ap politics

18:36 - February 25, 2017

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న 9 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే, గవర్నర్ కోటా అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. అభ్యర్ధుల ఎంపిక కోసం ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా సమావేశం కానుంది.

మొత్తం 16 స్థానాలకు గాను 150 దరఖాస్తులు

మొత్తం 16 స్థానాలకు గాను 150 దరఖాస్తులు అధిష్ఠానానికి అందాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు ఈ నెల 28 చివరి తేదీ. చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రెండు స్థానాలు ఖాళీలున్నాయి. ఇప్పటివరకు కేవలం కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్ రవి పేరును మాత్రమే చంద్రబాబు ఖ‌రారు చేశారు.

చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు ,హేమలత, నరేష్ కుమార్ రెడ్డి పేర్లు..

చిత్తూరు జిల్లాలో దొరబాబు, హేమలత, నరేష్ కుమార్ రెడ్డి పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా శిల్పా సోదరులకు ప్రాధాన్యత కల్పించవచ్చని సమాచారం. ఇదే జిల్లా నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు.

నెల్లూరు జిల్లా నుంచి వాకాటి నారాయణరెడ్డి, అనం బ్రదర్స్ పేర్లు ...

ఇక నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితోపాటు ఆనం బ్రదర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న అంగర‌ రామ్మోహన్ కు మళ్లీ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ మరో స్థానానికి మంతెన సత్యనారాయణరాజు పేరు ఖరారుగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల చంటబ్బాయ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అప్పల‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావులు పోటీప‌డుతున్నారు. అనంత‌పురంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి నుంచి, దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, గ‌డ్డం సుబ్రమ‌ణ్యం, అబ్దుల్ ఘ‌నీ, త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం?....

ఇక ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఖరారుచేసే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో నారా లోకేశ్‌కు ఓ ఎమ్మెల్సీ స్థానం ఖరారైనట్లు చెబుతున్నారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను కుల సమీకరణాల ప్రాధాన్యతతో ఎంపిక చేస్తారని సమాచారం. మొత్తం ఏడు స్థానాలకు జరిగే పోరులో సంఖ్యాబలం పరంగా తెలుగుదేశానికి ఐదు, వైసీపీకీ ఒక స్థానం ఖరారు కానుంది. ఏడో స్థానానికి పార్టీ బలాబలాలను బట్టి చూస్తే వైసీపీ నుంచి 20మందికి పైగా ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో తెలుగుదేశంలో చేరారు. ఏడో స్థానానికి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవటంతో రెండో ప్రాధాన్య ఓటు కీలకం కానుంది. దీంతో ఏడో స్థానానికి పోటీ జరుగుతుందా లేక ఏకగ్రీవం కానుందా అన్న అంశం ఆసక్తిగా మారింది.

ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాల కోసం నేతల ఎదురుచూపులు ....

ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానం కోసం కరణం బలరాం, పుష్పరాజ్, జూపూడి ప్రభాకరరావు, గోనగుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, దాసరి రాజా మాస్టర్, దివి శివరాం, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, చందు సాంబశివరావు, గొట్టిపాటి రామకృష్ణ, కొమ్మినేని వికాస్ లు పోటీలో వున్నారు. మహిళల కోటాలో పంచమర్తి అనురాధ, శోభా హైమావతి, ముళ్ళపూడి రేణుక, పోతుల సునీతలు తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ నేతల్లో.. ఇప్పుడంతా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. అధిష్ఠానం తమ పేర్లను ఖరారుచేస్తుందో లేదోనని ఆశావహులు హైరానాపడుతున్నారు. అంతటితో ఆగకుండా, అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు చివరి ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు.

18:34 - February 25, 2017

విశాఖ: ఉత్తరాంధ్ర అభివృద్ధిని పాలకులకు గాలికొదిలేశారని ఎమ్మెల్సీ శర్మ ఆరోపించారు. చట్టబద్ధంగా రావాల్సిన రైల్వే జోన్‌ను కూడా ఇవ్వకుండా ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలపై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కరపత్రం విడుదల చేసింది.

18:31 - February 25, 2017

అమరావతి: ఏపీ లో రాజకీయం వేడేక్కుతోంది.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఏ సంఘటన చోటు చేసుకున్నా.. ఎవరికి వారు మాదే పైచేయి అని చూపించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు నలిగిపోతున్నారు. అమరావతిలో జరిగిన మహిళా సదస్సు సందర్భంగా రోజాను సదస్సు ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడం సంచలనమైంది. తనను ఆహ్వానించి, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అడ్డుకోవడంపై రోజాతో పాటు , వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే రోజా సదస్సు ఉద్దేశాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తించబోతున్నారనే అనుమానంతోనే ఆమెను అడ్డుకున్నామని డీజీపీ సాంబశివరావు కూడా ప్రకటించారు. అయితే ఆ సమయంలో రోజా వ్యవహరించిన తీరు సరైంది కాదంటూ పోలీసు అధికారుల సంఘం పెదవి విరుస్తోంది.

తమ పట్ల దురుసు ప్రవర్తనతో...

