ap government

20:39 - February 27, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వతీరుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఎంతోమంది సీనియర్‌ నేతలున్నా లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమేంటని విమర్శించారు. ఎన్నికలకు ముందు టీడీపీ వివిధ కులాలకు 124 హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరకూ ఒక్క వాగ్దానమూ నెరవేర్చలేదని రఘువీరా విమర్శించారు. రజకులను ఎస్సీలో చేరుస్తామని చెప్పారని... ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు.. ఉపాది హామీ పథకాన్ని తెలుగు తమ్ముళ్లు పందికొక్కుల్లా దోచుకొని తింటున్నారని విజయవాడలో మండిపడ్డారు.

 

20:36 - February 27, 2017

గుంటూరు : వైైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ మండిపడ్డారు. స్పీకర్ కోడెలకు అసెంబ్లీ మొదటి రోజే లేఖ రాయడం జగన్ బాధ్యతా రాహిత్యమన్నారు. సీఎం హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని ఆరోపించడం జగన్‌కు తగదని.. ఆయన తీరు చూస్తుంటే.. దొంగే దొంగ అన్నట్టు ఉందని కాల్వ ఎద్దేవా చేశారు.

20:31 - February 27, 2017

కృష్ణా : జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నందివాడ మండలంలో అన్యాక్రాంతమైన భూములను..ఇప్పించాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. ఆర్డీవో కార్యాలయం ముట్టడికి యత్నించడంతో... పోలీసులు.. కేవీపీఎస్‌, సీపీఎం కార్యకర్తలపై లాఠీఛార్జి చేసి అరెస్టు చేశారు. స్టేషన్‌లో.. పోలీసులు తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని దళితులు ఆరోపించారు. దళితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నేతలు సీహెచ్‌ బాబూరావుతో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

 

20:29 - February 27, 2017

విజయవాడ : ఏపీ కొత్త సీఎస్‌గా అజయ్‌ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కల్లం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సెలక్టయ్యారు. 1983వ బ్యాచ్‌కు చెందిన అజయ్‌ కల్లం మార్చి చివరికి పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న టక్కర్‌ పదవీ కాలం రేపటితో ముగియనుంది. 

 

20:08 - February 27, 2017

విశాఖ : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అజా శర్మకు మద్దతివ్వాలని ఉద్యోగసంఘాలు తీర్మానించాయి. విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో స్టీల్‌ప్లాంట్‌, షిప్‌యార్డ్, బీహెచ్ ఈఎల్, హెచ్ సీఎల్ డాక్ యార్డు, పాలిమర్స్, విశాఖ పోర్టు, ఎన్ టిపిఎస్, డ్రిగ్జింగ్‌ కార్పొరేషన్‌, బీఎస్ ఎన్ ఎల్, ఎల్ ఐసీ, పోస్టల్‌, కోరమండల్‌ ఫెర్టిలైజర్, బ్యాంకులు, జీవీఎంసీ సంస్థలకు చెందిన కార్మిక నేతలు అజాశర్మకు తమ పూర్తి మద్దతు తెలిపారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే అజాశర్మలాంటి నేతల్ని ఎన్నుకోవాల్సిన అవసరముందని కార్మికవర్గ నేతలు అన్నారు.

 

20:05 - February 27, 2017

నెల్లూరు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా ఆనం విజ‌య్‌ కుమార్ రెడ్డిని జ‌గ‌న్ ఓకే చేశారు. ఈ మేర‌కు ఒంగోలులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రక‌ట‌న చేశారు. దీంతో గ‌త వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు వైసీపీ తెర‌దించింది. వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన వారంతా మ‌ళ్లీ వైసీపీలోకి రావాల‌ని వైవీ సుబ్బారెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ మీద రివేంజ్ తీర్చుకునే టైం వచ్చింద‌ని ఆయ‌న అన్నారు. జంప్ జిలానీలు వైసీపీకి ఓటెయ‌్యకుంటే న్యాయప‌ర‌మైన చిక్కులు త‌ప్పవ‌ని హెచ్చరించారు. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆశీర్వాదం తోనే తాను బ‌రిలోకి దిగుతున్నాని ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైసీపీ త‌ర‌పున త‌న‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌కు ఆయన కృత‌జ్ఞత‌లు తెలిపారు.

 

18:54 - February 27, 2017

హైదరాబాద్ : ఏపీ నూతన అసెంబ్లీలోకి పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకోవాలని.. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రజాప్రతినిధుల కొనుగోలులో అడ్డంగా ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబు.. హైదరాబాద్‌ అసెంబ్లీని హుటాహుటిన అమరావతికి తరలించారన్నారు. ఆ తర్వాత ..తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోబపెట్టి టీడీపీలో కలుపుకోవడం దొంగసొత్తుతో సమానమన్నారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని జగన్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. చర్యలు తీసుకోకపోతే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. 

