BJP Party

14:55 - February 22, 2018

హైదరాబాద్ : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్‌కు రాజకీయాలతో పనేంటని అసద్‌ ప్రశ్నించారు. అస్సాంలో ముస్లింల జనాభా చాలా వేగంగా వృద్ధి చెందుతుండడం... ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పటిష్టమవుతుండటంపై బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఓ పథకం ప్రకారమే వలసలు పెరిగిపోతున్నాయని, ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోస్‌ పాక్‌ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన అసద్‌... రాజకీయ పార్టీలతో ఆర్మీకి ఏం పని.. ఇందులో బిపిన్ జోక్యం చేసుకోవడం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లోబడి ఆర్మీ పనిచేయాలంటూ అసద్ ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఆర్మీ స్పందించింది. రావత్ ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయలేదని తెలిపింది. 

16:02 - January 17, 2018

ఢిల్లీ : హజ్‌ యాత్రీకులకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సిపిఎం తప్పు పట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేంద్రం నిరంకుశ నిర్ణయం తీసుకున్నదని విమర్శించింది. హజ్‌ యాత్రీకులకు ఇచ్చే సబ్సిడీని పదేళ్ల పాటు కొనసాగించాలని 2012లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు విరుద్ధంగా సబ్సిడీని ఎత్తివేస్తూ కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని సిపిఎం మండిపడింది. లౌకిక రాజ్యంలో మతపరమైన సబ్సిడీలకు సిద్ధాంతపరంగా తాము వ్యతిరేకమని పేర్కొంది. ప్రభుత్వాలు మతపరమైన సబ్సీడీలకు ప్రోత్సాహం ఇవ్వకూడదని సీపీఎంసూచించింది.

 

22:15 - December 22, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోది, బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిజెపి ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పలు అంశాలపై చర్చించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2జీ కేసులో తీర్పు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై సిడబ్లుసి చర్చించింది.

సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ బిజెపిని, ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. నోట్లరద్దు, గబ్బర్‌సింగ్‌ టాక్స్‌... బిజెపి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఒక్కొక్కటిగా రుజువు అవుతోందని మండిపడ్డారు.  2జీ స్పెక్ట్రం కేసులో వచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ....నిజం ఏమిటో దేశ ప్రజలందరూ తెలిసుకున్నారని రాహుల్ అన్నారు.
బైట్‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

మోది గుజరాత్‌ అభివృద్ధి ఓ బూటకమని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని రాహుల్‌ తెలిపారు. రఫేల్ ఒప్పందం, అమిత్‌షా కొడుకు సంపాదనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్‌ నిలదీశారు. జయ్‌ షా 50 వేల పెట్టుబడి పెడితే అది మూడు నెలల్లో 80 కోట్లయిందని, అదెలా సాధ్యమని అడిగితే జవాబుండదని పేర్కొన్నారు. ఓ పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చేందుకే రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్‌ విమర్శించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు.

నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 వేలు జమ చేస్తామని మోదీ ప్రజలను నమ్మంచి...వంచించారని రాహుల్‌ అన్నారు. అసలు బీజేపీ ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు. 

 

18:38 - December 4, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌వి వారసత్వ రాజకీయాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ఆత్మబలిదానాలు చేసిందని గుర్తు చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడమేంటని KVP ప్రశ్నించారు. 

17:25 - November 12, 2017

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీ బీజేపీకి షాక్ తగిలింది. చిత్రకూట్‌ నియోజకవర్గానికి జరిగిన బైపోల్‌లో కాంగ్రెస్‌ గెలుపొందింది. బీజేపీపై కాంగ్రెస్‌ అభ్యర్థి నిలాన్షు చతుర్వేది 14వేల 333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిత్రకూట్‌ సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌ కుమార్‌ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 9న ఎలక్షన్ జరగగా... ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి చతుర్వేది... బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ త్రిపాఠిని ఓడించారు. 

 

07:41 - October 28, 2017

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలకు మైక్‌ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. తెలంగాణ టీడీపీ నేతల పంచాయితీ ఏపీ రాజధాని అమరావతికి చేరింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరోతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్‌ నేతలతో ఇవాళ విజయవాడలో భేటీ కానున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజ మోహన్ రావు (టీఆర్ఎస్), రాజరాం యాదవ్ (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:35 - October 28, 2017

హైదరాబాద్ : రైతు సమస్యలపై కాంగ్రెస్‌ నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాసనసభ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అరెస్టులకు దారితీసింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయదేరిన పార్టీ నేతలు, కార్యకర్తలను నాంపల్లి చౌరాస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గాంధీభవన్‌ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.

