CM chandrababu

15:50 - August 14, 2018

గుంటూరు : ఇప్పటివరకు పనిచేసిన ప్రధానులల్లో అత్యంత వైఫల్యం చెందిన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచిపోతారని మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో నరేంద్రమోదీ ప్రజలను అడుగడుగున వంచించారని ఆరోపించారు. ప్రధాని దేశ ప్రజల ఆశలను ఒమ్ముచేశారని... స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా సత్యాలను పలకాలన్నారు. 

 

07:12 - August 14, 2018

గుంటూరు : గురజాలలో అక్రమ గనుల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ అడ్డుకోలేక అమాయకులపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

భారీగా మోహరించిన పోలీసులు..
గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. గురజాలలో అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేత కాసు మహేశ్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై హై కోర్టు మైనింగ్‌ ఆరోపణలు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్‌ అధికారులు గురజాలలో ఉన్న మైనింగ్‌ విలువను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మైనింగ్‌ ప్రాంతాన్ని వైసీపీ నిజనిర్దారణ కమిటీ సందర్శించి బహిరంగ సభను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించుకుంది. దీనికి పోలీసులు అనుమతి కోరగా వారు నిరాకరించారు.

వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మర్రి రాజశేఖర్‌లు దాచేపల్లికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు లోపలికి దూసుకు రావడంతో కాసు మహేష్ రెడ్డి పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవాల్సింది పోయి అక్రమాలను అడ్డుకుంటున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తుందని కాసు మహేశ్‌ రెడ్డి ఆరోపించారు.

బొత్స సత్యనారాయణ అరెస్ట్
అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజాలునిగ్గు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ మైనింగ్‌ వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ప్రమేయం ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌ ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌ను ఆపకపోతే భవిష్యత్‌లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

07:07 - August 14, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2 కోట్ల ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి :చంద్రబాబు
రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్టు పని తీరుని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు.

25 సాగునీటి ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం..
వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీలు, మిగిలిన చెరువులు భూగర్భ జలాలు ఇతర వనరులలో మొత్తం 867 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. 2 కోట్ల ఎకరాలకు, పరిశ్రమలకు అందించేందుకు నీటిని ఎలా వినియోగించాలన్న దానిపై లోతుగా పరిశీలన చేయాలన్నారు. వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్‌ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కట్టడాలు, నిర్మాణాలు జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం.

జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తి..
పోలవరానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని, వర్షాలు పడుతున్నప్పటికీ పనులు అనుకున్న మేర పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం, ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయని... గేలరీ వాక్‌కి స్పిల్ వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయన్నారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను ప్రోత్సహించాలన్న సీఎం
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును లక్ష మంది సందర్శించారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేసి అవహగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తికావాలన్నారు. వచ్చే వారం సమావేశానికి పూర్తి కార్యాచరణతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనులకు చెల్లించే బిల్లులపై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజినీర్ల బోర్డు సమావేశం అవుతోందని, ఆ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.

19:36 - August 13, 2018

పశ్చిమగోదావరి : 'జనసేన' పార్టీ గుర్తును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలులో నిర్వహించిన బహిరంగసభలో పార్టీ గుర్తు 'పిడికిలి' అంటూ ప్రకటన చేశారు. అందరి ఐక్యత చిహ్నంగా ఉంటుందని పవన్ తెలిపారు. అన్ని ప్రాంతాలు కలిసికట్టుగా ఉండి బలాన్ని 'పిడికిలి' ద్వారా చూపించాలన్నారు. కులాల సమైక్యత..అందరి కృషి..అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి..అన్నదే లక్ష్యమన్నారు.

 

19:18 - August 11, 2018

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర సమస్యలపై ఏపీ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ రాళ్లేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని విమర్శించారు. వైఎస్ భారతి పేరును ఛార్జీషీట్ లో నమోదు చేయడంపై జగన్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి దేవినేని ఓ కార్యక్రమంలో ఈ అంశంపై మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతోందని..ఈ ప్రయత్నంలో టిడిపి, ప్రభుత్వంపై రాళ్లు వేయడం సబబు కాదన్నారు. ఎల్లో పత్రికలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంగ్లపత్రికల్లో జగన్ అవినీతి బయటపడుతోందని, ఇంకా రెండు సీబీఐ నివేదికలు బయటకు రాకుండా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ రోజు జగన్ చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయని, మహిళా ఆఫీసర్లు..గోల్డ్ మెడలిస్టులు కోర్టు బోనులెక్కి..జైలుకెళ్లి నానా అవమానాలు పడ్డారని తెలిపారు. అధికార దాహంతో లక్ష కోట్ల దోపిడితో కేసుల్లో ఇరుక్కున్నారని ఆరోపించారు. 

21:08 - August 10, 2018

పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి జరిగేది ద్రోహమేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. టీడీపీని మరోసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని జనసేనాని తప్పుపట్టారు. అధికారంలో ఉండగా ఏం చేశారని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోరాట యాత్రలో పవన్‌ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పోరాట యాత్ర నిర్వహించారు. జనసేనాని సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్‌ విమర్శల వర్షం కురించారు.

టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి అధోగతి తప్పదని జనసేనాని హెచ్చరించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుయుక్తులైనా పన్నుతారని పవన్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి మేలు చేస్తారని గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని బలపరిస్తే.. చివరికి అన్యాయమే జరిగిందని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నేతల వైఖరి ఏరుదాటిన తర్వాత తెప్పతగలేసిన చందంగా ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ కాపులు, బీసీలకు ద్రోహం చేశారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. సామాజిక న్యాయం, రాజకీయ మార్పు, అవినీతి ప్రక్షాళన కోసమే జనసేన ఆవిర్భవించిందని పవన్‌ చెప్పారు. 

18:13 - August 10, 2018

పశ్చిమగోదావరి : 2019 ఎన్నికల్లో టిడిపిని..బాబును ఎన్నుకొంటే ద్రోహం జరుగుతుందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నరసాపురంకు చేరుకున్నారు. సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కులాలు విడగొట్టే పద్ధతి ఆగిపోవాలని పిలుపునిచ్చారు.

15 సీట్లు ఇచ్చిన జిల్లాలో ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని బీసీలకు..కాపులకు..ద్రోహం చేశారని విమర్శించారు. జగన్ కూడా మాట మార్చేశారని..తాను మాట తప్పనన్నారు. అందర్నీ కులాలకు న్యాయం చేస్తానన్నారు. అందరీకి అండగా నిలబడేది జనసేన పార్టీ అని...తాను అందరి కన్నీళ్లు తుడవడానికే వచ్చానన్నారు. ప్రతొక్కరినీ అర్థం చేసుకోవాలని..తదితర కారణాలతో 2014లో పోటీ చేయలేనని..ప్రస్తుతం అందర్నీ అర్థం చేసుకున్నానన్నారు. మత్స్యకారుల సమస్య తనకు బాధిస్తోందని...కోల్డ్ స్టోరేజ్ ..తదితర సమస్యలను టిడిపి పట్టించుకోలేదన్నారు. 

15:26 - August 10, 2018
15:12 - August 10, 2018

హైదరాబాద్ : టిడిపిపై వైసీపీ నేత తమ్మినేని సీతారం పలు విమర్శలు గుప్పించారు. నగరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. టిడిపి ఎలా పుట్టిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలతో పుట్టిందని..కానీ నేడు దానిని పూర్తిగా తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై కుహానా రాజాకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపిని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదన్నారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో టిడిపి ఎంపీలు కాంగ్రెస్ కు ఓటేయాడాన్ని తప్పుబట్టారు. 

14:55 - August 10, 2018

విజయవాడ : నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నిరుద్యోభృతి అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 2014 ఎన్నికల హామీ నేపథ్యంలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని సర్కార్ ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కేవలం వెయ్యితో సరిపెట్టడం సబబుకాదని.. ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ 2014 అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గంపెడు ఆశలు కల్పించారు. 'బాబు వస్తే జాబొస్తుందంటూ.. నిరుద్యోగ భృతి కల్పిస్తామని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులంతా తమకు భృతి అందుతుందని ఆశపడ్డారు. ప్రభుత్వం ఆ స్కీమ్‌ను అమలు చేయకపోవడంతో భృతి కోసం నాలుగున్నరేళ్లుగా వేచిచూస్తున్నారు. రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంది. అదికూడా వెయ్యిరూపాయలే ఇస్తామని ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ ఆశలు ఆవిరిచేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చే వెయ్యికి సవాలక్ష షరతులు విధించి కొందరికే ఆ అవకాశాన్ని కల్పించడంపట్ల యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్లపాటు మొక్కుబడిగా అదిగో ఇదిగో అంటూ మాయమాటలతో కాలం గడిపి.. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భృతి అందించాలనుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
కృష్ణా జిల్లాలో 2.71 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 71 వేల మంది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో తమ పేర్ల నమోదు చేసుకోగా, పేర్లు నమోదు కానివారు సుమారు 2 లక్షల పైచిలుకు ఉంటారని విద్యావంతులు అంచనా వేశారు. అయితే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ తదితర విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎక్కువమందే ఉన్నారు. వీరిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు విద్యకు దూరమౌతుండగా, మరికొందరు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. అర్హత ఉన్నవారు సిఫార్సులు లేనికారణంగా నిరాశ చెందుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ విద్యార్ధి నేతలు మండిపడుతున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్ నాటికి..సీఎం యువ నేస్తం' పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించి 15 రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 12న ఈ వెబ్ సైట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగించి 'సీఎం యువ నేస్తం' పథకాన్ని అమలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో సమాచారం సేకరించి, ఆధార్ అనుసంధానం ఆధారంగా రిజిస్ట్రేషన్లను పకడ్బందీగా నిర్వహిస్తారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నమోదైన రిజిస్ట్రేషన్లనే ఆన్ లైన్ స్వీకరిస్తోంది.

22 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, డిగ్రీ లేదా పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తిస్తామన్నారు అధికారులు. ఎంపికైన వారికి నెలకు వెయ్యి చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. వీరందరికీ 600 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని లెక్కకట్టారు. ఏదైనా సంస్థలో పనిచేస్తూ.. పీఎఫ్ కట్ అవుతున్నవారు లేదా...ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి కింద రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించనున్నారు. అయితే ప్రతినెలా అర్హులైన విద్యార్ధుల వేలిముద్రలు తీసుకుని బ్యాంక్ ఎకౌంట్లలో ఈ మొత్తాన్ని జమచేయనున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - CM chandrababu