Caste Discrimination

08:33 - March 24, 2017

సామాజిక తెలంగాణ కావాలని ఎంబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పడితేనే పేదల బతుకులు బాగుపడుతాయని తెలిపారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆయన సతీమణి విజయ పాల్గొన్నారు. '154 రోజులు, 4200 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన సిపిఎం బృందంలోని సభ్యుడు ఆశయ్యగారు ఇవాళ్టి జనపథంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. వారి సతీమణి విజయగారు కూడా 10టీవీ స్టూడియోకి వచ్చారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం నీర్ నెమల గ్రామంలో, రజక వృత్తిదారుల కుటుంబంలో జన్మించారు ఆశయ్య. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న ఆశయ్య జూనియర్ కాలేజీ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.  విద్యార్థి దశలోనే వామపక్షభావజాలం వైపు ఆకర్షితులైన ఆశయ్య ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేసి, యువజన సంఘాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. స్వగ్రామంలో 1996లో జరిగిన పెత్తందారి వ్యతిరేక పోరాటంలోనూ, విద్యుత్ ఉద్యమంలోనూ యాక్టివ్ గా పాల్గొని, జైలుకు సైతం వెళ్లారు. ఎంబిసి ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధత్యలు నిర్వహిస్తున్నారు. 154రోజుల పాదయాత్ర అనుభవాలన వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:02 - March 22, 2017

ప్రజల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత, పాదయాత్ర బృందం సభ్యుడు శోభన్ నాయక్ అన్నారు. ఇవాళ్టి జనపథంలో శోభన్ తో పాటు ఆయన సతీమణి విజయకుమారి పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి పాదయాత్ర నిర్వహించామని చెప్పారు. 'ఇవాళ్టి 10టీవీ జనపథానికి ఒక విశిష్ట అతిథి హాజరయ్యారు. చిన్న వయస్సుల్లోనే పెద్ద రికార్డు సృష్టించిన పాదయాత్రికుడు శోభన్ నాయక్ ఇవాళ్టి జనపథంలో తన అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శోభన్  హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శోభన్ రెండేళ్ల పాటు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శోభన్ ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ కేంద్ర కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించారు. గిరిజన సంఘం నిర్మాణంలోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న శోభన్ రెండు సార్లు జైలు జీవితం కూడా గడిపారు. తెలంగాణలో 154 రోజుల పాటు సాగిన మహాజన పాదయాత్ర బృందంలో ఒకరైన శోభన్ ఇవాళ్టి జనపథంలో తన అనుభవాలు పంచుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:36 - March 18, 2017

ఖమ్మం : ఇంటికో బిడ్డ...ఊరుకో బండి అనే నినాదంతో ప్రజలు కదం తోక్కనున్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 'సర్వసమ్మేళన సభ'కు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలి రానున్నారు. 
పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన మహాజన పాదయాత్ర
పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది.. పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నెల రోజుల పాటు సాగిన యాత్ర
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు నెల రోజులు సాగిన సీపీఎం మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభించింది. స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలపటంతో పాటు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని తమ్మినేనికి వినతులు అందజేశారు. 
సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  
సీపీఎం మహాజన పాదయాత్ర విజయోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు జనం హాజరుకానున్నారు. ఖమ్మం జిల్లాలోని 22 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 22 మండలాలకు సంబంధించి రెండు జిల్లాలో 776 గ్రామ పంచాయతీల నుండి ప్రజలు పెద్ద ఎత్తున కదం తొక్కుతున్నారు. ఇప్పటికే కొంతమంది బస్సులు, లారీలు, డీసీఎంలు, రైలు మార్గాల ద్వారా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లా నుండి 25 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం నుండి 10 వేల మంది కార్యకర్తలు కదలి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
పినరయ్ విజయ్‌కు రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో కవాతు 
ఎర్ర చీరలు, ఎర్ర చొక్కలు ధరించి ప్రతి ఒక్కరి చేతిలో ఎర్ర జెండా పట్టుకుని హైదరాబాద్ వెళ్లేందుకు అంతా సిద్ధమయ్యారు. సభకు వస్తున్న కేరళ సీఎం పినరయ్ విజయ్‌కు రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో కవాతు నిర్వహించనున్నారు. ప్రత్యేక క్యాడర్‌గా ఖమ్మం జిల్లా నుంచి ప్రతినిధులను ఇప్పటికే సభా స్థలానికి చేరుకున్నారు. ప్రజాసంఘాల బాధ్యులు కూడా కదం తొక్కనున్నారు. మొత్తంగా 19వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సర్వ సమ్మేళన సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు జనం హాజరుకానున్నారు.