మరోవైపు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అసెంబ్లీ గేటు ముందుకు దూసుకెళ్లారు. అసెంబ్లీ ఆవరణలోకి చొచ్చకుపోయేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అసెంబ్లీ సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక గ్రూపును పోలీసులు అరెస్టు చేసిన వెంటనే మరో బృందం రోడ్డుపైకి రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. శాసనసభ వాయిదా పడిన తర్వాత సభ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించడంతో పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. అరెస్టు చేసిన నేతలను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. కేసులు నమోదు చేసిన తర్వాత పంపించేశారు. మొత్తంమీద చలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారా రైతు సమస్యలను ప్రభుత్వంతోపాటు, ప్రజల దృష్టికి తేగలిగామన్న భావంతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

06:33 - October 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రతిపక్షాలకు మైక్‌ ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరిగారు. రైతుల సమస్యపై చర్చించేందుకు పాలకులు సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్‌ పాలన నాటి నిజాం పాలనను మించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే గందరగోళంగా కొనసాగాయి. సభలో రైతుల సమస్యలపై చర్చించాలని విపక్షాలు వాయిదా తీర్మానాలిచ్చాయి. అయితే విపక్ష వాయిదా తీర్మానాలను పట్టించుకోని డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కనీసం వాయిదా తీర్మానాలపై ప్రొటెస్ట్‌ చేసేందుకు కూడా అనుమతివ్వలేదని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. సభను తమ ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటామన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు జానారెడ్డి. ఇక డిప్యూటీ స్పీకర్‌ తీరు అభ్యంతరకరంగా ఉందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాలు, రైతుల సమస్యలను పట్టించుకోని సర్కార్‌... ఎన్ని రోజలు సభ జరిగితే ఏంటని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

తాను చెప్పిందే వినాలన్న ధోరణిలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ. రైతులపక్షాన నిరసనలు చేస్తే ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. మరోవైపు డ్రగ్స్‌ మాఫియాపై తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండానే వాయిదా వేశారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులే పబ్బులు నిర్వహిస్తూ... డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు రేవంత్‌.

సభ జరిగిన తీరు సరిగా లేదన్నారు బీజేపీ నేతలు. ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే సభను ఎలా కొనసాగిస్తారని... ప్రజాస్వామ్య పద్దతిలో సభ నిర్వహించాలన్నారు కిషన్‌రెడ్డి. మొత్తానికి తొలిరోజు అసెంబ్లీ సమావేశాల తీరును ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిచాయి. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో సభ నడిపినా, నడపకపోయినా ఒక్కటేనని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

10:09 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి రేపిన వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి మారతారంటూ వస్తున్న వార్తలపై దుమారం చెలరేగింది. ఆ వార్తలను ఆయన ఖండించినా.. పార్టీ సీనియర్లు శాంతించలేదు. రేవంత్ సరైన స్పష్టత ఇవ్వలేదంటూ రేవంత్‌ తీరును తప్పుపట్టారు. టిడిపిలో జరుగుతున్న పరిణామాలపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషించారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఈ సమావేశానికి ఎవరూ హాజరు కావొద్దని రమణ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, పార్టీ సీనియర్లకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పాటు బీజేపీతో కలిసి ఓ ప్రైవేటు హోటల్లో పోటీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రంగ ప్రవేశం చేసి టిడిఎల్పీ సమావేశం రద్దు చేసే విధంగా పావులు కదిపారు. గొల్కోండ హోటల్ లో బీజేపీ నేతలతో జరిగే భేటీ కంటే ముందు ఎల్.రమణతో సండ్ర భేటీ కానున్నారు. బీఏసీలో సమావేశంపై వీరు చర్చించనున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

06:29 - October 26, 2017

హైదరాబాద్ : శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హీటెక్కిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజాసమస్యలపై ఇరుపక్షాలు ఏమేరకు చర్చ జరుపుతారో తెలియదుకానీ.... పోటీపడి మరీ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇరు వర్గాల వాలకం చూస్తోంటే వింటర్‌ సెషన్‌.. సమ్మర్‌ను మించిపోయేయలా ఉంటుందని చెప్పకనే చెబుతోంది.

తెలంగాణ సర్కార్‌ సకాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం కొత్తగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు అధికార ప్రక్రియ ప్రారంభించింది. ఈ అంశమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. దీనికి తోడు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఇంకేముంది.. ఎవరికి వారే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే అధికారపార్టీయే ఒక అడుగు ముందువరుసలో ఉంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోలేదు. సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

కాంగ్రెస్‌ పిలుపు అధికారపార్టీలో సెగలు రేపుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలంతా ఛలో అసెంబ్లీకి రైతులు రావొద్దని మంత్రులు చెబుతున్నారు. తాము చరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తోంటే... ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఇలాంటి పిలుపులు ఇస్తున్నాయని మండిపడ్డారు.

ఇక వామపక్షాలు కూడా టీ-మాస్‌ పేరుతో తీసుకున్న సామాజిక అంశాలపై...ఈ సెషన్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. గుత్తికోయలపై దాడి, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, గొర్రెలు, మేకల పంపిణీలో అవకతవకలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టుల తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీపీఎం సిద్ధమైంది. బీజేపీ కూడా సర్కార్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం రచిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - BJP Party