baldia

17:43 - December 3, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు, కొందరు అవినీతి అధికారులు రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. 15ఏళ్లు నిండిన బల్దియా బండ్లను రోడ్డెక్కనివ్వమంటున్న అధికారులు... ప్రైవేట్‌ వ్యక్తులు ఎలాంటి వెహికిల్స్‌ నడిపించినా పట్టించుకోవడం లేదు. అగ్రిమెంట్‌ను తుంగలోతొక్కి పాత వాహనాలను రోడ్డు ఎక్కిస్తున్నారు. పనిచేయాల్సిన వాహనాలు పనిచేయకపోయినా ఎంచక్కా బిల్లులు మాత్రం పాసైపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ చెత్త రవాణాలో కాంట్రాక్టర్లు, అధికారుల కాసులలీలపై 10టీవీ ప్రత్యేక కథనం..

జీహెచ్‌ఎంసీ దేశంలోనే పెద్ద కార్పొరేషన్ల వరసలో ఉన్న లోకల్‌బాడీ. కోటికిపైగా జనాభా ఉన్న సిటీలో ప్రతిరోజు 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను నగరంలోని కాలనీలు, బస్తీలు, బల్క్‌ గార్బెజ్‌ పాయింట్ల నుంచి ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలకు, అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ కేంద్రానికి తరలించడానికి బల్దియాకు ప్రత్యేక రవాణా విభాగం పనిచేస్తుంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది బల్దియా. ఒకటి రెండేళ్ల క్రితం వరకు జీహెచ్‌ఎంసీనే చెత్త రవాణాను చేపట్టేది. ఇందుకోసం 773 వాహనాలు ఉండేవి. వాటి రిపేర్లు, డీజిల్‌ వంటి వ్యవహారాలను తమ పార్కింగ్‌ యార్డుల్లోనే చేసుకునేది బల్దియా. అయితే వాహనాల నిర్వహణలో పెద్దమొత్తంలో అక్రమాలు వెలుగు చూడడంతోపాటు కార్పొరేషన్‌ వాహనాలు పాతబడిపోవడంతో వాటిలో 290 వాహనాలను తొలగించారు.

తగ్గించిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలను బల్దియా అధికారులు కొనుగోలు మాత్రం చేయలేదు. వాటి స్థానంలో అద్దె వాహనాలను సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. తొలగించిన వాహనాల స్థౄనంలో 234 అద్దె వాహనాలను రోడ్డెక్కించారు. వీటిలో 82... 25 టన్నర్ల లారీలు,71 మినీ టిప్పర్లు , 30 డంపర్‌ ప్లెసర్లు, 29 జేసీబీలు, 15 బాబ్‌కాట్స్‌, ట్రాక్టర్లు, లోడర్లు వంటివి బల్దియా శానిటేషన్‌లో చేరిపోయాయి. వీటి నిర్వహణ కోసం ప్రతినెలా కోట్లాది రూపాయల అద్దెలు చెల్లిస్తోంది. అద్దె వాహనాల ఏర్పాటు... కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అగ్రిమెంట్‌ను బుట్టదాఖలు చేసిన ఈ గ్యాంగ్‌ .. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. అధికారయంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ.... అద్దె వాహనాలకు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. ఇమ్లీబన్‌ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో అద్దె వాహనాల వివరాలు ఎలా సేకరిస్తున్నారో చూడండి. కేవలం చివరి నాలుగు అంకెలు వేసి వదిలేస్తున్నారు. ఇది బల్దియా నిర్వహిస్తోన్న రికార్డు. దీని ద్వారానే బిల్లులు చెల్లిస్తారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పాతవాహనాల స్థానంలో కొత్త వాహనాలు అద్దెకు ఏర్పాటు చేశామంటున్న అధికారులు.. ఎలాంటి వాహనాలు పనిచేస్తున్నాయి, వాటి కండిషన్‌ ఏంటి అన్నది మాత్రం పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ తొలగించిన వాహనాల కంటే కండిషన్‌ మరీ లో ఉన్న వాహనాలతో చెత్త రవాణా చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. అద్దె వాహనాలు రోజు ఎంత చెంత తరలిస్తుందో కూడా లెక్కలు లేవు.

