CM Chandrababu Naidu

11:04 - October 21, 2017

పశ్చిమగోదావరి : ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లక్ష్యానికి అనుగుణంగా కొనసాగడంలేదు. నిధుల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తోంది. కాంట్రాక్టర్లు లక్ష్యాల మేరకు పనులు చేయకపోవడంతో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యే అకాశం కనిపించడంలేదు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 నుంచి సాగునీరు అందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తున్నా.. సవాలక్ష కారణాలతో కాంట్రాక్టు సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సమీక్షించే సోమవారం మినహా మిగిలిన రోజుల్లో ప్రాజెక్టు పనులు చేయడంలేదున్న ఆరోపణలు ఉన్నాయి. పనుల జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వెళ్లగక్కడం, కాంట్రాక్టర్లను మారుస్తామని చెప్పడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. కాంట్రాక్టు సంస్థలను మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు. దీనివలన ప్రాజెక్టు వ్యయం 30 శాతం పెరుగుతుందని, దీనిని భరించే స్థితిలో కేంద్రం లేదని జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్దేశిత గడవులోగా పూర్తి చేస్తామని చెబుతూవస్తోంది.

9,086.02 కోట్ల రూపాయల నిధులు విడుదల
పోలవరంకు ప్రధాన సమస్యల నిధులు. దీర్ఘకాల నీటిపారుదల నిధి కింది 2016-17లో నాబార్డు దేశంలోని సాగునీటి ప్రాజెక్టులకు 9,086.02 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే, పోలవరంకు మంజూరు చేసిన నిధులు మాత్రం 2,414.16 కోట్లు మాత్రమే. నాబార్డు ఈ ఏడాది దేశంలోని ప్రాజెక్టులకు 9వేల 20 కోట్ల రూపాయలు విదుడల చేయాలని నిర్ణయిస్తే, దీనిలో 979.36 కోట్లు మాత్రమే కేటాయించింది. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం తక్కువ నిధులు కేటాయించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీకుని, కేంద్రంతో చర్చించాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. 

18:38 - October 20, 2017

విజయవాడ : రాష్ట్రాభివృద్ధే తనకు నిజమైన దీపావళి అన్నారు ఏపీ ముఖ్యమత్రి చంద్రబాబు. అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్న ఆయన అయోవా రాష్ట్రాలోని ప్రవాసాంధ్రులతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. అటు పలు కంపెనీల సీఈఓలతో సమావేశం అయిన చంద్రబాబు.. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. పెట్టుబడులతో తరలిరావాలని కోరారు. మీరిపుడు మంచిస్థాయిలో ఉన్నారు.. జన్మభూమిని మరువకండి.. అమెరికాలోని ప్రవాసాంధ్రులతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఐయోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న సీఎం అక్కడి తెలుగు వారితో మాట్లాడారు. చేస్తున్న ఉద్యోగాలతోనే సంతృప్తి పడకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, అందుకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

అయోవా రాష్ట్రంలోని వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రముఖ రాజకీయవేత్త, ప్రస్తుతం ఐయోవా ప్రభుత్వ కార్యదర్శి విలియం హోవార్డ్‌బిల్‌ నార్డేతో బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న రైతు రుణమాఫీ పథకంపై నార్డే పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అటు వేగనింగ్‌ యూనివర్సిటీ అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ ఎల్‌వో ప్రిస్కోతో భేటీ అయిన ముఖ్యమంత్రి.. వ్యవసాయ రంగంలో ఏపీతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ అవసరాల కోసం సంయుక్తంగా గ్లోబల్‌ కన్సార్టియం ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.

సేంద్రియ వ్యవసాయంలో ఏపీ రైతులకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని ఐయోవాలోని మహర్షి వర్సిటీ అధ్యక్షుడిని చంద్రబాబు కోరారు. సేంద్రియ వ్యవసాయంలో భూటాన్‌కు సహకరిస్తున్నట్టే తమ ప్రభుత్వానికి కూడా సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం ఐయోవా రాజధాని నగరంలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ -2017 పురస్కారాల ప్రదానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల, సోమిరెడ్డితోపాటు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఉన్నారు. 

