birthday

15:23 - April 21, 2017

దక్షిణాఫ్రికా : ఓ చిన్నారిని సజీవంగా పూడ్చిపెట్టినా ప్రాణాలతో బయటపడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...క్వాజులు - నాటల్ ప్రావిన్స్ లో ఓ 25 ఏళ్ల మహిళ టింబర్ డిపోలో పనిచేస్తోంది. ఇటీవలే పండటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియవద్దని ఆ పసికందును పనిచేస్తున్న చోటే పూడ్చేసింది. కానీ మూడు రోజులకు ఆ చిన్నారి ఏడుపులు అక్కడి వారికి వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు శిశువును కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ పెష్ స్టోన్ రీజనల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే తల్లిపై పోలీసులకు కేసు నమోదు చేశారు.

21:35 - November 4, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జన్మదిన వేడుకలు రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విడివిడిగా రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టిన రోజును ఎన్నడూ మరిచిపోలేనని..ఇది అత్యంత సంతోషకరమైన పుట్టిన రోజుగా పేర్కొన్నారు గవర్నర్ నరసింహన్.

గవర్నర్ నరసింహన్ 70వ పుట్టినరోజు వేడుకలు
రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇరు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల రాకతో రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది.

సీఎం చంద్రబాబు గవర్నర్ర జన్మదిన శుభాకాంక్షలు
గవర్నర్ నరసింహన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తీసుకువెళ్లిన కేక్‌ను గవర్నర్‌తో కట్ చేయించారు. అనంతరం గవర్నర్‌తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలోని పలు పథకాలు, పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

కేసీఆర్ శుభాకాంక్షలు
చంద్రబాబు వెళ్లిన సుమారు 2గంటల తరువాత... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, హోం మంత్రి నాయిని, స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్పాట్

ఇంత ఆనందంగా ఎన్నడూ లేను : గవర్నర్ నరసింహన్
తాను 70 ఏళ్లుగా పుట్టిన రోజులు జరుపుకుంటున్నప్పటికీ ఇంత ఆనందంగా ఎన్నడూ లేనన్నారు గవర్నర్ నరసింహన్. తెలంగాణ రాష్ర్టానికి మొదటి గవర్నర్ కావడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు తాను ఆ రాష్ర్టానికి తొలి గవర్నర్‌గా పని చేశాననే సంతృప్తి తనకు ఉంటుందన్నారు నరసింహన్‌. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ సమస్య ఉన్నా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు గవర్నర్‌ నరసింహన్‌.  

14:46 - November 4, 2016

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి...తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు,కేసీఆర్ గవర్నర్ కు జన్మదిన శుంభాకాంక్షలు అందజేశారు. అనంతం గవర్నర్ కు శాలువా కిప్ప సత్కరించారు.

నరసింహన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన సీఎం చంద్రబాబు..
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి... గవర్నర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు.. ఆ తర్వాత సచివాలయం తరలింపుపై గవర్నర్‌తో చంద్రబాబు కొద్దిసేపు చర్చించినట్లు తెలుస్తోంది..

గవర్నర్ కు శాలువా కప్పి సత్కరించిన సీఎం కేసీఆర్
రాజ్‌ భవన్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ గవర్నర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 

13:46 - November 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాజ్‌ భవన్‌కు చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్‌కు శాలువా కప్పి కేక్‌ తినిపించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ గవర్నర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 

 

12:04 - November 4, 2016

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు గవర్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కు కేక్ తినిపించి విషెస్ తెలిపారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సచివాలయం తరలింపుపై గవర్నర్ తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:07 - October 22, 2016

