AP Assembly

18:37 - December 4, 2017

తూర్పుగోదావరి : శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కాపు రిజర్వేషన్లకు కేంద్రం అనుమతి బాధ్యతను తామే తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. దశాబ్ధాల పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో బీసీల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది వుండదని హామీ ఇచ్చారు.

14:45 - December 4, 2017

కడప : కాపులను బీసీలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కడపజిల్లా రైల్వేకోడూరులో కాపులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎన్టీఆర్ , శ్రీకృష్ణదేవరాయ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక టీడీపీ ఇంఛార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడుతో పాటు పలువురు కాపు నేతలు పాల్గొన్నారు. 

12:32 - December 4, 2017

అనంతపురం : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర నేటి నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో పూర్తి చేసుకున్న యాత్ర బసినేపల్లి వద్ద అనంతపురం జిల్లాలో ప్రవేశించింది. బసినేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది.  ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై రోజుల పాటు  యాత్ర కొనసాగుతుంది. జిల్లాలో 250 కి.మీ. మేర జగన్‌ పాదయాత్ర చేస్తారంటున్న అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అనంత వెంకట్రామిరెడ్డితో ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:44 - December 4, 2017

గుంటూరు : కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్‌లో రగడ కొనసాగుతోంది. ఓ వైపు ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నా.. బీసీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, దీనిపట్ల టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. 
చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ 
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించినట్లు సీఎం చంద్రబాబు  చెప్పారు. చాలాకాలంగా ఉన్న కాపుల డిమాండ్‌ను నేరవేర్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడ్డామన్నారు. బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలో చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామన్నారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ కమిషన్‌ అంశాలపై నేతలకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినప్పుడు మాట్లాడని ఆర్‌.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై అనవసర విమర్శలు చేస్తున్నారని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
బీసీ సంక్షేమ సంఘం ధర్నా 
మరోవైపు బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కాపులకు వర్తింపజేయడానికి వీల్లేదన్నారు బీసీ సంఘం నేతలు. ఈమేరకు కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసినా.. మరోవైపు కాపులను బీసీల్లో చేర్చడాన్ని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు సమస్యలు ఎదురవుతుంటే కాపులను బీసీల్లో చేర్చి మరిన్ని సమస్యలు సృష్టించడం ప్రభుత్వానికి తగదని బీసీ నేతలు అంటున్నారు. ఈ చర్యను ప్రభుత్వం ఆపకపోతే రాబోయేకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 

 

18:16 - December 3, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబుపై పలు విమర్శలు గుప్పించారు. అబద్దాలతో బాబు పాలన సాగిస్తున్నారని, రాష్ట్ర వృద్ధి రేటుపై బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. అమెరికా, యూకే, ప్రాన్స్, చైనాలో జీడీపీ మూడు నుండి ఆరు శాతం వరకు ఉంటే ఏపీ 12 శాతం వృద్ధి రేటు సాధించిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఒకవేళ బాబు చెప్పిందే నిజమైతే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉండేదన్నారు. 

15:27 - December 3, 2017

విజయవాడ : బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ లను కాపులకు వర్తింప చేయడానికి వీల్లేదని బీసీ సంఘం నేతలు స్పస్టం చేస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆదివారం విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఆం.ప్ర. బి.సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీలకు సమస్యలకు ఎదురవుతుంటే కాపులను బీసీల్లో చేర్చుస్తూ మరింత సమస్యల సుడిగుండంలో నెట్టారని ప్రభుత్వానికి తగదని, వెంటనే దీనిని ఆపకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

07:34 - December 3, 2017

కాపు రిజర్వేషన్లపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మండలి హనుమంతరావు, టీడీపీ నేత చందూ సాంబ శివరావు, బీసీ జన సభ రాష్ట్ర కన్వీనర్ గంగాధర్ పాల్గొని, మాట్లాడారు. కాపు రిజర్వేషన్ బిల్లు శాస్త్రీయబద్ధంగా లేదన్నారు. కాపు రిజర్వేషన్లపై హైడ్రామా నడుస్తోందన్నారు. కాపులను బీసీలో చేర్చడం చారిత్రక తప్పిదమని గంగాధర్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

