books

13:00 - October 14, 2017

 

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయం దాదాపు 3,100 చదరపు గజాల స్థలంలో ఉంది. 1898లో ప్రారంభమైన కందుకూరి వీరేశలింగం పంతులు గ్రంథాలయం, వాసురయ గ్రంథాలయం కలిపి 1979లో ఇది ఏర్పడింది. లక్షా 30 వేల పుస్తకాలున్న ఈ గ్రంథాలయంలో.. 30 వేల పుస్తకాలు చాలా అరుదైనవి. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడా లభించని అపురూపమైన పుస్తకాలు గౌతమీ గ్రంథాలయంలో ఉన్నాయి. వాల్మీకి, పోతన, తిక్కనతో పాటు మరెంతో మంది కవులు రాసిన 411 తాళపత్ర గ్రంథాలు.. వెండి, రాగిప్లేట్ల గ్రంథాలు.. 1771 నాటి బ్రిటానికా ఎన్‌ సైక్లోపీడియా మొదటి ప్రతులు.. 1900కి ముందు ముద్రితమైన 15 వందల పుస్తకాలతో పాటు, 1923కి ముందు ప్రచురితమైన 8,115 పుస్తకాలున్నాయి. 100 వాల్యూమ్‌ల గాంధీ చేతివ్రాత ప్రతులు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు చేతి వ్రాత ప్రతులు, సంస్కృతంలో ఉన్న హోలీ బైబిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విలువైన పుస్తకాలకు గౌతమి గ్రంథాలయం చిరునామా. ప్రతీ రోజూ వెయ్యి మందికి పైగా ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతారంటే.. ఇక్కడ ఉన్న విలువైన పుస్తకాలే కారణం.

స్కాన్‌ చేసి సాఫ్ట్ కాపీ రూపం
గౌతమీ గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ స్కాన్‌ చేసి సాఫ్ట్ కాపీ రూపంలో తయారు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన స్కానర్‌ను కొనుగోలు చేస్తున్నారు. వీటన్నింటినీ భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. తాళపత్ర గ్రంధాల సమాచారం అందించేందుకు చల్లా శ్రీ రామచంద్రమూర్తి ఒక పుస్తకాన్నే రాశారంటే.. గౌతమి గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఎంత విలువైనవో ఊహించొచ్చు. వాల్మీకీ మహర్షి రాసిన శ్రీమద్రామాయణము, బాలరామాయణము, కవి భాస్కరాదులు రాసిన రామాయణము సప్తకాండలు, తిక్కన భారతము, కవి పోతన రాసిన భాగవతం, కాళిదాసు రాసిన కుమార సంభవము, నన్నయ, ఎర్రన రాసిన భారతము ఇలా అనేక మంది కవులు రాసిన తాళపత్ర గ్రంథాలు గౌతమి గ్రంథాలయంలో ఉన్నాయి.

గుర్తింపు దక్కడం లేదు...
అరుదైన పుస్తక సంపదకు నెలవైన ఈ గ్రంథాలయానికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే గౌతమి గ్రంథాలయాన్ని జాతీయ గ్రంథాలయంగా గుర్తించాలని డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లేదు. ఆ అర్హత కేవలం గౌతమి గ్రంథాలయానికే ఉందని పలువురు ప్రముఖులు చెప్పారు. ఇన్నేళ్ల తరువాతయినా పాలకులు గౌతమి గ్రంథాలయంపై ప్రేమ చూపిస్తున్నారు. ఎలాంటి నిధులు ఇవ్వకుండానే ఇంతకాలం గడిపేసిన పాలకులు.. ఇప్పటికైనా విలువైన పుస్తక సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

