CM KCR

13:44 - March 21, 2018

హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధి ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు కేంద్రాన్ని 24వేల  కోట్లు సాయం అడిగామన్నారు. కాని మోదీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విపక్షసభ్యులు బడ్జెట్‌పై పూర్తిగా అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని  సీఎం విమర్శించారు. అప్పులు చేయకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేంద్రం ప్రభుత్వం కూడా జీడీపీలో 49శాతానికై పై అప్పులు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌డీపీలో 21శాతం మాత్రమే అప్పుల తీసుకుంటోందన్నారు. 

13:40 - March 21, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ హయాంలో మిడ్‌మానేరుకు ఎలాంటి అనుమతులూ తీసుకరాలేదని మంత్రి హారీష్‌రావు అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులకు రీ డిజైన్‌ చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో పంపిన ప్రతిపాదనలు బాగా లేవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ పంపిందని అన్నారు. రీ ఇంజనీరింగ్‌ చేసిన తర్వాతే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతులు ఇచ్చిందని మంత్రి హారీష్‌రావు అన్నారు

 

07:56 - March 21, 2018

రాష్ట్ర అప్పులు చేస్తుంది..కానీ అభివృద్ధి జరగడం లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి, టీఆర్ఎస్ నేత మన్నె గోదర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అప్పులు ఘనంగా చేస్తున్నారని..అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:47 - March 21, 2018

కారణాలేవైనా.. కుల దురహంకార హత్యలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. కాలం మారింది. కులం పోయింది.. అన్న మాటలు ఒట్టిదే అన్నట్లుగా కులం.. పేరుతో... జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. పాలకుల చర్యలు వీటిని ఆపలేకపోతున్నాయి. అసలీ కులదురహంకార హత్యలకు కారణాలేంటి.. వీటిని ఆపాలంటే.. తీసుకోవాల్సిన చర్యలేంటి.. అనే అంశంపై 10టీవీ ప్రత్యేక చర్యను చేపట్టింది... ఈ అంశంపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:29 - March 21, 2018

కరీంనగర్ : బహుజనులకు రాజ్యాధికారం అందించేందుకు బీఎల్‌ఎఫ్‌ పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు తమ్మినేనితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేసీఆర్‌ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తున్నారని... బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, రైతులకు మద్దతు ధర ఇస్తామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

 

07:24 - March 21, 2018

పెద్దపల్లి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని  కాంగ్రెస్‌ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించడం, 11 మందిని సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి  రాజ్యసభ సీట్లు ఇవ్వని టీఆర్‌ఎస్‌ వైఖరిని శ్రీధర్‌బాబు తప్పు పట్టారు. 

 

20:30 - March 20, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందన్న ప్రతిపక్షాల విమర్శలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తిప్పకొట్టింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 21 శాతం అప్పులు ఉన్నాయని బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం ఇస్తూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని సీపీఎం, బీజేపీ, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 
చర్చకు మంత్రి ఈటల సమాధానం 
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 15న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చ ముగిసింది. చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం ఇచ్చారు. ఈటల సమాధానం సందర్భంగా విపక్ష సభ్యులు అప్పులు విషయాన్ని ప్రస్తావించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని.. అప్పులు చేయడం  తప్పుకాదని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు రుణాలు తీసుకోక తప్పదని సభ దృష్టికి తెచ్చారు. 
రుణమాఫీ ప్రచార ఆర్భాటంగా మారిందన్న లక్ష్మణ్  
బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు లక్ష్మణ్‌... వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ప్రస్తావించారు. రైతుల రుణమాఫీ ప్రచార ఆర్భాటంగా మారిందని విమర్శించారు. 
సీపీఎస్‌ రద్దు చేయాలన్న సున్నం రాజయ్య 
చర్చలో పాల్గొన్న సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య... కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంతో రిటైన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయాలని సభ దృష్టికి తెచ్చారు. 
లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు : ఈటల 
బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానం ఇస్తూ.. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న విషయాన్ని ప్రస్తావించారు. లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకొంటున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. 
బీజేపీ, సీపీఎం, టీడీపీ సభ్యులు వాకౌట్‌ 
ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ, సీపీఎం, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ ముగిసిన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ మధుసూదనాచారి అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు. 

 

20:24 - March 20, 2018

హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడులో మాతృభాష బోధన విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. తెలుగు సబ్జెక్ట్‌కు సిలబస్ రూపొందించాలని తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
 

 

20:19 - March 20, 2018

రాజన్న సిరిసిల్ల : ప్రజా సేవ చేయాల్సిన నాయకులు... ప్రజల భూమిని కాజేయడమే పనిగా పెట్టుకున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న తమ భూమిని.. సర్పంచ్‌ కబ్జా చేశాడని బాధితులు మండిపడుతున్నారు. ఆయన అక్రమాల నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కంగళ్ళపల్లి మండలం అంకుషపూర్‌ గ్రామస్థులు.
5 ఎకరాల మిగులు భూమిపై కన్నేసిన సర్పంచ్‌ 
ఎన్నికల్లో ప్రజాసేవే మా లక్ష్యం అని చెప్పే నాయకులు.. అధికారంలోకి రాగానే అక్రమాలే పనిగా పెట్టుకుంటున్నారు.. ప్రజా సమస్యలు తీర్చాల్సిన నాయకులు వారే సమస్యగా మారుతున్నారు.. గత కొన్ని నెలల క్రితం ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంకుషాపూర్‌లో అధికారులు సర్వే చేశారు. దీంతో ఐదెకరాలు మిగులు భూమి తేలింది... దానిపై కన్నేశాడు ఆ ఊరి సర్పంచ్‌ అడ్డగట్ల భాస్కర్‌...  దాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం నుంచి పట్టా  పొందాడని ఆ పొలం యజమానులు ఆరోపిస్తున్నారు.
న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం
తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న సర్వేనంబర్ 571, 572, 573, 575 భూమి సర్పంచ్‌ భార్య, తల్లి పేరుతో విలేజ్‌ రెవెన్యూ అధికారి కార్యాలయంలోని జాబితాలో పేర్కొనడం అన్యాయం అంటున్నారు బాధితులు. ఈమేరకు అధికారులకు బాధితులు వినతిపత్రం కూడా ఇచ్చారు. ఆ భూమిపై ఐదు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని.. ఇలా తమ పొట్టకొట్టడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.  గతంలో ఉపాధి హామీ పనుల్లోనూ సర్పంచ్ అవకతవకలకు పాల్పడ్డాడనీ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.... విచారణలో  వాస్తవాలు తేలడంతో  ప్రభుత్వానికి లక్షరూపాయలు చెల్లించాడని  చెబుతున్నారు. ఈ భూమి విషయంలో అధికారులు స్పందించకుంటే.. కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
 

 

18:35 - March 20, 2018

కరీంనగర్ : బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు. కరీంనగర్ లో బీఎల్ ఎఫ్ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణలోని 113 స్థానాలకు అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. ప్రజలు ఆశించిన స్థాయిలో కేసీఆర్ పాలనలేదన్నారు. రాష్ట్రం పోలీసు రాజ్యంగా ఏర్పడిందని విమర్శించారు. సభకు ముందు తిమ్మాపూర్ నుంచి సభాస్థలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఎల్ ఎఫ్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - CM KCR