07:50 - October 15, 2017

శ్రీకాకుళం జిల్లా హిరమండలం దుగ్గుపురం, పాడలి, చిన్నకొల్లివలస, ఇరపాడు, తులగాం గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులు ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వందల ఎకరాలను పంటతో సహా జేసిబి, ట్రాక్టర్లతో నాశనం చేశారని కన్నీరు పెట్టుకుంటున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అనురాధ (టిడిపి), ఉమా మహేశ్వరరావు (సీపీఎం), సుధాకర్ బాబు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:49 - October 15, 2017

విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్రకు రెడీ అవుతోన్న వేళ ఆ పార్టీకి పెద్ద షాకే త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌చ్చే నెల 2 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యే టైంకు కాస్త అటూ ఇటూగా వైసీపీ నుంచి కీల‌క వ్యక్తులు జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ పాలిటిక్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీలో జోష్‌ నింపగా.. ప్రతిపక్షాన్ని డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీతో పాటు కాంగ్రెస్‌ నుంచి కూడా కొందరు కీలక నేతలు టీడీపీవైపు తొంగి చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ బుట్టా రేణుక టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బుట్టా రేణుకతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జ‌గ‌న్...క‌ర్నూల్ జిల్లా నేత‌ల‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాము పార్టీ మార‌డం లేద‌ని కొందరు నేతలు చెప్పగా...ఎంపీ బుట్టా రేణుక మాత్రం పార్టీలో కొన‌సాగే విష‌యంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..బుట్టా రేణుక పార్టీ మారడం ఖాయమన్న ప్రచారానికి మరింత బ‌లం చేకూరింద‌ని వైసీపీ నేత‌లు చర్చించుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను కర్నూలు ఎంపీగా కాక..ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్‌ సూచించడంతో వైసీపీని వీడేందుకు ఆమె సిద్ధపడినట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అంగీకరిస్తే..కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే బుట్టా మాత్రం ఇందుకు ససేమిరా అన్నారట. ఎంపిగానే పోటి చేస్తాన‌ని, ఎమ్మెల్యేగా పోటి చేసే ఉద్దేశం తనకు లేద‌ని కుండబద్దలు కొట్టేశారట. ఈ పరిణామాలతోనే బుట్టా రేణుక త‌న‌దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు బుట్టా రేణ‌క భర్త గ‌తంలో చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రేణుక కూడా భర్త బాటలో నడుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త‌న స‌న్నిహితులు,అనుచ‌రుల‌తో సమావేశమైన త‌రువాత..పార్టీ మార్పుపై రేణుక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వ‌ల‌స‌ల‌తో స‌త‌మ‌తమవుతున్న వైసీపీకి బుట్టా రేణుక పార్టీ మారితే మ‌రింత న‌ష్టం త‌ప్పద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

06:46 - October 15, 2017

విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటమితో కుదేలైన వైసీపీని గాడిన పెట్టేందుకు జగన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? మూసపద్ధతిలో కాకుండా వినూత్న పద్ధతిలో పాదయాత్ర ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారా? ప్రజా సమస్యలే ఎజెండాగా బాబు సర్కార్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహాలకు జగన్‌ పదునుపెడుతున్నారట. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు అనుమతి వస్తుందని భావిస్తున్న వైసీపీ నేతలు...జగన్‌ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. అసలు జగన్‌ పాదయాత్రకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. జగన్ పాదయాత్రకు సంబంధించి హాజరు మినహాయింపుల అనుమతులు కోరుతుండగా.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లలో యాత్రకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు మాత్రం అనుమతి వస్తుందని, హాజరు మినహాయింపు సంగతి ఏమౌతుందో చూడాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడక పోయినా..జగన్‌ పాదయాత్రకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

న‌వంబ‌రు 2 నుంచి సుదీర్ఘ పాద‌యాత్రకు శ్రీకారం చుట్టేందుకు జగన్‌ రెడీ అవుతున్నారు. పట్టణాలతో పాటు ప‌ల్లెలు, గ్రామాల్లో విస్తరిస్తేనే పార్టీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పాద‌యాత్ర పూర్తిగా ప‌ల్లెలు, గ్రామాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే పాదయాత్రను అట్టహాసంగా ప్రారంభించేందుకు వైసిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారట. సుమారు లక్ష మందితో పాదయాత్రను మొదలుపెట్టి అధికార పార్టీకి పెద్ద సవాల్‌ను విసరాలని భావిస్తున్నారట. 3 వేల కిలోమీటర్లకు పైగాసాగే పాదయాత్ర అన్ని జిల్లాలను కలుపుతూ 122 నియోజకవర్గాల్లో ఉండేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఈ పాదయాత్రలో జనాన్ని ఆకర్షించేందుకు పీకే కొత్త వ్యూహాలు సిద్ధం చేశారట. నవరత్నాల పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఇవేకాక జనాల నాడిని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి కొత్త హామీలు ప్రకటించాలని భావిస్తున్నారట. ఇక జగన్‌ పాదయాత్రలో మరో ఆసక్తిరమైన అంశంపై ప్రచారం హోరెత్తుతోంది. ప‌ల్లె జ‌నాల‌ను ఆక‌ర్షించేందుకు త‌న తండ్రి మాదిరిగా జ‌గ‌న్ కూడా పంచె ధరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా వైసీపీ అధినేత పాదయాత్రకు సీబీఐ కోర్టు తీర్పు కీలకం కానుంది. 

