chennai

10:10 - December 7, 2017

చిత్తూరు : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి జాతీయ రహదారి రతువరం కుడ్చి వద్ద ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొంది. దీనితో 9 మంది అక్కడికక్కడనే మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 15 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు..ముగ్గురు పిల్లలన్నారు. కన్యాకుమారి నుండి తిరుపతికి వస్తుండగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా బస్సు ప్రయాణిస్తుండడం..డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

06:45 - December 6, 2017

చెన్నై : విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని... విశాల్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన పది మందిలో ఇద్దరి సంతకాలు సరిగా లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్‌ తిరస్కరించారని , దీని వెనుక కుట్ర ఉందని విశాల్‌ ఆరోపించారు.

300 మంది అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం చివరి నిమిషంలో విశాల్‌ అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అఫిడవిట్‌లో లోపాల కారణంగా దీపా జయకుమార్‌ నామినేషన్‌ తిరస్కరించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. తన నామినేషన్ తిరస్కరణ వెనుక కుట్ర ఉందంటూ దీప ఆరోపించారు.

ఆర్కేనగర్‌ నియోజవర్గంలో విశాల్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని రాజకీవర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశమైంది. విశాల్, దీపల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో అన్నాడిఎంకే, డిఎంకె, శశికళ మేనల్లుడు దినకరన్‌ల మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశముంది.జయలలిత మృతితో ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈనెల 21న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది.

21:14 - December 5, 2017

చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికకు హీరో విశాల్ నామినేషన్ ను అంగీకరించారు. ముందు నామినేషన్ ను తిరస్కరించినా...విశాల్ వివరణ ఇచ్చిన తర్వాత రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను స్వీకరించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

19:46 - December 5, 2017

తమిళనాడు : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో హీరో విశాల్, జయలలిత మేనకోడలు దీపకు ఈసీ షాక్ ఇచ్చింది. నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయంటూ తిరస్కరించింది. నామినేషన్ తిరస్కరణకు నిరసనగా విశాల్ అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  నామినేషన్ తిరస్కరణపై విశాల్ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించినట్లు విశాల్ ఆరోపిస్తున్నారు. 

 

20:00 - December 2, 2017

ఢిల్లీ : కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఓక్ఖీ తుపాను అతలాకుతలం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యానికి ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రాష్ట్రాల్లోనూ వంద మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికీ సముద్రంలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు.. అధికారులు.. యుద్ధనౌకలను వినియోగిస్తున్నారు. మరోవైపు.. డిసెంబర్‌ ఐదు నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఓక్ఖీ తుఫాను.. దక్షిణాదిని ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. తమిళనాడులోని తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాపై.. ఓక్ఖీ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఓక్ఖీ కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే 13 మంది మరణించారు. కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లకు చెందిన సుమారు 531 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిలో 393 మందిని రక్షించారు. తమిళనాడులో ఇప్పటికీ 60 మంది జాడ తెలియడం లేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధనౌకలు గాలిస్తున్నాయి. తీరం వెంబడి కోస్ట్‌గార్డ్‌, వైమానిక, నావికాదళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

తుపాను దెబ్బకు తమిళనాట.. సుమారు నాలుగు వేలకు పైగా విద్యుత్‌ లైన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో.. కన్యాకుమారి జిల్లా మొత్తం అంధకారంలో ఉండిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. అమిత వేగంగా వీస్తోన్న గాలుల వల్లే అత్యధిక నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా.. తమిళనాట.. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్‌ చేసి.. రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అటు కేరళలోనూ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రానికి వచ్చిన పర్యటకులు.. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన వారు.. బయటకు రావద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం పదేసి లక్షల రూపాయల మేర పరిహారం ప్రకటించింది. ఒక్ఖీ తుపాను.. లక్షద్వీప్‌ను కూడా అతలాకుతలం చేస్తోంది. లక్షద్వీప్‌ పరిధిలోని కాల్పేని ద్వీపంలో వర్షం ధాటికి సముద్ర నీటిమట్టం బాగా పెరిగింది. కొబ్బరిచెట్లు కూకటివేళ్లతో సహా ఒరిగిపోయాయి. తీరంలో ఆపిన బోట్లు దెబ్బతిన్నాయి. లక్షద్వీప్‌ పరిధిలో 31 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వెయ్యికి పైగా ప్రజలు ఇందులో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం తుపాను లక్షద్వీప్‌ వద్ద ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో ముంబై, గుజరాత్‌ దిశగా సాగే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

మరోవైపు.. డిసెంబర్‌ ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా తుపాను గండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్‌ ఐదున అల్పపీడనం బలపడి.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించే సువర్ణముఖి, కాళింగి నదుల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాల అధికారులకు ప్రభుత్వం సూచించింది. 

