Congress

09:34 - September 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. అధికారమే లక్ష్యంగా జట్టు కట్టిన మహా కూటమి పార్టీల మధ్య తొలిదశ చర్చలు పూర్తయ్యాయి. పొత్తులు, పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై పార్టీలు...కాంగ్రెస్ కు ప్రతిపాదనలు అందజేశాయి. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలపై అంచనా వేసి...సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చలు జరపాలని మహాకూటమి నేతలు నిర్ణయించారు. 

తెలంగాణలో మహాకూటమిలోని పార్టీల మధ్య...తొలి దశ చర్చలు విజయవంతంగా ముగిశాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌ స‌మితిలు క‌లిసి మహాకూటమి ఏర్పాడాలని నిర్ణయించాయి. కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్ళాల్సిన వ్యూహాలపై తొలిదశ చర్చలు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌కు కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే బాధ్యతను అప్పగించిన మిగతా పార్టీలు... కూటమి ఏర్పాటు కోసం పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకోసం కూటమి పక్షాలు సహా కాంగ్రెస్ పరిస్థితి, అభ్యర్థుల బలంపైనా సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాదు బాధ్యతను పెద్దన్నకే అప్పగించాయి కూటమిలోని పార్టీలు.

సర్వే కోసం తాము పోటీ చేయాలనుకున్న సీట్లపై టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కసరత్తు పూర్తి చేసి ప్రతిపాదిత జాబితాను కాంగ్రెస్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో 30 స్థానాలను కోరుతున్న తెలుగుదేశం పార్టీ....20 మందికి సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీకిచ్చింది. జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలకు చోటు కల్పించారు.  

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ...కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయనున్నారు. టీటీడీ బోర్డ్ మెంబరు పెద్దిరెడ్డి హుజురాబాద్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఉప్పల్ లేదా కుత్బుల్లాపూర్-వీరేందర్ గౌడ్, ఖైరతాబాద్- బీఎన్ రెడ్డి, శేరిలింగంపల్లి- మండవ వెంకటేశ్వరరావు, రాజేంద్రనగర్- భూపాల్ రెడ్డి, కంటోన్మెంట్- ఎంఎన్ శ్రీనివాస్, ఆర్మూరు- ఆలేటి అన్నపూర్ణమ్మ, మిర్యాలగూడ- శ్రీనివాస్, ఖమ్మం- నామా నాగేశ్వరరావు, దేవరకద్ర -రావుల చంద్రశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్- కూన వెంకటేశ్ గౌడ్, మక్తల్ -కొత్తకోట దయాకర్ రెడ్డి, పరకాల-రేవూరి ప్రకాశ్ రెడ్డి, కోదాడ-బొల్లా మల్లయ్య యాదవ్, సత్తుపల్లి-సండ్ర వెంకటవీరయ్య, జడ్చర్ల-ఎర్రశేఖర్, మహబూబ్ నగర్-చంద్రశేఖర్, కూకట్ పల్లి-శ్రీనివాసరావు, ఆలేరు బండ్రు శోబారాణిలకు జాబితాలో చోటు కల్పించారు. కాంగ్రెస్ కు ఇచ్చిన జాబితాలో...కనీసం 15 సీట్లు పట్టుబట్టాలని టీటీడీపీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో 15 సీట్లలో గెలుపొందిన టీడీపీ...ఈ ఎన్నికల్లోనూ గెలిచే స్థానాలను వదిలిపెట్టకూడదని నిర్ణయించింది. 

19:02 - September 21, 2018

కర్ణాటక : కన్నడలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ముంచుకొచ్చినట్లుగా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటుకు నానా కష్టాలు పడి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి ప్రభుత్వం కూలిపోనుందా? సంకీర్ణప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. బీజేపీ నేతలు గవర్ణర్ ను కలిసేందుకు సన్నద్ధం అవతున్న నేపథ్యంలో వీటికి బలం చేకూర్చేలా వాతావరణ వేడెక్కింది. కాంగ్రెస్, జేడీఎస్ నుండి దాదాపు 20మంది ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. తమ డిమాండ్లకు కుమారస్వామి ఒప్పుకోవాలని ముంబై నుండి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెలే్యలు కథను నడిపిస్తున్నారు.  దీనికోసము కాచుకుని కూర్చున్న బీజేపీ వారిని తమవైపు లాక్కుని ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పావులు కదుపుతోంది. దీనిపై స్పందించి ముఖ్యమంత్రి కుమార స్వామి ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.15 కోట్లు ఎరవేసి తమవైపు లాక్కునేందుకు బీజేపీ బేరసారాలు నడుపుతోందని ఆరోపించారు. ఈ హాట్ హాట్ వాతావరణం చూస్తుంటే కుమారస్వామి సీెఎం పదవి ప్రమాదంలో పడినట్లుగా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

16:04 - September 21, 2018

న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు సెస్టెంబర్ 29 తేదీని సర్జికల్ దినోత్సవం రోజుగా పాటించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీచేసింది. పాకిస్థాన్ భూభాగంలో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు సంఘీభావంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆరోజు ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉత్తరాలను యూజీసీ పంపించింది.

యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) అద్యాపకులు విమర్శించారు. ఇది విశ్వవిద్యాలయాల్లో యుధ్ధ టాంకులను మొహరింపచేయడమేనని.. దీని ద్వారా బీజేపీ నేతలు తమను తాము జాతీయవాదులుగా నిరూపించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.


రాజకీయ లబ్దికి బీజేపీ కుట్ర : కాంగ్రెస్

సర్జికల్ స్ట్రైక్ దినోత్సవాన్ని జరపాలని యూజీసీ ఆదేశించడం రాజకీయ దురుద్దేశమేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీని ద్వారా రాజకీయ లబ్దిపొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కపిల్ సిబాల్ విమర్శించారు. ఇటువంటి చర్యలవల్ల విశ్వవిద్యాలయాలు స్వతంత్రతను కోల్పోతాయని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూజీసీ ఈ తరహా సర్కులర్‌లను జారీచేయలేదని సిబాల్ పేర్కొన్నారు.

09:31 - September 20, 2018

హైదరాబాద్ : అధికార పార్టీకి చెమటలు పట్టించాలని ఏర్పడిన మహాకూటమిలో సీట్లకోసం సిగపట్లు పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లిస్తే.. ఎన్ని గెలుస్తారు.. అడిగినన్ని సీట్లూ ఇస్తే గెలుతీరం చేరగలమా.. అన్న సంశయాలు కూటమి నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పొత్తుల్లోనూ ఎత్తులూ పైఎత్తులు వేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాలని ఒక్కటైన మహకూటమి నేతలకే చెమటలు పడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన మహాకూటమిలో  సీట్లకోసం నేతలు  సిగపట్లు పడుతున్నారు. ఎవరికెన్ని సీట్లివ్వాలి.. ఇచ్చినవాటిలో ఎన్ని గెలుస్తారు.. అన్నదానిపై సీరియస్‌గా హోమ్‌ వర్క్‌ చేస్తున్నారు.

సీట్ల విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిన హస్తం పార్టీ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చింది. మరోవైపు 119 సీట్లలో ఏ స్థానంలో ఎవరు గెలుస్తారన్న దానిపై కసరత్తుకు దిగుతున్నాయి మహాకూటమిలోని పార్టీలు. మొత్తానికి అంతర్గత నివేదికల ఆధారంగానే సీట్ల సర్దుబాటుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌ సర్వే ప్రకారం టీడీపీకి 12 నుంచి 14 సీట్లు, సీపీఐ, టీజేఎస్‌కు చెరో మూడు సీట్లన్న  అంచనాకొచ్చినట్లు సమాచారం. టీడీపీ తాము చేయించుకున్న సర్వే ప్రకారం 20 స్థానాలకుపైగా  గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక సీపీఐ  8 నుంచి 9 సీట్లు అడుగుతుంటే.. టీజేఎస్‌ 15 సీట్ల దగ్గర ఉంది.  

మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం పొత్తులు పొత్తులే.. ఎత్తులు ఎత్తులే అన్న చందంగా అడుగులేస్తోంది.  ఏదిఏమైనా తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది కాంగ్రెస్‌.  టీజేఎస్‌తో పొత్తు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. తమకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఖమ్మం జిల్లాతోపాటుపాటు.. హైదరాబాద్‌ శివార్లలో పొత్తుల్లో గెలిచేంత బలం ఉందంటోంది టీడీపీ.  ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పొత్తుల్లో విజయం సాధించేంత బలం ఉందని సీపీఐ నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ -సీపీఐ కలిసి పోటీచేసినా.. చివరినిమిషంలో సీపీఐకి కేటాయించిన పలుసీట్లలో కాంగ్రెస్‌ రెబల్స్‌ నిలబడ్డారు. దీంతో సీపీఐకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. మళ్ళీ అదే జరిగితే...  ఈసారి సీపీఐ కంటే తమకే ఎక్కువ నష్టమని భావిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.  మొత్తానికి మహాకూటమి నేతలకు సీట్ల పంపకం సవాల్‌గానే కనిపిస్తోంది.

