cec

21:26 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని.. పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, 100శాతం పారదర్శకంగా పోలింగ్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ రాత్రిలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని చెప్పారు.
ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు ఐడీ కార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ధూమపానంపై నిషేధం ఉందన్నారు. మద్యం తాగి ఓటింగ్‌కు రావడం కరెక్ట్ కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయచ్చుని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, జాబ్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, ఫొటో గుర్తింపు కార్డులు, పెన్షన్ డాక్యుమెంట్లు చూపి ఓటు వేయొచ్చుని తెలిపారు. ఈసారి కొత్తగా 20లక్షలమంది ఓటర్లుగా చేరారని రజత్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఓట్ల సవరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు.
సా.5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఎంత సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 135 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో దొరికిన దానికంటే రెట్టింపు నగదును ఈసారి స్వాధీనం చేసుకున్నామన్నారు. డబ్బు పంపిణీ కింద 250 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు తగినంత సఖ్యంలో ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రచారం ఉందని.. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని రజత్‌కుమార్ వెల్లడించారు.
గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

12:04 - December 3, 2018

హైదరాబాద్ : ఎన్నికల నిర్వాహణ ఓ సవాల్‌‌లాంటిదని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికలకు సర్వంసిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ 3వ తేదీ సోమవారం ఆయన మీట్ ద ప్రెస్‌లో మాట్లాడారు. ఇక్కడ జరిగే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించిందని...ఎన్నికలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలను ఎన్నో ఎదుర్కొన్నామన్నారు. బోగస్ ఓటర్లు లేకుండా చేసినట్లు...4.93 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్న రజత్ కుమార్...  కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వాహణ చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను సేకరించినట్లు..పార్టీల మేనిఫెస్టో..హామీలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల చేతులో ఓటుతో పాటు పవర్‌ఫుల్ యాప్ ఉందని రజత్ 

10:53 - November 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మద్యం రెండు రోజుల పాటు దొరకదు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే. దీనితో ఈసీ  పలు చర్యలకు ఉపక్రమించింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యం..నగదు పంపిణీ కాకుండా పోలీసులు..ఈసీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6గంటల నుండి డిసెంబర్ 7వ తదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని ఎన్నికల అధికారి ఆదేశాల్లో పేర్కొన్నారు. బార్లకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని...బార్లు..బార్ అండ్ రెస్టారెంట్..పబ్‌లు..స్టార్ హోటల్స్ బార్లు..రిజిష్టర్డ్ క్లబ్‌లు మూసివేయాలని పేర్కొన్నారు. 

09:44 - November 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం ముంచుకొస్తోంది. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేపడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. కొన్ని పార్టీలు..కొంతమంది నేతలు అక్రమ బాట ఎంచుకుంటున్నారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా..ధన..మద్య ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ముందే పసిగట్టిన ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పకడ్బందీ చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నవంబర్ 23వ తేదీ వరకు రూ. 81.29 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. 

  • పోలీసు శాఖ రూ.60.46 కోట్లు స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. 
  • తనిఖీల్లో పాల్గొంటున్న ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.20.83 కోట్లు సీజ్ చేసిందని సమాచారం. 
  • 3,98,622 లీటర్ల మద్యం సీజ్ చేశారు. దాని విలువ రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. 
  • బంగారం, వెండి, గంజాయి, గుట్కా, పొగాకు, చీరలను కూడా సీజ్ చేశారని సమాచారం. 

అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని...విపక్ష నేతలు పేర్కొంటుంటే..తమకు అక్రమాలకు పాల్పడాల్సినవసరం లేదని అధికార పక్షం పేర్కొంటోంది. ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఇంకా ఎంత ధనం..మద్యం..ఇతరత్రా ఎంత సీజ్ చేస్తారో చూడాలి. 

