AP Assembly sessions

22:02 - March 8, 2018

అమరావతి : లక్షా 91 వేల 63 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 50 వేల 270 కోట్లు కాగా.. మూలధన వ్యయం 28 వేల 678 కోట్లు. ఆర్థిక లోటును 24 వేల 205 కోట్లుగా అంచనా వేశారు. గతంలో పోలిస్తే 21.70శాతం బడ్జెట్‌ పెరిగింది.

1 లక్షా 91 వేల 63 కోట్ల బడ్జెట్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను.. 1 లక్షా 91 వేల 63 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చేశారు. రెవెన్యూ వ్యయం 1 లక్షా 50 వేల 270కోట్లు కాగా.. మూలధన వ్యయం.. 28 వేల 678కోట్లు. ఆర్థిక లోటును 24 వేల 205 కోట్లుగా అంచనా వేశారు. గతంలో పోలిస్తే 21.70శాతం బడ్జెట్‌ పెరిగినట్లు యనమల తెలిపారు.

రెండంకెల వృద్ధి
రాష్ట్ర పునర్నిర్మాణానికి సాయం అందడం లేదని.. విభజనలో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందని యనమల అన్నారు. అసంబద్దంగా జరిగిన విభజన వల్లే రాష్ట్రానికి సమస్యలు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక పోవడం సమస్యను రెట్టింపు చేసిందన్నారు. మూడేళ్లలో జాతీయ సగటు వృద్ధి 7.30 శాతంతో పోలిస్తే.. రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందని చెప్పారు.

వ్యవసాయ రంగానికి 12 వేల 352కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 12 వేల 352కోట్లు కేటాయించారు. ఇది గతంలో పోలిస్తే 35.91 శాతం అదనం. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని యనమల అన్నారు. ఇందుకు కర్నూలు జిల్లాలోని మెగా సీడ్‌ పార్క్‌కు 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతు రుణమాఫీకి 4 వేల 100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

సాగునీటి రంగానికి 16 వేల 978 కోట్లు
సాగునీటి రంగానికి 16 వేల 978 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 20 వేల 815కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. అలాగే.. ఇంధన రంగానికి 5 వేల 52కోట్లు, పరిశ్రమల శాఖకు 3 వేల 74కోట్లు, రవాణా శాఖకు 4 వేల 653కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణ శాఖకు 3 వేల 679కోట్లు కేటాయించిన యనమల.. 2020 నాటికి పట్టణ ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేదే లక్ష్యమన్నారు. ఇళ్ల స్థలాల సేకరణకు 575 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సాధారణ సేవల కోసం 56 వేల 113 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టుకు 9 వేల కోట్లను బడ్జెట్‌లో చేర్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యనమల.

విద్యా రంగానికి 24 వేల 185కోట్లు
విద్యా రంగానికి 24 వేల 185కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు 100కోట్లు, బీసీలకు 100కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల తెలిపారు. సామాజిక భద్రత కోసం 3 వేల 29కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు బోధన ఫీజు కోసం 700కోట్లు, కాపు సామాజిక విద్యార్థులకు 400కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 4 వేల 477కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి 12 వేల 200కోట్లు, కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు , వైశ్యుల సంక్షేమం కోసం 30కోట్లు, మేదరుల సంక్షేమానికి 30కోట్లు, నాయీ బ్రాహ్మణుల కోసం 30కోట్లు, కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం 70కోట్లు కేటాయించారు. చేతివృత్తులకు ఆదరణ పథకానికి గాను 750 కోట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. చేనేతలను ప్రోత్సహించేందుకు జనతా వస్త్రాల పథకం కింద 250కోట్లు కేటాయించారు.

