AP General Secretary

21:03 - February 12, 2018

పశ్చిమగోదావరి : పేద వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే లక్ష్యమని సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహాసభలు స్పష్టం చేశాయి. వామపక్ష, అభ్యుదయ శక్తుల ఐక్యతతో బడుగులకు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా.. కొత్త శకానికి నాంది పలుకుతామని మహాసభలు ప్రతినబూనాయి. మూడు రోజుల పాటు సాగిన మహాసభల చివరిరోజైన నేడు.. పి.మధును రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో జ‌రుగుతున్న సిపిఎం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన సమావేశాల్లో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశాల చివరి రోజైన సోమవారం... పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. పి. మ‌ధును మహాసభ రెండోసారి ఎన్నుకుంది. ఆయనతో పాటు.. 14 మంది స‌భ్యుల‌తో కార్యద‌ర్శివ‌ర్గాన్ని, 60 మంది సభ్యుల‌తో రాష్ట్ర కార్యవ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితోపాటు.. 10 మంది స‌భ్యుల‌తో ఆహ్వానితుల క‌మిటీని ఏర్పాటు చేశారు.

మూడు రోజుల పాటు సాగిన మహాసభల్లో.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత చర్చ సాగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వే జోన్‌ ఏర్పాటు, ఉక్కు పరిశ్రమ నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాలని మహాసభ కేంద్ర, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి నిధులు, బడ్జెట్‌ లోటు భర్తీకి నిధుల విడుదల వంటి హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిందని మహాసభ అభిప్రాయపడింది. బిజెపికి మిత్ర పక్షంగా ఉంటూ విభజన హామీలను సాధించడంలో టిడిపి ఘోరంగా విఫలమైందని కూడా మహాసభ అభిప్రాయపడింది.

సామాన్య రైతుల భూములను, అసైన్డ్‌ భూములను బలవంతంగా గుంజుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు వత్తాసు పలుకుతోందని.. మహాసభలో నేతలు ఆరోపించారు. పారిశ్రామిక రంగంలో మూసివేతలు పెరుగుతున్నాయని, కార్మిక హక్కులను కాలరాసే చట్టాలు చేస్తున్నారని, విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్లకు అండగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన నామమాత్రంగా ఉందని, విద్య, వైద్యం, మానవాభివృద్ధి సూచికలలో రాష్ట్రం బాగా వెనకబడి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి పాలనలో అగ్రకుల దురహంకార దాడులు, దళిత, ఆదివాసీ, బలహీనవర్గాలపై పెరుగుతున్నాయని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక నవరత్నాల పేరుతో ఓట్లకోసం ప్రజాకర్షక వాగ్దానాలను గుప్పించడం తప్ప మౌలిక విధానాలలో వైసిపికీ, ఇతర పాలక పార్టీలకూ తేడా లేదని సీపీఎం మహాసభలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని ఉపయోగించుకుని మతోన్మాద శక్తులు బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, అభ్యుదయ, లౌకిక విధానాలతో ప్రజలకు ఊరట కలిగించగలిగే ప్రత్యామ్నాయం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అన్నారు. ఈదిశగా.. ఇప్పటిదాకా చేపట్టిన ఉద్యమాలకు మించిన కార్యాచరణను రూపొందిస్తున్నామని పార్టీ కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన మధు వెల్లడించారు. తెలుగు ప్రజల సమైక్యతకోసం నిలిచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందన్న నేతలు.. అలాంటి ఘన వారసత్వాన్ని కొనసాగించి.. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల చేతికి అధికారం వచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 

18:42 - February 12, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు కాసేపటి క్రితం ముగిశాయి. గత మూడు రోజులుగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ, రాష్ట్రీయ..ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి రోజైన సోమవారం పార్టీ కార్యదర్శి..ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాగా 14 మంది సభ్యులతో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. 10 మంది సభ్యులతో ఆహ్వానితుల కమిటీగా రాష్ట్ర కార్యవర్గం రూపొందింది. 

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో రానున్నకాలంలో పోరాటాలు..ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన పెనుమల్లి మధు తెలిపారు. కాసేపటి క్రితం భీమవరంలో జరుగుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా మధుతో టెన్ టివి ముచ్చటించింది. ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా..విభజన చట్టం తదితర సమస్యలు ఎన్నో ఉన్నాయని, ఈ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం జరపాల్సినవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై పునరంకితం కావాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. కౌలు రౌతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని..ఎన్నో సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని, ప్రజల పక్షం నిలవాలని మహాసభ పిలుపునివ్వడం జరిగిందన్నారు. 14వ తేదీన ఉదయం వామపక్షాల సమావేశం జరుగుతుందని, ఇప్పటిదాక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం చాలా కాలంపాటు పోరాటం చేస్తున్నామని..వివిధ జిల్లాల్లో విభజన హామీల కోసం పోరాటం చేస్తామని తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటం చేయాలి ? ఎవరెవరిని కలుపుకొని పోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భం కాదని..ప్రజా ఉద్యమాల సందర్భమని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తామన్నారు. గతంలో ఎలాంటి పోరాటాలు చేశామో అంతకంటే ఉధృతంగా పోరాటం చేస్తామని, తొందరలో పోరాట కార్యచరణనను ప్రకటిస్తామని మధు తెలిపారు. 