అతడు మాస్ కు బుజ్జిగాడు..క్లాస్ కు మిస్టర్ పెర్ఫెక్ట్..అభిమానులకు డార్లింగ్..అవార్డులకు, రికార్డులకు బాహుబలి..ఆ ఆరడుగుల ఆజానుబాహుడు..అందగాడు ప్రభాస్...అతడి పుట్టినరోజు సందర్భంగా..ప్రత్యేక కథనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా తెరమీదకు వచ్చాడు ప్రభాస్. హీరోగా ఎత్తూ, ఫిజిక్ ఉండి తనదైన శైలిలో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. చేసింది తక్కువ చిత్రాలైనా ప్రేక్షకుల మదిలో మాస్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. కృష్ణంరాజు నట వారసత్వాన్ని చేతపట్టి రికార్డుల మోత మోగిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'ఈశ్వర్' తో మొదలైన ఆ ప్రస్థానం నిన్నటి 'బాహుబలి' వరకు అద్భుతంగా సాగింది. మాస్ ప్రేక్షకుల పల్స్ ఇట్టే పట్టేసిన 'ప్రభాస్' తన సినిమాలతో వారిని అలరించడం స్టార్ట్ చేశాడు. 'ఈశ్వర్' హిట్ తో కుర్రాడు మంచి కసి మీదున్నాడు కదా అనుకునే సరికి 'వర్షం' హిట్ తో స్టార్ స్టేటస్ కి ఎగబ్రాకాడు. హీరోగా 'ప్రభాస్' కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా 'వర్షం'. ఈ సినిమాతో ప్రభాస్ పెర్ఫామెన్స్ బాగా మెరుగయి ఆయనను స్టార్ హీరోగా మార్చేసింది. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పెర్ఫామెన్స్ తో.. 'వర్షం'లో అదరగొట్టాడు. ఇక 'జక్కన్న' చేతిలో పడి 'ఛత్రపతి'గా అవతరించి బాక్సాఫీస్ బాద్షాగా మారాడు. సినిమా సినిమాకు నైపుణ్యతను జోడిస్తూ స్టార్ గా ఎదిగిన 'ప్రభాస్' ను పరిశ్రమలో అందరు డార్లింగ్ అని అంటుంటారు. 'ప్రభాస్' లోని మరో కోణాన్ని చూపించిన సినిమాలు 'చక్రం', 'పౌర్ణమి'. ఇక 'బుజ్జిగాడు'గా ట్రెండ్ సెట్ చేసిన 'ప్రభాస్' తన నిక్ నేమ్ అయిన డార్లింగ్ సినిమాతో అందరిని అలరించాడు. కొత్త రకం క్యారక్టరైజేషన్ కి ప్రాధాన్యతనిచ్చే 'ప్రభాస్' ఎప్పుడు ప్రయోగాలకు ముందుంటాడు.

డిఫరెంట్ స్టయిల్...
టాలీవుడ్ లో 'ప్రభాస్' ది డిఫరెంట్ స్టయిల్. హాలీవుడ్ స్టార్ లాంటి బాడీ, బాడీ లాంగ్వేజ్ అతడి సొంతం. డాన్స్.. యాక్షన్.. ఫైట్స్ ఇలా ప్రతి మూవీ మూమెంట్స్ లో అతడి స్టయిలే వేరు. ఈ లక్షణాలే 'ప్రభాస్' ని టాలీవుడ్ లో ఆల్ రౌండర్ ని చేసాయి. 14సంవ‌త్సరాలు..17 సినిమాలూ ఇదీ ప్రభాస్ హిస్టరీ. అత‌నికి ఫ్లాప్‌లు తెలుసు. యావ‌రేజ్‌లు తెలుసు. సూప‌ర్ హిట్లు హిట్లూ, బ్లాక్‌బ్లస్టర్ హిట్టూ అన్నీ తెలుసు. అందుకే ఓ హిట్టొస్తే కాల‌ర్ ఎగ‌రేయ‌డు. ఫ్లాప్ వ‌స్తే.. త‌ల‌దించుకోడు. ఎప్పుడూ ఒక‌టే.. న‌డ‌వ‌డిక. 'ప్రభాస్' క‌టౌట్ కి యాక్షన్ క‌థ‌లు త‌ప్ప మ‌రోటి న‌ప్పకూడ‌దు. ఫైట్ సీన్లలో త‌ప్ప సెంటిమెంట్ సీన్లు స‌రిప‌డ‌వు. కానీ… 'ప్రభాస్' వీటిలో దేనికీ లొంగ‌లేదు. కోపం వ‌స్తే ఫైట్ చేశాడు. అమ్మాయి న‌చ్చితే డ్యూయెట్లు పాడాడు.. టీజింగ్ చేశాడు..అమ్మ ప్రేమ కోసం క‌న్నీళ్లు పెట్టుకొన్నాడు..కుటుంబ బంధాల కోసం ప‌రిత‌పించాడు..'ప్రభాస్' ని ఆల్ రౌండ‌ర్ హీరో అన‌డానికి ఇంకేం కావాలి. 