జేసీబీలు, అద్దె వాహనాలు పనిచేసినా, చేయకపోయినా పూర్తిస్థాయిలో బిల్లులు మాత్రం చెల్లిస్తున్నారు. రెండు వాహనాలకు బదులు ఒకదానితో పనిచేసినా బిల్లులు మాత్రం మూడింటికి ఇచ్చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండికొడుతున్నారు. అంతేకాదు...ట్రాన్స్‌పర్‌ కేంద్రాల నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు వెళ్లే దూరాన్ని ఎక్కువ చూపుతూ బిల్లులు నొక్కేస్తున్నారు. కిందిస్తాయి అధికారులు, సిబ్బంది అక్రమాలపై బల్దియా బాస్‌ దృష్టి సారించకపోతే ఖజానా గుళ్లవడం ఖాయం. ఇప్పటికైనా ట్రాన్స్‌పోర్టు విభాగంలో జరుగుఉతన్న అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

18:04 - October 19, 2017

హైదరాబాద్ : ఎన్నికలు ఏవైనా ఓట‌ర్ల జాబితా రూపొందించడమంటే అధికారులకు కత్తిమీద సామే. ఏటా మార్పులు చేర్పుల ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఓట్లు గల్లంతయితే వివాదస్పదమవుతోంది. విపక్షాలు విరుచుకుపడతాయి. దీంతో ఓటర్ల జాబితా తయారుచేయడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. దీంతో ఈ సమస్యలకు ఆధునిక సాంకేతికతో చెక్‌పెట్టేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్లకు చేయాల్సిన స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా తొలిసారి గ్రేట‌ర్ ప‌రిదిలో ఆన్‌లైన్‌లో రూపొందిస్తున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా అర్హులైన వారికి ఓటు హక్కు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నారు. హైద‌రాబాద్ మహానగరంలో 41.32 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు. 3879 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓట‌ర్ల సంఖ్య ఆధారంగా ముందుగానే ప్రాంతాలను విభజించారు.

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌మిష‌న‌ర్ సమావేశం
ప్రతి బిఎల్‌ఒకు ప్రత్యేక ట్యాబ్‌ను స‌మ‌కుర్చారు. ఇప్పటి వర‌కు హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలో 40 లక్షల 17 వేల 951 ఓట‌ర్లు ఎన్యూమ‌రేట్ చేశారు. వీటిలో కొత్తగా 20 లక్షల 4 వేల 90 మంది ఓటర్లు నమోదు కాగా.. చిరునామా మారిన వారు 14 లక్షల 95 వేల 808 మంది ఉన్నారు. అదే అడ్రస్‌లో ఉన్న వారు 17 వేల 64 వేల 77 మంది ఓట‌ర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌కవ‌ర్గంలో అత్యధికంగా 81 వేలు..,గోషామ‌హ‌ల్‌లో 79వేలు..., ఖైర‌తాబాద్‌లో 58వేలు, కంటొన్మెంట్‌లో 55వేలు, అంబ‌ర్ పేట్‌లో 54వేలు, స‌న‌త్ న‌గ‌ర్‌లో 51వేల ఓట్లును తొలగించనున్నారు. బల్దియా చర్యలపై పలు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాల‌యంలో రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో క‌మిష‌న‌ర్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో జ‌రుగుతున్న ఎన్నికల జాబితా ప‌నితీరును వివ‌రించారు. త్వరలోనే స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితాను ప్రక‌టిస్తామ‌న్నారు. గ్రేటర్‌లో ఎన్నికల జాబితాను ఆన్‌లైన్‌లో రూపొందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

17:25 - August 24, 2017

హైదరాబాద్ : బల్దిలియా మరో నిర్ణయానికి సిద్ధపడింది. నగరంలోని చెత్త తరలింపు కాంట్రాక్ట్ రాంకీకి అప్పగించేలా సిద్ధమౌతు ఒప్పందం చేసుకునేందుకు రెడీ అయింది. బల్దియా నిర్ణయంపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యమ సమయంలో ప్రైవేట్ కు అప్పగిచడాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం సై అంటున్నారు. మరిన్ని వివరాలకు కోసం వీడియో చూడండి.