16:38 - February 11, 2018

పశ్చిమగోదావరి : ఏపీ విభజన చట్టంలోని హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోదని.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చుకున్నా సాధించుకోలేకపోయిన టీడీపీని ప్రకాశ్‌ కరత్‌ తప్పుపట్టారు. విభజన చట్టంలోని చాలా హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. 

14:07 - February 11, 2018

ప.గో : ఏపికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాని సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్రంతో తాము పోరాడుతామన్నారు. బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్న టీడీపీ... కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ భవిష్యత్‌ కార్యాచణేంటో ప్రజలకు చెప్పాలంటున్న ఏచూరితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. 

 

13:25 - February 11, 2018

పశ్చిమగోదావరి : విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న కేంద్రం.. వాటిని విస్మరించిందన్నారు. 

 

20:58 - February 10, 2018

పశ్చిమగోదావరి : బీజేపీ-టీడీపీ మిత్రబంధం వల్ల సాధించిందేమీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను ఈ రెండు పార్టీలూ మోసం చేశాయని విరుచుకుపడ్డారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. అల్లూ‌రు సీతారామ‌రాజు న‌గ‌ర్‌ ప్రాంగ‌ణంలో జరిగిన బ‌హిరంగ స‌భలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ-టీడీపీ మిత్రబంధంతో సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేద ప్రజలపై మరింత భారాలు మోపుతుందని ఏచూరి మండిపడ్డారు. 73 శాతం ధనం ఒక్క శాతం ప్రజల వద్దే ఉందని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని అన్నారు. ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని ఏచూరి అన్నారు.

రైతాంగం పోరాటాల్లోకి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు పిలుపునిచ్చారు. బడ్జెట్లో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రైతుల అప్పులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం విభజన హామీలను విస్మరించి ప్రజలను మోసగించిందని రాఘవులు మండిపడ్డారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయాలన్నారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వా పరిశ్రమ, యనమదుర్రు డ్రెయిన్‌, గరగపర్రు, పెద్దగొట్టిపాడు దళితులపైదాడుల వంటి సమస్యలపై సీపీఎం ఉద్యమాలు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఏయూ ప్రొపెసర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదని మధు మండిపడ్డారు.

రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ మండిపడ్డారు. సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా రానున్నకాలంలో కార్మిక, కర్షక, దళిత, బహుజన, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసే వేదికగా ఈ మహాసభలు జరగనున్నాయ‌ని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని గఫూర్‌ హెచ్చరించారు.

రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని.. వారి సమస్యలూ ఒకేలా ఉన్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజలు భూమి కోసం భుక్తి కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అన్ని పోరాటాల్లోనూ సిపిఎం ప్రజలకు అండగా ఉంటోందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసేది ఎర్రజెండా మాత్రమే అని తమ్మినేని స్పష్టం చేశారు.

అంతకు ముందు భీమవరం పట్టణంలో సీపీఎం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 20 వేల మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కామ్రేడ్స్‌ కదం తొక్కడంతో.. భీమవరం వీధులన్నీ అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. సీపీఎం రాష్ట్ర మహాసభలు సోమవారం వరకూ సాగనున్నాయి. 

18:27 - February 10, 2018

పశ్చిమగోదావరి : తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్టాలు విడిపోయి నాలుగేళ్లు గడిచిపోయాయన..ఎక్కడ అభివృద్ధి అంటూ తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోతే అభివృద్ధి అవుతుందని ఆనాడు చెప్పారని, నీళ్లు..నిధులు..నియామకాలు వస్తాయని ఆనాడు ఉద్యమం చేసిన కేసీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజలు నమ్మి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారని, అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారని..ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు.

ఏపీ, తెలంగాణలో కొత్త సీఎంలు వచ్చారని..ఇరు రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. కానీ ప్రజల బాధలు..కష్టాలు తీరలేదని..హక్కులు..సమస్యల కోసం ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో 7.5 శాతం అభివృద్ధిలో ఉన్నామని మోడీ..తెలంగాణలో పది శాతం వృద్ధి సాధించామని కేసీఆర్ పేర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన జీడీపీలో 73 శాతం సంపద ధనికుల..కుబేరుల చేతుల్లోకి వెళుతోందని..ఇదే నా అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం..దేశం అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేశారు.