06:58 - December 3, 2017

గుంటూరు : పార్టీ ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి కలిసివచ్చిందా? లేక అధికారపార్టీకి కలిసివచ్చిందా? వైసీపీ నిర్ణయంతో లాభం ఏ పార్టీకి జరిగింది.?  నష్టమెవరికి మిగిలింది ? ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ నిర్ణయం దోహదపడిందా? ఇంతకీ వైసీపీ నిర్ణయంపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి?  లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ..
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ
పోలవరం నిర్మాణం, రాజధాని నగర ప్రగతి.. అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో లోటుపాట్లు... అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జాప్యం... ఇలాంటి అనేక సమస్యలు ఏపీలో ఉన్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని  నిలదీసేందుకు సరైన వేదిక అసెంబ్లీయేనని చెప్పాలి. ప్రతిపక్షానికి ఇంతకంటే మించిన వేదిక మరొకటి ఉండదు.  సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూనే.. తమ విధానాన్ని ప్రజలకు చెప్పేందుకు సరైన వేదిక అసెంబ్లీ సమావేశాలు. కానీ ఏపీలోని ప్రతిపక్షపార్టీ వైసీపీ ఆ అవకాశాన్ని వదులుకుంది.  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌తో సభకు హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయించింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకాలేదు. ప్రతిపక్షం ఒక్కరోజు కూడా సభకు హాజరుకాకపోవడమనేది ఒక చరిత్రే. కానీ ఇది ప్రజాస్వామ్యంలో సరైన పని కాదన్న విమర్శలు కూడా వైసీపీపై వచ్చాయి.  అధికారపార్టీపై నిప్పులు చెరిగే కాంగ్రెస్‌లాంటి పార్టీలతోపాటు... ఉండవల్లి లాంటి సీనియర్‌ పొలిటీషియన్‌ కూడా ప్రతిపక్ష తీరును తప్పుపడుతున్నారు. వైసీపీ తన నిర్ణయంతో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయిందని చెబుతున్నారు.
బోటు ప్రమాదంపై సర్కార్‌ను నిలదీసే చాన్స్‌ మిస్సైన వైసీపీ
ఏపీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన తర్వాత ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ దగ్గర బోటు ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనకు ఇటు టూరిజంశాఖ.. అటు ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యం ఉంది. ఇంతపెద్ద ప్రమాదం జరిగితే ప్రతిపక్షం మాత్రం అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరుకాలేదు. ఫలితంగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి.. బాధిత కుటుంబాలకు మరింత న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంది. సభకు వైసీపీ హాజరైఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
కాపులకు రిజర్వేషన్లపై ప్రభుత్వ ఏకపక్ష ధోరణి
కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే సభలో బిల్లు ప్రవేశపెట్టడం చకాచకా జరిగిపోయింది. ఇదే సమయంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ్‌ కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. కమిషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న మంజునాథ్‌ నివేదిక ఇవ్వకుండానే సభ్యులుగా ఉన్నవారు  ఇచ్చిన నివేదికను బేస్‌ చేసుకుని ప్రభుత్వం కాపు రిజర్వేషన్‌ బిల్లు రూపొందించడం కొంత వివాదాఆనికి దారితీసింది. కీలకమైన, సున్నితమైన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కాపు రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన గందరగోళాన్ని సభలో ప్రస్తావించే దిక్కులేకుండా పోయింది.  వైసీపీ సభకు హాజరుకాకపోవడం మూలంగా అత్యంత కీలకమైన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ప్రతిపక్షం వాయిస్‌ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. 
ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కోల్పోయిన వైసీపీ
టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లో పెట్టిన అత్యంత కీలకమైన వాగ్దానం నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతికి సంబంధించిన కసరత్తు కొన్ని నెలలుగా జరుగుతున్నా... ఇప్పటికీ దాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో విధివిధానాలు రూపకల్పన చేసే దిశగా ఇంకా కసరత్తు  చేస్తూనే ఉంది. వైసీపీ సభకు వచ్చుంటే నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే అవకాశం చిక్కేది. కానీ ఈ అవకాశాన్ని సైతం వైసీపీ కోల్పోయింది. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. నంది అవార్డులు మొదలుకొని విద్యార్థుల ఆత్మహత్యల వరకు చర్చనీయాంశమయ్యాయి. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరకాటంలో పడవేసే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుందనే చెప్పక తప్పదు.  మొత్తంగా చూస్తే వైసీపీ సభకు హాజరుకావొద్దని తీసుకున్న నిర్ణయం ఆపార్టీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయింది. అధికారపార్టీ తప్పులను ఎత్తిచూసే చాన్స్‌ను మిస్‌ అయ్యింది. ఈ నిర్ణయం అటు వైసీపీలోనూ అంతర్గతంగా అసంతృప్తిని రాజేసిందనే చెప్పాలి.

