Central Government

19:18 - August 11, 2018

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర సమస్యలపై ఏపీ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ రాళ్లేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని విమర్శించారు. వైఎస్ భారతి పేరును ఛార్జీషీట్ లో నమోదు చేయడంపై జగన్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి దేవినేని ఓ కార్యక్రమంలో ఈ అంశంపై మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతోందని..ఈ ప్రయత్నంలో టిడిపి, ప్రభుత్వంపై రాళ్లు వేయడం సబబు కాదన్నారు. ఎల్లో పత్రికలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంగ్లపత్రికల్లో జగన్ అవినీతి బయటపడుతోందని, ఇంకా రెండు సీబీఐ నివేదికలు బయటకు రాకుండా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ రోజు జగన్ చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయని, మహిళా ఆఫీసర్లు..గోల్డ్ మెడలిస్టులు కోర్టు బోనులెక్కి..జైలుకెళ్లి నానా అవమానాలు పడ్డారని తెలిపారు. అధికార దాహంతో లక్ష కోట్ల దోపిడితో కేసుల్లో ఇరుక్కున్నారని ఆరోపించారు. 

08:13 - August 10, 2018

హైదరాబాద్ : ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా ఉన్నామని కలరింగ్‌ ఇచ్చిన గులాబీ పార్టీ.... ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. గతంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నా.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని గులాబీపార్టీ చెప్పకనే చెబుతోంది. రాజకీయంగా కూడా బీజేపీతో ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి అనుకూలంగా టీఆర్ ఎస్ 
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ దోస్తీ కడుతుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్‌ పలు సందర్భాల్లో సమర్ధించారు.  ఇప్పుడు రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా... ఫ్రంట్‌ కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. కానీ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి  కేసీఆర్‌ పరోక్షంగా మద్దతిస్తూ .. తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో మరింత ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో ఉన్న నేతకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతునిచ్చింది. ఎన్నికల్లో పాల్గొని ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటేశారు.  అయితే ఇందుకు కొత్త కథ చెబుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతోనే తాము మద్దతు ఇచ్చామన్న వాదనను అధికారపార్టీ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే తరపున అభ్యర్థియే కదాని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
ఒకవైపు బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది.  అంతేకాదు... తెలంగాణలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ టూర్‌ను అడ్డుకునేందుకు గులాబీపార్టీ అనుబంధ విభాగాలు సిద్ధమవుతున్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఓయూలో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌వీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు యూనివర్సిటీలు వేదికలు కాబోవని టీఆర్‌ఎస్‌వి నేతలు అంటున్నారు.  శనివారం ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌వీ నిర్ణయించింది. మొత్తానికి  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో  టీఆర్‌ఎస్‌ విభేదిస్తూనే... బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో ఉంది.

 

06:37 - August 6, 2018

ఈనెల 12నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు దశల వారీగా ఆందోళన బాట పట్టనున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ర్టం తీసుకుంటున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. కేంద్రం అనుసరిస్తున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, పాలకులు అనుసరిస్తున్న విధి విధానాలపై టెన్ టివి జనపథంలో UTF తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి చావా రవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:56 - July 28, 2018

ఢిల్లీ : లారీల సమ్మెపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. లారీ యజమానుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీనిచ్చింది. రవాణా, రహదారులశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్టు లారీ యజమానులు ప్రకటించారు.
లారీ యజమానుల సమ్మెతో దిగొచ్చిన కేంద్రం..
లారీ యజమానుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చింది. దీంతో లారీల సమ్మెను యజమానులు విరమించారు. శుక్రవారం కేంద్ర రవాణాశాఖతో ఏఐఎంటీసీ చర్చలు జరిపింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని లారీ యజమానుల సంఘం కోరింది. కేంద్ర ప్రభుత్వం కూడా లారీ యజమానుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చింది. ఇతర డిమాండ్లనూ పరిశీలిస్తామని చెప్పింది. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు లారీ యజమానులు ప్రకటించారు. దీంతో 8 రోజుల నుంచి గోడౌన్లకు పరిమితమైన లారీలు మళ్లీ రోడ్డెక్కాయి.
8 రోజులుగా స్తంభించిన రవాణా..
ప్రధానంగా డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఈనెల 20న లారీ యజమానులు నిరవధిక సమ్మెకు దిగారు. లారీల సమ్మెతో 8 రోజులుగా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం లారీ యజమానులకు చర్చలకు పిలిచింది. ఇరువర్గాల మధ్య జరిగిన చర్చల్లో... థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై సడలింపు ఇచ్చారు. ఫిట్‌నెట్ సర్టిఫికెట్‌ను రెండేళ్లకోసారి రెన్యువల్‌ చేయనున్నారు. దీనిలో 20శాంత మినహాయింపు ఇస్తామని తెలిపారు. వే బిల్లులపై జీఎస్‌టీని ఎత్తేయనున్నారు. సాధారణ రవాణా లారీలకు కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధనపైనా సడలింపులు ఇచ్చారు. ఓవర్‌ లోడులపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపడతామని, లారీల్లో లోడు ఎత్తుపై ఒకే విధానం ప్రకటిస్తామని తెలిపారు. కీలకమైన ఇన్‌కంట్యాక్స్‌ కూడా ఎత్తేస్తామని కేంద్రం హామీనిచ్చింది. 

