ban

21:30 - January 11, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. అసలు దొంగలను వదలి.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ కరెన్సీని అరికట్టడంలో.. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. నల్లడబ్బు స్విస్‌ బ్యాంకుల్లోనే కాకుండా.. బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రూపంలో ఉందన్నారు.

14:05 - December 7, 2016

విజయవాడ : బెజవాడ..విజయవాడ నగరంలో పనిచేసే మున్సిపల్ వర్కర్లు ఎస్ బీఐ కు బారులు తీరుతున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న ఎస్ బీఐ బ్యాంకుకు కార్మికులు పోటెత్తుతున్నారు. పెద్దనోట్ల రద్దు అయి నెల రోజులు అవుతున్నా ప్రజలు కష్టాలు మాత్రం వీడడం లేదు. విజయవాడలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులు నగదు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకులు..ఏటీఎంల ఎదుట క్యూ లైన్లు కడుతున్నారు. దీనితో కార్పొరేషన్ లోని బ్యాంకు కార్యాలయం కిక్కిరిసిపోయింది. 4వేల విత్ డ్రా నిబంధనతో కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ వదులుకొని వస్తున్నామని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. 

13:08 - December 7, 2016
11:01 - December 7, 2016

ఖమ్మం : పెద్దనోట్ల రద్దుతో పేదల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నగరవాసులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతుంటే... గ్రామీణ ప్రాంతీయులు కనీస అవసరాలు తీరక.. అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పల్లెవాసుల జీవితాలు అంధకారంగా మారాయి.

పండితాపురం సంతకు పెద్దనోట్ల ఎఫెక్ట్‌
నోట్ల రద్దు వ్యవహారంతో.. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వారం వారం జరిగే సంతల్లో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మం జిల్లా... కామేపల్లి మండలం పండితాపురం సంతలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి బుధవారం.. ఇక్కడ జరిగే సంతలో కోటి 50 లక్షల రూపాయల వ్యాపారం జరిగేది. నోట్ల రద్దుతో ఇప్పుడది లక్ష రూపాయలకు పరిమితమైంది. కరెన్సీ కొరతతో సంతలో సరుకులు అమ్ముడుకావడం లేదు. సంతలో ఐదు వేలకుపైగా వచ్చేవని.. ఇప్పుడు కేవలం ఐదు వందల రూపాయలలోపే వస్తుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

ఖాళీగా దర్శనమిస్తున్న స్టాళ్లు..
నోట్ల రద్దుతో సంతలో కూరగాయలు.. పశువులు..పువ్వులు.. నిత్యావసరాలు.. దుస్తులు.. ప్లాస్టిక్‌ వస్తువులు.. వచ్చిపోయే వారికోసం పెట్టే టీ..టిఫిన్‌ స్టాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కూరగాయలు..పువ్వులు కొనేవారు లేక పాడైపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేసేదిలేక ఎంతోకంతకు వినియోగదారులకు ఇచ్చేస్తున్నారు. రూ.10, 20, 50, వంద రూపాయల నోట్లు కనిపిస్తే చాలు..బతిమాలి మరీ ధర తగ్గించి రైతులు అమ్ముకుంటున్నారు.

పూట గడవడం కష్టంగా ఉందంటున్న వ్యాపారులు
ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్‌ వాహనాల్లో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇక్కడ సంతకు సరుకులు తీసుకు వస్తుంటారు. తెచ్చినవి అమ్ముడుపోక..కనీస రవాణా ఖర్చులు కూడా రాక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో ఒక్కపూట గడవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.  

21:57 - November 21, 2016

ఢిల్లీ : నోటు రద్దు కారణంగా మృతి చెందడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఓ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 15 వందలు మార్చుకోవడానికి 70 ఏళ్ల సియారాం మూడు రోజుల పాట్లు క్యూలైన్లో నిల్చున్నారు. నవంబర్‌ 15, 16న క్యూలైన్లో నిల్చున్నా నగదు మార్చుకోలేక పోయారు. నవంబర్‌ 17న సియారాం మళ్లీ లైన్లో నిల్చున్నారు. ఒంట్లో ఓపిక నశించిన ఆ పెద్దమనిషి కుప్పకూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన తండ్రి మరణానికి మోడీ ప్రభుత్వమే కారణమంటూ సియారాం కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పరిహారం కింద తమ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కేంద్రం సరైన ఏర్పాట్లు చేయనందునే సియారాం చనిపోయినట్లు ఆరోపించాడు.