ఎర్రజెండాను అధికారంలోకి తీసుకరావాలని..అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తాము చెప్పడం జరుగుతోందని...ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందట పెట్టాలని సూచించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ ఏర్పాటయ్యిందని, ఆనాటి చరిత్రను పునరావృతం చేస్తామని..ఎర్రజెండా రాజ్యాధికారం కోసం పోరాడుతామన్నారు. సకల అట్టడుగుల మీద అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని..అగ్రకులాల ఆధిపత్యం అణగదొక్కడానికి పోరాటం చేస్తున్నట్లు..ఇందుకు 28 పార్టీలతో బిఎల్ఎఫ్ ఏర్పాటైందన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో బిఎల్ఎఫ్ స్పష్టంగా ప్రజలకు చెబుతోందన్నారు. 

18:22 - February 10, 2018

పశ్చిమగోదావరి : ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర టిడిపి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆనాటి నుండి తాము చెబుతూ వస్తున్నామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గుర్తు చేశారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.54 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేయాలని చెప్పినా..ఇంతవరకు కదలిక లేదన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ కింద ఎంతో మంది పనిచేస్తున్నారని..వీరిని రెగ్యులర్ చేస్తామని ఆనాడు చెప్పారని...కానీ చేయలేదన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

23వ తేదీన సమ్మె జరుగుతుంటే జిల్లాకు చెందిన అంగన్ వాడీలు..మధ్యాహ్న భోజన కార్మికులు..ఇతరులు సమ్మె చేస్తుంటే వారిని తొలగించాలంటూ ప.గో. కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. సమ్మె చేస్తే ఉద్యోగాలు తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. అంగన్ వాడీలకు ఇచ్చిన సంజాయిషీ నోటీసును..ఉద్యోగుల తొలగింపు నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్ ను జిల్లా నుండి పంపించే విధంగా పోరాటం చేస్తామన్నారు. ఇందుకు మంత్రి పితాని సత్యనారాయణ బాధ్యత తీసుకోవాలని..కార్మికులకు సమ్మె హక్కు ఉందా ? లేదా ? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. 

18:20 - February 10, 2018

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నిప్పులు చెరిగారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పోలవరంలో అయితే...గిరిజనులు మునిగిపోతా ఉంటే ..మునిగిపోతున్న గిరిజనులకు ప్రత్నామ్యాయం చూపెట్టకుండా తగాదా పెడుతుంటే ఖబడ్దార్ చంద్రబాబు అని నినదించామని తెలిపారు. సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కొంటారని ప్రశ్నించిన ఒకరిపై 90 కేసులు నమోదు చేశారని..రౌడీ షీట్ నమోదు చేశారని తెలిపారు.

రొయ్యల పరిశ్రమ వద్దని..1500 తుందుర్రు నుండి లారీలు కట్టుకుని కలెక్టర్ దగ్గరకు వెళ్లారని..మంత్రులు..ప్రజాప్రతినిధులు..వైసీపీ దగ్గరకు వెళ్లారని తెలిపారు. సీపీఎం దగ్గరకు వెళుదామని వచ్చారని...17వ తేదీన చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ దిగుతుంటే నిరసన వ్యక్తం చేశామన్నారు. 40వేల ఎకరాలున్న గ్రామాల్లో మత్స్యకార్మికుల పనులు పోతున్నాయని, ఉపాధి దెబ్బతింటోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమను అణిచివేసేవిధంగా చూశారని తెలిపారు.

900 కోట్ల రూపాయలు కేటాయిస్తామని..కాలుష్యం ప్రారదోలుతామని చెప్పి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. బాబు..టిడిపి ప్రభుత్వం చెప్పేవన్నీ నీటిమూటలేనని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఓ కమిటీ వేసిందని..రొయ్యల చెరువులను మూసివేయాలని..8 నెలల పాటు మూసివేయాలని ఉప్పు నీళ్లు లేకపోతే రొయ్యల చెరువు ఏర్పాటు చేయవద్దని కమిటీ సూచించిదన్నారు.

దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..వారి తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. 60 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కార్మికుల సమస్యలపై వైసీపీ ఏనాడు గళమెత్తలేదన్నారు. పోలీసులను ముందర పెట్టి పాలన కొనసాగిస్తున్నారని.. ఏ కార్యక్రమం పెట్టినా తమను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం పేదవాడి కోసం పుట్టిందని..13, 14 సమావేశంలో వామపక్షాలు ఒక ఉమ్మడి అభిప్రాయానికి వస్తామన్నారు. బీజేపీ సంగతి తేలేదాక పోరాటం చేస్తామని..ఆంధ్రుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని..ఇందుకు మహాసభలో చర్చిస్తామని మధు తెలిపారు. 