17:52 - July 7, 2018

కడప : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక  ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. కార్మిక వ్యతిరేక పార్టీగా బీజేపీ ముద్ర వేసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను మారుస్తూ కార్మికులపై దాడులు చేస్తున్నారని గఫూర్‌ ఆరోపించారు. కార్మికులను బానిసలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. 

 

17:31 - July 7, 2018

విజయవాడ : జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ కేంద్రం నడవమన్నట్లుగా నడుస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఆరోపించారు. పవన్‌ నటించిన సినిమాల్లో ఒక్క జాని సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ వేరే డైరెక్టర్లు చేసినవే అని.. ఇప్పుడు రాజకీయం కూడా కేంద్రం డైరెక్షన్‌లోనే నడుపుతున్నాడన్నారు. చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి పదవి నుంచి.. పవన్‌ రాజీనామా చేయమనడం హస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనే హక్కు పవన్‌కు లేదన్నారు. దీని వెనుక ఎవరున్నారనేది మోదీయా లేక జగనా అనేది పవన్‌ చెప్పలన్నారు.

 

06:25 - July 4, 2018

హైదరాబాద్ : బీఈడీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీఈడీ చదివిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకూ అర్హులను ప్రకటించింది. 2010 నాటి గెజిట్‌ను సవరిస్తూ.. కొత్త గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. బీఈడీ చేసిన వాళ్లు ఎస్జీటీలుగా నియమితులైతే... రెండేళ్లలో ఆరు నెలల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఆదేశించింది. డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా ఇప్పటివరకు డీఈడీ చేసిన వారికి మాత్రమే అర్హత ఉండటంతో. ఓవైపు కేంద్రం నిర్ణయం పట్ల బీఈడీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే... డీఈడీ విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

12:43 - April 22, 2018

ఢిల్లీ : పోక్సో చట్ట సవరణ ఆర్టినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా ఇకపై 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధిస్తారు. గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోవడంతో... నిన్న కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ విడుదల చేశారు. దీనికి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధిస్తారు. ఇక ఈ కేసు దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు, ఆస్పత్రులకు ఫోరెన్సిక్‌ కిట్లను అందించాలని నిర్ణయించారు. ఇక 12 నుంచి 16 ఏళ్ల బాలికలపై లైంగికదాడులకు పాల్పడితే గతంలో కంటే కఠిన శిక్ష విధించనున్నారు. అలాగే మహిళలపై లైంగికదాడులకు పాల్పడితే శిక్షను ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని నిర్ణయించారు. 

 

10:59 - April 22, 2018

ఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. పోక్సో చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కథువా, సూరత్‌, ఎటా, ఛత్తీస్‌గఢ్‌, ఇండోర్‌...దేశంలో ఎక్కడో ఓ చోట చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.  ఈ ఘటనలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుండడంతో . ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిపింది.

సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో పోక్సో చట్టాన్ని సవరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే దోషులకు మరణశిక్ష విధించేలా మోది ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ కేసుల్లో విచారణ 2 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారి శిక్షను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు.

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపనున్నారు. వర్షాకాల సమావేశాల్లో ఈమేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. 

07:21 - March 21, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. నాబార్డు ద్వారా 1400 కోట్లు రుణం మంజూరుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర జలవనరుల శాఖకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఆడిట్లు వచ్చిన తర్వాత మిగిలిన 300 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Central Government