 

21:17 - December 2, 2017

విజయవాడ : కాపులను బీసీలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. ఏపీలో మిశ్రమ స్పందన వస్తోంది. కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో... బీసీల్లో చేర్చాలంటూ ... కాపు సామాజిక వర్గం చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొందరు.. మండిపడుతున్నారు.

కాపులకు రిజర్వేషన్‌ కల్పించడంతో... తిరుపతి, విశాఖపట్నంలలో కాపు సామాజిక వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే నిర్ణయంపై కాపు ఉద్యమ నేత... ముద్రగడ పద్మనాభం సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఐదు శాతం రిజర్వేషన్‌ల కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆయన కోరారు. అలాగే కాపులను బీసీలో చేర్చడం కాపులకు చరిత్రలో మర్చిపోలేని రోజని, రిజర్వేషన్లతో కాపులకు మెరుగైన అవకాశాలు అందుతాయని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

బీసీల్లో కాపులను చేర్చడాన్ని నిరసిస్తూ.. పలు జిల్లాలో బీసీ సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి.. తమ వ్యతిరేకతను తెలియజేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని .. నినదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం కూడా ఖండించింది. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

అదేవిధంగా వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే కాపు రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకం కాకపోయినా.. బీసీలకు ఏ మేరకు న్యాయం చేయగలరో తేటతెల్లం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయంపై కూడా భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నిర్ణయంపై అనంతపురంలో.. వాల్మీకి నాయకులు సంబరాలు జరుపుకుంటే.. కర్నూలులో గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 

19:46 - December 2, 2017

విజయవాడ : కాపులను బీసీల్లోకి చేరుస్తూ.. ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. వెనుకబడిన కులాల జాబితాలో.. కాపుల కోసం కొత్తగా ఎఫ్‌ అనే గ్రూప్‌ను సృష్టించి.. దానిద్వారా, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఐదు శాతం మేర రిజర్వేషన్‌లు కల్పించనున్నట్లు తీర్మానంలో ప్రతిపాదించారు. రాజకీయాల్లో తప్ప, విద్య, ఉద్యోగావకాశాల్లో ఈ రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. రాజ్యాంగ సవరణ అవసరమైన దృష్ట్యా.. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. మరోవైపు, వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండు కీలక తీర్మానాలను ఆమోదించింది. కాపులను బీసీల్లోకి చేర్చే తీర్మానం ఒకటైతే.. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న తీర్మానం మరోటి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి మరీ.. ప్రభుత్వం ఈ తీర్మానాలను ప్రతిపాదించింది. కాపులను బీసీల్లో చేర్చే బిల్లును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాపుల కోసం.. వెనుకబడిన కులాల జాబితాలో కొత్తగా ఎఫ్‌ కేటగిరీని సృష్టించారు. దీనికింద, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానంలో ప్రతిపాదించారు. అన్ని వర్గాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు వెల్లడించారు.

తీర్మానంపై మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామన్నారు. ఎవరూ కోరకున్నా.. పాదయాత్ర సందర్భంగా.. కాపుల కష్టాలు చూసిన తానే.. రిజర్వేషన్‌ల ప్రస్తావన తెచ్చానన్నారు. బ్రిటిష్‌ హయాంలో బీసీలుగా ఉన్న కాపులు.. కాలక్రమంలో రిజర్వేషన్‌లను ఎలా కోల్పోయారో చంద్రబాబు వివరించారు. 2014లో ఇచ్చిన హామీకి కట్టుబడి.. 2016లో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ వేశామని తెలిపారు. కమిషన్‌ నివేదిక మేరకే.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామని, బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగబోదని చంద్రబాబు వివరించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్టాడిన తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ, సుప్రీంకోర్టు తీర్పును గమనంలో ఉంచుకుని.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించే అంశంపై లోతుగా కసరత్తు చేశామన్నారు.

సుదీర్ఘ చర్చ అనంతరం.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పించే తీర్మానాన్ని.. ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వెంటనే.. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు.. ఈ తీర్మానం తరాలుగా అణగారిన బోయ, వాల్మీకుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తోందని అన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించడంతో, ప్రస్తుతం ఏపీలో రిజర్వేషన్ల శాతం 55కు చేరింది. రిజర్వేషన్‌లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. రాజ్యాంగ సవరణ కోరుతూ.. ఈ తీర్మానాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపాలని శాసనసభ నిర్ణయించింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP Assembly