14:29 - October 8, 2017
13:16 - April 8, 2017

సంగారెడ్డి : జిల్లా గ్రంథాలయం సరికొత్త హంగుల్ని సంతరించుకుంటోంది.. కలెక్టర్‌ చొరవతో సమస్యలనుంచి బయటపడుతోంది.. అత్యాధునిక గదులు, అన్నిరంగాలకు సంబంధించిన పుస్తకాలతో ఇక్కడ అడుగుపెట్టగానే కొత్త ప్రపంచంలోకి వెళ్లామన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ లైబ్రరీ ప్రారంభం కానుంది. ఒకప్పుడు సంగారెడ్డి గ్రంథాలయం అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు.. తెలిసినవారు పుస్తకాలు చదువుకునేందుకు ఇక్కడకు వచ్చినా కనీస సౌకర్యాలులేక వెనుదిరిగేవారు.. ఇదంతా కలెక్టర్‌ మాణిక్‌ కణ్ణణ్ రాకముందు పరిస్థితి.. కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక గ్రంథాలయం రూపురేఖలే మారిపోయాయి. 1965లో ఏర్పాటైన ఈ పుస్తకాలయం మెదక్‌ జిల్లా వాసులకు ఎన్నో పుస్తకాలు చదువుకునే అవకాశం కల్పించింది. ఎంతోమందిని పుస్తకాలద్వారా చైతన్యంచేసిన ఈ గ్రంథాలయాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం కూర్చునేందుకు కుర్చీలుకూడాలేని దీనస్థితికి చేరింది. పుస్తకాలుకూడా అంతంతమాత్రంగా రావడంతో లైబ్రరీకి జనాల రాక తగ్గింది. వచ్చినవారు వసతులలేమితో అక్కడ ప్రశాంతంగా చదువుకోలేకపోయారు.

సంగారెడ్డి కలెక్టర్..
సంగారెడ్డి కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కణ్ణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఈ లైబ్రరీ పరిస్థితి చూశారు.. గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.. పుస్తకాలయం రూపురేఖలే మార్చేలా చర్యలు చేపట్టారు.. అన్నివర్గాల ప్రజలు చదువుకునే పుస్తకాలు ఇక్కడ లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. దిన, వారపత్రికలు, మామూలు పుస్తకాలతోపాటు.. పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్‌నుకూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ లైబ్రరీల ఆలోచనకూడా చేస్తున్నారు. చిన్నారులకు డిజిటల్‌ లైబ్రరీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లైబ్రరీలో సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టిపెట్టారు.. ఇక్కడికివచ్చే పుస్తకప్రియులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఫ్యాన్లు, లైట్లను బిగించారు. మంచి గాలి, వెళుతురు వచ్చేలా రీడింగ్‌ హాల్‌, రిఫరెన్స్ హాల్‌ సిద్ధం చేస్తున్నారు. కేవలం పుస్తకాలేకాకుండా లైబ్రరీ ఆవరణనుకూడా మార్చేస్తున్నారు. చుట్టుపక్కల పచ్చని మొక్కలతో కళకళలాడుతూ కనిపించేలా చర్యలు చేపట్టారు. అధికారుల చొరవతో లైబ్రరీకి కొత్త రూపురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలలేమి నుండి బయటపడ్డ సంగారెడ్డి గ్రంథాలయం త్వరలో ప్రారంభం కాబోతోంది. యువతీ యువకులు, వృద్ధులు, విద్యార్థులు అందరూ చదువుకునే బుక్స్‌ పుస్తకప్రియుల్ని అలరించబోతున్నాయి.

13:12 - March 19, 2017

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగి పొందేవేళ..
అంటూ అద్భుత భావనా బలంతో కవిత్వం రాసిన అరుదైన కవి విన్నకోట రవిశంకర్. మనిషి తనలోని ఆత్మను అందంగా ఆవిష్కరించడమే కవిత్వమని భావించే రవిశంకర్ ఏ వస్తువునైనా అద్బుతమైన కవితా శిల్పంగా మార్చగలరు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంతో వస్తూ వస్తూనే తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశారు. అదే వరుసలో వచ్చిన వేసవివాన, రెండో పాత్ర లాంటి కవితా సంపుటాలు కవిత్వాభిమానులను మరితంగా ఆకట్టుకున్నాయి. 
"కవిత్వంలో నేను" వ్యాసం
కవిత్వం రాయడంతో పాటు ఇతర కవులు రాసిన కవిత్వాన్ని ఆకళింపజేసుకొని వారి కవితా సంపుటాలలోని వస్తుశిల్పాలను "కవిత్వంలో నేను" అనే వ్యాస సంకలనంలో అందంగా విశ్లేషించారు విన్నకోట రవిశంకర్. కవిత్వంలో నూతన అభివ్యక్తికి ఈ కవిరాసిన కుండీలో మర్రి చెట్టు కవిత్వం అద్దం పడుతుంది.
సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి
శ్రుతి చేసిన వీణలా ఆమె ధ్వనిస్తుంది
కనిపించని విషాదపు ఒత్తిడికి
చిగురుటాకులా  ఆమె  చలిస్తుంది
అంటూ సరికొత్త అభివ్యక్తితో కవిత్వాన్ని శిల్పీకరించారు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంలో 29 కవితలున్నాయి. హోళీ, ఉదయాలు, ప్లూ, నిద్రానుభవం, గాయం, కెరీరిజం, పాప మనసు, చలనచిత్రం, మెుదలైన కవితలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. 

