AP Assembly Winter and Monsoon Sessions

21:18 - November 14, 2017

కర్నూలు : జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదోరోజు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగల మర్రి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగింది. జగన్ యాత్ర ఇవాళ వంద కిలోమీటర్లు దాటింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి గ్రామస్థులకే ఉద్యోగం కల్పిస్తామన్నారు జగన్. 

18:48 - November 14, 2017

విజయవాడ : జగన్ కు ఇంగిత జ్ఞానం ఉందా ? అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ తీరుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు నీరిచ్చి ఆదుకుంటుంటే.. జగన్‌ పల్నాడుకు నీరు తరలించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి క్షణం సీఎం కుర్చీ గురించే ఆలోచించే జగన్‌ ముఖ్యమంత్రి కాలేడని జేసీ అన్నారు. జగన్‌ రాజకీయాలు వదిలేసి పారిశ్రామిక వేత్తగా స్థిరపడాలని జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. 

22:03 - November 12, 2017


కడప : చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టామన్నారు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. ఆరో రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చెన్నమరాజుపల్లె, చాపాడు కెనాల్‌, కామనూర్‌, రాధానగర్‌ మీదుగా 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చేనేత కార్మికులు, ఇతర కుల సంఘాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్తలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకురావాలన్నారు జగన్‌. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసే పరిస్థితి రావాలన్నారు. అలాంటి పరిస్థితి తీసుకురావడానికే పాదయాత్ర చేస్తున్నానన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలు దిద్దిన మానిఫెస్టో తీసుకువస్తానన్నారు. ప్రజల భయంతోనే చంద్రబాబు మానిఫెస్టో నెట్‌లో పెట్టలేదని విమర్శించారు.

 

21:46 - November 10, 2017

గుంటూరు : పాదయాత్రతో అధికారంలోకి వస్తారనుకోవడం భ్రమేనన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో షర్మిల కూడా పాదయాత్ర చేసిందని... అయినా ఏం ప్రయోజనం కలగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు తరువాత చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. దూషించుకుంటేనే వార్త అనే పరిస్థితి పోవాలన్న సీఎం... అర్ధవంతమైన చర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియాపైనే ఉందన్నారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం కొత్తేమీ కాదన్నారు. 1982కు ముందు ప్రతిపక్ష పార్టీలు లేవని... గ్రూపులు మాత్రమే ఉండేవన్నారు. అసెంబ్లీలో జగన్‌ ఉంటే సభను అడ్డుకోవడం తప్ప వేరే పనేం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్‌, జగన్‌ అవినీతి గురించి ఇప్పటికీ విదేశాల్లో అడుగుతున్నారని... గతంలో జరిగిన అవినీతి వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిన్నదని వాపోయారు. ఏసీబీకి పట్టుబడ్డ వారి ఆస్తులను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అక్రమార్జనను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే భావన ప్రజల్లో వస్తే అవినీతిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

 

20:25 - November 10, 2017

గుంటూరు : నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రలో తాగు, సాగు, పారిశ్రామిక రంగాలకు నీటి భద్రత కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ బృహత్‌ కార్యక్రమం పూర్తైన తర్వాత సమగ్ర నీటి విధానం తీసుకొస్తామని సభ దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానాన్ని పూర్తి చేయడం ద్వారా 15 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. విపక్షం లేకుండా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 25 వరకు జరగనున్నాయి. 
సమావేశాలను బహిష్కరించిన వైసీపీ  
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరించడంతో అన్ని అంశాలపై చర్చ ఏకపక్షంగా సాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు.. ప్రత్యేక ప్రస్తావన ద్వారా  పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి  కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చిన ముఖ్యమంత్రి చందబ్రాబును అభినందనలు తెలిపే విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై చాలా మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పాలని ఆసక్తి కనపరచడంతో ప్రశ్నోత్తరాల తర్వాత సల్వవ్యవధి చర్చ చేపట్టారు. 
పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ
పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా రైతుల ఆదాయం పెరిగిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానంచేసి, నీటి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
అమరావతిలో అంబ్కేడ్కర్‌ స్మృతివనంపై చర్చ 
ప్రశ్నోత్తరాల సమయంలో అమరావతిలో అంబ్కేడ్కర్‌ స్మృతివనం నిర్మాణంపై చర్చ జగింది. టీడీపీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన లేవనెత్తిన ఈ అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో  అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి, 18 నెలల్లో పూర్తి చేస్తామని  చర్చకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.  ప్రశ్నోత్తరాలు, పట్టిసీమపై చర్చ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు.  

 

19:25 - November 10, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో నదుల అనుసంధానం, పట్టీసీమపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.... పోలవరం జీవనాడి అయితే రాయలసీమకు ముచ్చుమర్రి జీవనాడి అన్నారు. పోలవరం ప్రాజెక్టు తన జీవిత ఆశయంగా పెట్టుకున్నానని.. ఎన్నికష్టాలొచ్చినా పూర్తి చేసి తీరుతామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం త్వరలోనే పూర్తవుతుందన్నారు. రాజధాని మొదలు అన్ని పనులకు ప్రజలు తన వెంట ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

 

19:18 - November 10, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ముందుగానే ప్రకటించడంతో.... ప్రతిపక్షం లేకుండానే... సమావేశాలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన సమావేశాలు ఈనెల 25 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ వైసీపీ చేసిన డిమాండ్‌పై స్పీకర్ కోడెల స్పందించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ భేటీని వైసీపీ బహిష్కరించడం అప్రజాస్వామికమని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. సమావేశాలకు 1200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని డీఐజీ గోపాలరావు తెలిపారు. 

 

Don't Miss

Subscribe to RSS - AP Assembly Winter and Monsoon Sessions