bjp government

15:41 - August 7, 2017

హైదరాబాద్ : సీబీఐ కేసుల నుంచి బయటపడటానికే సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే  మోదీకాళ్లపై పడ్డారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ అంశంలో తెగ హడావిడి చేసిన కేసీఆర్‌.. సాగునీటి ప్రాజెక్టులకు నష్టం కలుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిడ్డారు. జీఎస్టీని గుడ్డిగా సమర్థించి రాష్ట్రానికి చేటు తెచ్చారని పేర్కొన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నకేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం కలిగించారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కటే కోర్టుకు వెళ్లితే ప్రయోజనం రాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. 

 

13:21 - August 7, 2017
12:41 - August 5, 2017

హైదరాబాద్‌ :నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు.. నిన్న గుజరాత్‌లో రాహుల్‌ గాంధీపై రాళ్లదాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు.. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు... కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్‌ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

21:47 - August 1, 2017

ఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి వంటగ్యాస్‌ ఎల్‌పిజిపై సబ్సిడీ ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజ్యసభ దద్దరిల్లింది. కాంగ్రెస్‌, ఎస్పీ, వామపక్షాలు, బిఎస్పీ, టిఎంసి ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సబ్సిడీని వదులుకోవడానికి ప్రజలే ముందుకు వస్తున్నారని, పేదలకు మాత్రం సబ్సిడీ కొనసాగించాల్సిందేనని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ప్రపంచంలో ఓ వైపు చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. జులై 1 నుంచి ప్రతినెల 4 రూపాయలు పెంచుతూ 2018 మార్చి నాటికి ఎల్‌పిజిపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

20:46 - August 1, 2017

'గ్యాస్‌ బండ ఇక మరింత భారం కానుంది. సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌ సిలిండర్ల ధర ఇక నుంచి ప్రతి నెలా పెరగనుంది. నెలకు రూ.4 చొప్పున పెంచాలంటూ కేంద్రం ..ఆయిల్‌ కంపెనీలను.. ఆదేశించింది. ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది'. వంట గ్యాస్‌ సిలిండర్ ధర పెంపు నిర్ణయం సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఏపీఎస్ వో ప్రతినిధి రేఖ, ఐద్వా రమాదేవి, టీ.బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. వంట గ్యాస్‌ సిలిండర్ ధర పెంపుతో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రజలపై అధిక భారం పడుతుందని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:25 - August 1, 2017

గ్యాస్‌ బండ ఇక మరింత భారం కానుంది. సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌ సిలిండర్ల ధర ఇక నుంచి ప్రతి నెలా పెరగనుంది. నెలకు రూ.4 చొప్పున పెంచాలంటూ కేంద్రం ..ఆయిల్‌ కంపెనీలను.. ఆదేశించింది. ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 
గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేతకు కేంద్రం నిర్ణయం
గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేతకు ... కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను నెలకు రూ.2 చొప్పున పెంచాలని ఆయిల్‌ కంపెనీలను ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. ఆ ప్రకారం గతేడాది జూలై నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రతినెలా 2 రూపాయలు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు దానిని ప్రభుత్వం 4 రూపాయలకు పెంచింది. 
సబ్సిడీ తొలగించేందుకే 
సిలిండర్‌పై.. సబ్సిడీని పూర్తిగా తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని లోక్‌సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్‌ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 చొప్పున పెంపు కొనసాగుతుందని ప్రధాన్‌ స్పష్టం చేశారు. అలాగే ఐదు కిలోల సబ్సిడీ సిలిండర్ల  ధర పెంపును ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయిస్తాయన్నారు. 
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు
అయితే కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 18.11 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులపై ఈ భారం పడనుంది. 

11:27 - July 27, 2017

బీహార్ సీఎం రాజీనామా చేయడం... 24 గంటలు గడవక ముందే మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు అన్న సామెత బీహార్ రాజకీయాలకు సరిపోతోంది. నిన్నమొన్నటివరకు ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకున్న జేడీయూ-ఆర్జేడీలు పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయాయి. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ తమ శత్రుకూటమి రాజ్యమేలుతున్న బీహార్ లో భాజపాను అధికార పార్టీకి మిత్ర పక్షంగా మోడీ మార్చుకున్నారు.

