Ap special status

21:50 - August 16, 2017

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయాలను కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లే తేదీలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

 

07:27 - July 15, 2017

హైదరాబాద్ : జనంలోకి వచ్చేందుకు జనసేనాని సిద్ధమవుతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ ప్రజా బాట పట్టనున్నాడు. ఇకపై ప్రజల్లోనే ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాడు. రథయాత్రతో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించేందుకు రెడి అవుతున్నాడు. 
రూట్‌ మార్చుకున్న పవన్‌?
ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు స్పందించే పవన్‌... తన రూట్‌ మార్చుకున్నట్టు తెలుస్తోంది.  యాత్రల సంప్రదాయాన్ని పవన్‌ కూడా అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. గతంలోనే రాష్ట్రమంతా యాత్ర చేపడతానని ప్రకటించిన పవన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
రథయాత్ర చేపట్టాలని యోచిస్తున్న పవన్‌
పవన్‌ రాష్ట్రమంతా తిరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న సినిమా పూర్తైయ్యాక... ప్రజల్లోకి వచ్చేందుకు పవన్‌ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. తొలుత .. పాదయాత్ర చేయాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల రీత్యా రథయాత్రకు ఫిక్స్‌ అయినట్టు సమాచారం. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని కొన్ని రోజుల పాటు ఈ రథయాత్ర కొనసాగనుంది. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్‌ 2న ఈ రథయాత్ర ప్రారంభం కానున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ రథయాత్రలో ప్రత్యేక హోదాపైనా... స్థానిక సమస్యలపైనా పవన్‌ ప్రస్తావించనున్నారు. మొత్తానికి జగన్‌ పాదయాత్రకు సిద్ధమైతే..  పవన్‌ రథయాత్ర చేపట్టనున్నాడు.. ఈ యాత్రలకు.. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 

 

19:52 - June 4, 2017

గుంటూరు : ప్రత్యేకహోదా కోరితే రాష్ట్రానికి శత్రువులా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ ప్రత్యేకహోదా భరోసా సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా కోరితే ద్రోహులా అని నిలదీశారు. హోదా కోసం ఎవరు పోరాడినా మనం మద్దతు ఇవ్వాలన్నారు. ప్రత్యేకహోదా కోరే ప్రతి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని..హోదాను బలపర్చాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని చంద్రబాబు ఆత్మవంచన చేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ శ్రేణులు నల్లజెండాలు పట్టుకుంది ప్రత్యేక హోదా వద్దనా... హోదా కోరితే నల్ల జెండాలు చూపించడం సిగ్గుచేటన్నారు. మతోన్మాద బీజేపీతో చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో పొత్తును సమర్థించుకోవడం కోసం చంద్రబాబు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదని.. హోదా సాధించే వరకు తెరిచి ఉన్న అధ్యాయమేనని తెలిపారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలను ఢిల్లీ తీసుకెళ్లి.. 
పార్లమెంట్ లోపల, బయట పోరాడి సాధించుకుందామని చెప్పారు. 

 

11:16 - June 3, 2017

గుంటూరు : 'ప్రత్యేక హోదా' కోసం మళ్లీ కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని..బలం పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా 'హోదా' అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఆదివారం భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరు కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. సభ ఏర్పాట్లను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కుంతియా, నాదెండ్ల మనోహర్, కనుమూరి బాపిరాజు..ఇతర నేతలు పర్యవేక్షించారు. ఈసందర్భంగా రఘువీరా..బాపిరాజులు వేర్వేరుగా టెన్ టివితో మాట్లాడారు. ప్రత్యేక హోదా ప్రజల పక్షాన నిలబడుతామని, రాష్ట్రానికి ఏం మంచిది జరుగుతుందో అది ప్రాధాన్యమని రఘువీరా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:26 - June 3, 2017