మాస్ కు నిలువెత్తు రూపం..
మ‌న‌కు సూప‌ర్‌మేన్‌లు లేరు.. స్పైడ‌ర్‌మేన్‌లూ లేరు..! ఐరెన్ మేన్ అనే మాటే లేదు. కానీ.. హీమాన్‌లాంటి హీరో ఉన్నాడు – అత‌నే యంగ్ రెబ‌ల్ స్టార్ 'ప్రభాస్‌'. ఆర‌డుగులదేహం, ఆజానుబాహుడు అనే పదానికి అసలు సిసలైన రూపం అతగాడిది. .పూర్వం సినిమా హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండేవి. ఆరడుగుల పొడవు... మంచి బాడీ... అమ్మాయిల్ని ఆకట్టుకునే స్పురద్రూపం... ఇవన్నీ ఉన్నవాడే హీరోగా నిలదొక్కుకోగలిగేవాడు. ఇప్పుడు కాలం మారింది. అందం లేదు... పొడుగూ లేదు... బాడీ లేదు. ఒక్క బ్యాక్ గ్రౌండ్ వుంటే చాలు ఎవరైనా హీరో అయిపోవచ్చు. అయితే, 'ప్రభాస్' మాత్రం నిన్నటి హీరో లక్షణాలను పుణికిపుచ్చుకున్న నేటి తరం హీరో! నిన్నటి తరం హీరోలు ఎలా వుండేవారో ప్రభాస్ అలాగే ఉంటాడు. మాస్ సినిమాలే 'ప్రభాస్' ను టాలీవుడ్ లో సూపర్ హీరోని చేసాయి. ముఖ్యంగా 'పూరీ జగన్నాథ్', 'రాజమౌళి', 'కొరటాల శివ' లాంటి దర్శకులు 'ప్రభాస్' లోని మాస్ యాంగిల్ ను బాగా వెలికితీసారు. ఇప్పుడు మాస్ కు నిలువెత్తు రూపం 'ప్రభాస్'.

ఛత్రపతి మూవీ...
హీరోగా 'ప్రభాస్' మాస్ ఇమేజ్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లిన మూవీ 'ఛత్రపతి'. టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ 'రాజమౌళి' డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 'ప్రభాస్' కెరీర్ లో ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయింది. 'ప్రభాస్' కెరీర్ ను 'ఛత్రపతి' ముందు 'ఛత్రపతి' తరువాత అని బేరీజు వేసుకునేంతగా హిట్ గా నిలిచిపోయిందీ సినిమా. 'ఛత్రపతి' తరువాత , పూరీ జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో 'ప్రభాస్' బాడీ లాంగ్వేజ్ ను, బాడీ మూమెంట్స్ ను, అతడి నటనలో ఈజ్ ను బాగా ఎలివేట్ చేసాడు. ఆ ఒక్క సినిమాలోనూ, మిగతా సినిమాల్లోనూ 'ప్రభాస్' లోని మార్పుని మనం స్పష్టంగా చూస్తాం. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయినా, 'ప్రభాస్' కి ఈ సినిమా చాలా ఉపయోగపడింది. ఆ తరువాత 'ఏక్ నిరంజన్' లో కూడా 'ప్రభాస్' మాస్ నటన జనాన్ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.