హోంశాఖకు 6 వేల 226కోట్లు
హోంశాఖకు 6 వేల 226కోట్లు, పర్యాటక శాఖకు 290కోట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం కోసం 2 వేల 623కోట్లు కేటాయించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కోసం 600కోట్లు, అన్నా క్యాంటీన్ల కోసం 200కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. పౌష్టకాహార లోపం నియంత్రణకు 360కోట్లు కేటాయించారు. హిజ్రాల సంక్షేమానికి 20కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. తమ ప్రభుత్వం వైద్య-ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్న యనమల.. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవకు 1000కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య ఆరోగ్యానికి 8 వేల 463 కోట్లు కేటాయించారు.న్యాయశాఖకు 886కోట్లు, నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్లు, ఎన్టీఆర్‌ ఫించన్లకు 5 వేల కోట్లు కేటాయించారు. ప్రజల రాజధాని అయిన అమరావతి అభివృద్ధికి గత ఏడాది కంటే 49 శాతం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి యనమల తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో 7,741 కోట్లు కేటాయించారు. మొత్తంగా ప్రధాన ప్రతిపక్షం లేకుండానే.. లక్షా 91 వేల 63 కోట్లతో రాష్ట్ర బడ్డెట్‌ ప్రతిపాదనలను అసెంబ్లీలో యనమల ప్రవేశపెట్టారు.   

20:00 - March 8, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. విభజనలో ఆదాయాన్ని, రాజధానిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించిందన్నారు. అసమజసంగా జరిగిన విభజన వల్లే రాష్ట్రానికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన వివిధ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేషకులు తులసీరాం,  పట్టాబిరాం (టీడీపీ) కిలారి రోశయ్య (వైసీపీ) ఈ అంశంపై మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి..

16:04 - March 8, 2018

అమరావతి : ఏపీ విభజన హామీలు నెరవేర్చే క్రమంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. బీజేపీ వ్యవహారంపై ఆవేదన వ్యక్తంచేసిన బాబు మాట్లాడుతు..జాతీయపార్టీలపై నమ్మకం పోతుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు.. నాలుగేళ్ల పాటు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విభజించిన దానికంటే విభజించిన తీరే ఆంధ్రులను తీవ్రంగా బాధించిందన్నారు. ఆనాడు విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై భాజపా ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. విభజన జరిగిన సమయంలో పెట్టిన బిల్లులోని అంశాలు, తర్వాత రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన తర్వాతే భాజపాతో పొత్తు పెట్టుకుమని.. ఇప్పుడేమో నిబంధనలు అడ్డొస్తున్నాయని కథలు చెబుతున్నారన్నారు. జాతీయ పార్టీగా భాజపా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. 

14:01 - March 8, 2018

అమరావతి : అసెంబ్లీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 19,070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. రెండో అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధి సాధించామని.. జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 14శాతం అధికంగా నమోదైందని తెలిపారు. రబీలో 42శాతం వర్షపాతం తక్కువగా నమోదైనందువల్ల వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా హెక్టారుకు 5,176 కిలోల ఉత్పత్తి నమోదు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానం, వరి ఉత్పాదనలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా ముందస్తు నీటి విడుదల వల్ల అధికోత్పత్తి సాధ్యమైందని...రబీ పంట చివరి దశ సాగునీటికి మార్గం సుగమమైందని మంత్రి పేర్కొన్నారు. విభజన తర్వాత నాగార్జున సాగర్‌ నుంచి రాష్ట్ర నీటి వాటా 132 టీఎంసీలు మాత్రమే వచ్చాయన్నారు. రైతులకు వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాల పంపిణీ చేస్తు్న్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విత్తనాల సరఫరాల కోసం ఆధార్‌ అనుసంధానం అమలు చేస్తు్న్నామన్నారు. విత్తన సరఫరాలో పారదర్శకతకు రాష్ట్రానికి జాతీయస్థాయిలో అవార్డు లభించిందన్నారు. వేరు శనగ విత్తనాలను 90శాతం రాయితీతో సరఫరా చేశామన్నారు. కర్నూలు జిల్లా తంగడంలో అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పామని.. ఇది దేశంలో మొట్టమొదటి మెగా సీడ్‌ పార్క్‌ అని తెలిపారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్‌ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో తగ్గుతున్న ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి : 