 

17:45 - February 27, 2017

విజయవాడ : ఏపీలో వైసీపీ పుంజుకుంటుందా..? అధికార టీడీపీ.. ఎదురు దాడులు తట్టుకోలేక వెనకబడుతుందా..? వచ్చే 2019 ఎన్నికల సమయానికి వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది..? 2014 ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ బయటపడ్డారా..? టీడీపీ, వైసీపీల మధ్య తాజా రాజకీయ వాతావరణం చూస్తే వీటన్నింటికి బలం చేకూరుతోంది. 
పుంజుకుంటున్న వైసీపీ  
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ పుంజుకుంటున్న దాఖలాలు కన్పిస్తున్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య ఇప్పుడున్న హోరాహోరీ పోరాట పరిస్థితులే వచ్చే ఎన్నికల్లోనూ ఉండేలా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. అలాగే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజన తర్వాత నామరూపాల్లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం కోసం తలపడేది వైసీపీ, టీడీపీలేనన్న వాదనతో తన పరిధిని పెంచుకుంటోంది. 
వైసీపీని బలహీన పరిచేందుకు చంద్రబాబు వ్యూహాలు    
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీని బలహీన పరిచేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తనవైపు తిప్పుకుని వైసీపీ బలహీన పడిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అటు కేంద్రంతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ... రాబోయే ఎన్నికల నాటికి జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వాదనా లేకపోలేదు.  
వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత     
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ మృతి పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. అది పూర్తి స్థాయిలో వైసీపీకి మెజారిటీని కట్టబెట్టలేకపోయింది. తాజాగా వైఎస్‌ జగన్‌ విశాఖలో విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక హోదా కార్యక్రమానికి మద్దతు తెలపడం, పోలీసులు అడ్డు తగలడం, ఎయిర్‌పోర్టు నుంచి జగన్‌ను పోలీసులు హైదరాబాద్‌కు పంపడం ఆ పార్టీకి ప్రజల్లో కొంత సానుభూతిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అదే విధంగా అంతర్జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించడం, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచే ఆమెను బలవంతంగా తరలించడం కూడా వైసీపీకి కొంత మేలు చేసిందని చెప్పవచ్చు. గుంటూరులో జగన్‌ నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో విద్యార్థులను వేధించడం కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను.. అదే సమయంలో వైసీపీ పట్ల సానుకూలతను పెంచింది.
టీడీపీ, వైసీపీలకు 2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకం 
2019 ఎన్నికలు అటు టీడీపీ.. ఇటు వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీని అంతర్మథనంలో పడేసేందుకు ఎదురు దాడికి దిగుతూనే ఉంది. అదే కోవలో ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే అమరావతి రాజధానిపై కూడా ప్రశ్నల్ని సంధించనుంది. రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భూ సమీకరణ వంటి అంశాలపై వైసీపీ టీడీపీని ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రజలకు చేరువ చేసి.. ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు చేస్తేనే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా వైసీపీ కార్యాచరణ రూపొందించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

13:21 - February 27, 2017

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టిడించేందుకు దళితులు, పేదలు యత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలపర్రు లో పేదల భూములను ఆన్యాక్రాంతం చేశారని, భూములను అప్పగించాలని దళితులు, పేదలు కోరారు. కానీ ఆన్యాక్రాంతమైన భూముల విషయంలో అధికారులు..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై దళితులు...పేదలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నేతలు మద్దతు పలికారు. ఆరో తేదీ నుండి పోరాటం చేస్తున్నా ప్రభుత్వాధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ముట్టడించేందుకు నిర్ణయించారు. ముట్టడిలో భాగంగా వస్తున్న నేతలను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. తమ భూములను తమకు అప్పగించాలని ఆందోళన చేయడం జరుగుతోందని దళితులు పేర్కొన్నారు. కానీ పోలీసులు ఏమాత్రం వినిపించుకోలేదు. ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మహిళలని చూడకుండా లాగిపడేశారు. పోలీసుల తీరుపై దళితులు నిరసన వ్యక్తం చేశారు.

13:16 - February 27, 2017

విజయవాడ : ఇప్పటి వరకు హైదరాబాద్ లో విధులు నిర్వర్తించిన ఏపీ అసెంబ్లీ ఉద్యోగులు అమరావతిలో అడుగు పెట్టారు. సోమవారం 180 మంది ఉద్యోగులు వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక అసెంబ్లీకి చేరుకున్నారు. వీరికి స్పీకర్ కోడెల, మంత్రులు యనమల, ప్రత్తిపాటి, రాజధాని రైతులు స్వాగతం పలికారు. వెలగపూడిలోనే పనిచేయాలని ప్రభుత్వ ఆదేశాలతో వీరంతా తరలివచ్చారు. ప్రస్తుతం వీరు ఇంకా విధుల్లోకి ఇంకా హాజరు కాలేదు. స్పీకర్ మాత్రం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఉద్యోగులకు వీలైన సదుపాయాలు కల్పిస్తామని స్పీకర్ కోడెల వెల్లడించారు.

6 నుండి అసెంబ్లీ..
మార్చి 6వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు. మార్చి 13వ తేదీన సాధారణ బడ్జెట్ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఉగాదిలోపు బడ్జెట్ ఆమోదించి సమావేశాలు వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు, మార్చి 6వ తేదీన బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

సొంతిల్లే నయం..
అమరావతిలో శాసనసభను నిర్ణీత సమయంలో ఆధునిక హంగులతో నిర్మించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. 146 మంది ఉద్యోగులు ఇక్కడకు రావడం జరిగిందని ఇందులో 47 మంది మహిళలున్నారని వీరందరికీ స్వాగతం పలికినట్లు తెలిపారు. కొత్త ప్రాంతం కావడంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ap government