశ్రమలో విష వాయువులు పీల్చి మృతి చెందిన ఆరుమంది కుటుంబాలకు నష్టపరిహారంపై ఇటు పరిశ్రమ యాజమాన్యం కాని, అటు ప్రభుత్వం కాని స్పందించలేదు. దీనిపై వైసీపీ, లెఫ్ట్‌ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి  ధర్నాకు సిద్ధమైన ప్రతిపక్ష నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. 500 మంది పోలీసులతో తాడిపత్రి పట్టణంలో పికెట్‌ నిర్వహిస్తున్నారు.

21:11 - July 12, 2018

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో విషాదం నెలకొంది. స్థానిక గెరుడౌ స్టీల్‌ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. ఓ పెద్దగదిలో పదకొండు మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలుస్తోంది. ఆ వాయువును పీల్చిన రంగనాథ్‌, మనోజ్‌, లింగయ్య, గంగాధర్‌, వసీమ్‌, గురవయ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఘటనలో గాయపడ్డ మరో ఐదుగురిని మిగిలిని కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో లోపాలను సవరించకుండా నిర్లక్ష్యం చేయటంతోనే విషవాయువు లీకైందని కార్మికులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

18:23 - July 12, 2018

అనంతపురం : ఏపీ రాష్ట్రంలో మరో మరణ మృదంగం మోగింది. రోడ్డు ప్రమాదాలు..ఇతర ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. నిండు జీవితాలు గాలిలో కలిసిపోతుండడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా అనంత జిల్లాలోని తాడిపత్రిలో గెరుడౌ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో గ్యాస్ లీకు కావడంతో ఆరుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్యాస్ లీక్ కావడం..వెంటనే మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తమ వారు మృతి చెందారని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

16:29 - July 11, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కృషి చేస్తుంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకరించడం లేదని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్రం కల్లబొల్లి మాటలు చెబుతోందని, ఈ గడ్డపై ఎంతో మంది వీరులు పుట్టారని..వారి ఉద్యమ స్పూర్తిని తీసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభివృద్ధికి మోడీ సహకరించాలని..కానీ అలా చేయడం లేదన్నారు. కరవు జిల్లా..ఎడారిగా మారుతున్న జిల్లాలో సంకల్పం పూనుకుని కాల్వలు..చెరువులు..నీళ్లతో నింపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో స్వచ్చమైన నీరు తాండవం చేస్తోందని, ఉద్యోగాలు..ఉపాధి కోసం..కడుపు మంటతో వలసలు వెళ్లిన కుటుంబాలను చూసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. కియో పరిశ్రమ ఏర్పాటు చేసి వలసల నివారణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రం..జాతిపై చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. 

16:25 - July 11, 2018

అనంతపురం : టిడిపి మంత్రులు..ఎంపీలు జనసేన అధ్యక్షుడు పవన్ ను టార్గెట్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. బాబు..లోకేష్ లపై పవన్ చేస్తున్న ఆరోపణలను ఎంపీలు తిప్పికొట్టారు.

పవన్ ను చూస్తే బాధేస్తోందని..ప్రజారాజ్యాన్ని ప్రజలు నమ్మారని..కానీ వారు మాత్రం కోట్ల రూపాయల కొల్లగొట్టారని ఆరోపించారు. పవన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి బీఫారాలు తీసుకున్నారని..ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇవన్నీ పవన్ కు తెలియదా ? అని నిలదీశారు. ప్రజల్లో మమేకమవుతే రాజకీయాలు తెలుస్తాయని, కేంద్రంతో డబ్బులు తీసుకుని బీజేపీ ఏది చెబితే అదే చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

15:59 - July 11, 2018

అనంతపురం : వైసిపి..జనసేన..బిజెపి పార్టీలపై టిడిపి మంత్రులు, ఎంపీలు విమర్శల పర్వం కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని... గద్దె నింపే వరకు పోరాటం చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో ఏపీకి అన్యాయం చేసిన మోడీని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామన్నారు. బీజేపీ..జనసేన..వైసీపీ పార్టీలు కుట్రల కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంలో వీరు కూడా పావుగా మారుతున్నారని..మోడీకి భజనపరులరని మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన పవన్ జగన్ ఫ్యాన్ గాలిగా ఎందుకు మారాడో అర్థం కావడం లేదన్నారు. పోరాటం ఇక్కడితే ఆగదని..ఇంకా ఉధృతంగా సాగుతుందన్నారు. 