16:45 - November 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని సీఈసీ అధికారి రావత్ వెల్లడించారు. నవంబర్ 23వ తేదీ శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో వివరాలను వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్స్ అందుబాటులో ఉంటాయని, వీవీ ప్యాట్స్‌లో ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండడం అభినందనీయమని కొనియాడారు. శాంతిభద్రతలను పర్యవేక్షణ నేపథ్యంలో పలువురిని అదుపులోకి తీసుకోవడడం..బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. జైళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరీక్షించడం జరుగుతుందన్నారు. 
2014లో 76 కోట్ల రూపాయలు సీజ్ చేస్తే 2018 ఎన్నికల్లో నవంబర్ 22వ తేదీ వరకు 77.80 కోట్ల రూపాయలను సీజ్ చేయడం జరిగిందన్నారు. 
పార్టీ ఫిర్యాదుపై పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారిదే.
అభ్యర్థులు కోరితే వీవీ ప్యాట్ ప్రింట్ పేపర్లను కౌంట్ చేస్తాం. 
పోస్టల్ ఓటర్ల సంఖ్య 10 వేల 038. 
పోలింగ్ సజావుగా జరిగేందుకు వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వేషన్. 

12:14 - November 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ముసాయిదా ప్రతికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. అందుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌ విడుదలతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19 చివరి తేదీ. ఈ నెల 20న నామినేషన్లు పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 11న వెల్లడికానున్నాయి. 
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్ పూర్తి
మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 వరకే జరగనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగతా 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

 

09:34 - October 30, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఈసీ దూరం పెట్టింది. తెలంగాణ ఎన్నికల బందోబస్తుకు ఏపీ పోలీసులను వినియోగించకూడదని నిర్ణయించింది. ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులు.. తెలంగాణ ఓటర్లను ప్రలోభ  పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రచారంలో అభ్యర్ధుల తీరుతెన్నులను పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు ఖర్చులను లెక్కగడుతోంది. ఎన్నికల ఖర్చులను  డేగకళ్లతో కనిపెట్టేందుకు 119నియోజకవర్గాల్లో త్వరలో పరిశీలకులను నియమించబోతుంది.

ఎన్నికల కాలం నడుస్తుండటంతో.. తెలంగాణలో పరిణామాలను ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటిలిజెన్స్  అధికారులు ధర్మపురిలో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెట్టారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో ఈసీ సీఈఓ రజత్ కుమార్ చర్యలు చేపట్టారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీకి రజత్  కుమార్ లేఖ రాశారు. పట్టుబడ్డ పోలీసులకు సంబంధించిన వివరాలు అందించాలని కోరారు. అయితే.. ఏపీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. ఈసీ కీలక నిర్ణయం  తీసుకుంది. ఏపీ మినహా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల  బలగాల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది.

ఎన్నిక‌ల గ‌డువు సమీపిస్తున్న కొద్ది ఎన్నికల సంఘం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేస్తోంది. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రిగే ప్రాంతాలపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు  అభ్య‌ర్దులు ఉప‌యోగించే అన్ని అంశాల‌పై నిఘా క‌ఠిన‌త‌రం చేసింది. ఎన్నిక‌ల్లో భ‌ద్ర‌త ‌కోసం 70 వేల బ‌ల‌గాలను వినియోగించనుంది. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు, ఈవీఎంల భ‌ద్ర‌త ‌కోసం కేంద్ర  బ‌ల‌గాల‌ను మోహరించనుంది. ఎన్నిక‌ల భద్రత కోసం కేంద్రం నుండి 307 ప్ల‌టూన్ల బ‌ల‌గాల‌ను కోరగా.. 250 ప్ల‌టూన్ల బ‌ల‌గాల‌ను కేటాయిస్తామ‌ని కేంద్రం తెలిపింది. అత్య‌వ‌స‌రమైతే మ‌రిన్ని  బ‌ల‌గాలు పంపుతామంది.  

ఎన్నిక‌ల‌ నిర్వహణకు విఘాతం క‌లిగించే వారిపైనా ఈసీ దృష్టిసారించింది. ఆయుధాల కలిగిన వారి వివరాలు సేకరించిన ఈసీ.. లైసెన్స్ కలిగిన తుపాకీలను స్వాధీనం చేసుకుంది. ఓట‌ర్లను  ప్ర‌లోభాల‌కు గురిచేసే మద్యం స‌ర‌ఫ‌రాపైనా నిఘా పెంచాల‌ని ఈసీ నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే కోటి రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.  ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎమ‌ర్జెన్సీ  స‌మ‌యంలో వైద్య సేవ‌ల ‌కోసం ఎయిర్ అంబులెన్స్ ల వినియోగంపైనా దృష్టి సారించింది. క‌ర్నాట‌కతో పాటు ఖ‌మ్మం ఎన్నికల్లో ఈ సేవ‌లు వినియోగించిన నేప‌థ్యంలో అవి ఎలా  ఉప‌యోగ‌ప‌డ్డాయ‌న్న అంశంపై అధ్యయ‌నం చేయనుంది.