బాహుబలి 2
ఇక 'ప్రభాస్' కెరీర్ 'బాహుబలి' ముందు 'బాహుబలి' తర్వాత అనుకొనేలా చేసింది బాహుబలి అఖండం విజయం. ఈ సినిమా కోసం 'ప్రభాస్' దాదాపు 3 సంవత్సరాలకు పైగానే 'రాజమౌళి' దగ్గర లాక్ అయిపోయాడు ప్రభాస్. ఏ నటుడి కెరీర్ కైనా ఒక బ్రేక్ అనేది ఉంటుంది. 'ప్రభాస్' కు మాత్రం ఆ బ్రేక్ చాలా ఎఫెక్టివ్ గా వచ్చింది. వేరే ఏ హీరో కూడా బద్దలు కొట్టలేని రికార్డుల్ని నెలకొల్పి 'బాహుబలి' తో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా అవతరించాడు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలందరికన్నా మోర్ ఎక్స్పెన్సివ్ హీరో అయిపోయాడు. ఇదంతా కేవలం 'బాహుబలి' తెచ్చిపెట్టిన అఖండమైన ఖ్యాతి. నిన్నమొన్నటి వరుకూ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోగా మాత్రమే సినిమాలు చేసుకొన్న 'ప్రభాస్' 'బాహుబలి' తో అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ఖ్యాతి గడించాడు. 'బాహుబలి' కేవలం ఇండియాలోనే కాకుండా మరికొన్ని ఇతర దేశాల్లో సూపర్ హిట్టయి 'ప్రభాస్' కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. దటీజ్ 'బాహుబలి'. ఇప్పుడు ప్రభాస్ 'బాహుబలి 2' తో చాలా బిజీగా ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ కు ఎంత కష్టం పడ్డాడో రెండో భాగానికి కూడా అంతకు మించి కష్టపడుతున్నాడు 'ప్రభాస్'. దాదాపు 1000 కోట్ల టార్గెట్ తో 'జక్కన్న' 'బాహుబలి 2'ని జనరంజకంగా చెక్కుతున్నాడు. అంతేకాదు ఈ సినిమా అప్పుడే అనూహ్యమైన బిజఙనెస్ చేసేస్తోంది.

16 గంటల కష్టం..
'బాహుబలి' సినిమా కోసం యంగ్ రెబ‌ల్‌స్టార్ 'ప్ర‌భాస్‌' ఇప్పటికే మూడేళ్లకు పైగా స‌మ‌యం కేటాయించాడు. మొదటి భాగం రిలీజ్ అయ్యి ఏడాది పైగానే పూర్తి కాగా.. దానికి ముందు రెండున్నరేళ్ల కష్టం ఉంది. ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్' కు.. క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇది పూర్తయ్యే వరకూ.. ప్రధాన నటులు అదే లుక్ ను మెయింటెయిన్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా 'బాహుబలి'గా నటిస్తున్న 'ప్రభాస్'.. తన లుక్స్ లో వీసమెత్తు కూడా తేడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదటి భాగంలో ఎక్కువగా శివుడు పాత్రమీదే కథ నడిచినా.. సెకండ్ పార్ట్ లో దాదాపు 'బాహుబలి' స్టోరీనే ఉంటుంది. పైగా ఈ పాత్ర కోసం ఇప్పటికే 20 కిలోల బరువు పెరిగాడు 'ప్రభాస్'. 'ప్ర‌భాస్' అంత‌ బరువు పెరిగి కూడా.. పూర్తి స్థాయి ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేయాలి. అందుకే షూటింగ్.. వర్కవుట్స్ మొత్తం కలిపి 16 గంటల పాటు కష్టపడుతూనే ఉన్నాడట. ముందే తెలిసిన ప్రభాస్.. అందుకోసం ఎలాంటి లూప్ హోల్స్ వదలబోవడం లేదని.. ఈ 16 గంటల కష్టం చూస్తే అంద‌రికీ అర్ధమవుతోంది.