గుంటూరు : తెలుగు రాష్ట్రాలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో 'ప్రజాగర్జన'లో పాల్గొన్న రాహుల్ ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరులో ఏపీ కాంగ్రెస్ నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. ‘ప్రత్యేక హోదా' పేరిట కాంగ్రెస్ ఓ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభకు రావాలని జాతీయ నేతలకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానం పలికారు. ఆంధ్ర ముస్లిం కాలేజీలో సభ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లను కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, తదితర నేతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. పార్లమెంట్ లో ఆనాడు బిల్లు పెట్టబోయే ముందు తాము రాహుల్ కలవడం జరిగిందని, హోదాపై మాట్లాడడం జరిగిందని పనబాక లక్ష్మీ తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రకటించాలని రాహుల్ ఆనాటి ప్రధాని మన్మోహన్ కు సూచించడం జరిగిందని, విభజన బిల్లులో ప్రత్యేక హోదా పెట్టడం జరిగిందని తెలిపారు. ఐదు సంవత్సరాలు చాలదని..పది సంవత్సరాలు కావాలని ఆనాడు వెంకయ్య నాయుడు పార్లమెంట్ లో ప్రస్తావించారని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు గుప్పించారని..అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు మరిచిపోయారన్నారు. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:17 - May 26, 2017

విశాఖ : రైతు సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో మొయిలీ విరుచుకుపడ్డారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు కల్పించే అంశంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు మొయిలీ. కోటి ఉద్యోగాలంటూ హామీలు గుప్పించడం తప్ప ఒక్కరికీ సరైన ఉపాధి చూపించలేకపోయారని మొయిలీ ఆరోపించారు. 2019లో తాము అధికారంలోకి రావడం ఖాయమని మొయిలీ స్పష్టం చేశారు.

 

06:30 - May 26, 2017

కృష్ణా : విజ‌య‌వాడ‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల మ‌హా స‌మ్మేళ‌నంలో..అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వలేని పరిస్థితులు కల్పించింది కాంగ్రెస్సే అని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని..ఇప్పుడు త‌మను ప్రత్యేక హోదా కావాలని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభ‌జ‌న బిల్లులో హోదాకు సంబంధించి స్పష్టమైన అంశాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదన్న ఆయన.. ఇప్పుడు త‌మ‌ను విమ‌ర్శించడం తగదన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని..అయినా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదాకు స‌మాన‌మైన ప్రయోజ‌నాలు ఏపీకి అందిస్తున్నామ‌న్నారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఇచ్చాం...

న‌రేంద్ర మోదీ ఏపీకి ఏం చేశారని కొంద‌రు ప్రశ్నిస్తున్నారని, తాను మోదీ త‌ర‌ఫున జ‌వాబు ఇస్తున్నానంటూ అమిత్‌షా కొన్ని అంకెలు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఎన్నో ఇచ్చామని.. పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే భరిస్తోందన్నారు. లక్షా 75వేల కోట్లు రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థిక సాయం అందించిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తరబడి జరగని వృద్ధి ఈ మూడేళ్లలో చేసి చూపామని షా వివరించారు.

25 వేల బూత్ క‌మిటీలు నియ‌మించుకోవ‌డం పట్ల హర్షం ...

న‌రేంద్ర మోదీ పాల‌న‌లో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంద‌ని షా చెప్పారు. ఏపీలో 25 వేల బూత్ క‌మిటీలు నియ‌మించుకోవ‌డం సంతోషమ‌ని అన్నారు. 12 కోట్ల స‌భ్యత్వంతో బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిందని అన్నారు. ఈ మ‌హా స‌మ్మేళ‌నం చ‌రిత్రలో నిలిచిపోతుందన్నారు. బూత్ స్థాయి స‌మావేశాల‌ను విజ‌య‌వంతం చేసిన రాష్ట్ర క‌మిటీకి అభినంద‌న‌లు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జులైలో ప్రధాని మోదీ ఏపీకి వస్తారని వెల్లడించారు.

బీజేపీని శ‌క్తిమంత‌మైన పార్టీగా...