మచ్చలేని సీఎం గా..

బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సుదీర్ఘకాలం కొనసాగిన సమయంలో కానీ ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఆయనపై రాలేదు. రాజకీయ విరోధులు సైతం ఈ అంశంలో వేలెత్తిచూపే ధైర్యం చేయలేనంతటి నిజాయితీ ఆయన సొంతం. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలను మార్చే స్వభావం ఉన్నా నీతి, నిజాయితీలలో మాత్రం చెక్కుచెదరని వ్యక్తిత్వం ఆయనది. తాజాగా మహా కూటమిలో ప్రధాన భాగస్వామిపై వచ్చిన అవినీతి మరకల విషయంలో రాజీపడలేక తన పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధమయ్యారు.

లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వి పై ఉన్న అవినీతి ఆరోపణలు, వాటిమీద సాగుతున్న విచారణ కలగలిసి... ఇప్పుడు భాజపాకు పంట పండుతోంది. ఇంకా మూడేళ్లకు పైగా ఉన్న ప్రభుత్వం కాలంలో.. ఏనాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయో చూడాల్సిందే..

బీహార్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రాజీనామ..

బీహార్‌ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే రాజీనామా చేశానని జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్జేడీ మేజర్‌ భాగస్వామిగా ఉన్న మహాకూటమిలో పనిచేయలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై తేజస్వి యాదవ్‌ రాజీనామాను తాను కోరలేదని, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాత్రమే తాను యాదవులను(లాలూ, తేజస్వి) కోరినట్టు చెప్పారు. అందుకు కూడా వారు ఒప్పుకోకపోవడంతో గత్యంతరం లేక రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. సరిగ్గా ఈ సమయంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భాజపా రంగ ప్రవేశం చేసింది. నితీశ్ పార్టీకి భాజపా మద్దతు ఇస్తేచాలు.. అక్కడ ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉంది. కమలనాధులు.. రంగంలోకి దిగి, బయటినుంచి మద్దతు ఇస్తూ నితీశ్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం బహుశా లాలూ ప్రసాద్ కు, అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మింగుడు పడేది కాకపోవచ్చు.

సంక్షోభానికి బిజెపినే కారణామా?

గత ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో జేడీయూ- ఆర్జేడీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత సంక్షోభానికి బీజేపీనే కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీతో జోడీ కట్టి నితీష్ ఈ దఫా కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 80, జేడీయూకి 71, బీజేపీకి 53 స్థానాలున్నాయి. మరోవైపు బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీకి కాదని జేడీయూ అవకాశం ఎలా ఇస్తారని ఆర్డీజే నేతలు అర్ధరాత్రి గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఏది ఏమైనా బీహార్ రాజకీయాలు అనూహ్య మలుపులు ఏ దారి పట్టనున్నాయో వేచి చూడాల్సిందే... మరో వైపు బిజెపి మద్దతుతో ఆరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

12:57 - July 21, 2017

మనుషులా ? మృగాలా ? దేశంలో దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ఘటన వింటుంటే..చూస్తుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు..ఎందుకిలా మారిపోతున్నారు..ఎందుకిలా చేస్తున్నారు..మనిషిని చంపే హక్కు వీరికి ఎవరిచ్చారు ? చట్టాన్ని చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు ?

