BV Raghavulu

12:41 - March 5, 2017

గుంటూరు : ఇప్పుడున్న పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి భవిష్యత్తులో సోషలిస్టు వ్యవస్థలోకి రావడం ఖాయమన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీ. వీ రాఘవులు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీపీఎం సీనియర్‌ నాయకులు సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ. వీ. రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింహాద్రి శివారెడ్డి సేవలను రాఘవులు కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో శివారెడ్డి అలుపెరగకుండా పోరాటం చేశారని అన్నారు.

21:39 - February 23, 2017

టీటీడీ నిధులు దారి మళ్లుతున్నాయని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, లక్ష్మీపార్వతి, సీపీఎం నేత మురళి పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:35 - February 23, 2017

చిత్తూరు : టీటీడీ నిధులపై ప్రభుత్వం కన్నుపడింది. హిందూ ధర్మ ప్రచారం పేరిట ఓ ట్రస్ట్‌కు ఏటా అప్పనంగా కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై టీటీడీ ఉద్యోగులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి నిధులను అక్రమంగా దారి మళ్లిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 
టీటీడీ నిధులు బొక్కేసేందుకు మరో కుట్ర 
టీటీడీ నిధులు అప్పనంగా బొక్కేసేందుకు మరో కుట్ర జరుగుతోంది. హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేట్‌ సంస్థకు ఏటా కోట్లాది నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం  ఈనెల 8న జీవో 65 జారీ చేసింది. 
ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత
హిందూ ధర్మ ప్రచారం ట్రస్ట్‌కు టీటీడీ నుంచి ప్రతి నెల 50 లక్షలు, దేవాదాయ శాఖ నుంచి మరో 50 లక్షలు చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ.. దానికి అనుబంధంగా ఉన్న హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందంటున్నారు. ఇప్పుడు అదికాకుండా.. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ప్రభుత్వం ఆఘమేఘాల మీద నిర్ణయం 
టీటీడీ మాజీ ఈవోగా పని చేసిన పీవీ ఆర్కే ప్రసాద్‌.. హిందూ ధర్మ ప్రచారం పేరిట వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు.. ఇందుకు నిధులు మంజూరు చేయాలని గతేడాదిలో ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల దేవాదాయశాఖ 50 లక్షలు,.. టీటీడీ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని జీవోలో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలా 5వ తేదీలోగా నిధులు విడుదల చేయాలని ప్రత్యేకంగా  పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కనీస వేతనాలు, ఇతర సదుపాయాల కోసం ఎంతోకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఓ ట్రస్ట్‌కు కోట్ల రూపాయలు అప్పనంగా మంజూరు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట
ప్రభుత్వ నిర్ణయంపై శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ధర్మ ప్రచారం ముసుగులో శ్రీవారి సొమ్ము స్వాహా చేస్తున్నారని మండిపడుతున్నారు. తాము సమర్పించే కానుకలకు జవాబుదారీ ఎవరు ? అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా ఎవరో ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు హిందూ ధర్మ ప్రచారం పేరిట సంస్థలు పెడితే ఇలానే కోట్లాది రూపాయలు కట్టబెడతారా ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం శ్రీవారి నిధులను ఇష్టమొచ్చిన వారికి అప్పనంగా కట్టబెడితే.. భవిష్యత్‌లో తమకు, భక్తులకు అన్యాయం జరిగే అవకాశముందని టీడీపీ ఉద్యోగులంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.

 

19:48 - February 23, 2017

తిరుపతి : హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు ఏటా టిటిడి కోట్లాది నిధుల్ని మంజూరు చేయడం అన్యాయమన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.  టిటిడికి సొంతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌  ఉండగా..ప్రైవేటు సంస్థకు హిందూధర్మం పేరుతో నిధులు ఎలా కేటాయిస్తారని తిరుపతిలో ప్రశ్నించారు. 

 

11:41 - February 23, 2017

తిరుపతి : హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు ఏటా టిటిడి కోట్లాది నిధుల్ని మంజూరు చేయడం అన్యాయమన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. టిటిడికి సొంతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఉండగా..ప్రైవేటు సంస్థకు హిందూధర్మం పేరుతో నిధులు ఎలా కేటాయిస్తారని తిరుపతిలో ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు 50 లక్షలు స్వామి వారి సొమ్ము కొట్టేస్తున్నారని, సంవత్సరానికి 6 కోట్లు అని తెలిపారు. ఎండో మెంట్స్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రస్టుకు టిటిడి సొమ్మును ప్రభుత్వం ఎందుకు దానం చేయాలని సూటిగా ప్రశ్నించారు.