కొందరు నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీసు అధికారులంటున్నారు.. తమకు ఎమ్మెల్యే రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఏపీలో 13 జిల్లాల పరిధిలో గన్ మెన్లు ఒక్క రోజంతా.. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారని సంఘం నేతలంటున్నారు.. డీజీపీపై మాట్లాడితే అందరిపై మాట్లాడినట్లేనని... విమర్శిస్తున్నారు. అయితే.. ఇటీవల పోలీసులను విమర్శించడం ఫ్యాషనైపోయిందని సంఘం నేత శ్రీనివాసరావు మండిపడ్డారు.

పోలీసు అధికారుల తీరుపై మండిపడుతు రోజా..

అయితే.. ఎమ్మెల్యే రోజా మాత్రం పోలీసు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.. పోలీసులపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేసినప్పుడు అధికారుల సంఘం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. పుష్కరాల్లో అనేక మంది మరణిస్తే ఆ తప్పంతా పోలీసుల వైఫల్యమేనని చంద్రబాబు అన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏమైపోయిందని ..తనను క్షమాపణ కోరే ముందు రాజధానిలో పోలీసుల అవస్థలపై నిరసన తెలపాలని ఎమ్మెల్యే రోజా అంటున్నారు.

తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ మహిళా నేతలు....

ఇప్పటి వరకు రోజా తీరుపై తీవ్ర స్థాయిలో టీడీపీ మహిళా నేతలు ధ్వజమెత్తారు.. ఇప్పుడు పోలీసులు అధికారుల సంఘం చేత అధికార పార్టీ నేతలే మీడియా సమావేశం నిర్వహించి విషయాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు.. దీని వల్ల తమ పార్టీ ఇమేజే పెరుగుతుందని వారంటున్నారు.

13:31 - February 24, 2017

విజయవాడ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని శాఖల్లో పనితీరు అంచనావేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన 'మేధోసంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరై, ప్రసంగించారు. మానవ ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వస్తున్నాయని... వాటికి తగినట్లుగా ఆయా రంగాల్లో మెరుగైన వృద్ధి సాధిస్తున్నామని చెప్పారు.. ఆక్వా రంగంలో 30శాతం వృద్ధి సాధించామని ప్రకటించారు.. ఒకప్పుడు విద్యుత్ కోతలతో చాలా ఇబ్బందిపడేవాళ్లమని... ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని గుర్తుచేశారు.. ఈ సమస్యను అధిగమించి మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సదస్సుకు చంద్రబాబుతోపాటు.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. 

12:44 - February 24, 2017

కృష్ణా : విజయవాడలో మేధోసంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఏ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. 
 

14:32 - February 22, 2017

విశాఖ : బీమునిపట్నం తహసీల్దార్‌ రామారావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అధికారులు హైదరాబాద్‌, రాజమండ్రి, విశాఖలలో ఉన్న రామారావు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రామారావు ఇంట్లో 15 లక్షల రూపాయలను, రాజమండ్రిలో ఉంటున్న అతని అల్లుడి ఇంట్లో 30 లక్షల రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతర ఇళ్లలోనూ నగలు, నగదు ఆస్తి పత్రాలు దొరికినట్టు అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

12:31 - February 22, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో తీసుకొచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ టిడిపి ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారు. కొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండడం...ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే 'ప్యాకేజీ'కి చట్టబద్ధత కల్పించాలని, లేనిపక్షంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంటుందని ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'ప్యాకేజీ'కి చట్టబద్ధత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ క్యాబినెట్ ఏజెండాలో మాత్రం ఈ అంశం లేకపోవడం గమనార్హం. కానీ టేబుల్ అజెండాగా తీసుకొనే అవకాశం ఉంది. చట్టబద్ధత కల్పించడం వల్ల ప్రభుత్వాలు మారినా కేంద్రం నుండి నిధులు వచ్చే అవకాశం ఉందని ఎంపీలు పేర్కొంటున్నారు.
3500 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రూపంలో సహయం అందే అవకాశం ఉంది. అంటే ఐదు సంవత్సరాల్లో 17వేల కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. చట్టబద్ధత కల్పిస్తే ప్రతిపక్షాన్ని ఎదుర్కొనవచ్చని ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేర్కొంటోంది. కానీ చట్టబద్ధత కల్పిస్తే వెనుకబడి ఉన్న రాష్ట్రాలు ఆందోళన చేసే అవకాశం ఉందని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. భేటీ అనంతరం మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

18:39 - February 21, 2017

విజయవాడ : మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి.. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 14 శాతం మంది విద్యార్థులు అధికంగా ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్షలను మార్చి 19వ తేదీకి వాయిదా వేశామని మంత్రి చెప్పారు.

14:39 - February 21, 2017

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. పశ్చిమలో తోడి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులను దాటించేస్తున్నారు. రాజకీయ నాయకుల అండ, ఇసుక మాఫియా మామూళ్లతో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు నిద్ర మత్తులో జోగుతున్నారు. దీంతో కోట్లు విలువైన ఇసుక జిల్లా సరిహద్దులు దాటేస్తోంది. అక్రమ ఇసుక దందాపై పూర్తి వివరాల కోసం ఈ వీడియో ను క్లిక్ చేయండి...

13:55 - February 20, 2017

అనంతపురం : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి వెళ్లి ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. మూడేళ్లలో అభివృద్ధి ఏం జరగలేదని.. రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ap politics