తమిళ..హిందీ భాషల్లో...
'బాహుబలి 2' మొదటి భాగంకన్నా ఇంకా ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తే ,ఇక తరువాత ప్రభాస్ క్రేజ్ ను ఎవరూ అంచనా వేయలేరు. అయితే ఈ సినిమా పూర్తయిపోయాక ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి ఎక్కువైపోయింది జనానికి. అంతేకాదు ఆ సినిమా బడ్జెట్ ప్లాన్ మీదకూడా జనానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. బాహుబలి తో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది కాబట్టి, బాహుబలి 2 తో ఆ ఇమేజ్ ని మరింత క్యాష్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ప్రభాస్ కూడా తక్కువేం తినలేదు 'బాహుబలి' తో వచ్చిన ఇంటర్నేషనల్ స్టార్ డంని అలాగే కంటిన్యూ చేయడానికి పెద్ద ప్లానే వేసాడు . ప్రస్తుతం చేస్తున్న 'బాహుబలి పార్ట్ 2' తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ బాషలలో కూడా నిర్మించానున్నారట. దీనివల్ల బాలీవుడ్ జనాలకు మాత్రమే కాకుండా మాలీవుడ్ , కోలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టవచ్చు అని ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఖర్చు పెట్టినా రాబడికి డోకా ఉండదని భావిస్తున్నారట. అదే సమయంలో 'బాహుబలి పార్ట్ 2' తర్వాత వచ్చే చిత్రం కాబట్టి అంచనాలు కూడా భారీగా ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండొచ్చని ఒకవేళ ఆ సినిమా నచ్చితే మరింత మార్కెట్ పెరిగే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారట. మొత్తం మీద 'ప్రభాస్' బాహుబలి ఇమేజ్ ని భలేగా క్యాష్ చేసుకుంటున్నాడు కదూ.
అభిమానుల ఫాలోయింగ్‌లోనూ…రికార్డుల వేట‌లోనూ..కొత్త పాత్రలు ఎంచుకోవ‌డంలోనూ, పాత్రల కోసం క‌ష్టప‌డ‌డంలోనూ 'ప్రభాస్' ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఈ స్థాయికి చేరాడు. 'బాహుబ‌లి' 'ప్రభాస్'కి మ‌న‌స్ఫూర్తిగా జ‌న్మదిన‌ శుభాకాంక్షలు తెలియ‌జేసుకుంటోంది 10 టివి.

16:54 - September 17, 2016

గుజరాత్ : ప్రధానమంత్రి నరేంద్రమోది తన 66 వ పుట్టినరోజును స్వరాష్ట్రం గుజరాత్‌ జరుపుకున్నారు. ఉదయమే గాంధీనగర్‌ చేరుకున్న మోది తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోది తల్లితో అరగంటసేపు గడిపారు. హీరాబెన్‌ తాను స్వయంగా తయారు చేసిన మిఠాయిని కుమారుడికి తినిపించారు. ప్రధాని మోది దాహోద్‌ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రులు ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ ప్రధానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించి.. శుభాకాంక్షలు తెలియజేశారు.
 

09:19 - August 23, 2016

హైదరాబాద్ : చిరంజీవి బర్త్‌డే సందర్భంగా సోమవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో సినీ ప్రముఖులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌లోని సినీ హీరోలు, హీరోయిన్స్‌, నటులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. 

 

10:43 - August 21, 2016

ఆయనో మెగా మెరుపు..మహా వెలుగు..ఆయన పేరే వైబ్రేషన్..ఆయన డ్యాన్సో సెన్సేషన్..టోటల్ గా ఆయన స్టైలో సెలబ్రేషన్...దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు వెండి తెరనేలిన ఆ మెగా మహారాజు చిరంజీవి. ఆ కోట్లాది అభిమానుల గుండె చప్పుడు... ఇప్పుడు విజయధ్వానమై వినిపిస్తోంది. ఆయన 62 వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి నట ప్రస్థానంపై ప్రత్యేక కథనం..చిరంజీవిది సాధారణమైన ఇమేజ్ కాదు. అసాధారణమైన విజయాలను ఒంటి చేత్తో సాధించి, తెలుగు తెర శిఖరాగ్రంపై నిలిచిన అసమాన్యమైన ఇమేజ్. కోట్లాది మంది అభిమానులకు తెరవేలుపుగా నిలిచిన ఆయన ప్రస్థానం అద్వితీయమైనది.