18:36 - March 18, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి నినాదంతో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో చేపట్టిన సుదీర్ఘ మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న 'సర్వసమ్మేళన సభ'ను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. 
ముగింపు దశకు సీపీఎం మహాజన పాదయాత్ర  
తెలంగాణ వ్యాప్తంగా సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగనున్న ముగింపు సభను జయప్రదం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా జనవరి ఒకటివ తేదీన పాదయాత్ర వరంగల్ అర్బన్ జిల్లాకు చేరుకుంది. నెల రోజుల పాటు జనగాం, వరంగల్ రూరల్, మహబూబా బాద్, జయశంకర్ జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగింది. 
నెరవేరని ప్రభుత్వ హామీలు : ప్రజలు 
ప్రభుత్వం ఇచ్చిన చాలా హామీలు నేరవేరలేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా ప్రజలు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సీయం కేసీఆర్ కు లేఖలు రాశారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 
సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వం : రత్నమాల 
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశవర్కర్లు, డ్వాక్రా మహిళాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రత్నమాల తెలిపారు. ఈ సమస్యలను పాదయాత్ర ముగింపు సభలో మరోమారు లేవనెత్తుతామన్నారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున వారి సమస్యలను సీపీఎం నాయకులకు వినిపించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఈ రంగాల నుంచి 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 
వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాసుదేవారెడ్డి          
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అంటూనే వరంగల్ ను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి. మొత్తమ్మీద ఈ సమస్యలన్నింటిని పాదయాత్ర ముగింపు సభలో లేవనెత్తుతామంటున్నారు సీపీఎం నాయకులు. ఈ నెల 19న జరిగే మహాజన పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతున్నారు. 

 

17:34 - March 18, 2017

నల్గొండ : సంక్షేమ, సామాజిక సమర సమ్మేళనం సభకు యావత్‌ తెలంగాణ కదులుతోంది. రేపు హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు తెలంగాణ పల్లెలు సిద్ధమయ్యాయి.  నల్లగొండ జిల్లా నుంచి భారీ సంఖ్యలో కదలడానికి పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. సీపీఎం శ్రేణులతోపాటు విద్యార్ధి, యువజన, మహిళా, రైతు సంఘాలు కూడా జనసమీకరణలో మునిగిపోయాయి. అటు సమాజిక శక్తులు, ప్రజాసంఘాల నేతలు సభకు తరలుతున్నారు. 
మహాజన పాదయాత్ర ముగింపు సభ
మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఊరూవాడ కదులుతోంది. ఆదివారం సరూర్‌నగర్‌   ఇండోర్‌స్టేడియం గ్రౌండ్స్‌లో జరిగే  బహిరంగ సభకు  పల్లెలన్నీ పయనమవుతున్నాయి.  నల్లగొండ జిల్లా నుంచి సమర సమ్మేళనం సభకు  తరలేందుకు ప్రజానీకం రెడీ అవుతోంది. సీపీఎం శ్రేణులతోపాటు ఇతర వామపక్ష నేతలు, వివిధ సామాజిక శక్తులు, ప్రజా సంఘాల నేతలు కూడా సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 
పాదయాత్రకు అపూర్వ స్వాగతం 
నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచింది. నల్లగొండ జిల్లాలో మొదటి నుంచీ కమ్యూనిస్టులకు పురిటిగడ్డగా నిలిచింది. అనేక ఉద్యమాలు నల్లగొండ జిల్లాలో జరిగాయి. కమ్యూనిస్టులకు పెట్టని కోటగా నల్లగొండ నిలిచింది. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగిన మహాజన పాదయాత్రకు జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. పదహారు మండలాలు చుడుతూ 320 కిలోమీటర్లు ఈ జిల్లాలో సాగిన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు.  కేతేపల్లి నుంచి చిట్యాల వరకు ప్రతిచోటా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 
సభ సక్సెస్‌పై పార్టీ నాయకత్వం దృష్టి  
పాదయాత్ర పొడవునా జిల్లాలో అపూర్వ స్వాగతం లభించడంతో పార్టీ నాయకత్వం 19న జరిగే సభ సక్సెస్‌పై దృష్టి పెట్టింది.  ఇప్పటికే సమర సమ్మేళనం సభపై ప్రతిగ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటికో మనిషి.. ఊరికో బండి నినాదంతో పల్లెల్లో క్యాంపెయిన్‌ నిర్వహించారు. 50వేల మందిని తరలించడమే లక్ష్యంగా సీపీఎం నేతలు ముందుకుసాగుతున్నారు. సీపీఎం శ్రేణులతోపాటు విద్యార్ధి, యువజన, రైతు, మహిళా సంఘాలు కూడా సమర సమ్మేళనం సభ విజయవంతంపై దృష్టి పెట్టాయి. గ్రామాల వారీగా పక్కాగా ప్లాన్‌ చేశాయి. సమర సమ్మేళనం లక్ష్యాన్ని వివరిస్తూ వారిని సభకు తరలించే ఏర్పాట్లలో మునిగిపోయాయి.  మొత్తానికి జెండాలన్నీ పక్కనపెట్టి... సామాజిక ఎజెండాపై కలిసి రావాలన్న సీపీఎం పిలుపు అన్ని వర్గాలను ఆలోచింపజేస్తోంది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి ముగింపు సభకు జనం భారీగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

20:42 - March 17, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర హుషారుగా సాగుతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా 9వ తేదీ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు మహాజన పాదయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. పాదయాత్రకు వివిధ పార్టీ పక్షాల నేతలు మద్దతు తెలియచేస్తున్నారు. పాదయాత్రలో 'మల్లన్న' పాల్గొని నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మిగతా విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

