AP Housing Scheme

19:41 - July 5, 2018

విజయవాడ : ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీల అమలులో కేంద్రప్రభుత్వం.. ఏపీకి నమ్మకం ద్రోహం చేసిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు తప్పుబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడిని ఖండిస్తూ.. తమ పోరాటం వ్యక్తులపై కాదని, వ్యవస్థలపైనే అని పార్టీ శ్రేణులకు సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం.. సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో.. నిర్మాణం పూర్తయిన 3 లక్షల ఎన్టీఆర్‌ ఇళ్లల్లోకి.. లబ్దిదారుల చేత గృహప్రవేశం చేయించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. ఏపీకి కేంద్రం చేసిన మోసాన్ని చంద్రబాబు ప్రజలకు మరోసారి వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు తప్పుబట్టారు. 

రాష్ట్రాభివృద్ధికి తాను అహర్నిశలు కష్టపడుతుంటే... కోర్టుల్లో కేసులు వేస్తూ విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని, ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరినీ సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా కమలనాథుల పట్ల  మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకుండా మోసం చేసిన కేంద్రంతో పోరాడాల్సిన వపన్‌, జగన్‌... బీజేపీతో లాలూచీపడ్డారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. జిల్లాల పర్యటనల్లో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద జరిగిన దాడులపై చంద్రబాబు స్పందించారు. టీడీపీ పోరాటం వ్యవస్థలపైనే తప్ప.. వ్యక్తులపై కాదని పార్టీ శ్రేణులకు సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోణలు చేస్తున్నాయని సభలో మాట్లాడిన మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు 14 లక్షల ఇళ్లను మాయంశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గృహప్రవేశ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సభా వేదిక నుంచే ఆన్‌లైన్‌లో సమీక్షించారు. వచ్చే జనవరిలో మరో మూడు లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు నిర్వహింపచేస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. 

12:08 - February 24, 2018

అనంతపురం : రాష్ట్రాలో 19లక్షల ఇళ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు మంత్రి కాల్వశ్రీనివాసులు. ఇప్పటికే 13 లక్షల ఇళ్ల నిర్మాణా సాగుతోందన్నారు. పక్షంరోజుల టార్గెట్‌పెట్టుకుని 3లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాడానికి సమీక్ష లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు కూడా పాల్గొనేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 12వ తేదీ లోపుగా 13జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తామన్నారు.

13:07 - November 12, 2017

విశాఖపట్టణం : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. అనకాపల్లిలో పేదలకు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని..అందులో ఏపీకి 5 లక్షల 39 వేల ఇళ్లను కేటాయించిందన్నారు. ఆత్యాధునిక టెక్నాలజీ సహాయంతో పేదల ఇళ్లను నిర్మిస్తున్నట్లు, 15 నెలల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. 

12:16 - October 12, 2017

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలు ఎందుకు ప్రకటించేస్తున్నారు. మూడేండ్ల అనంతరం ఇప్పుడే ఎందుకు వరుసగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు ? రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములను ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు ? మధ్యతరగతి ప్రజల కోసం కొత్త పథకం తెస్తున్నారా ? కొత్త కొత్త పథకాలు..వరాలు దేని కోసం? అనే చర్చ జరుగుతోంది.      బాబు ప్రస్తుతం దూకుడు పెంచేశారు..వరుసగా పథకాలు..సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా బాబు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ అనలిస్టుల టాక్. 2018-2019 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని బాబు ఇదివరకే ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీలవలే నంద్యా..కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోసారి మెజార్టీ సాధించాలని బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే విధంగా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాలని కింది కార్యకర్తలకు దిశా..నిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలు..కార్యకర్తలతో అప్పుడప్పుడు భేటీ అవుతూ పలు సూచనలు..సలహాలు అందచేస్తున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బాబు పేర్కొంటున్నారు. ఇంటింటికి టిడిపి పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల మధ్యలోకి వెళుతున్నారు.

అన్ని శాఖలపై రివ్యూ నిర్వహించిన బాబు ప్రస్తుతం..పోలవరం..అమరావతిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో వీటిని పూర్తి చేయాలని..రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను ఓ కొలిక్కి తీసుకరావాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెన్షన్లు..ఇంటి నిర్మాణాలు..చంద్రన్న పెళ్లికానుక..ఎన్టీఆర్ సృజల స్రవంతి..తదితర పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు కింద ఎవరైనా మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చే వారు. ఇప్పుడు సహజ మరణానికి రూ. 2లక్షలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యర్థి అయిన వైసీపీని కూడా టార్గెట్ చేశారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. బలహీనపరిచేలా ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు, రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందనే కారణంతో రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై బాబు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని రైతులు..ఇతరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల కోసమే బాబు పలు స్కీంలు ప్రవేశ పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరి బాబు చేస్తున్న ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

20:32 - August 31, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ గృహ నిర్మాణ కార్యక్రమం చాలా విస్తృతంగా చేపట్టినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయంలో 13 జిల్లాల ప్రాజెక్టు ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని..  మొత్తం 11 లక్షల ఇళ్లను వచ్చే ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. 

 

Don't Miss

Subscribe to RSS - AP Housing Scheme