దేశంలో ఎక్కడో ఒక చోట దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. కక్షలు..కార్పణ్యాలు..క్షణికావేశంలో హత్యలకు తెగబడుతున్నారు. కర్రలు..మారణాయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల ఈ ఘటనలు పెచ్చరిల్లుతుండడం ఆందోళన కలిగిస్తోంది మనుషులం అని మర్చిపోతున్నారా ? లేక మానవత్వం చచ్చి మృగాలుగా మారిపోతున్నారా ? మూగజీవాలు..మనుషుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నని, ప్రశ్నించే తత్వాన్ని నిలువరించడానికి హత్యల్ని ఆయుధం చేసుకున్న కొందరు మూకలు దేశమంతటా ఒక భీతావహ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గొడ్డు మాంసం తింటే ఖబడ్దార్‌ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏకంగా హత్యలు చేయడంలో వెనుకాడడం లేదు. ఏది తినాలి ? ఏది తినకూడదు అనే తీర్పు ఎవరిచ్చారు ? తమ మాట కాదని తింటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. గొడ్డు మాంసం తినే కోట్లాదిమంది దళిత, మైనారిటీ వర్గాల వాళ్ళందరినీ చంపేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాలనలో గడచిన రెండునెలల కాలంలో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ఇటీవలే వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ అత్యుత్సాహం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాయక యువకులను టార్గెట్ చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. నైతికత పేరిట ఓ అబ్బాయి..అమ్మాయిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజ్ గంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన దిగ్ర్భాంతి కలిగించింది. ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి చేశారు. పట్టపగలే అతనిని దారుణంగా నరికి చంపారు. ఏకంగా 27సార్లు ఆ వ్యక్తిని కర్కశంగా నరికేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

ఇలాంటి ఎన్నో ఘటనలు భారతదేశంలో చోటు చేసుకుంటున్నాయి. గో రక్షక్ పేరిట మారణకాండను సృష్టిస్తున్నారు. గో రక్షక్ పేరిట జరుగుతున్న దాడుల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలస్యంగా స్పందించారు. ఇలాంటి దాడులు సహించమని చెప్పుకొచ్చారు. కానీ దాడులు..హత్యలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. అక్కడి పాలకులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇలాంటి దాడులు..లౌకికవాదులు..అభ్యుదయ వాదులు..ఖండించాల్సినవసరం ఉంది...

20:33 - June 29, 2017

 

ఓ యువకుడు రైళ్లో వెళ్తున్నాడు.. సీటు దగ్గర గొడవొచ్చింది.  సాధారణంగా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ హత్య జరిగింది. కారణం తెలుసా.. బీఫ్ తింటాడని.. గొడ్డు మాంసం తింటాడని చంపేశారు. ఎందుకీ ఉన్మాదం.. ఎందుకీ అరాచకం..ఏ మత విలువలు ఈ హింసను ప్రోత్సహిస్తున్నాయి. గోవుని కాపాడి మనిషిని చంపి ఏం సాధిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో కాస్త ఆలోచన ఉన్నవారైనా నాట్ ఇన్ మై నేమ్ అంటున్నారు. ఎవర్ని చంపుతారో.. ఎవరిపై దాడులకు దిగుతారో.. కానీ, దానికి నా సపోర్ట్ లేదు.. నేను హిందువును కావచ్చు.. బట్ … నాట్ ఇన్ మై నేమ్.. అంటూ దేశమంతా ఒక్కటై నినదిస్తోంది. నిజమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది. అసహనం.. పక్కవాడి మతాన్ని భరించలేనంత అసహనం..పక్కవాడి తిండిని ఒప్పుకోలేనంత అసహనం..

పక్కవాడి నమ్మకాల్ని చూస్తూ ఊరుకోలేనంత అసహనం..  మనం అనుకున్నదే కరెక్ట్.. మన విలువలే నిజం.. మన అలవాట్లే సరైనవి. ఈ భావజాలాన్ని ఏమంటారు? ఇది దేశాన్ని ఏ తీరాలకు తీసుకెళుతుంది.. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

19:45 - June 29, 2017

హైదరాబాద్ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోది స్పందించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలను సహించేది లేదని హెచ్చరించారు. మహాత్మాగాంధీ పుట్టిన ఈ గడ్డపై హింసకు తావు లేదన్నారు. ప్రజలను చంపే హక్కు ఎవరికీ లేదని, హింస సమస్యకు పరిష్కారం కాదని మోది స్పష్టం చేశారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న మోది సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆశ్రమం ఆవరణలో మొక్కను నాటారు. చరఖా తిప్పి నూలు వడికారు. బాపూజీ స్వాతంత్ర్యం కన్నా స్వచ్ఛతకే ప్రాధాన్యతనిచ్చేవారని మోది గుర్తు చేశారు. గాంధీ ఆదర్శంగానే స్వచ్ఛభారత్‌ను చేపట్టామన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - bjp government