22:13 - September 19, 2018

హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం  తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి..టీఆర్ఎస్ లో విలీనం చేసిన అనంతరం తెరమరుగు అయిపోయిన రాములమ్మ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుస్తు ఎన్నికల్లో రాములమ్మ చక్రం తిప్పనుంది. టీఆర్ఎస్ లో ఎంపీగా పనిచేసిన ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఆమెను టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధిష్ఠానం నియమించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

 

19:33 - September 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం శంఖం పూరించిన వేళ టీ.కాంగ్రెస్ లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ..పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పదోన్నతి లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు.

 

18:58 - September 19, 2018

హైదరాబాద్: మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకొని ఆర్భాటంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సైతం స్పందించారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లట్ ఆధ్వర్యంలో కొంత మంది నేతలను ఎన్నికల బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. ఫ్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో సభ్యునిగా సురేష్ రెడ్డి పేరును కూడా చేర్చి జాబితాను విడుదల చేశారు. పార్టీని వీడిపోయిన వారికి కూడా ఎన్నికల బాధ్యతలు ఎలా అప్పగిస్తారని కొందరు అసంతృప్తి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారినా మాకు సంబంధం లేదు ‘వదల బొమ్మాళీ వదలా’ అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ తన పరువును తనే తీసుకుంది.

 

17:07 - September 18, 2018

కర్నూల్ : కాంగ్రెస్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అనీ..అందుకే ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే సంజీవయ్యగారి నివాసానికి వెళ్లానని రాహుల్ గాంధీ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా వున్న సమయంలో సంజీవయ్యను సీఎంగా చేయాలనే ప్రతిపాదన వచ్చిందని రాహుల్ తెలిపారు. తెలుగు వారైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రధానిగా పీవీ నర్శింహారావులను మీరు గెలిపించారనీ..నిజాయితీపరులైన నాయకులను మీరెప్పుడు గెలిపించారనీ..మాకు అవకాశం ఇస్తే అటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ తయరు చేస్తుందని హామీ ఇస్తున్నాననీ రాహుల్ పేర్కొన్నారు. దేశానికే ఏపీ దశ, దిశ, నిర్ధేశం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీతో సుదీర్ఘమైన అనుబంధం వుందని రాహుల్ గుర్తు చేసుకున్నారు. 

 

15:34 - September 15, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ అయింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిటీల ఏర్పాటుపై స్ర్కీనింగ్ కమిటీ దృష్టి సారించింది.  ఎన్నిక లకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ప్రచార, సమన్వయ, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటుపైనా చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నిన్న ముగ్గురు సభ్యులతో రాహుల్ గాంధీ స్ర్కీనింగ్ కమిటీని వేశారు. భక్తచరణ్ అధ్యక్షతన జ్యోతిమని సెంథిమలై, శర్మిష్ఠ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. 
ప్రచార కమిటీ బాధ్యతలపై కాంగ్రెస్ లో పోటీ పెరిగింది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిలు ప్రచార కమిటీ బాధ్యతలు కోరుతున్నారు. ప్రచార కమిటీ ఆశావహుల్లో కోమటిరెడ్డి, వి.హెచ్, మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ చేరుకున్నారు. 
రాష్ట్రంలో పొత్తులపైనా తుది నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. మహాకూటమి పార్టీలతో పొత్తుపై నిర్ణయానికి కాంగ్రెస్ కమిటీలు వేయయనుంది. కాంగ్రెస్, టీడీపీలు బలంగా ఉన్న స్థానాల జాబితాను రూపకల్పన చేయనున్నారు. టీడీపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలన్న అంశంపై ఢిల్లీ స్థాయిలో చర్చ చేస్తున్నారు. తుది నివేదికను రాహుల్ కు సమర్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. 

 

11:20 - September 14, 2018

ఢిల్లీ : తనకు సినిమా అంటే ప్రాణం...కానీ ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలని అనిపించిందని..అందుకని కాంగ్రెస్ లో చేరానని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల్లో వలసలు...చేరికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వలసలు జోరందుకుంటున్నాయి. పలువురు టికెట్ లు ఆశిస్తూ ఆయా పార్టీలో చేరుతున్నారు. తాజాగా సిని నిర్మాత బండ్ల గణేష్, ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. 

శుక్రవారం ఢిల్లీకి వచ్చిన బండ్ల గణేష్, ఇతర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్  సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటే త్యాగాల పార్టీ అని అభివర్ణించారు. తాను ఎప్పటి నుండో పార్టీ అభిమానినని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడం...నిర్మించడం తాను చేయడం జరిగిందని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవన్ తండ్రిలాంటి వారని..గురువు..కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని పేర్కొన్నారు. జూబ్లిహిల్ నియోజకవర్గం నుండి టికెట్ పోటీ చేయనున్నారా ? అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఎక్కడి నుండి పోటా చేయాలని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Congress