15:55 - August 12, 2017

హైదరాబాద్ : నగర అభివృద్ధికి, కొత్త ప్రాజెక్ట్‌ల అమలుకు, జీతాల చెల్లింపులకు, రోజువారి మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులను సమీకరించేందుకు కొత్త వ్యూహాలకు బల్దియా పదును పెడుతోంది. ప్రాపర్టీ టాక్స్‌ వసూళ్లలో దూసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అంతే కాకుండా అధికారులతో వీక్లీ రివ్యూ పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సునామీ సర్వే.. ఆస్తి పన్నులో ఉన్న లోపాలను రివ్యూ చేసి పన్నులు పెంచేందుకు ప్లాన్ చేశారు. బల్దియా ఎన్నికల సమయంలో 1200 రూపాయల లోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేశారు. అయితే వాటికి అసలు పన్ను ఎంత ఉంటుందని రివిజన్ చేసిన బల్దియా అధికారులు.

60 కోట్ల పన్ను
30 శాతం నుంచి 500 శాతం వరకు పన్నును విధించారు. దాంతో మొదట్లో రద్దైన పన్ను కంటే ఎక్కువ మొత్తంలో పన్ను డిమాండ్‌ను పెంచారు. దీంతో పాటు ఈ ఏడాది లెక్కలోకి రాని ఆస్తులు.. ఖాళీ స్థలాలను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బల్దియా తీవ్ర కసరత్తు చేస్తోంది. వాటిపై 60 కోట్ల పన్ను రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా.. ఈ ఏడాది 1450 కోట్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పటికే 541 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయ్యింది. మార్చి నాటికి 909 కోట్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రతీ వారం పన్ను వసూళ్లపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతీ నెల 113 కోట్ల చొప్పున వసూలు చేయాలని టార్గెట్ ఫిక్స్‌ చేసుకున్నారు.

పన్నులు భారీగా పెంచనున్న జీహెచ్ఎంసీ
ఇక ట్రెడ్‌ లైసెన్స్‌ పన్ను ప్రకటనల పన్నులను కూడా భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో ఉన్న హోర్డింగుల నిర్వహణను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం ద్వారా 100 కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా 50 కోట్ల ఆదాయం ఆర్జించిన జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది దానిని 100 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఇందులో ఉన్న లోపాలను సవరించేందుకు ఇటీవలే స్టాండింగ్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో సిటీలో ఉన్న ప్రతీ వ్యాపారాన్ని లైసెన్స్ పరిధిలోకి తెచ్చి.. వారందరి నుంచి పన్ను రాబట్టాలని డిసైడ్ చేసింది. ఇక ప్రతీ యేటా టౌన్ ప్లానింగ్ ద్వారా వస్తున్న 600 కోట్ల ఆదాయాన్ని కూడా ఈ సారి భారీగా పెంచడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సిటీ డెవలప్‌మెంట్ కోసం పలు భారీ ప్రాజెక్ట్‌లను ముందేసుకున్న బల్దియా.. వాటిని కంప్లీట్ చేసేందుకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేస్తుంది. ఈ ఏడాది కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతాయా.. లేదా అనేది మార్చి చివరికి తేలిపోనుంది. 