అభ్య‌ర్దుల ఖ‌ర్చునూ ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నికల కమిషన్ లెక్క‌గ‌డుతోంది. వారు పెట్టే ప్ర‌తిపైసా ఖర్చు పైనా నిఘా ఉంటుంద‌ని స్పష్టం చేసింది. అభ్య‌ర్థులు రూ.28 ల‌క్ష‌ల కంటే ఎక్క‌వ  ఖ‌ర్చుచేయ‌రాద‌ని సూచించింది. ఎన్నిక‌ల ఖ‌ర్చుపై నిఘా పెంచేందుకు 119 నియోజక వ‌ర్గాల్లో ప‌రిశీల‌కులను నియమించనుంది. తెలంగాణలో ఎన్నిక‌లు స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో  నిర్వ‌హించేందుకు అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో పోలీసుల‌తో మార్చ్ ఫాస్ట్ నిర్వహించనుంది. 

16:47 - October 23, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ఓట్లు తొలగింపులో ఎన్నికల సంఘం చర్యలు కంటితుడుపుగానే ఉన్నాయని, హైకోర్టును ఎన్నికలసంఘం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈఅంశంపై న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తమదగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సాఫ్ట్ వేర్ ఉందని చెప్పిన ఎన్నికల సంఘం కంటితుడుపు చర్యగా బోగస్ ఓట్లను తొలగించిందని అన్నారు. రాష్ట్రానికి ఆడిట్ బృందాన్ని ఈసీ ఎందుకు పంపలేదని మర్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే  ప్రకటించిన షెడ్యూల్ కు అనుగుణంగా తమ షెడ్యూల్ ఉండేలా అమలు చేయటానికి ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 

10:58 - October 23, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరీశిలించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపి రావత్...ఇవాళ శాంతి భద్రతల అంశంపై ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 31జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశం అవనున్నారు. ఈ సందర్భంగా సమస్యత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు..సరిహద్దులో చెక్ పోస్టుల నిర్మాణం, నగదు, మద్యం పంపిణీని ఎలా అరికట్టాలనే దానిపై పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.  ఇక పోలింగ్ స్టేషన్లలో సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లతో పాటు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పై కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఐటీ శాఖ అధికారులతో భేటీ అవనున్నారు.
 

10:08 - October 23, 2018

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఈసీ ఓపీ రావత్ బృందం...తెలంగాణలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లపై ఆయా పార్టీల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలపై చర్చించారు. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ ప్రతిపక్షాలు ఈసీ ముందే ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. 11మంది సభ్యులున్న కేంద్రం ఎన్నికల సంఘం బృందం....మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఎంఐఎం, వైసీపీ, సీపీఎం ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కోపార్టీకి 19 నిమిషాల టైమివ్వడంతో....పార్టీల నేతలు పలు అంశాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటనలపై వస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్‌గా పరిగణించాలని విపక్షాలు కోరడాన్ని ఆయన తప్పు పట్టారు.

ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ వస్తుందని ఈసీకి తెలియజేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని... మొదట్నుంచీ తాము చెబుతూనే ఉన్నామన్నారు. ఓటర్ల జాబితా సరిచేయలేదని, అవసరమైన ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చెప్పారు. 

ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. టీడీపీ సీనియర్ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. సంబంధంలేని అంశంలో ఎల్‌. రమణను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలని ఈసీని కోరామన్నారు. 

హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని....వాటిని తొలగించాలని గతంలోనే కోరినా ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోలేదన్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి. డబ్బుల పంపకాన్ని అడ్డుకొనేందుకు అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. బోగస్‌ ఓటర్లకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విజిలెన్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - cec