60 ఏళ్ల కిందట...
సరిగ్గా 60ఏళ్ళ క్రిందట గోదారి దారిలో వున్న మొగల్తూరుకి తెలియకపోవచ్చు తాను భవిష్యత్ లో సినీ సంచలనానికి కేంద్రబిందువుగా నిలవనున్న పసిబిడ్డను మోస్తున్నానని తల్లి అంజనాదేవికి అప్పుడు తెలిసివుండక పోవచ్చు. తెలుగు సినిమా సింహాసనాన్ని ఏలే మొనగాడి బోసి నవ్వులు వింటున్నానని. కట్ చేస్తే తనొక సినీ శిఖరంగా ఎదిగాడు. అప్పటికే ఎన్.టి.ఆర్ దేవుడిగా పూజింపబడుతున్నాడు. ఏ.ఎన్.ఆర్ నవలానాయకుడిగా ప్రేమింపబడుతున్నాడు కృష్ణ కొత్తదనంతో కీర్తింపబడుతున్నాడు. వీరి ముందు నిలబడాలంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్నకు తనదైన శైలిలో డ్యాన్స్ ని ఎంటర్ టైన్మెంట్ ని కామెడి ని మాస్ ని కలబోసి తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్నాడు. నేటి మేటి మెగాస్టార్ అయ్యాడు. ఈ స్థితికి చేరడానికి చిరంజీవి ఎన్నో ఎత్తు పల్లాల్ని ఎక్కి దిగాడు. మరెన్నో ఎత్తుల పై ఎత్తులకు చిత్తవక ఎంతో ఎదిగాడు.

తెలుగు సినిమాని కమర్షియల్ ఎక్స్ప్రెస్ ఎక్కించిన ఘనుడు చిరంజీవి. అప్పటివరకూ కనీ వినీ ఎరుగని హీరోయిజం కళ్ళముందు కదలాడే సరికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయేవారు. సుప్రీమ్ హీరో మెగాస్టార్ ల బిరుదులు చిరు ముందు నిలుచుని సత్కారాన్ని అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాలపాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదలిన రూపం. తన నటన, డాన్స్ లతో అశేష జనవాహిని తన అభిమానులు మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనలో మాత్రమే కాదు డాన్సర్, సింగర్, ప్రొడ్యూసర్, బిజినెస్..ఇలా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు. ఆయన నటన, సమాజ సేవ..కోట్లాది అభిమానులను సంపాదించిపెట్టింది. టిక్కెట్ దొరికితే పండగలు.. ఫస్ట్ షో పడకపోతే ధర్నాలు ప్రధాన కూడలి థియేటర్ ల దగ్గర ట్రాఫిక్ జామ్ లు కట్ అవుట్ లకు పాలాభిషేకాలు ఇటువంటి వెర్రి అభిమానాలకి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి సినిమాలే. చిన్న పిల్లలు కొత్తగా ఒక డైలాగ్ చెప్పినా ఒక స్టెప్పేసినా చిన్నగా నవ్వించినా 'ఈడు పెద్దయ్యాక చిరంజీవైపోతాడు' అన్న డైలాగ్ ప్రతీ ఇంట్లో కూడా పడేది.

మొగల్తూరులో జననం..
మొగల్తూరు లో జన్మించిన చిరంజీవి నట ప్రస్థానం 1978 లో ప్రారంభమైంది. సరిగ్గా అప్పుడే ఆయన సినీ జీవితానికి పునాది రాళ్ళతో పునాది పడింది. ప్రాణం ఖరీదు విడుదలైన తొలి చిత్రమైంది. అక్కడనుంచి చిరంజీవి కెరీర్ అంచెలంచలుగా ఎదిగింది. 1978 లో శిక్షణాకాలం పూర్తవుతున్న సమయంలో 'పునాది రాళ్ళు' సినిమాలో నటించే ఆవకాశం రావటంతో చిరంజీవి సినీ ప్రస్థానం మొదలయింది. తరవాత వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వినియోగించుకుని ఆనతికాలంలోనే మంచి నటుడిగా, మంచి డాన్సర్ గా పేరు గడించారు. మొదట ప్రతినాయక పాత్రలలో నటించినా తరవాత హీరో గా రాణించడం మొదలయింది. 1983 లో విడుదల అయిన 'ఖైది ' తెలుగు సినిమా పరిశ్రమకు ఓ పెద్ద స్టార్ నీ ప్రసాదించింది. అదిరిపోయే డాన్సు లుతో , ఫైట్ లతో వచ్చిన మాస్ ఫాలోయింగ్ తో సుప్రీంహీరోగా తరవాత మెగా స్టార్ గా కోటానుకోట్ల అభిమానులను సంపాదించుకుని స్టార్ ఇమేజ్ కు కొత్త నిర్వచనం చెప్పారు అయన. తరవాత తెలుగు సినిమాలో స్టార్ హీరో గా నిలదొక్కుకోవాలంటే డాన్సు చేయడం, ఫైట్స్ చేయడం అనేవి ప్రధాన అర్హతలు అయ్యాయి. ఇప్పటికి అదే భావనలో తెలుగు ప్రేక్షకులు ఉండటం చూస్తుంటే చిరంజీవి ఎంతలా ప్రభావితం చేసారో ఊహించవచ్చు.