18:06 - August 5, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం పక్కదారి పడుతోంది. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆటోల ఈఎంఐల చెల్లింపుల్లో ... అధికారులు కమీషన్‌లు దండుకుంటున్నారు. అలాగే ఆటోల నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తున్నారు. చెత్త సేకరణ కోసం అధికారులు... 1996 ఆటో టిప్పర్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం ప్రతినెల 2 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నారు. అయితే వీటి చెల్లింపుల్లో అధికారులు కమీషన్‌లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఆటోల నిర్వహణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో ఆరు నెలలు 15 ఆటోలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.

15:54 - July 3, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3లో అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రయత్నించారు. అయితే కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ కూల్చివేతను అడ్డుకుని జీహెచ్ ఎంసీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. మరోవైపు తన ప్రాపర్టీకి వెళ్లే మార్గంలో కొందరు అడ్డంగా గోడ నిర్మించారని.. వాటిని తొలగించడానికి వచ్చిన సిబ్బందిపై కార్వాన్ ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదని పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:27 - July 3, 2017

హైదరాబాద్ : కాసేపట్లో జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఏరియా కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. కౌన్సిల్ ప్రతి ఐదు వేల జనాభాకు ఒకరు చొప్పున 1400 మందిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ గతేడాదిలోనే పూర్తి కావాల్సి ఉంది కానీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మధ్య సమన్వయ లోపం వల్ల వాయిదా పడింది. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

13:48 - May 17, 2017

హైదరాబద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ విభాగంలో వెతికినా అవినీతి మరకలే. బల్దియాలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతుండడంతో కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ప్రత్యేక నిఘా పెట్టారు. అవినీతిపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై ఆయన స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. చిన్నపాటి ఆరోపణలు వచ్చినా అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తున్నారు. ఆరోపణలు నిజమనితేలితే చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

బల్దియా బాస్‌కు ఫిర్యాదులు
స్వీపింగ్‌ యంత్రాల బిల్లులపైనా బల్దియా బాస్‌కు ఫిర్యాదులు అంతాయి. దీంతో దాని అంతుతేల్చేందుకు సిద్దమయ్యారు. ప్రతిరోజు ఒక్కో స్వీపింగ్‌ యంత్రం 60 కిలోమీటర్ల లైన్‌ రోడ్లనును ఉడ్చాల్సి ఉంటుంది. ఇందుకోసం గంటకు బల్దియా 2,457 రూపాయలు చెల్లిస్తుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అంటే ప్రతి రోజు పది గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కోమిషన్‌కు రోజుకు దాదాపు 24వేల 570 రూపాయలను జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుంది. అంటే నెలకు 7, 37,100 రూపాయలు చెల్లిస్తుందన్నమాట. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇలాంటి ప్రైవేట్‌ స్వీపింగ్‌ యంత్రాలు 25 ఉన్నాయి. వీటికి నెలకు కోటి 84 లక్షల 27,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక బల్దియాకు 26 స్వీపింగ్‌ మిషన్లు ఉన్నాయి. వీటిలో ఆరు పెద్దవికాగా.... 20 చిన్నవి. వీటి నిర్వహణ రాజరాజేశ్వరి ఎంటర్‌ ప్రైజెస్‌కు అప్పగించింది బల్దియా. ఇందుకు ప్రతి నెల 72 లక్షల 30వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే ప్రైవేట్‌, ప్రభుత్వ స్వీపింగ్‌ యంత్రాల కోసం బల్దియా నెలకు 2కోట్ల 56 లక్షల 57వేల 500 రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 30కోట్ల, 78 లక్షల 90వేలు ఖర్చు చేస్తోందన్నమాట.

