BJP

17:34 - August 19, 2017

చెన్నై : అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్‌సెల్వం వర్గాల విలీనం మరోసారి వాయిదా పడింది. విలీనం విషయంలో చర్చలు జరుగుతున్నాయని....ఒకటి రెండు రోజుల్లో విలీనంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని మాజీ సిఎం పన్నీర్‌ సెల్వం తెలిపారు. గత కొన్నిరోజులుగా విలీనంపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఇరు వర్గాలు శుక్రవారంనాడు జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. రెండు వర్గాల విలీనానికి మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఏర్పాట్లు చేశారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇరువర్గాల నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి పళని స్వామి జయలలిత మృతిపై విచారణకు ఆదేశించడం, వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ప్రకటనతో విలీనం దిశగా అడుగులు పడ్డాయి.

 

17:31 - August 19, 2017

ఢిల్లీ : జెడియు నితీష్‌ వర్గం మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన జాతీయ ఎక్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈమేరకు జెడియు తీర్మానం చేసింది. నితీష్‌ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై అసంతృప్తితో ఉన్న జెడియు సీనియర్‌ నేత శరద్‌యాదవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. శరద్‌ యాదవ్‌, ఆర్జేడి చీఫ్‌ లాలు యాదవ్‌లకు చెందిన అనుచరులు ఆందోళనకు దిగారు. నితీష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్‌లో బిజెపి-జెడియు 17 ఏళ్లపాటు ఎన్డీయేలోనే ఉన్నాయి. 2013లో జెడియు ఎన్డీయే నుంచి విడిపోయింది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి బిజెపిని ఓడించాయి. నితీష్‌ సిఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. లాలు తనయుడు డిప్యూటి సిఎం తేజస్వీయాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నితీష్‌కుమార్‌ సిఎం పదవికి రాజీనామా చేశారు. బిజెపితో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. నితీష్‌ బిజెపితో జతకట్టడాన్ని శరద్‌యాదవ్‌ తప్పుపడుతున్నారు.

 

18:45 - August 17, 2017

ఢిల్లీ : శ‌ర‌ద్ యాద‌వ్ నిర్వహిస్తున్న 'స‌భా విరాస‌త్ బ‌చావో స‌మ్మేళ‌న్‌'కు హాజ‌రైన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ .. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోది ప్రభుత్వం అన్ని సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులతో నింపేస్తోందని ధ్వజమెత్తారు. పోలీస్‌, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, మీడియా ఇలా అన్ని సంస్థల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ తమ వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటోందని మండిపడ్డారు. మరోవైపు మోది చెప్పేటివన్నీ అబద్ధాలేనని రాహుల్‌ తెలిపారు. మోదీ  'స్వచ్ఛ భార‌త్ కావాలంటున్నారు.. కానీ మాకు మాత్రం స‌చ్ భార‌త్‌' కావాల‌ని రాహుల్ ఎద్దేవా చేశారు.  మేకిన్‌ ఇండియా, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంతో మోది ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు ప్రతిపక్ష నేతలు సీతారాం ఏచూరి, అఖిలేష్‌ యాదవ్ తదితరులు హాజరయ్యారు. నితీష్‌కు తమ బలమేంటో చూపడానికే శరద్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

09:38 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రోజున యూపీ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఎగురవేయాలని..జాతీయ గీతం పాడాలని..సమర యోధులకు శ్రద్ధాంజలి ఘటించాలని సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమౌతోంది. ఇప్పటికే ఆయన చేసిన ఆదేశాలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలను రికార్డు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తమ దేశభక్తిని శంకించడం వల్లే ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని మదర్సా నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. తమ దేశభక్తిని రుజువు చేయడానికి ఎవరూ సర్టిఫికేట్ అవసరం లేదని, ఫొటోలు..వీడియోలు తీయడం రాజకీయమే తప్ప మరొకటి కాదన్నారు. 

09:33 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక చిన్నారులు మృతి చెందుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఆక్సిజన్ అందక 40 గంటల్లోనే 30 మంది చిన్నారులు మృత్యుముఖంలోకి వెళ్లిపోయారు. వీరంతా మెదడు వాపు వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. గోరఖ్ పూర్ లోని బీఆర్ డీ మెడికల్ ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో మొత్తం 54 మంది చిన్నారులున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆసుపత్రిని తనిఖీ చేసి వెళ్లారు. ఈసందర్భంగా ఆయనకు అక్కడి వారంతా సమస్యలు ఏకరవు పెట్టగా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం హామీనిచ్చినట్లు తెలుస్తోంది. 