అద్భుతమైన టైమింగ్...
మాస్ కామెడీకి చిరంజీవి పెట్టింది పేరు. దానికి ఆయన వాడే బాడీ లాంగ్వేజ్ , లాంగ్వేజ్ ఎప్పటికీ డిఫరెంటే. అద్భుతమైన టైమింగ్ తో ఆయన చేసే కామెడీ మాస్ జనానికి భలే కిక్కెస్తుంది. దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడులోని ఆయన పెర్ఫార్మెన్సే దీనికి నిదర్శనం. ఎంటర్ టైన్మెంట్ లో సైతం వైవిధ్యం చిరు నైజం. నా ముక్కుమీద ఇలా వేలు పెట్టి అంటూ త్రాగుబోతు పాత్రలో నవ్వు తెప్పించిన తీరు అసామాన్యం. నాయకుడు కులం నుండి కాదు జాతి నుండి పుడతాడన్న సూత్రాన్ని జ్ఞప్తి చేసినా స్టైల్ గా ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టుకుంటే అదికాస్తా చిరిగి బయటకు కనిపించి నవ్వించినా అంతెందుకు కేవలం లుంగీ కట్టి నోట బీడీ పట్టినా, స్టైల్ గా వంగి నమస్కారం పెట్టినా, చెయ్యి చూపించి రఫ్ఫాడిస్తానని చెప్పినా, అంతొద్దు ఇదిచాలని చెప్పినా, లెంగ్త్ ఎక్కువైంది కట్ చేస్తానని చెప్పినా, బాక్స్ బద్దలైపోద్దని, జంక్షన్ జామైపోద్దని వార్నింగిచ్చినా ... ప్రేక్షకులు చిరంజీవి నటనకు, ఎపీరెన్స్ కి, ఆ స్టైల్ కి బ్రహ్మరథం పట్టారు.

విజయాల సంకలనం..
మెగాస్టార్ అంటే విజయాల సంకలనం. ఎవరూ సాధించలేని విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. ఎన్నో చిత్రాలు చేసి మెగాస్టార్ అనే శిఖరానికి చేరుకున్న మెగానటుడు చిరంజీవి. చిరంజీవి నెలకొల్పిన రికార్డులన్నీ కలిపితే అదొక రికార్డు. 149 సినిమాలు అందులో 100కు పైగా కమర్షియల్ హిట్లు 30 కి పైగా బ్లాక్ బస్టర్ లు.. అయినా కేవలం సినిమా గురించి కలెక్షన్ల గురించి మాత్రమె మాట్లాడుకునే సాధారణ వ్యక్తి కాదు చిరు. సామాజిక సేవతో అభిమానులను ముందుండి నడిపించిన వ్యక్తి చిరంజీవి. అసలు తెలుగు ప్రేక్షకుడికి తమ షర్టు కాలర్ విలువ తెలిపిన ఘనుడు చిరు. అతనోదిలెళ్ళి పోయాక నెంబర్ 1 స్థానం 9ఏళ్ళు గడిచినా అలానే ఖాళీగా వుందంటే చిరంజీవి ఇమేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు. మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ స్టైల్ గా చిరు స్మైలిచ్చి ఒక స్టెప్పేస్తే చాలు మెగాభిమానులకు పండగే పండగ.