ఖజానాను ఊడ్చేస్తున్నారు
అవినీతికి బాగా అలవాటుపడ్డ బల్దియా అధికారులు స్వీపింగ్‌ యంత్రాల వినియోగంలోనూ అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు నీళ్లు వదలి స్వీపింగ్‌ యంత్రాల పేరుతో ఖజానాను ఊడ్చేస్తున్నారు. స్వీపింగ్‌ మెషీన్‌ పనిచేస్తున్నా లేకున్నా.. అధికారులు బిల్లులు మాత్రం చెల్లించేస్తున్నారు. దీంతో వారికి ముడుపులు అందుతున్నాయన్న విమర్శలు బహిరంగానే ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎంత బిల్లుపెడితే వాటిని బల్దియా అధికారులు మంజూరు చేస్తూ ఖజానాకు కన్నం పెడుతున్నారు. దీంతో కమీషనర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. స్వీపింగ్‌ యంత్రాల బిల్లుల్లో 40శాతానికిపైగా అవినీతికి పాల్పడ్డట్టుతెలుస్తోంది. కమిషనర్‌ తీసుకుంటున్న చర్యలతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

10:36 - April 29, 2017

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌ అభివృద్ధిలో నగరవాసులను భాగ్యస్వామ్యం చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ మాటలకే పరిమితమైంది. కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటై 14నెలలు పూర్తైన ఇంత వరకు ఒక్క వార్డు కమిటీ కూడా ఏర్పాటు కాలేదంటే జీహెచ్‌ఎంసీ పాలకమండలి పనితీరు ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. గ‌త ఏడాది ఏప్రిల్ లో జరగాల్సిన వార్డు కమిటీ ఎన్నికలు నేటికీ పూర్తి కాలేదు. ఇందుకు రాజకీయ నాయకుల జోక్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీల్లో త‌మ అనుచ‌రుల‌కు అవ‌కాశం క‌ల్పించాలని కార్పొరేట‌ర్లు, ఎమ్యేల్యేలు పోటీపడుతున్నారు. దీంతో ఆలస్యమవుతూ వచ్చిన కమిటీల ఎన్నిక చివరకు కొన్ని వార్డుల్లో మాత్రమే జరగనున్నాయి.

ఈ నెల మొదటివారంలోనే తుది జాబితాను విడుదలచేసింది
ఇందుకోసం ఈ నెల మొదటివారంలోనే తుది జాబితాను విడుదలచేసింది పాలకమండలి. అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు పనులు ప్రారంభించలేదు. వార్డు క‌మీటిలు పూర్తి స్థాయిలో ప‌ని చేయాలంటే ముందు ఏరియా స‌భ‌ల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ స్పూర్తికి విఘాతం క‌లుగ‌కుండా వెంట‌నే ఏరియా స‌భ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి సిటిజ‌న్ ఫోర‌మ్స్. స్థానిక సంస్థల‌కు పెద్ద పీఠ‌వేస్తామంటూ చెప్పుకునే పాల‌కులు ఇప్పటికైనా స్థానిక పాల‌న ప్రజ‌ల‌కు అప్పచెప్పాల్సిన అవ‌సరం ఎంతైనా ఉందని సిటిజన్ ఫోరమ్స్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.  

10:16 - April 14, 2017

హైదరాబాద్ : దాదాపు 7నెల‌ల త‌రువాత జ‌రిగిన జిహెచ్ఎంసి కౌన్సిల్ స‌మావేశం వాడి వేడిగా జ‌రిగింది. ఎంపిక చేసిన ప్రశ్నలన్నింటిపై సభ్యులు చ‌ర్చించారు. ముఖ్యంగా న‌గ‌రంలోని గ్రేవ్ యార్డులు, శానిటేష‌న్, నాలాలు, రోడ్ల అభివృద్దిపై ఫోక‌స్ చేశారు. స్టాండింగ్ క‌మిటీ అమోదం తెలిపిన 57 అంశాల‌తో పాటు మ‌రో 7 అంశాల‌కు ఒకే చెప్పింది కౌన్సిల్‌.గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సాధార‌ణ కౌన్సిల్ మీటింగ్ నగరంలోని ప‌లు స‌మస్యల‌పై చ‌ర్చింది. సభ్యుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలతో కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. గ్రేట‌ర్‌ ప‌రిధిలోని గ్రేవ్‌యార్డుల అభివృద్ధిపై త‌గినంతగా దృష్టి పెట్టలేదంటూ సైదాబాద్ కార్పొరేట‌ర్ సింగిరెడ్డి స్వర్ణల‌త అధికారుల తీరుపై అస‌హ‌నం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నేరుగా సంద‌ర్శించి త‌మ డివిజ‌న్ లోని స్మశాన వాటిక అభివృద్దికి 2కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే దానిని అభివృద్ది చేయడంలో త‌గిన శ్రద్ద పెట్టడంలేద‌న్నారు. ఇత‌ర స‌భ్యులు కూడా త‌మ త‌మ ప్రాంతాల్లో గ్రేవ్ యార్డుల అభివృద్దిపై అధికారుల‌ను ప్రశ్నించారు.

