ap cm

13:19 - November 14, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

16:08 - November 8, 2017

కృష్ణా : విజయవాడను గ్రేటర్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం విజయవాడ పరిధిలోని 45 గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముందుగా 19 గ్రామాలను గ్రేటర్‌లో చేర్చి మిగితా గ్రామాలను మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం విలీనం చేయనున్నారు. 
నగరపాలక సంస్థలో 45 గ్రామాల విలీనం..! 
విజయవాడకు గ్రేటర్‌ కల త్వరలోనే సాకారం కానుంది. వ్యాపార, వాణిజ్య, పర్యాటక, ఆధ్యాత్మిక పరంగా విజయవాడ నగరానికి ప్రత్యేకమైన పేరుంది. 2017 అక్టోబర్ 14న సీఎం చంద్రబాబు విజయవాడలో చేసిన అకస్మిక తనిఖీల్లో భాగంగా గ్రేటర్‌ అంశాన్ని ప్రస్తావించారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను దశలవారిగా నగరపాలక సంస్థలో విలీనం చేస్తామని ప్రకటించారు. అప్పటి నుండి గ్రేటర్‌ పనుల్లో వేగం పెరిగింది. 
15,17,732కు పెరగనున్న జనాభా
ప్రస్తుతం నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు ఉండగా, 45 గ్రామాల ప్రతిపాదిత విస్తీర్ణం 363.71 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. గ్రేటర్‌లో 45 గ్రామాలన్నీ విలీనం చేస్తే 425.59 చదరపు కిలోమీటర్ల మేర నగరం విస్తరించనుంది. అలాగే 2011 సంవత్సరంలో నగర జనాభా లెక్కలు 10 లక్షల 39వేల 518 మంది ఉండగా, 45 గ్రామాల్లో జనాభా 4 లక్షల 78వేల 214 మంది ఉన్నారు. విజయవాడ గ్రేటర్‌గా రూపాంతరం చెందితే ఈ సంఖ్య 15 లక్షల 17వేల 732 కు పెరగనుంది. 
విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు 
అయితే ఈ విలీనాన్ని  ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రేటర్ అయితే ప్రజలపై పన్నుల భారం  పడనుందంటున్నారు. అయినా కూడా ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు సన్నాహాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయవాడను గ్రేటర్‌ చేసినప్పటికీ ప్రజలపై పన్నుల భారం లేకుండా, తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నారు. 

 

15:25 - November 8, 2017

కడప : సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ సవాల్ విసిరారు. జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు విదేశాల్లో నల్లధనం ఉందని రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని జగన్ అన్నారు. నల్లధనం లేదని రుజువు చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

 

18:30 - November 4, 2017

విజయవాడ : ఏపీ పర్యాటక రంగానికి పెట్టుబడుల కోసం రేపటి నుంచి రెండు రోజుల పాటు ఆ శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ లండన్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. లండన్‌లో వరల్డ్ ట్రావెల్ మార్ట్‌లో ఎపీ తరపున స్టాల్ ఏర్పాటు చేయబోతున్నట్లు అఖిలప్రియ చెప్పారు. రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అదే విధంగా విదేశాల్లో పర్యటించే తెలుగు వారికి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

లండన్ పర్యటనలో టూరిజం, హోటల్..ఈవెంట్ మేనేజ్ మెంట్..అడ్వర్ టైజ్ మెంట్స్ కు సంబంధించిన వారితో చర్చలు జరుపడం జరుగుతుందన్నారు. విదేశీ పర్యటకులకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల్లో పర్యటించే తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి..అక్కడున్న అధికారికి విషయం తెలియచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

21:19 - November 3, 2017

ఢిల్లీ : భారత్‌లో ఫుడ్‌ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన 'వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ 10 లక్షల మంది ప్రయాణికులు రైళ్లల్లో భోజనం చేస్తుంటారని..... ఆహార పరిశ్రమకు వాళ్లే ప్రధాన కస్టమర్లు అని మోదీ తెలిపారు. ఆహార తయారీ ప్రక్రియలో రైతులే కీలకమన్నారు. ప్రపంచ స్థాయి ఆహార పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనా' పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఆహార పరిశ్రమల కోసం సుమారు 5 బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని చెప్పారు. దీని వల్ల సుమారు 20 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుందన్నారు. మరో 5 లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఫుడ్‌ ఫెస్టివల్‌లో 70 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

21:15 - November 3, 2017

ఢిల్లీ : హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం నిధుల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు రాష్ట్రానికి రావల్సిన ఇతర నిధుల అంశాన్ని జైట్లీ ముందు ప్రస్తావించారు. అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను చంద్రబాబు కలిశారు. విభజనచట్టం వేగవంతం చేయమని రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. విభజన చట్టం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అమిత్‌షాతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పారు. 

18:42 - November 3, 2017

ఢిల్లీ : ఇండియా గేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఎగ్జిబిషన్‌లో ఏపీ ప్రత్యేక స్టాల్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబుతో పాటు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో 18 రాష్ట్రాల పెవిలియన్లు ఏర్పాటు చేయగా.. ఏపీ స్టాల్‌లో 40 సంస్థల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఆహార ఉత్పత్తి రంగంలో ఏపీలో ఉన్న వనరులు, వ్యాపార అవకాశాలు వివరించేందుకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. 

18:27 - November 3, 2017

ఢిల్లీ : 20 ఏళ్ల క్రిందటే ఐటీ మీద దృష్టి పెట్టిన తాము ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నెంబర్ వన్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అభివృద్ధికి అవసరమైన పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో... రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

18:14 - November 3, 2017

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా ఫెస్టివల్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో ఆయన భేటీ అయ్యారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన విషయంలో కేంద్రం నుండి అందాల్సిన సహకారంపై చర్చ జరిగింది. పోలవరం నిర్మాణంపై ఇటీవలే సంబంధిత మంత్రి గడ్కరి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పెండింగ్ నిధులు..కాంట్రాక్టర్ మార్పు..ఇతర అంశాలపై తాజాగా జైట్లీతో బాబు చర్చించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు కేటాయింపు వేగవంతం చేయాలని కోరారు. విభజన అంశాల్లో పేర్కొన్న వాటిని అమలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 

18:37 - November 2, 2017

ఢిల్లీ : ఇండియాగేట్ ప్రాంగణంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ, సీఐఐ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫెస్టివల్‌లో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలు సంస్థల పెట్టుబడి దారులు, ఉత్పత్తిదారులు, విధాన రూపకర్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. ఏపీలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్పత్తి రంగాల్లోని అవకాశాలను ప్రతినిధులకు చంద్రబాబు వివరించనున్నారు. ఏపీ స్టాల్‌లో 40 సంస్థల ఉత్పత్తులు ప్రదర్శనలో పెట్టనున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ap cm