andhra pradesh

16:37 - June 13, 2018

విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారాని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌ చాందీ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మోదీ అమలు చేయకపోవడాన్ని చాందీ తప్పుపట్టారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా హోదా సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 

07:26 - June 12, 2018

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మత్స్యకారులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం మత్స్య పరిశ్రమను పట్టించుకోకపోవటంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చనందునే సమ్మెకు దిగాల్సి వస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. 
మత్స్య వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె
తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. మత్స్య వ్యతిరేక విధానాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నందున సమ్మెకు దిగుతున్నట్లు మత్స్యకారులు ప్రకటించారు. అలాగే పెరుగుతున్న డీజిల్‌ భారం, తగ్గిపోతున్న మత్స్య సంపద, మార్కెట్ మాయజాలంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అందుకే ఈ నెల 14 తర్వాత ఈ సమ్మెను చేపట్టబోతున్నామని తెలిపారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్ర మత్స్య సంపద అభివృద్ది కోసం ప్రభుత్వం వేటను నిషేధిస్తోందన్నారు.  తమకు  తగిన పరిహారం ఇవ్వకపోవటంతో  తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
వేటకు వెళ్లకుండ వినూత్న నిరసనలు చేసే యోచన 
క్రాప్‌ హాలిడే స్ఫూర్తితో ఈ సమ్మెకు దిగుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. నిషేధం తర్వాత వేటకు వెళ్లకుండా వినూత్న నిరసనలతో సమ్మె చేస్తామన్నారు. బోట్లకు రాయితీలపై అందిస్తున్న డీజిల్ సక్రమంగా అందకపోవటమే కాకుండా అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నందునే సమ్మెకు దిగుతున్నామని బోటు యజమానులు చెబుతున్నారు. 
చేపల ధరలు పెరిగే అవకాశం 
మరోవైపు మత్స్యకారుల సమ్మెతో మార్కెట్లో చేపల ధరలు పెరిగే అవకాశం ఉంది. చెరువు చేపలు కనిపిస్తున్నప్పటికి కాలుష్య కారణంగా వాటిని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ సిద్దపడటం లేదు. సముద్ర చేపలకు గిరాకీ ఉండటంతో ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది. 

 

16:54 - June 11, 2018

గుంటూరు : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌లతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. చంద్రబాబుతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మట్టికరవక తప్పదని మధు జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సీపీఎం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మధు.. రాబోయే రోజుల్లో ప్రజాస్వామికవాదులను కలుపుకొని వెళ్లనున్నట్లు తెలిపారు. 

11:21 - June 11, 2018
18:17 - June 8, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ళ టీడీపీ పాలనపై వైసీపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. చంద్రబాబు హామీలపై వీడియోను కూడా విడుదల చేశారు. నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా ఉందని సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ర్టంలోని అన్ని వ్యవస్థలనూ సీఎం భ్రష్టు పట్టించారంటూ టీడీపీపై తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

21:48 - June 6, 2018

విజయవాడ : బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుల మధ్య వాడీ వేడీ వాగ్యుద్ధం సాగుతోంది. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని జీవీఎల్‌ అంటే.. వెనుకబడిన జిల్లాలకు వెళ్లి చూడాలని కుటుంబరావు కౌంటర్‌ ఇచ్చారు. అబద్ధాలు చెబితే నిధులు రావని జీవీఎల్‌ హితవు పలికితే.. దేశవ్యాప్తంగా బీజేపీకి 160 సీట్లూ రావని కుటుంబరావు జోస్యం చెప్పారు. 

ఏపీ ప్రభుత్వంపై.. బీజేపీ నాయకుల దాడి కొనసాగుతోంది. దానికి దీటుగా ప్రభుత్వ ప్రతినిధులూ స్పందిస్తున్నారు. బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు.. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయ మనుగడ కోసమే బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని.. ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెబితే నిధులు రావంటూ.. చెన్నై-వైజాగ్‌ కారిడార్‌ను ఉదహరించారు. 