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని శ‌క్తిమంత‌మైన పార్టీగా త‌యారుచేయాలని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు అన్నారు. మోదీ పాల‌న‌లో అవినీతికి తావులేదని చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా ప‌లువురు చేస్తోన్న త‌ప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు నిర్వహిస్తే బీజేపీకి 360 స్థానాల‌కు పైగా వ‌స్తాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఆర్థిక అస‌మాన‌త‌లు త‌గ్గించ‌డం మోదీ ప్రభుత్వ ల‌క్ష్యమ‌న్నారు.

అమిత్ షా ప్రసంగిస్తుండగా..

అమిత్ షా ప్రసంగిస్తుండగా.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళ‌నకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపుచేశారు. ఇదే సందర్భంగా, కొందరు బీజేపీ కార్యకర్తలు.. టీడీపీని వీడండి, బీజేపీని కాపాడండి అన్న అర్థం వచ్చే స్లోగన్‌లతో ప్లకార్డులు ప్రదర్శించి.. హడావుడి చేశారు.

21:54 - May 24, 2017

ఢిల్లీ : ఏపీకి హోదాపై ఏపీ కాంగ్రెస్‌ నేతలు రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు.. ఇవాళ సీపీఐ, సీపీఎం జాతీయ నేతలను కలిశారు. జూన్‌లో భీమవరంలో నిర్వహిస్తోన్న సభకు హాజరుకావాలని వామపక్షాల నేతలను కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ విమర్శించారు. ఏపీకి మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీపీఎం కట్టుబడి ఉందని... దీనిపై పార్లమెంట్‌లోపలా, బయట పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి బీజేపీ ద్రోహం చేస్తోంటే దానికి టీడీపీ మద్దతు పలుకుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. భీమవరంలో జరిగే సభలో తాము పాల్గొంటామని కాంగ్రెస్‌ నేతలకు హామీనిచ్చారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు... ఏపీలోని పరిస్థితులను వివరించారు. భూసేకరణ చట్టం 2013కు ఏపీ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించవద్దని ప్రణబ్‌ను కోరారు.

18:58 - May 19, 2017

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడతారా? పార్టీ అధినేత గతంలో చెప్పినట్టుగా రాజీనామాస్త్రం ప్రయోగిస్తారా? తాజాగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ ఎంపీలు.. రాజీనామాపై వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్‌ యూ టర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

ఆసక్తికరంగా మారిన రాజీనామా అస్త్రం

నవ్యాంధ్ర ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు.. రాజీనామా అంశంపై ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో.. వైసీపీ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. అంతిమ అస్త్రంగా రాజీనామాస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యింది.

రాజీనామాల కోసం ఎంపీలను ప్రిపేర్‌ చేసిన జగన్‌

వచ్చే పార్లమెంట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసేందుకు రెడీ కావాలని.. ఎంపీలను జగన్‌ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ వ్యూహాలను మార్చినట్టుగా తెలుస్తోంది. అంతిమ అస్త్రంగా ఎంపీలతో రాజీనామాల అస్త్రం ప్రయోగించాలి అనుకున్న జగన్.. ఈ అంశంపై పూర్తిగా వెనక్కి తగ్గారు. హోదాపై తమ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్‌లో పోరాడేది ఎవరు అని జగన్ అంటున్నారు.

ప్రధాని మోదీని కలిసిన జగన్

గతంలో అరు నూరయినా ఎంపీలతో రాజీనామా చేయించి.. కేంద్రప్రభుత్వంపై పోరాడతామన్న జగన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కొత్త ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్‌ ప్రధాని మోదీని కలిసిన తరువాత ఇద్దరి మధ్య.. రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. హోదాపై కేంద్రానికి ఉన్న అభ్యంతరాలు జగన్‌కు ప్రధాని వివరించారు. జగన్‌కు సంబంధించిన ఇతర వ్యక్తిగత అంశాలపై ఏనాడు లేని విధంగా పీఎం ప్రాధాన్యత ఇవ్వడంతో.. జగన్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద రాజీనామాల పై రూట్ మార్చిన జగన్‌ వ్యూహం.. ఏ విధంగా మలుపు తిరుగుతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. 

13:57 - May 16, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - Ap special status