ఉత్తరాంధ్రలో తగ్గుతున్న ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గత ఏడాది కంటే వేరు శనగ ఉత్పత్తి విస్తీర్ణం 31 శాతం తగ్గిందన్నారు. కాగా వేరు శెనగ విత్తనాలను 90 శాతం రాయితీతో సరఫరా చేశామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ముందస్తు నీటి విడుదలతో అధికోత్పత్తి సాధ్యమయిందన్నారు. రైతులకు వందశాతం రాయితీలో సూక్ష్మపోషకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీని అమలు చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన సంకేతిక పరిజ్నానం అందించేందుకు అగ్రిటెక్ ను ఉపయోగిస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తన సరఫరా కోసం ఆధార్ తో అనుసంధానం చేశామన్నారు. సాయిన ఎరువుల వాడకంలో దేశంలో ఆరోస్థానంలో వున్నామన్నారు. దేశంలో మొదటిసారిగా ఈ మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాలో దేశంలోను తొలిసారిగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. నూతన పద్దతులతో కూరగాయల సాగు 35 శాతం పెంచగలిగామన్నారు. అలాగే ఉద్యానవన పంటలతో రైతుల ఆదాయం మెరుగుపడుతోందన్నారు. రాబోయే రోజుల్లో వేయికి పైగా రైతు సంఘాల ఏర్పాటు చేస్తామన్నారు.

  • పశు సంవర్థక శాఖకు రూ.223 కోట్లు
  • మత్స్యశాఖకు రూ.386 కోట్లు
  • మెగా సీడ్ పార్క్ కు రూ.100 కోట్లు
  • జైకా ప్రాజెక్ట్ కింద రూ.2000 కోట్లు
  • కౌలు రైతుల రుణాలకు రూ.2,346 కోట్లు
  • కరవు నివారణకు రూ.1,042కోట్లు
  • అజిమ్ ప్రేమ్ జీ సంస్థతో పరిశోధనలకు రూ.100 కోట్లతో ఒప్పందం
  • వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహాలకు రూ.420 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.258 కోట్లు
  • ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగానికి రూ.4730 కోట్లు
  • రెవెన్యూ వ్యయం.. రూ.18,602.98కోట్లు
  • పెట్టుబడి వ్యయానికి రూ.467.38కోట్లు
  • రైతు రథం పథకం కింద రూ.2.50లక్షల రాయితీతో ట్రాక్టర్ల మంజూరు

 

 

12:38 - March 8, 2018

గుంటూరు : ఏపీ వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 2018 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్ తరువావ సభ ముందుకు వ్యవసాయ బడ్జెట్ రానుంది. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరగడంతో ఆదాయం భారీగా కోల్పోయామని తెలిపారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందిపడ్డామని చెప్పారు. సమస్యలున్నా కూడా ఆర్ధికాభివృద్ధికి బలమైన పునాదులు వేశామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులతో బడ్జెట్ తో రూపొందించామన్నారు. బడ్జెట్ లో సంక్షేమ రంగానికే పెద్దపీట వేశామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్వేయమన్నారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని తెలిపారు. 

  • మొత్తం బడ్జెట్ రూ.1,91,06, 361 కోట్లు
  • గత ఏడాది 10.96 వృద్ధ సాధించాం... 
  • క్యాపిటల్ అంచనా వ్యయం రూ.28,678.49 కోట్లు
  • ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు 
  • ఎస్టీ, బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక అమలు 
  • ఇందుకోసం చెరో వందకోట్లు కేటాయింపు 
  • సాగునీటి రంగానికి రూ.16,975 కోట్లు
  • సంక్షేమ రంగానికి రూ.13.720 కోట్లు
  • వ్యవసాయానికి రూ.12,355 కోట్లు 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు 
  • వెనకబడిన వర్గాల కోసం 35 శాతం ఆదనపు నిధులు
  • హిజ్రాల సంక్షేమం కోసం రూ.20 కోట్లు 
  • చంద్రన్న పెళ్లి కానుక రూ.100 కోట్లు
  • కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు
  • కాపు కార్పొరేషన్ కు రూ.100 కోట్లు 
  • సెకండరీ విద్య కోసం రూ.21,612 కోట్లు 
  • వెనుబడిన వర్గాల కోసం 35 శాతం అదనపు నిధులు 
  • ఆదరణ పథకానికి రూ.750 కోట్లు 
  • మత్స్యకారుల సంక్షేమానికి 77 కోట్లు 
  • ఏపీ వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100 కోట్లు 
  • గ్రామీణాభివృద్ధికి రూ.20,816 కోట్లు 
  • చేనేత రంగానికి రూ.200 కోట్లు 
  • వైద్య రంగానికి రూ.8,463 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ.3,679 కోట్లు 
  • వైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు 
  • నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు 