896 శ్మశాన వాటికల్లో..
గ్రేట‌ర్ పరిధిలోఉన్న మొత్తం 896 శ్మశాన వాటిక‌ల్లో 24 గ్రేవ్ యార్డుల‌ అభివృద్దికి 25కోట్లు ఖ‌ర్చు చేస్తున్నట్టు క‌మిష‌న‌ర్ జ‌నార్దన్ రెడ్డి చెప్పారు. అయితే స్మశానాల‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత స‌భ్యులంద‌రిపైనా ఉంద‌న్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. అంతకు ముందు కౌన్సిల్‌ సమావేశం కాగానే మాజీ మేయ‌ర్ ఎంఐఎం సభ్యుడు మాజీద్ హుస్సేన్ .. స‌మ్మర్ యాక్షన్ ప్లాన్ పై చ‌ర్చించాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. అయితే ప్రశ్నోత్తరాల‌పై చ‌ర్చ త‌రువాతే మిగతా విషయాలపై చర్చిద్దామని మేయర్‌ సూచించడంతో సభలో కొద్దిసేపు గంద‌ర‌గోళం నెల‌కొంది. తర్వాత సిటీలో శానిటేష‌న్ కార్మికుల హాజ‌రు, వేత‌నాల చెల్లింపులో చెప‌ట్టిన సంస్కర‌ణ‌ల‌పై కౌన్సిల్‌లో చర్చజరిగింది. అకౌంట‌బులిటి పెంచేందుకే బ‌యోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామ‌ని అధికారులు సమాధానం చెప్పారు. అయితే శానిటేష‌న్ కార్మికులను సూప‌ర్‌వైజ్ చేయాల్సిన శానిట‌రీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత10 ఏళ్లుగా ఒకే చోట ప‌నిచేయడం వ‌ల్ల స‌మ‌స్యలు వ‌స్తున్నాయ‌ని.. వారిని మార్చడానికి స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరారు. మరోవైపు కార్పొరేష‌న్ ప‌నుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఒకే కాంట్రాక్టర్ ప‌దుల సంఖ్యలో ప‌నులు తీసుకుంటూ వాటిని స‌కాలంలో పూర్తి చేయడంలో విఫ‌ల‌మౌతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ప్రతిపనిలోనూ అవినీతికి పాల్పడుతున్నార‌ని స‌భ్యులు అరోపించారు.

విపక్ష సభ్యుల ఆరోపణలు..
పాల‌క మండ‌లి జ‌నరల్ బాడి స‌మావేశం చాలా అర్థవంతంగా జ‌రిగింద‌న్నారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. దీనిపై పై ప్రతిప‌క్ష స‌భ్యులు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. ఒక అంశంపై పూర్తిస్థాయిలో చ‌ర్చించ‌కుండానే మ‌రో అంశంలోకి వెళ్తున్నార‌ని మండిప‌డుతున్నారు వారు. అధికారులు అవినీతికి పాల్పడుతుండటంతో.. కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా వ్యహరిస్తున్నారని. దీంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయక..గ్రేటర్‌ సిటీమొత్తం అస్తవ్యస్తంగా మారుతోందని విపక్షసభ్యులు ఆరోపించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - baldia