21:44 - December 1, 2017

హైదరాబాద్ : ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో, కోల్‌కతాలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. కార్తి చిదంబరం మామ ఎస్‌ కైలాసం, రామ్‌జీ నటరాజని, సుజయ్‌ సాంబమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2006లో జరిగిన ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎయిర్‌సెల్‌లో 3 వేల 500 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మారిషస్‌కు చెందిన మ్యాక్సిస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. 600 కోట్లు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చే అధికారం ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీకి మాత్రమే ఉంది. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సొంతంగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 

 

21:42 - December 1, 2017

హైదరాబాద్ : ఓఖి తుపాను తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌ను అతలాకుతలం చేస్తోంది. బలమైన ఈదురుగాలులతో వందలాది చెట్లు నేలకూలాయి. లక్షద్వీప్‌లో ఎగిసిపడుతున్న అలలతో తీర ప్రాంతం భీకరంగా ఉంది. తుపాను ధాటికి ఇప్పటివరకూ 14 మంది మరణించారు. 30 మంది జాలర్లు గల్లంతయ్యారు. వీరిలో 8 మందిని రక్షించారు. తుపాను ధాటికి తమిళనాడులో 10 మంది, కేరళలో నలుగురు మరణించారు.

కేరళకు చెందిన 30 మంది మత్స్యకారులు గురువారం నుంచి కనిపించకుండా పోయారు. వారిలో 8 మంది జాలర్లను నేవీ రక్షించింది. మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లక్షద్వీప్‌లోని కల్పెనీ ద్వీపం సమీపంలో ఐదు జాలర్ల పడవలు మునిగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. కన్యాకుమారిపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కన్యాకుమారి వద్ద సముద్రం ఉప్పొంగడంతో సుచీంద్రం ఆలయం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ఆలయంలోని ముఖమంటపం నీటితో నిండిపోయింది.

భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో వందల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఓఖీ తుపాను అరేబియా సముద్రం వైపు మళ్లడంతో పెను తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మినికాయ్‌ దీవులకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఓఖీ 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని.... తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

21:30 - November 30, 2017

ఢిల్లీ : తమిళనాడు, కేరళ రాష్ట్రాలను ఓఖీ తుపాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి వందలాది చెట్లు నేలకూలాయి. ఓఖీ బీభత్సానికి నలుగురు మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓఖీ తుఫానుగా మారింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది.

భారీ వర్షాలకు కన్యాకుమారి జిల్లా అతలాకుతలమైంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీస్తుండడంతో వందలాది చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. కరెంట్‌ లేక పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. తుపాను ధాటికి ఇప్పటివరకు నలుగురు మృతిచెందారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడానికి జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తిరునల్వేలి, టుటికొరిన్‌, విరుద్‌నగర్‌, తంజావూర్‌, తదితర జిల్లాల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. దీంతో శబరిమల ఆలయంలో గురువారం సాయంత్రం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. సన్నిధానం, పంబ వద్ద ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని అధికారులు సూచించారు. చెట్ల వద్ద, పల్లపు ప్రాంతాల్లో ఉండరాదని, నదులు, సరస్సులో స్నానాలు చేయవద్దని హెచ్చరించారు. 

15:35 - November 30, 2017

చెన్నై : రెండాకుల గుర్తుపై అన్నాడీఎంకేలో వర్గపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శశికళ వర్గం నేత దినకరన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రెండాకుల గుర్తు పళని-పన్నీర్‌ వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ పళని-పన్నీర్‌ వర్గం, దినకరన్‌ వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ... పళని-పన్నీర్‌ వర్గానికి రెండాకుల గుర్తును కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

15:34 - November 30, 2017

చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు అధికార అన్నాడీఎంకే అభ్యర్థిని ఖరారు చేసింది. ఎఐఎడిఎంకె ప్రిసీడియం ఛైర్మన్‌ ఈ.మధుసూదన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. చెన్నైలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం మధుసూదనన్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పార్టీ పార్లమెంటరీ బోర్టు కోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం, కో కోఆర్డినేటర్‌గా పళనిస్వామి వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మధుసూదన్‌ పోటీ చేశారు. అప్పుడు పన్నీర్‌ సెల్వం వర్గం తరఫున అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పార్టీ నుంచి ఆయన పోటీచేశారు. అయితే కొన్ని పార్టీలు డబ్బులిచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయన్న ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను రద్దు చేశారు. దీంతో మరోసారి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. డిఎంకె అభ్యర్థిగా మరుదు గణేష్, శశికళ వర్గం నుంచి టిటివి దినకరన్‌ పోటీలో ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్‌కె నగర్‌ ఖాళీ అయింది. ఆర్‌కె నగర్‌కు డిసెంబర్‌ 21న ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్‌ 24న ఎన్నికల ఫలితం వెలువడనుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - chennai