19:58 - March 17, 2017

హైదరాబాద్ : పల్లెపల్లెను పలకరించింది.. కార్మిక, కర్షక, దళితుల, మహిళల సమస్యలను తెలుసుకుంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది... అన్ని వర్గాల ప్రజలను కదిలించింది..పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది సీపీఎం మహాజన పాదయాత్ర. ఆటంకాలను, అడ్డంకులను అధిగమించి... విజయవంతంగా ముందుకు సాగింది. సీపీఎం చేపట్టిన మ‌హాజన పాదయాత్ర ఐదు నెలల క్రితం ఇబ్రహింపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగసభతో ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగింది. 19న హైదరబాద్‌లో జరిగే బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగియనుంది. ఈ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గోనున్నారు. కాగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ మహాబూబ్‌నగర్‌లో మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రంజెటేటివ్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మహాజన పాదయాత్ర సభ్యులు పర్యటించారు. ప్రతి గ్రామానికి వెళ్లి అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలియజేశారు. అలాగే ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసింది. గ్రామీణ స్థాయిలో ఉండే అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. వివిధ రంగాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి లేఖలు రాశారు.

పాలమూరులో..
అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వందల గ్రామాల్లో పాదయాత్ర సభ్యులు పర్యటించారు. అక్కడున్న సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగలేదని.. రైతులు అనేక సమస్యలన ఎదుర్కొంటున్నారని, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వలేదని జిల్లా వాసులు పాదయాత్ర బృందం సభ్యులకు తెలియజేశారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని పాదయాత్ర సభ్యులు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్ట్‌లలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర విజయోత్సవ సభకు ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి దాదాపు పదివేల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. జిల్లాలో వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు ముగింపు సభలో పాల్గొంటున్నారు.

19:55 - March 17, 2017

యాదాద్రి : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 4వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్న పాదయాత్ర..ప్రస్తుతం 153వ రోజు యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని యూసఫ్‌నగర్‌, హన్మాన్‌వాడ, భువనగిరి, స్పిన్నింగ్‌ మిల్‌, పగిడిపల్లి, గూడూరు స్టేజీ, బీబీనగర్‌, నిమ్స్‌ ఆసుపత్రి, కొండమడుగు స్టేజీలో పాదయాత్ర కొనసాగనుంది. కేపాల్‌ వద్ద మేడ్చల్‌ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. భువనగిరి దగ్గర ఏర్పాటు చేసిన సభకు టిడిపి, కాంగ్రెస్‌ నేతలు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే జరుగుతుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

06:41 - March 15, 2017

హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత విద్యార్థి ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముత్తుకృష్ణన్‌ చనిపోయినా చూడటానికి వీసీ రాలేదంటూ జెఎన్‌యు విద్యార్థులు ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ యాజమాన్యంపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు. వీసీ వచ్చే వరకు పోస్టుమార్టం జరుగనివ్వబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధుల ఆందోళనతో ముత్తుకృష్ణన్‌ డెడ్‌బాడీకి పోస్టుమార్టం జరగలేదు.

తన కుమారుడిది ఆత్మహత్య కాదు....

తన కుమారుడిది ఆత్మహత్య కాదు హత్యేనని ముత్తుకృష్ణన్‌ తండ్రి జీవనంతం అన్నారు. కృష్ణన్‌ మృతిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై వామపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై అత్యున్నత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

తమిళనాడులోని సేలంకు చెందిన 27 ఏళ్ల ముత్తుకృష్ణన్‌ ...

తమిళనాడులోని సేలంకు చెందిన 27 ఏళ్ల ముత్తుకృష్ణన్‌ జేఎన్‌యూలో సెంటర్‌ ఫర్‌ హిస్టారికల్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీ మునిర్కా విహార్‌లోని స్నేహితుడి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే క్రిష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ముత్తుకృష్ణన్‌ గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని వద్ద ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని తెలిపారు. ఎంఫిల్, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం లేదని, యూనివర్సిటీలో నిరసనలు చేపట్టేందుకూ అవకాశం లేదని... మార్చి 10న ఫేస్‌బుక్‌లో చేసిన చివరి పోస్టులో ముత్తుకృష్ణన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సియూలో రోహిత్‌ వేముల ఆత్మహత్య నిరసనల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

10:33 - March 14, 2017

హైదరాబాద్: ఢిల్లీ జేఎన్ యూలో ఎం. ఫిల్‌ విద్యార్థి ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. మునీర్కా విహార్‌లోని స్నేహితుని ఇంట్లో ముత్తుకృష్ణన్‌ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముత్తుకృష్ణన్‌ మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. ముత్తుకృష్ణన్‌ది తమిళనాడులోని సేలం ప్రాంతం. తల్లిదండ్రులు ఢిల్లీ చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తారు. అయితే ముత్తు కృష్ణన్‌ ఆత్మహత్యపై తల్లిదంద్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే అంతటి పిరికివాడు కాదని అంటున్నారు. ముత్తుకృష్ణన్‌ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Caste Discrimination