12:51 - July 8, 2018

అనంతపురం : వైఎస్‌ జయంతి రోజున అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తామంటే తాము పూలమాల ముందు వేస్తామని సిద్దారెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి అనుచరుల ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:30 - July 3, 2018

అనంతపురం : దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు వామపక్ష జాతీయ నేతలు. అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకోస్తామని హామీ ఇచ్చిన బీజేపీ... అధికారంలోకి వచ్చాక పెద్దనోట్లను రద్దు చేసి... దేశంలో ఉన్న అక్రమ సంపాదనంతా విదేశాలకు తరలించారన్నారు. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని అంతం చేయాలంటే... మోదీ సర్కార్‌ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అనంతపురంలో స్వాత్రంత్య సమరయోధుడు, కమ్యూనిస్ట్‌ నేత నీలం రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

లం రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉత్సవాల్లో వామపక్ష జాతీయ నేతలు..
సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధారకర్‌రెడ్డి అనంతపురంలో పర్యటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్‌ నేత నీలం రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొని.. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజశేఖర్‌రెడ్డి జీవిత విశేషాలతో కూడిన శతజయంతి సంచికను విడుదల చేశారు.

ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తాం : సీతారాం ఏచూరి
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని... ఇందుకు వామపక్షాల ఐక్యత అవసరమన్నారు సీతారాం ఏచూరి. దేశంలో అవినీతి పెరిగిపోయిందని.. మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించడమే లక్ష్యంగా పోరాటం చేస్తామన్నారు.

మోదీ సర్కార్‌లో అవినీతి పెచ్చుమీరిపోయింది : సురవరం
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మైనారిటీల్లో అభద్రతను బీజేపీ నెలకొల్పుతుందన్నారు సురవరం సుధాకర్‌రెడ్డి. మోదీ సర్కార్‌లో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. అమిత్‌షా డైరెక్టర్‌గా ఉన్న బ్యాంక్‌లో.. నోట్ల రద్దు చేసిన ఐదు రోజుల్లోనే 570 కోట్లు మార్చుకున్నారన్నారని ఆరోపించారు. స్విస్‌ బ్యాంక్‌లో నల్లధనాన్ని రాబట్టడంలో కేంద్రం విఫలమైందని సురవరం అన్నారు.

మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వామపక్షాల వ్యూహాలు
సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు వామపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాటాలకు సిద్దమవుతున్నారు. 

21:04 - June 28, 2018

అనంతపురం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా పర్యటన ఉద్రిక్తంగా సాగింది. టీడీపీ, సీపీఐ శ్రేణులు వేర్వేరుగా కన్నా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వారిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. పరస్పరం పిడిగుద్దులు విసురుకున్నారు. తమవారిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ.. అనంత అర్బన్‌ ఎమ్మెల్యే ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అనంతపురం ఆర్&బి అతిథిగృహంలో కన్నా లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న విలేకరుల సమావేశం దగ్గరకు టీడీపీ అనుబంధ విభాగం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు చేరుకుని.. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అదే సందర్భంలో.. కొందరు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకారులపై విరుచుకుపడి.. పరుగులెత్తించారు. టీడీపీ కండువాను తగులబెట్టారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ శ్రేణులపై దాడి జరిగిన కొద్దిసేపటికే.. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ నేతృత్వంలోని కార్యకర్తలు ఆర్‌&బి అతిథిగృహానికి చేరుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణను కలిసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు, సీపీఐ కార్యకర్తలను అడ్డుకుంటూ.. వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరువర్గాలనూ శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇరు వర్గాలూ ఒక్కసారిగా దాడులు, ప్రతిదాడులకు దిగారు. రెండు ఘటనల్లోనూ.. పోలీసులు టిఎన్‌ఎస్‌ఎఫ్‌, సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
టిఎన్‌ఎస్‌ఎఫ్‌, సీపీఐ శ్రేణులపై బీజేపీ నేతల దాడిని నిరసిస్తూ.. అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి.. నగర రెండో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. దాడికి దిగిన కడప గూండాలపై కేసులు నమోదు చేయాలని, బీజేపీ నేతలు బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అటు సీపీఐ నేతలు.. తమపై దాడులకు నిరసనగా.. అనంతపురం బంద్‌కు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు ఇదే తరహాలో వ్యవహరిస్తే తామూ ప్రతిదాడులకు దిగాల్సి వస్తుందని, వారిని జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

టీడీపీ, సీపీఐ నేతల ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లోనే తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల పర్యటనలో.. తొలిరోజే.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ శ్రేణులు అడ్డుకుంటాయని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో.. బీజేపీ శ్రేణులను ఒప్పించి, వారి ర్యాలీని దారిమళ్లించారు. అయితే.. రెండో రోజు.. తెలుగు విద్యార్థి, సీపీఐ శ్రేణులు కన్నా లక్ష్మీనారాయణ పర్యటనను అడ్డుకున్నాయి. కడప ఉక్కు, ప్రత్యేక హోదా అంశాలపై నిలదీసే ప్రయత్నం చేశాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - Anantapur News Updates