18:15 - February 10, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాటకం జరగుతోందని..నాటికలకు నంది అవార్డులు ఇచ్చినట్లే..జైట్లీ..సీఎం చంద్రబాబు నాయుడులకు అవార్డులు ఇవ్వొచ్చని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో విభజన హామీలు సాధించేందుకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జేఏసీ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారని..ఇప్పటికే ఎన్నో జేఏసీలున్నాయని..పవన్ జేఏసీ అవసరమా ? అని ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్ లో చాల విషయాలు ప్రస్తావించారని, కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని తెలిపారు. రైతుల గిట్టుబాటు ధర చట్టంగా రూపొందించాలని సీపీఎం మొదటి నుండి కోరుతోందని..బడ్జెట్ లో ఈ అంశం ప్రస్తావన తేలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని..రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని..ఈ సమస్య పరిష్కారం కావాలంటే గిట్టుబాటు ధర చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రంలో రైతులు పోరాటంలో భాగస్వాములు కావాలని..రాష్ట్ర విభజన ఎలాంటి నినాదాలు..ఎలాంటి హామీలిచ్చారో..వాటికి కేంద్ర బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని..సీపీఎం మొదటి నుండి చెబుతూ వచ్చిందని...విభజన జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఆనాటి నుండి చెబుతూ వస్తున్నామని..విభజన చేస్తామని..మంచి జరుగుతుందని..స్పెషల్ స్టేటస్..రాయితీలు ఇస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. స్పెషల్ స్టేటస్ అవసరం లేదని..స్పెషల్ ప్యాకేజీ అంటూ మొదటి మోసం చేశారని తెలిపారు. ఎక్కువ సాధిస్తామని..ఎక్కువే సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని తెలిపారు.

రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ అని పేర్కొన్నారని..రూ. 3వేల కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇనుప ఖనిజం స్వతంత్రంగా ఇస్తామని చెప్పారని..రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని..కడపలో స్టీల్ ప్టాంట్ నిర్మాణం..కాకినాడ రీఫైనరీ ఏర్పాటు..ఇలా ఎన్నో చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమి చేయలేదన్నారు.

మొత్తంగా ఏపీలో రాజకీయ నాటకం..మోసపూరితమైన నాటకం ఆడుతున్నారని..వీరందరికీ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో టిడిపి పేరు ఎత్తలేదని..బిజెపి పేరు మాత్రమే ఎత్తుతున్నారని, బిజెపి..టిడిపి తోడుదొంగలని..గ్రహించాలని సూచించారు. వైసీపీ కూడా బిజెపి పార్టీ పేరును ఎత్తడం లేదని..చిత్తశుద్ధి ఉంటే పోరాటం చేయాలని సూచించారు.

పవన్ జేఏసీ అంటూ కొత్తది తెరపైకి తెచ్చారని..ఇప్పటికీ ఎన్నో జేఏసీలున్నాయన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోకుండా పరిశ్రమలకు అనుమతులిస్తున్నారని, పశ్చిమ..తూర్పు గోదావరిలో ఎక్కడా చూసిన నీళ్లే ఉంటాయని..కానీ డబ్బులు చెల్లించి నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఏడు మండలాలు మునిగిపోతాయని..నష్టపరిహారం ఇవ్వరా ? పేదలను ఆదుకోరా ? అంటూ ప్రశ్నించారు. పొలాలకు..ఉపాధి..నివాసాలకు నష్టపరిహారం ఇవ్వాలనే దానిపై మాట్లాడాలని..పోలవరం నిర్మాణం గురించి పదే పదే మాట్లాడడం సరికాదన్నారు.

ఏపీ రాష్ట్రంలో చదువు..వైద్యం పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చదువులో 30శాతం..వైద్యంలో 26వ స్థానంలో ఏపీ ఉందన్నారు. ఆరోగ్యం కూడా వ్యాపారమయంగా చేసేశారని తెలిపారు. దళిత హక్కులు..బలహీన వర్గాల హక్కులు..మైనార్టీ..గిరిజన హక్కులు..కోసం సీపీఎం పోరాటం చేస్తోందన్నారు.

అమెరికాలో ఇక్కడి నుండి వెళ్లిన వారిని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అవమానపరుస్తున్నారని పేర్కొంటున్నారని..కేంద్రం టిడిపిని అవమనపరచలేదా ? ఎందుకు మాట్లాడలేదన్నారు. కుల వ్యవస్థ ఉన్నంత కాలం సూపర్ పవర్ కాదని...సామాజిక న్యాయం ఉంటేనే అది పరిష్కారమౌతుందన్నారు. ఏపీలో కార్మికుల పరిస్థితి ఏంటీ ? అని ప్రశ్నించారు. టిడిపి..వైసిపి..బిజెపి ఏ పార్టీలకు ప్రత్యామ్నాయ విధానం లేదని..వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సమీకరించాలని రాఘవులు పిలుపునిచ్చారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP General Secretary