20:46 - August 11, 2017

ఓ పక్క కాలా షూటింగ్ జరుగుతోంది.. మరోపక్క వాడి వేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. ఊహాగానాలు పెరుగుతున్నాయి.. వీటన్నిటిని చూస్తే తమిళనాట రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా? సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? రజనీ ఏ సంకేతాలిస్తున్నారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి? అదే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి కనిపించటం తమిళనాట కొత్త చర్చకు దారితీస్తోందా? ఇదే ఈ రోజు .దశాబ్దాల నుండి ఆ పీఠంపై సినీ తారలను, సినీరంగ ప్రముఖులను కూర్చోబెడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? ఆయన దారి రహదారి. ఇది సినిమాల్లోనేనా లేక పాలిటిక్స్ లో కూడానా. ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ ఉన్న దారిలోనే దూసుకొస్తారా? లేక కొత్త బాట వేసుకుంటారా? రజనీతో పాటు తెరపైకి వచ్చి వేడెక్కిస్తున్న కమల్ హసన్ దారెటు?రజనీ హడావుడి ఓ పక్క నడుస్తుండగానే కమల్ హాసన్ తెరపైకివచ్చారు.. కొద్ది నెలలుగా ట్వీట్లు స్టేట్ మెంట్లతో తమిళ రాజకీయరంగాన్ని వేడెక్కిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒకే పార్టీ కార్యక్రమానికి హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. తనకు గతంలోనే డీఎంకే నుంచి పిలుపు వచ్చిందంటున్న కమల్ ఇప్పుడు దాన్ని అంగీకరిస్తారా?సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని గాంధేయ మక్కల్‌ ఇయక్కం చెప్తోంది. రజనీ ఎంట్రీ ఇస్తే, కొత్త పార్టీతో తమిళ ప్రజల్లోకి ఆయన వస్తారా? ఇందుకు ఢిల్లీ వేదికగా కసరత్తులు సాగుతున్నాయా? సైలెంట్ గా న్యాయ నిపుణుల కమిటీలతో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు, విధి విధానాల రూపకల్ప నలో బిజీగా ఉన్నారా?

20:04 - August 11, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు. మొత్తం వెంటలేటర్ పై 54మంది చిన్నారులుంటే అందులో 30 మంది చిన్నారలు మృతి చెందడం కలంకలం రేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితమే ఆసుపత్రి సందర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:35 - August 11, 2017

ఢిల్లీ : తలైవా పొలిటికల్‌ ఎంట్రీకి ముహూర్తం కుదిరిందా..? తమిళ రాజకీయాల్లో సూపర్‌స్టార్ చరిష్మా ఏ మేరకు ఉండబోతోంది..? అనిశ్చితిలో ఉన్న పాలిటిక్స్‌ను రజనీకాంత్‌ రాక ఉత్తేజాన్ని కలిగిస్తుందంటున్నారు సూపర్‌స్టార్‌ అభిమానులు. అక్టోబర్‌లోనే రజనీకాంత్‌ రాకీయ అరంగేట్రంఅంటూ సాగుతున్న ప్రచారంపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. జయలలిత మృతి, వయోభారంతో కరుణానిధి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మరోసారి తమిళనాట రాజకీయ అనిశ్ఛితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో తలైవా పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీకి కచ్చితంగా స్పేస్‌ ఉందని సూపర్‌స్టార్‌ అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. అధికార అన్నాడిఎంకెలో మూడు ముక్కలాట నడుస్తోంది.

ఈ రాజకీయ శూన్యతే రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి నాంది పలికింది. అంతే.. హుటాహుటిన అభిమానులతో సమావేశం.. యుద్ధానికి సిద్ధంకండి అంటూ పిలుపునివ్వటం జరిగిపోయింది. తర్వాత అంతా రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తులంటూ రజనీ సన్నిహితులు, గురువులు హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాకపోతే ఎపుడూ కాదు అంటున్నారు రజనీ అభిమానులు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడంటూ వస్తున్న వార్తలు అభిమానుల గుండెల్లో షికార్లు చేస్తున్నాయి. రజనీ సెంటర్‌పాయింట్‌గా జరుగుతున్న కొత్తరాజకీయాల చర్చ.. తమిళనాట ద్రవిడ పార్టీలకు దడపుట్టిస్తోంది. ఈ నెలలోనే కాలా చిత్రం పూర్తివుతోంది. ఆ తర్వాత అక్టోబర్‌లో పార్టీ ఆవిర్భవానికి రజనీ ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం గుప్పుమంటోంది. దీంతో అభిమానులు, ద్రవిడ పార్టీల నేతల దృష్టంతా అక్టోబర్ నెలపైనే పడింది.

నిన్నటిదాకా రజనీకాంత్‌ జాతీయపార్టి పెట్టడానికే సిద్ధం అవుతున్నారని, లేదా బీజేపీకే మద్దతు ఇస్తారని..ఆయన వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ఉందని ఇలా రకరకాలుగా సాగిన ప్రచారం ప్రస్తుతం చప్పబడింది. దీనికీ ఓ కారణం ఉంది. దాదాపు 4దశాబ్దాల కిందటనే జాతీయ పార్టీలకు గుడ్ బై చెప్పిన తమిళ ఓటర్లు.. ద్రవిడ పార్టీలనే ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరంగ్రేట్రంతోనే రాజకీయంగా స్థిరత్వం సాధించాలంటే.. కచ్చితంగా ప్రాంతీయపార్టీపెట్టడమే మంచిదని రజనీ సన్నిహితులు సలహా ఇస్తున్నారు. దీంతో సూపర్‌స్టార్‌ ప్రాంతీయపార్టీకే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అయితే గత నలబైఏళ్లుగా ద్రవిడ అజెండాతో రాజకీయాలు నెరపుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, ఇతర చిన్నాచితకా ప్రాంతీయపార్టీలు రాష్ట్రంలోని దాదాపు 70శాతం ఓటుబ్యాంకును కలిగిఉన్నాయి. ఇక మిగిలిన 30శాతం ఓటర్లలో 1, 2శాతం జాతీయపార్టీలకు పోను.. మిగిలిన ఓటర్లపైనై తలైవా పెట్టబోయే పార్టీ దృష్టిపెట్టాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం చీలికలు పీలికలుగా ఉన్న అన్నాడీఎంకే నుంచి రజనీ పార్టీ వైపు భారీగా ఓటర్లు స్వింగ్‌ అవుతారని ఆయన సన్నిహితులు ఊహిస్తున్నారు.