 

12:16 - March 8, 2018

గుంటూరు : కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని చెప్పారు. ఏపీకి పద్ధతి ప్రకారం న్యాయం చేయలేదని వాపోయారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని కేంద్రంతో పొత్తుపెట్టుకున్నామని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ప్రజల నుంచి ఒత్తిడి ఉందన్నారు. జాతీయ పార్టీలు జాతీ ప్రయోజనం కోసం బాధ్యతగా ఉండాలని సూచించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. ఎన్ టీఆర్ కాంగ్రెస్ యేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారని... ఫెడరల్ సెటప్ కు శ్రీకారం చుట్టారని చెప్పారు. కొన్ని రాజకీయ కారణాలతో బీజేపీ మంత్రులు రాజీనామా చేశారని తెలిపారు. కామినేని, మాణిక్యాలరావు మంత్రులుగా మంచిగా పని చేశారని అభినందించారు. చాలా సమర్థవంతంగా పని చేశారని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని...ఎండో మెంట్ ను స్ట్రీమ్ లైన్ చేశారని కొనియాడారు. 

 

12:01 - March 8, 2018

గుంటూరు : ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ శత్రువు కాదని.. మిత్రువే అని అన్నారు. తనకు చంద్రబాబు స్ఫూర్తి అని అన్నారు. చంద్రబాబు నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. చక్కటి పరిపాలన దక్షతతో సీఎం చంద్రబాబు పని చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీకి లాభం చేకూరిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మెడికల్ కాలేజీలో లేదని సీఎం దృష్టికి తెచ్చినట్లు గుర్తు చేశారు.

 

11:45 - March 8, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బాబు లాంటి నాయకులుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను మంత్రిగా సఫలం అయ్యాయని చెప్పారు. తాను మంచి స్నేహితులను సంపాదించుకున్నానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేశారని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి వెంకయ్యనాయుడు, బీజేపీ నాయకత్వం కారణమన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. కొన్ని పేపర్లు, కొందరు తనపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. రాజకీయ అవినీతికి పాల్పడలేదన్నారు.  

 

07:54 - March 8, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా భారీ కేటాయింపులతో బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు  ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ కావడంతో కొత్త పథకాలతో ఆకర్షణీయంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఉదయం 11.30కు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ఈ ఆకర్షణీయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తర్వాత  పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ మండలిలో ప్రవేశపెడతారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెట్టనుంది.
  

22:14 - March 7, 2018

గుంటూరు : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు అత్యసవరస భేటీ అయ్యారు. ఎంపీలతో టెలికాన్ఫరెన్సులో సీఎం అభిప్రాయాలు తీసుకుంటున్నారు. జైట్లీ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి చెందారు. రెండు ప్రతిపాదనలపై చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. తొలి ప్రతిపాదనగా కేంద్రమంత్రులతో రాజీనామాలు, రెండో ప్రతిపాదనగా కేంద్రం మంత్రులతోనూ నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. చర్చల అనంతరం ఎన్డీయేకి కటీఫ్ చెప్పాలని ఎంపీలు సీఎంకు తేల్చి చెప్పారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, లోకేష్, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - AP Assembly sessions