కవిత్వం రాయడాన్ని చాలా సీరియస్ యాక్టివిటీగా భావిస్తారు రవి శంకర్ . అతని ప్రతి కవితా సంకలనంలో, ప్రతి కవితలోనూ ఈ స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. అతడు వెలువరించిన మరో కవితా సంపుటి వేసవివాన .అందులో
నేల కురిసే వాన
గుండ్రంగా తిరుగుతుంది
ఎప్పుడంటే అప్పడు
ఇంటి ముందు ఇంద్రధనుస్సులల్లుతుంది
 అంటూ వానను సరికొత్త భావనతో కవిత్వం చేసి అబ్బురపరుస్తారు. 
అగ్ని పర్వతం ఒకటి
హఠాత్తుగా మనసు మార్చుకుని
మంచుకొండగా మారిపోయినట్టుగా ఉంది
అంటూ ఒక వస్తును ఎవరూ ఊహించని ఇమేజరీతో తళుక్కుమనిపిస్తారు. ఇది  రవిశంకర్ ప్రత్యేక కవితా శిల్పకళ అని చెప్పాలి. 
విన్నకోట కవిత్వంలో ఏ వస్తువైనా అందంగా శిల్పీకరించబడుతుంది. కవిత్వ భాష , పదచిత్రాలు, ఇమేజరి, అభివ్యక్తి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అందమైన కవిత్వంగా ఆవిష్కరించబడుతుంది.. 

ఇక రెండో పాత్ర కవితా సంపుటిలో మెుత్తం 77 కవితలున్నాయి. అందులో గొడుగు, వానపాట, బాధ, సహచరిలాంటి కవితలు శిల్ప సోయగంతో కవితా ప్రియులను అలరిస్తాయి. 
జలజలమంటూ కురిసే వాన
కిటికీపై నీటిపరదాలు జార్చినట్టు
నీ పాట నా కంటిమీద
కన్నీటి తెరలు దించుతుంది..

వెలిసిన వాన వేరే ఊరు 
వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
ముగిసిన నీ పాట మాత్రం
కొన్నాళ్ల వరకు 
తలపుల్లో గూడుకట్టుకుని
కలలో కూడా వెంటాడుతుంది.. అంటాడు విన్నకోట రవిశంకర్..

కవిత్వం రాయడంతో ఆగి పోకుండా, ఇతరుల కవిత్వాన్ని చదువుతూ  కవిత్వాన్ని విశ్లేషించడం నిరంతరం కొనసాగిస్తున్నారు విన్నకోట రవిశంకర్.  కవిత్వంలో నేను సంకలనంలో నల్లగేటు నందివర్ధనం చెట్టు, నిరంతరయాత్ర, పడవనిద్ర, సాలె పురుగులాంటి వ్యాసాలు ఆయా కవుల సృజన పట్ల కొత్త ఆలోచలను రేకెత్తిస్తాయి. 

విన్నకోట రవిశంకర్ కు కవిత్వం వారసత్వంగా వచ్చింది. తండ్రి విన్నకోట వేంకటేశ్వరావు స్వయానా పండితుడు ..ఆయన తెలుగు తోట అన్న ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు. ఇందులో 85 మంది కవుల కవితలను ప్రచురించారు. 

