bride

15:40 - May 22, 2017

రంగారెడ్డి : జిల్లాలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారానికి చెందిన టేకుమట్లు జంగయ్య తన కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బంధువుల రాకతో ఇళ్లంతా సందడిగా మారింది. మరికొద్ది సేపట్లో పెళ్లి అనగా జంగయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. విషయం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తండ్రి మరణవార్త తెలుసుకున్న వధువు భోరునా విలపించింది. జంగయ్య మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.

13:57 - May 15, 2017

వధువుకు ఘోర అవమానం కలిగింది. వరుడు చేసిన ఆరోపణలు నిజం కాదని వధువు నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పలు వివాహాలు కొన్ని కొన్ని కారణాలతో ఆగిపోతున్న సంగతి తెలిసిందే. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే యువకుడికి..ఓ యువతితో వివాహం కుదిరింది. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన జైహింద్ పెళ్లి వద్దని చెప్పడంతో అందరూ హతాశులయ్యారు. పెళ్లి కూతురికి బొల్లి వ్యాధి ఉందని..అందుకే తనకీ పెళ్లి వద్దని ఖరాఖండిగా చెప్పాడు. తనకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని..ఆరోగ్యవంతంగా ఉన్నానని వధువు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అమ్మాయి తరపు వారు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వరుడు ఎంతమాత్రం వినలేదు. పెళ్లి రద్దు చేయాలని వరుడు డిమాండ్ చేయడంతో వధువు తండ్రి వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరు కుటుంబాలు పీఎస్ కు చేరాయి. వరుడు కుటుంబానికి చెందిన మహిళలతో వధువును ఒక గదిలోకి పంపి తనిఖీ చేయించారు. ఆమెకు ఎలాంటి ల్యూకోడెర్మా లేదని వారు గుర్తించడంతో వరుడు పెళ్లికి అంగీకరించాడు. వధువుపై ఆరోపణలు చేసిన జైహింద్ క్షమాపణలు చెప్పాడు. అతడిపై పెట్టిన కేసును కూడా వాపస్ తీసుకోవడంతో వివాహం జరిగిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రీటా సింగ్ పేర్కొన్నారు.

15:29 - April 19, 2017

కొన్ని పెళ్లిళ్లు వివిధ కారణాల వల్ల ఆగిపోవడం చూస్తుంటాం. ఇటీవలే కొన్ని పెళ్లిళ్లు చిన్న చిన్న కారణాలకే రద్దు కావడం జరుగుతున్నాయి. భోజనం అందరికీ ఏర్పాటు చేయలేదని మొండికేసిన మగపెళ్లి వారిపై వధువు తిరగబడిన సంగతి తెలిసిందే. ఏకంగా తనకు పెళ్లే వద్దంటూ స్పష్టం చేసింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలో రసగుల్ల కోసం ఓ పెళ్లి ఆగిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నావ్ జిల్లాలో..కుర్మాపూర్ గ్రామానికి చెందిన శివ కుమార్ కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 14వ తేదీన పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వివాహానికంటే ముందు ఆడపెళ్లి వారు వరుడు బంధువులకు విందు ఏర్పాట్లు చేశారు. విందులో రసగుల్ల కూడా పెట్టారు. ఒకే రసగుల్లా వడ్డించాలని నిర్ణయించడంతో వధువు బంధువు అలాగే వడ్డిస్తున్నాడు. వరుడు తమ్ముడు మాత్రం తనకు ఇంకో రసగుల్లా వడ్డించాలని కోరాడు. దీనికి వడ్డిస్తున్న వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దీనితో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చినికిచినికి గాలివానగా మారి ఇరువైపులా వారు కొట్టుకొనే పరిస్థితికి వెళ్లిపోయింది. ఆహారా పదార్థాలు..ప్లేట్లు..ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ విషయం పోలీసులకు వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పెద్దమనుషుల సమక్షంలో పెళ్లికి ఒప్పించారు. కానీ వధువు మాత్రం ఒప్పుకోలేదు. రసగల్లా కోసం రచ్చ రచ్చ చేయడమే కాకుండా తన తండ్రి మీద కూడా చేయి చేసుకున్నారని..తాను పెళ్లి చేసుకోలేదని ఖరాఖండిగా చెప్పడంతో వరుడి తరపు వారు వెనుదిరగాల్సి వచ్చింది.