మేకప్ వేసుకున్న చిరు..
మళ్లీ 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి, తన వేలుపట్టి నడిపించిన వెండితెరకు తిరిగొచ్చారు. తన దైన స్టైల్లో మళ్లీ డ్యాన్సులతో, ఫైట్స్ తో, యాక్టింగ్ తో మరిపించాలని డిసైడయ్యారు. కత్తి లాంటి కథతో కత్తి కన్నా పదునైన ఆలోచనలతో ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని కష్టపడుతున్నారు చిరంజీవి. చిరు ఇమేజ్ ను వెండితెరమీద బ్యాలెన్స్ గా నిలపడం ఏ దర్శకుడికైనా కత్తి మీదసామే. అయితే ఆ ఛాలెంజ్ ను చాలా సంతోషంగా స్వీకరించి చిరంజీవి 150 వ సినిమాను టేకప్ చేసాడు వివివినాయక్. మాస్ లో హీరో ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే వినాయక్ , చిరంజీవితో ఆల్రెడీ ఠాగూర్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. దాని వల్లే ఇప్పుడు చిరంజీవి తన 150 వ సినిమా భాధ్యతను కూడా వినాయక్ భుజాలమీద పెట్టాడు. తనను ఎలా చూడ్డానికి తన అభిమానులు ఇష్టపడతారు అనే కోణంలో చిరు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. మళ్లీ తన ట్రేడ్ మార్క్ డ్యాన్సులతో మాస్ జనానికి పూనకం తెప్పించడానికి రకరకాల డ్యాన్సింగ్ మూమెంట్స్ తో ఫ్లోర్ మీద రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు చిరంజీవి. సో..ఆయన తలుచుకుంటే మళ్లీ డాన్సులతో అదరగొట్టడం ఎంతసేపూ...ఒక స్టెప్పేసినంత తేలిక.

దటీజ్ మెగాస్టార్..
రజినికాంత్ + కమల్ హాసన్ = చిరంజీవి' అని బాలచందర్ కీర్తించారు. 'హి ఇస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని అమితాబ్ తేల్చేశారు. వీక్ మ్యాగజైన్ చిరు రెమ్యునరేషన్ గురించి రాస్తూ బిగ్గర్ దేన్ బచ్చన్ అని కీర్తించింది. అలాంటి చిరంజీవి మళ్లీ ఇన్నాళ్ళకు వెండితెరమీద వెలిగిపోతుంటే.. మెగాభిమానుల కళ్లల్లో కోటి కాంతులు విరబూస్తాయి. దటీజ్ మెగాస్టార్.  

13:23 - July 23, 2016

తెలుగు సినిమాలలో గ్రాఫిక్స్ కు తెరలేపిన తొలి దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు, దేవుళ్లు, అరుంధతివంటి పలు హిట్ సినిమాలు ఆయన సృష్టించిన మాయాజాలాలే.. అరుంధతి సినిమాతో సూపర్ డూప్ హిట్ కొట్టి అనుష్కను రాత్రికి రాత్రే నంబర్ వన్ హీరోయిన్ గా నిలిపారు కోడి రామకృష్ణ.. అప్పటివరకూ పెద్దగా గుర్తింపులేని అనుష్కను 'అరుంధతి' సినిమాతో నంబర్ వన్ హీరోయిన్ గా..హీరోయిన్ ఓరియంటెడ్ హీరోయిన్ గా నిలిపటం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జులై 23 ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన చెప్పే విశేషాలను తెలుసుకుందాం..అసలే భక్తి భావం జాస్తిగా వున్న దర్శకుడు కోడి రామకృష్ణ ఏ దేవుడైనా ఎప్పుడూ కాళీగా వుండని నవ్వుతూ అన్నారు. మనం ఎంతో గొప్ప సినిమా తీససాం అనుకుంటాం గానీ ప్రేక్షకుడుకి నచ్చితేనే అది గొప్ప సినిమా అవుతుందన్నారు. ఇండ్రస్ట్రీలో తాను కృతజ్ఞతలు చెప్పుకునే ఒకే ఒక్కవ్యక్తి దాసరి నారాయణ రావుగారని తెలిపారు. ఆయన చెప్పే మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..కోడి రామకృష్ణ సక్సెస్ ఫుల్ టిప్స్ ఏమిటో తెలుసుకోండి..

Pages

Don't Miss

Subscribe to RSS - birthday