19:02 - October 14, 2017

ఢిల్లీ : చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేసి మళ్లీ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు దుయ్యబట్టారు. వంశధార నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగుతాయని మధు స్పష్టం చేశారు. 

17:46 - October 12, 2017

హైదరాబాద్ : పోలవరం రీ డిజైన్‌పై అఖిలపక్షం కమిటీ వేసి ప్రధాని వద్దకు వెళ్దామన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనం వహించారో చెప్పాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుతో రాజకీయ లబ్ధి కోసం ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారా? అని పొంగులేటి ప్రశ్నించారు. తెలంగాణలో 100 ప్రాంతాలు ముంపుకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిసినా.. ఎందుకు అడ్వకేట్‌ను పెట్టలేదో.. కేసీఆర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుతో జరిగిన లోపాయకారి ఒప్పందం ఏంటో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

 

10:04 - October 5, 2017

విశాఖ : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయా? ఈ  ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ సిద్ధమవుతోందా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోందా? జీవీఎంసీ ఎన్నికలను ఊహించే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందా? విశాఖలో టీడీపీ జోష్‌పై 10టీవీ కథనం..

విశాఖ తెలుగుదేశం పార్టీలో జోష్‌ కనిపిస్తోంది. జీవీఎంసీకి ఎన్నికలు ఎప్పుడైన రానున్న నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతోంది. నంద్యాల, కాకినాడలో గెలిచిన సమరోత్సాహంతో ముందుకెళ్తోంది. ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను ఇప్పటి నుంచే నేతలు సిద్ధం చేస్తున్నారు.

జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నేతలు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. టీడీపీ నేతలు ప్రతి ఇల్లును తిరుగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇందులో భారీగా టీడీపీ క్యాడర్‌ పాల్గొంటోంది. 

ఒక టీడీపీనేకాదు... దాని మిత్రపక్షమైన బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది.  ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక నెరవేర్చిన హామీలపైనే నేతలే ఫోకస్‌ పెట్టారు.  విశాఖలోని అన్ని డివిజన్స్‌లోనూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను కొన్ని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. 

ఈ ఏడాది డిసెంబర్‌లోకానీ... వచ్చే ఏడాది ప్రారంభంలోకానీ జీవీఎంసీకి ఎన్నికలు జరుగుతాయని టీడీపీ క్యాడర్‌ అంచనా వేసింది. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికలపై దృష్టిసారించారు. మొత్తానికి టీడీపీ జీవీఎంసీ పీఠంపై కన్నేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది.

18:54 - October 4, 2017

కర్నూలు : అమరావతి తరహాలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే పనిగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో కార్పొరేషన్ పార్కులు, వీధి దీపాలు, రోడ్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కేఈ.కృష్ణమూర్తి తెలిపారు. 

18:50 - October 4, 2017

గుంటూరు : ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలవుతోన్న తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో చర్చించారు. పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యక్రమం అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై సీఎం ప్రధానంగా చర్చించారు. ఇళ్ల నిర్మాణం, పింఛన్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి ఫిర్యాదులపై చర్చించారు. 60 ఏళ్లు దాటిన వికలాంగులకు ఒకే పించన్‌ ఇవ్వడంపై ఫిర్యాదులు వచ్చాయన్న చంద్రబాబు... అర్హులైన వారికి రెండు పించన్లు అందేలా చూస్తామన్నారు. ఎన్ టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్మించిన ఇళ్లకు లక్ష రూపాయల వరకు మంజూరు చేయడంపై సీఎం సానుకూలంగా స్పందించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - CM Chandrababu Naidu