 

16:44 - February 12, 2017

నెల్లూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యానికి తీరని హాని జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు.డా.శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 25 సంవత్సరాల నూతన ఆర్థిక విధానాల అమలు ఉద్యోగులు - కార్మికులు - ప్రజలపై ప్రభావం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాఘవులు మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని, మతసౌమరస్యానికి విఘాతం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి నూతన ఆర్థిక విధానాలు దోహదం చేయడం లేదన్నారు. కార్పొరేట్లకు ఆర్థిక సంస్కరణలు లాభాలు తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ మరింత దూకుడుగా వెళుతున్నారని విమర్శించారు.

19:47 - February 5, 2017

కృష్ణా : పచ్చని పంటపొలాలతో కళకళలాడిన ఆ భూములు.. చేపల చెరువులుగా మారుతున్నాయి. నిత్యం సాగులో ఉండే దళితుల భూములు.. ఉప్పునీటి చెరువులుగా మారిపోతున్నాయి. చుట్టూ నీళ్లున్నా.. తాగేందుకు చుక్కబొట్టు లేక దళితులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. పేదలు, దళితుల భూముల్లో చేపల, రొయ్యల పెంపకం చేపట్టి భారీ ఎత్తున లాభాలు గడిస్తున్న ఆక్వా మాఫియా.. యజమానులకు మాత్రం తీవ్ర నష్టం చేస్తోంది. కృష్ణా జిల్లాలో దళితుల భూముల్ని కొల్లగొట్టి.. వారి కడుపు కొడుతున్న చేపల చెరువుల పై స్పెషల్ స్టోరీ...! 
దళితుల పొట్ట కొడుతున్న పెత్తందారులు  
ఇదీ.. కృష్ణా జిల్లాలో ఆక్వా వ్యాపారులు, పెత్తందార్లు రెచ్చిపోతున్న తీరు. నందివాడ మండలం ఇలపర్రు గ్రామ పరిధిలో దళితులకు చెందిన 165 ఎకరాల అసైన్డ్‌ భూముల్ని కొందరు పెత్తందార్లు, ఆక్వా వ్యాపారులు ఆక్రమించి చేపల చెరువులుగా మార్చారు. దశాబ్దానికి పైగా దళితుల భూముల్లో ఆక్వా సాగు చేస్తూ కోట్లు గడిస్తున్న వ్యాపారులు.. దళితుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇదే విషయమై కొంతకాలంగా పోరాటానికి దిగిన బాధితులు, దళితులకు సీపీఎం అండగా నిలుస్తూ వస్తోంది.  
దళితుల భూములపై పెత్తందారుల కన్ను 
ఇలపర్రు గ్రామ ఆయకట్టు 4,629 ఎకరాలు కాగా, అందులో చెరువులుగా మారినవి 4,429 ఎకరాలు. పట్టా భూమి 1800 ఎకరాలుంటే, అసైన్డ్ భూమి 2,300 ఎకరాలు. చాలాకాలంగా దళితులు సాగు చేస్తూ వస్తున్న 165 ఎకరాల భూములపై కొంతమంది పెత్తందారుల కన్నుపడింది. అంతే.. దళితులకు తెలియకుండానే తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని.. లీజు పేరిట ఆ భూముల్ని కాజేశారు. కొన్నాళ్లు లీజు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చిన సదరు పెత్తం దారులు కాలక్రమంలో దళితుల భూముల్ని వారి కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. 
పెత్తందారులకు సహకరిస్తున్న అధికారులు  
పెత్తందార్ల మోసాలకు బలైన దళితులు.. చేసేది లేక న్యాయం కోసం ప్రభుత్వాన్ని, హైకోర్టును ఆశ్రయించారు. 2007లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో ఎంజాయ్‌మెంట్ సర్వే చేయించారు. ఆ సర్వేలో పెత్తందారులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన వీఆర్వో సైతం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులు, న్యాయస్థానాల ఆదేశాలు దళితులకు అనుకూలంగా వచ్చాయి. అయినా.. అధికారులు మాత్రం పెత్తందారులకు సహకరిస్తూనే వస్తున్నారు. 
వ్యకాస, కేవీపీఎస్ నేతలపై అక్రమ కేసులు 
బాధితులకు అండగా నిలిచిన వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కానీ... బాధితులు పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా.. పోలీసులు మాత్రం ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలకు దిగారు. 
దళితుల పోరాటానికి సీపీఎం మద్ధతు 
దళితుల పోరాటానికి సీపీఎం మద్ధతునిచ్చింది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా కార్యదర్శి, పలువురు నేతలు బాధితులకు  భరోసా ఇచ్చి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఫిబ్రవరి 6వ తేదీలోగా సమస్యను పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. సమస్యను పరిష్కరించి దళితులు, పేదలకు న్యాయం చేయాలని లేకపోతే భవిష్యత్‌లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