ఇక రవిశంకర్ జీవిత విశేషాల్లోకి వెళితే ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో  విన్నకోట వేంకటేశ్వరరావు, శ్యామల దంపతులకు జన్మించారు. పిఠాపురం, కాకినాడల్లో హైస్కూల్ వరకు చదువుకున్నారు. వరంగల్ లో యం.టెక్ ను పూర్తి చేశారు. తర్వాత ఎ.పి.ఎస్.ఇ.బి లోను తర్వాత  సి.యం.సిలో ఇంజనీర్ గా పనిచేశారు. 1998 లో అమెరికా వెళ్లి సౌత్ కెరొలినాలో ఉద్యోగం చేస్తున్నారు. 

ప్రముఖ కవి ఇస్మాయిల్ ప్రభావంతో  తనదైన మార్గంలో కవిత్వం రాస్తున్న అరుదైన కవి, సాహితీ సమీక్షకులు విన్న కోట రవిశంకర్. ఆయన కలం నుండి భవిష్యత్ లో మరెన్నో కవితా సంపుటాలు వెలువడాలని ఆశిద్దాం....

10:21 - March 17, 2017

హైదరాబాద్ : విహారి సంస్థ 12 వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విహారి ఎండీ నితిన్‌కుమార్‌తో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహారి ద ట్రావెలర్‌ బుక్‌ను రిలీజ్‌ చేశారు. 

 

13:19 - December 25, 2016

ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ కవి పాపినేని శివశంకర్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. పాపినేని కవితా సంపుటి 'రజనీగంధ'కు గాను ఈ అవార్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ అవార్డును బహుకరించనున్నారు. కాగా, పాపినేని శివశంకర్ స్వగ్రామం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కల్లు. తాత్త్వికమైన లోతులను స్పృశిస్తూ ఆధునిక తెలుగు కవిత్వంలో పాపినేని శివశంకర్ అగ్ర కవుల సరసన చేరారు. ఇప్పటివరకు 350కవితలు, 55 కథానికలు,220దాకా వ్యాసాలు పాపినేని శివశంకర్ కలం నుంచి జాలువారాయి.

20:37 - December 4, 2016
07:07 - December 27, 2015

చినిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక్క మంచి పుస్తకం కొనుక్కో ..అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్ నెట్ లు, బ్లాగులు, ఫేస్ బుక్ లు ఎన్నో అందుబాటులోకొచ్చాయి. అయినా పుస్తకాలకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిరూపించింది. తెలంగాణా కళాభవన్ లో ఈ నెల 18 నుండి 27 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగింది. సమీక్షా కథనం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:07 - July 9, 2015

హైదరాబాద్ : మీకు పుస్తకాలు చదవడమంటే ఇష్టమా ? ఏయే పుస్తకాలు కావాలో ఎంపిక చేసుకోండి. ధర గురించి బెంగే వద్దు. అవి ఎంత తూగితే అంతకే డబ్బు చెల్లించండంటూ పుస్తక విక్రయ కేంద్రాలు అందరికీ ఆహ్వనం పలుకుతున్నాయి. వినడానికి కొత్తగా ఉన్నా ... ప్రస్తుతం భాగ్యనగరంలో హల్ చల్ చేస్తోన్న నయా ధోరణి ఇది. ట్రెండ్ మారడంతో పుస్తక దుకాణాల్లో కొనుగోళ్లు మందగించాయి. ప్రముఖ బుక్ స్టాల్స్ మూతబడే స్థాయికి అమ్మకాలు తగ్గిపోయాయి. బిజినెస్ ఏదైనా నయా ట్రెండ్‌కు తగ్గట్లు మార్చుకుంటే సేల్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇదే పద్దతి ఫాలో అయ్యారు హైదరాబాద్‌లోని కొందరు షాపుల యజమానులు. మీకు నచ్చిన బుక్స్ తూకం వేయండి. బరువునుబట్టి ధర చెల్లించండి అంటూ కొత్త స్కీం ప్రకటించారు.. పుస్తకాల ఎంపికను బట్టి కిలోకు వంద నుంచి 300 వరకు ధర నిర్ణయించారు. ఈ కొత్త ధోరణి మార్కెటింగ్ గిమ్మిక్కే అయినా పుస్తక ప్రియులనుమాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పుస్తకం ధరకు మూడు పుస్తకాలు రావడంతో కిలోల కొద్దీ బుక్స్ కొనేస్తున్నారు జనాలు.

 

Don't Miss

Subscribe to RSS - books