బాబుతో జాబు రాలేదు కానీ, జబ్బులొచ్చాయని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. షేర్‌మార్కెట్‌ నిపుణుడు కుటుంబరావును ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఎయిర్‌ ఏషియా అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు ప్రస్తావనపై వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 

జీవీఎల్‌ నరసింహారావు విమర్శలకు.. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు దీటుగా బదులిచ్చారు. ఏపీకి అన్నీ ఇస్తున్నామన్న బీజేపీ నేతల ప్రకటనల్లో వాస్తవాన్ని తేల్చేందుకు.. ఓ పదిమంది కేంద్ర, రాష్ట్ర అధికారులతో కమిటీ వేయాలని తాను సూచిస్తుంటే.. నిజనిర్ధారణ కమిటీ అంటూ జీవీఎల్‌ చెబుతున్నారని కుటుంబరావు ఎద్దేవా చేశారు. 

బెజవాడలో కూర్చుని ప్రెస్ మీట్‌లు పెట్టడం కాకుండా.. జిల్లాలకు వెళ్ళి చూడాలని జీవీఎల్‌కు కుటుంబరావు సూచించారు. జీవీఎల్‌ అసహనంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు చేసిన ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని కుటుంబరావు సవాల్ చేశారు.  అగ్రిగోల్డ్‌ వ్యవహారంపైనా జీవీఎల్‌ నరసింహారావు, కుటుంబరావు పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 160 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని కుటుంబరావు జోస్యం చెప్పారు.  

19:43 - June 6, 2018

విజయవాడ : బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావుపై ఏపీ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై అబాండాలు వేస్తున్నారని.. ట్విట్టర్‌ హీరోగా చెలామణీ అవుతున్న జీవీఎల్‌.... లోకేష్‌ ట్విట్టర్‌ పోస్టుకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామంటున్న జగన్‌ మాటలు నమ్మొద్దన్నారు. 

19:39 - June 6, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు పనులేనని తీవ్రంగా విమర్శించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన నాలుగేళ్ళ కాలంలో.. అశోక్‌గజపతిరాజు మూడు పెద్ద అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఎయిర్‌ ఏషియా కుంభకోణంపై ఆడియో టేపులు వెలుగు చూసిన నేపథ్యంలో.. బొత్స ఈ ఆరోపణలు చేశారు.

 

07:54 - June 6, 2018

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా అరకు లోయలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంత్రాక్స్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలోని తాగు నీటి సమస్య గురించి తెలుసుకొని నీటి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు అండగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. 

07:49 - June 6, 2018

అమలాపురం : రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆశించి ఎన్డీయేలో చేరితే.. కేంద్రప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించిన తరహాలోనే ప్రజలు.. బీజేపీకీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

కేంద్రం నమ్మించి మోసం చేసింది -చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా నవనిర్మాణ దీక్షలో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన దీక్ష సభలో సీఎం మాట్లాడారు. విభజిత రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న ఆశతోనే.. ఎన్నికలకు ముందే.. ఎన్డీయేలో భాగస్వాములయ్యామని సీఎం చెప్పారు. అయితే.. కేంద్రం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రం ద్రోహం చేసినా.. రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే వరకూ అవిశ్రాంతంగా పాటు పడతానని అన్నారు .

విభజన తర్వాత ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితి లేదు-చంద్రబాబు
రాష్ట్ర విభజన అనంతరం.. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితుల్లో లేమని.. అందుకే ఆ రోజున నవనిర్మాణ దీక్ష చేపడుతున్నామని అన్నారు. భవానీ, అయ్యప్ప, శివదీక్షల తరహాలో.. ప్రజలందరూ ఐక్యంగా జరుపుకునే ఏకైక దీక్షగా నవనిర్మాణ దీక్షను అభివర్ణించారు. నాలుగేళ్ల కిందట చేపట్టిన ఈ దీక్ష ఇప్పటికి ఉపయోగపడిందని సీఎం అన్నారు. రాష్ట్రానికి సహకరించడం కేంద్రం బాధ్యతని.. కేంద్రం సహకరించకున్నా.. ముందుకే సాగుతామని అన్నారు.

చింతలపూడిలోనూ పర్యటించిన చంద్రబాబు
జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి వన్నె చింతలపూడిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం దళితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అక్కడి నుంచి గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - andhra pradesh