 

15:52 - November 21, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో జీహెచ్ ఎంసీ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కూలీ డబ్బుల కోసం బ్యాంకు ముందు గంటలకొద్దీ క్యూకడుతున్నారు. క్యూలోనే గంటలకొద్దీ సమయం గడిచిపోతోంది. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ కోసం బ్యాంకుముందు నిరీక్షణ చేస్తున్నారు. వృద్ధులు క్యూలో నిలబడలేకపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

14:52 - November 4, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్‌ ఉగ్రదాడికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేశారన్న కారణంతో హిందీ న్యూస్‌ ఛానల్‌ ఎన్డీటీవీ ప్రసారాలు నవంబర్‌ 9న ఒకరోజు నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ ఆదేశించింది. దీనిపై సంబంధిత శాఖ విచారణ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ పేర్కొంది. 9 నవంబర్‌ రాత్రి 12 గంటల నుంచి 10 నవంబర్ 12 గంటల వరకు ప్రసారాలపై బ్యాన్‌ ఉంటుంది. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సందర్భంగా ఎన్డీటీవీ ఎయిర్‌బేస్‌లోని ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేసినట్లు దీనిపై విచారణ జరిపిన కమిటీ పేర్కొంది. రక్షణకు సంబంధించిన గోప్యంగా ఉండే వివరాలు బహిర్గతం చేయడం దేశ భద్రతకు వ్యతిరేకమని తెలిపింది. తాము గోప్యమైన సమాచారాన్ని ప్రసారం చేయలేదని ఎన్టీటీవి వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్డీటీవీ ప్రసారాలపై ఒకరోజు బ్యాన్‌ విధించడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఖండించింది. ఇది భావ ప్రకటనపై దాడిగా అభివర్ణించింది.

06:25 - August 19, 2016

ఢిల్లీ : రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించినట్లు సీఏఎస్ ప్రకటించింది. గతంలో డోపింగ్ కేసు విషయంలో క్లీన్ చీట్ పై పిటిషన్ ధాఖలవటంతో సీఏఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నర్సింగ్ యాదవ్ నాలుగేళ్ల పాటు రెజ్లింగ్ కు దూరం అవ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అతను నిర్దోషో తెలవదు కానీ అతను దోషి అని సీఏఎస్ తేల్చింది. పతకం రాకపోగా భారత్ ప్రతిష్ట అప్రదిష్టపాలైనట్లు, దీనిపై భారత్ కచ్చితంగా దృష్టి సారించాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డోపింగ్ జాబితాలో భారత్ చేరడం దురదృష్టకరంగా చెప్పుకోవాలని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జరిపిన డోపింగ్ టెస్టులో పాజిటీవ్ గా తేలినా అతడి తప్పులేదని భావించి అతడికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థలకు నాడా అందజేసింది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, వాడా మాత్రం నర్సింగ్ ను బరిలో దింపేందుకు అనుమతించడం లేదు. తాజాగా నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించాలనుకుంటున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

16:18 - January 13, 2016

ఢిల్లీ : సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో సంప్రదాయ బద్ధ క్రీడ అని పేర్కొనే జల్లికట్టుపై సుప్రీం మరోసారి తీర్పు చెప్పింది. జల్లికట్టుపై సుప్రీం ఇచ్చిన స్టేపై నిర్వాహకులు రివ్యూ పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం సుప్రీం విచారణ చేపట్టింది. రివ్యూ పిటిషన్ తోసిపుచ్చింది. జల్లికట్టు ఆడడం కుదరదని తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జల్లికట్టుకు అనుమతినివ్వాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కేంద్రం అనుమతి..
సంక్రాంతి సందర్భంగా ఎద్దులతో ఆడే ఈ క్రీడకు కేంద్రం కొన్ని షరతులతో ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత జంతు సంరక్షణ బోర్డు (ఏడబ్ల్యూబీఐ), పెటా ఇండియా, బెంగ ళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి. ఈ అంశంపై మంగళ వారం విచారించనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ తెలిపారు. 2011 నుంచి తమిళనాడులో జల్లికట్టు, ఇతర రాష్ట్రాలలో ఎద్దుల బండ్ల పోటీలపై నిషేధం అమలులో ఉండగా, ఈ ఏడాది జనవరి 7న నిషేధాన్ని తొలగిస్తూ మోడీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో ఎద్దులు గాయపడటంతోపాటు మనుషులు చనిపోతున్నారని పెటా ఇండియా తెలిపింది. 2010 నుంచి 2014 వరకు 1100మంది గాయపడగా, ఓ చిన్నారితోపాటు 17మంది చనిపోయారని పెటా ఇండియా పేర్కొన్నది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా వెళ్లొద్దని ప్రభుత్వ సలహా సంఘం ఏడబ్ల్యూబీఐ గత డిసెంబర్‌లో సూచించినా కేంద్రం పెడచెవిన పెట్టిందంటూ పెటా ఇండియా మండిపడింది. 