ఆదిశగానే పావులు కదుపుతూ .. ద్రవిడ నినాదంతోనే కొత్తపార్టీని పెట్టడానికి రజనీకి సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆర్ఎస్ఎస్, బీజేపీలతో తలైవా దూరంగా ఉంటున్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉండటంతో.. పార్టీని ప్రజల్లో ఎస్టాబ్లిష్‌చేయడానికి ఆమాత్రం టైం అవసరమేనని తలైవా వ్యూహకర్తలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో పొలిటికల్‌ ఎంట్రీకి ముహూర్తం ఖరారు చేసుకున్న రజనీకాంత్‌ను దేవుడు ఇంకా ఏమని ఆదేశిస్తాడో వేచి చూడాలి అంటున్నారు అభిమానులు.  

06:51 - August 10, 2017

ఢిల్లీ : క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరిగింది. దేశ స్వాతంత్ర్యంలో క్విట్‌ ఇండియా ఉద్యమం నిర్వహించిన పాత్రను అధికార విపక్షాలు నెమరేసుకున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, మతతత్వ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. 1942లో జరిగిన ఉద్యమం దేశ స్వాతంత్ర పోరాటాల్లో అతి పెద్దదని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. దేశ స్వాతంత్రం కోసం క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ `కరో యా మరో' నినాదమిచ్చారని...దీంతో చిన్నా...పెద్దా అంతా ఏకమయ్యారని తెలిపారు. స్వాత్రంత్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో నాయకులు జైలు జీవితం గడిపారని...ఎన్నో బలిదానాలు జరిగాయని చెప్పారు. ఆనాటి జాతీయ నేతలను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి అవినీతి అడ్డుకట్టగా మారిందని మోది అభిప్రాయపడ్డారు.

లోక్ సభలో..
లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పరోక్షంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ధ్వజమెత్తారు. దేశంలో చీకటి శక్తులు మళ్లీ పైకి లేస్తున్నాయని మండిపడ్డారు. లౌకిక, ఉదారవాద, స్వేచ్ఛాయుత ఆలోచనాధారకు ముప్పు వాటిల్లుతోందని... ప్రస్తుతం దేశంలో భయాందోళన వాతావరణం నెలకొందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పరిరక్షించాలంటే క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా చట్టవ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని కొన్ని గ్రూపులు వ్యతిరేకించాయంటూ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను వేలెత్తిచూపారు.

ఏచూరి గేయం..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, మతతత్వ పరిస్తితులపై రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు బ్రిటిష్‌వాళ్లను వెళ్లగొట్టడానికి క్విట్‌ ఇండియా నినాదమిస్తే...ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక విధానాలను ఇండియా నుంచి పారదోలాలన్నారు. పేదలు, ధనికుల మధ్య అంతరం రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. కొన్ని శక్తులు దేశంలో మతపరంగా ప్రజలను రెండుగా విడదీయాలని చూస్తున్నాయని... దేశాన్ని మరోసారి ఇండియా, పాకిస్తాన్‌లుగా విడగొట్టవద్దని ఏచూరి హెచ్చరించారు. ఈ సందర్భంగా మతసామరస్యంపై ఏచూరి ఓ గేయాన్ని వినిపించారు. బ్రిటిష్‌ వాళ్లకు వ్యతిరేకంగా 1857లో జరిగిన ఉద్యమంలో అగ్రవర్ణాలు దళితులు, మైనారీటీలు అన్న తేడా లేకుండా దేశం కోసం అందరూ సమైక్యంగా పోరాడారని ఏచూరి గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో క్విట్‌ ఇండియా నిర్వహించిన భూమికను ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు మరోసారి గుర్తు చేసుకున్నారు.

14:54 - August 9, 2017

ఢిల్లీ : క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా..లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్యమంపై ప్రస్తావించారు. జీవింతంలో మంచి పరిణామాలను స్మరించుకోలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో జైలు జీవితం గడిపారన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో బలిదానాలు చేసినట్లు చెప్పారు. గాంధీజీ సందేశంతో అందరూ ఏకమయ్యారని.. ఆయన శాంతియుత ఉద్యమంతోనే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకొచ్చారు. చరిత్రాత్మక ఘటనలను యువత తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - BJP