14:50 - April 10, 2017

పెళ్లి..పలు ప్రాంతాల్లో రకరకాలుగా ఈ తంతు జరుగుతుంటుంది. ఈ పెళ్లి వేడుకల్లో మగ పెళ్లి వారి హావా కనిపిస్తుంటుంది. తెగ హడావుడి చేస్తూ కనబడుతుంటారు. అమ్మాయి తరపు వారు అణిగిమణిగి ఉండాలని..ప్రతి విషయంలో పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఫుడ్ విషయంలో మంకు పట్టు పట్టిన మగపెళ్లి వారికి ఓ నవ వధువు షాక్ ఇచ్చింది. తనకు పెళ్లే వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. కర్నాటక రాష్ట్రంలోని కోణనకుంటలోని ఓ కళ్యాణ మండపంలో నాగేంద్రప్రసాద్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం జరగనుంది. శనివారం రాత్రి కళ్యాణ మండపంలో మగ పెళ్లి వారికి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కానీ మగ పెళ్లి వారి తరపున వచ్చిన కొంతమందికి భోజనం అందలేదు. దీనితో తమకు అవమానం జరిగిందంటూ నాగేంద్రప్రసాద్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. చెప్పిన దానికంటే ఎక్కువ సంఖ్యలో రావడంతో ఇలా జరిగిందని, మరలా వంట చేసి పెడుతామని ఆడపెళ్లి వారి తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినిపించుకోకుండా అర్ధరాత్రి వరకు గొడవ కొనసాగింది. చివరకు ఎలాగొ అలా పెద్దవాళ్లు మెత్తబడ్డారు. కానీ ఈ విషయాన్ని పెళ్లి కూతురు సీరియస్ గా తీసుకుంది. పెళ్లి కానప్పుడే ఇలా ఉంటే పెళ్లి అయిన తరువాత పరిస్థితి ఏంటీ అని ఆలోచించింది. వెంటనే తనకు పెళ్లి కొడుకు వద్దని తేగేసి చెప్పింది. ఇరు కుటుంబాలవారు ఆదివారం ఉదయం వరకూ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో ఆ పెళ్లి కాస్తా ఆగిపోయింది. నాగేంద్ర ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి, వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు ఆమె స్పష్టం చేసింది.

22:18 - March 18, 2017

ఓ అమాయకుడు బందీ అయ్యాడు. ఏడేళ్ల శిక్షకు సిద్ధమయ్యాడు. కానీ అతడు మాత్రం ఏ తప్పూ చేయలేదు. అతనితోపాటు అతని భార్య.. ఆ నవ వధువు నట్టింట్లో శిక్ష అనుభవిస్తుంది. ఆమె కూడా ఏ తప్పు చేయలేదు. ఈ దంపతులు దూరమై, కనీసం మాట్లాడుకునేందుకు కూడా చేసింది నమ్మకం. ఆ నమ్మకమే వారి జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడా ఇళ్లాలు కడుపులో బిడ్డను మోస్తోంది. కన్నీళ్లు తాగుతూ బతుకుంతోంది. దీనంతటికీ కారణం నమ్మకమే. భర్త ఏ నాటికైనా తిరిగి వస్తాడన్న ఒకే ఒక నమ్మకం. ఆమెలో ధైర్యాన్ని తెస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:39 - July 8, 2015

తన బిడ్డ సంరక్షురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేసిన ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. తన బిడ్డకు తనను ఏకైక సంరక్షక్షురాలిగా..తన లావాదేవీలన్నిటికీ తన బిడ్డను నామినీగా గుర్తించాలని ఒక అవివాహిత తల్లి చేసిన విజ్ఞప్తిని విచారణ కోర్టు, ఆ తరువాత హైకోర్టు తిరస్కరించడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అవివాహిత తల్లులు..ఒంటరి తల్లుల బిడ్డల విషయంలో..ఆ బిడ్డకు సంబంధించి బాధ్యతలను విస్మరించిన తండ్రుల చట్టబద్ధమైన హక్కుల కన్నా..ఆ బిడ్డ సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ అంశంపై 'మానవి' వేదికలో న్యాయవాది పార్వతి విశ్లేషణ చేశారు. అలాగే పలువురు వ్యక్తపరిచిన న్యాయ సందేహాలను ఆమె నివృత్తి చేశారు. 

Don't Miss

Subscribe to RSS - bride