13:33 - January 6, 2016

ఢిల్లీ : కాలుష్యంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో భారీ డీజీల్‌ వాహనాల నిషేధంపై అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తగ్గలేదు. వాహన తయారీ సంస్థల అభ్యర్థనను అడ్డంగా కొట్టేసింది. కారణాలు చెప్పండంటూ కడిగి పాడేసింది. నిషేధంపై మార్పు లేదని కుండబద్దలు కొట్టి చెప్పింది. మరోపక్క డీజిల్‌ వాహనాలపై మరింత కఠినంగా వ్యహరించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమవుతోంది. మీ వాహనాలు కార్బన్‌ను విడుదల చేయవా..? మీరు తయారుచేసిన వెహికల్స్‌ నుంచి ఆక్సిజన్‌ విడుదల అవుతుందా...? ఇదీ సుప్రీంకోర్టు సూటిగా సంధించిన ప్రశ్న. ఆటోమోబైల్‌ కంపెనీల మైండ్‌ బ్యాంక్‌ అయ్యేలా అడిగిన ప్రశ్న. వాహన తయారీదారులు నీళ్లు నమిలేలా అత్యున్నత న్యాయం స్థానం నిలదీసిన వైనం ఇది.

పునసమీక్షించాలన్న పలు కంపెనీలు...
ఢిల్లీలో భారీ డీజీల్‌ వాహనాల నిషేధాన్ని పునసమీక్షించాలని మెర్సిడెస్‌, టయోటా, మహింద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ అంశం కోర్టులో విచారణకు వచ్చింది. తమ సంస్థకు చెందిన భారీ వాహనాలు తక్కువ స్థాయిలోనే ఉద్గారాలు వెదజల్లుతున్నాయని మెర్సిడెస్‌ వాదించింది. బొలారో, సుమో వంటి వాహనాలను గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులు కూడా అధిక సంఖ్యలో వినియోగిస్తున్నరంటూ చెప్పుకొచ్చింది. మెర్సిడెస్‌ వాదనపై కోర్టు మండిపడింది. పర్యావరణానికి ఏ విధంగా హానికరం కాదో డాక్యుమెంటరీ ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. 2000 సి సి డీజీల్‌ వాహనాలను సామాన్యులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించింది. ధనవంతులే వీటిని వినియోగిస్తారని తేల్చి చెప్పింది.

ఢిల్లీలో మార్చి 31 వరకు నిషేధం..
కాలుష్యంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గానే వ్యవహరిస్తోంది. డీజిల్‌ వాహనాల వినియోగంపై కఠినంగా ఉంటోంది. ఢిల్లీలో 2000 సిసి ఇంజిన్‌ సామర్థ్యం మించిన డీజీల్‌ వాహనాలను, ఎస్‌యూవీ వెహికల్స్‌ వినియోగంపై కోర్టు ఇప్పటికే తాత్కాలికంగా నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో మార్చి 31వ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోంది.

డీజిల్‌ వాహనాలపై గ్రీన్‌టాక్స్‌..
ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో 2000సిసీ సామర్థ్యం దిగువున్న ఉన్న వాహనాలపైనా నిషేధం విధించాలని కోర్టు భావిస్తోంది. మరింత అధ్యయనం తర్వాత దీనిపై ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోపక్క అన్ని డీజీల్‌ వాహనాలపైనా గ్రీన్‌ టాక్స్‌ విధించాలని ఆలోచిస్తోంది. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా కోర్టు మండిపడింది. ఐదేళ్ల దాటిన డీజిల్‌ వాహనాలను ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించింది. మొత్తానికి డీజిల్‌ వాహనాల వినియోగంపై కోర్టు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ముందు ముందు దేశ అత్యున్నత న్యాయస్థానం మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ban