19:04 - February 5, 2017

కృష్ణా : జిల్లాలో నందివాడ మండలం ఇలపర్రులో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.. గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించారు.. ఆక్రమిత భూముల్ని రేపు స్వాధీనం చేసుకుంటామన్న దళితుల ప్రకటనతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.. ఇలపర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించారు.. ఆక్రమిత భూములవద్ద 145 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.. ఇలపర్రులో పోలీసుల చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు.. గ్రామానికి ఎవరూ రావొద్దని ఆదేశించారు.. ఇంటింటినీ తనిఖీ చేస్తూ... ఆధార్‌కార్డుతోనే బయటకు రావాలని గ్రామస్తులకు ఆంక్షలు పెడుతున్నారు.. ఆక్రమణకుగురైన తమ భూముల్ని తిరిగి ఇప్పించాలంటూ 140రోజులుగా దళితులు పోరాటం చేస్తున్నారు.. వీరి ఉద్యమానికి సీపీఎం, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలిచింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:24 - January 29, 2017

కృష్ణా : జిల్లా నందివాడ మండలంలో భూ ఆక్రమణలపై సీపీఎం పోరుబాటపట్టింది. భూముల్ని ఆక్రమించి చేపల చెరువులు తవ్విన అక్రమార్కులపై సమరశంఖం పూరించింది. ఫిబ్రవరి 5లోపు భూముల్ని తిరిగి ఇచ్చివేయాలని... లేకపోతే తామే స్వాధీనం చేసుకొని దళితులకు అప్పగిస్తామని హెచ్చరించింది. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. చట్టవిరుద్దంగా చేపల చెరువులు తవ్వుతూ స్థానికుల జీవితాల్లో చీకటి నింపుతున్నారు కొందరు అక్రమార్కులు. ఆక్వా మాఫియా ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు అక్కడే బతకలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఈ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 33వేల ఎకరాల్ని ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేశారు. ఇందులో దేవాలయాల భూములు, అసైన్డ్, డ్రైనేజీ, ఇరిగేషన్‌, రెవెన్యూ భూములు ఎక్కువగా ఉన్నాయి. దళితుల భూములు 165 ఎకరాలుగా కాగా... దేవాదాయ శాఖవి 6వేల ఎకరాలున్నాయి.

పనిలేక వలసలు పోతున్న పేదలు..
మండలంలో వేలాది ఎకరాలు చేపల చెరువులుగా మారడంతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. సాగు, తాగునీటికి తీవ్రస్థాయిలో కొరత ఏర్పడింది. పైగా చేపల చెరువులతో వచ్చే కాలుష్యం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలు, వాసనతో వివిధ రకాల జబ్బులు సోకాయి. పచ్చిక లేక పశువులు బతకలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 80శాతం భూములు చేపల చెరువులుగా మారడంతో పేదలకు ఉపాది కరువైంది. ఉన్నచోట పని దొరక్క... వేరే మార్గంలేక చాలామంది నిరుపేదలు వలసబాటపట్టారు. వలసలు పెరిగిపోవడంతో స్థానికంగా జనాభా పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఇక్కడ 2 ఎంపీటీసీ స్థానాలుండగా జనాలు లేక ఇప్పుడు ఒక్క ఎంపీటీసీ స్థానమే మిగిలింది.

తిరగబడిన ఇలపర్రు ప్రజలు..
ఇలపర్రులో ఈ నరకయాతన భరించలేక స్థానికులు తిరగబడ్డారు. తమ భూముల్ని లాగేసుకొని. కనీసం ఇక్కడ బతికే అవకాశం కూడా లేకుండా చేస్తున్న అక్రమార్కులకు వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దగ్గరకు వెళ్లి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. అయినా పట్టించుకునేవారే కరువయ్యారు. అయినా ధైర్యంగా పోరాడుతున్న బాధితులకు వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాటం సంఘం, సీపీఎం అండగా నిలిచాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులుతో పాటు రాష్ట్ర నేతలు ఈ చేపల చెరువుల్ని పరిశీలించారు. బాధితుల తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 5లోగా ఈ భూముల్ని తిరిగి ఇచ్చివేయాలని లేకపోతే తామే స్వాధీనం చేసుకొని దళితులకు భూముల్ని అప్పగిస్తామని సీపీఎం హెచ్చరించింది.

18:16 - January 29, 2017

కృష్ణా : దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. నందివాడ (మం) ఇలపర్రులో ఆయన పర్యటించారు. అక్రమణకు గురైన భూములను ఆయన పరిశీలించారు. ఆరు వేల ఎకరాలను ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ సర్కార్ స్పందించకపోవడంతో సీపీఎం రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా రాఘవులు టెన్ టివితో మాట్లాడారు. అక్రమణకు గురైన దళితుల భూములు వారికే ఇవ్వాలని, ఆక్రమించుకున్న భూములను ఫిబ్రవరి 5లోగా ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాఘవులు హెచ్చరించారు. ఫిబ్రవరి 6న చేపల చెరువులను ఆక్రమించుకుంటామని, దళితులకు మేలు చేస్తామన్న సీఎం దళితుల భూములు ఆక్రమణకు గురైతే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితుల భూములు వారికే ఇవ్వాలని సూచించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - BV Raghavulu