Congress Leader Raghuveera

21:27 - February 18, 2018

కృష్ణా : ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు హాజరై ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యమాన్ని ఖరారు చేశారు. మంగళవారం ఏపీజేఎఫ్‌ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన దీక్ష చేపడతారు. ఈనెల 19 నుంచి 28 వరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 20న రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. టాలీవుడ్‌ నటుడు శివాజీ నేతృత్వంలో ఈనెల 28న కర్నాటకలో సమావేశం ఏర్పాటు చేస్తారు. మార్చి 1న వైసీపీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుంది. వచ్చే నెల 4న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తారు. మార్చి 5న ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలని సీపీఎం నిర్ణయించింది. మార్చి 5న వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరులో భారీ సదస్సు నిర్వహిస్తారు. మార్చి 2న జాతీయ రహదారులు దిగ్బంధానికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల ఆందోళన, చలో పార్లమెంటు నిర్వహిస్తారు. ఇలా ఏ పార్టీకి ఆపార్టీ విడివిడిగా కార్యాచరణ ప్రకటించాయి.ప్రత్యేక హోదా పై చంద్రబాబు బాధ్యతారహితంగా వ్యవహరించారని రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు... ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్న టీడీపీ... ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. ప్రత్యే క హోదా సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణ అవసరమని, దీనిలో అందరూ భాగస్వాములు కావాలని సినీ నటుడు శివాజీ పిలుపు ఇచ్చారు. 

 

21:15 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని ఇవాళ రెస్క్యూ టీమ్‌ వెలికి తీసింది. మరోవైపు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. ఏడేళ్ల అశ్విత మృతదేహాన్ని రెస్క్యూటీం వెలికితీసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఫెర్రీఘాట్‌ బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక అందజేశారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని తెలిపారు. సరస్సుల్లో నడిపే బోటు కృష్ణానదిలో తిప్పడానికి అనుమతి లేదని చెప్పారు. రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని కలెక్టర్‌ నివేదికలో తెలిపారు. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీనును సస్పెండ్‌ చేసింది. మరో 8 మందిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు.

పడవ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని అఖిలప్రియ వివరించారు. మరోవైపు విజయవాడ పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమిఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:57 - November 14, 2017

విజయవాడ : పడవ ప్రమాద ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నిజ నిర్థారణ కమిటీ పరిశీలించింది. పున్నమి ఘాట్‌ వద్ద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ ప్రైవేటు బోట్‌లో ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సేఫ్టీనామ్స్‌ పాటించకపోవడంతోనే 22 మంది మృతి చెందారని పేర్కొన్నారు. పల్లంరాజుతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:36 - November 14, 2017

విజయవాడ : ఫెర్రీ ఘాట్‌ పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఏడేళ్ల చిన్నారి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశ్విత అమ్మ నాన్నమ్మ కూడా ప్రమాదంలో మృతిచెందడం కుటంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నదిలో గల్లంతైన ఒంగోలుకు చెందిన మరో మహిళ సుజన కోసం గాలింపు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

08:42 - November 14, 2017

తూర్పుగోదావరి : పర్యాటకం ముసుగులో కాసుల కోసం వ్యాపారం జరుగుతోందా? పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బోటు యజమానులు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? పర్యాటకుల భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారా? బోటులో ప్రయాణించే పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా? భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారా? కృష్ణానదీ పవిత్రసంగమం దగ్గర జరిగిన బోటు ప్రమాదం... నదీ విహార భద్రతపై ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. మరెన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రమాదంలో పడిన గోదావరి నది పడవ ప్రయాణంపై 10టీవీ ప్రత్యేక కథనం...
పర్యాటకుడి ఆనందంపైనే కొన్ని దేశాల ఆర్థికాభివృద్ధి
బోటు విహారం అంటే ఎవరికి ఇష్టముండదు. అందరూ ఎగిరి గంతేస్తారు. ఆ సంతోషానికి అవధులుండవు.  ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం దొరికినా ఖర్చుతో సంబంధం లేకుండా ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తారు.  ప్రపంచంలో కొన్నిదేశాల ఆర్ధికాభివృద్ది ఆ పర్యాటకుడి ఆనందంపైనే ఆధారపడి ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.  ఆ మంత్రాన్నే గతకొంతకాలంగా ఏపీ ప్రభుత్వం అవలంభిస్తోంది. కానీ అభివృద్దిలో భాగస్వామమవుతున్న పర్యాటకుడి ప్రాణాలకు మాత్రం భరోసా కల్పించలేకపోతోంది. వ్యాపార ధోరణిలో వ్యవహరిస్తున్న బోట్ల యజమానుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో  పర్యాటకుల ప్రాణాలు గాల్లో  కలిసిపోతున్నాయి.
ఓవర్‌లోడ్‌తో పర్యాటకుల ప్రాణాలకు ముప్పు
అఖండ గోదావరి మధ్యలో పాపికొండలు... అద్భుతమైన దృశ్యం. నదిలో ప్రయాణిస్తూ ఆ దృశ్యాన్ని చూడడానికి ఇష్టపడని వారుండరు. అందుకే  బోటులో నదీవిహారం మొదలయ్యింది. గత పదిహేనేళ్లుగా గోదావరి నదిలో బోట్లు నడుస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇప్పుడు ఇదే చాలా మందికి వ్యాపారంగా మారిపోయింది. నాలుగు కాసులు వెనకేసుకునే మోజులోపడి పర్యాటకుల భద్రత గాల్లో వదిలేస్తున్నారు. ఎంతమందిని ఎక్కించుకుంటే అంత డబ్బు వస్తుందనే ధ్యాసలో ఓవర్ లోడ్ తో బోట్లు నడుపుతూ ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు 
నిబంధనలు పాటించని బోటు యజమానులు
గోదావరి నదీ విహారం కోసం  మొత్తంగా 63 ప్రవేట్‌ బోట్లున్నాయి. రాజమహేంద్రవరానికి వచ్చిన పర్యాటకులను ప్రత్యేక బస్సుల్లో పురుషోత్తం పట్నం , పోలవరంకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి పేరంటాలపల్లి కి వెళ్తారు. అటునుంచి  భద్రాచలం వెళ్లాలనుకున్నవారికి వేరే బోటులోకి మారుస్తారు. సాయంత్రం ఐదు దాటితే బోటు ప్రయాణం చేయకూడదన్నది  నిబంధన. కానీ ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. పాపికొండలను చూడాలనుకే పర్యాటకుల కోరిను వీరు తమకు అనుకూలంగా మార్చుకుని వ్యాపారం చేస్తున్నారు.  పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కిస్తారు. ప్రతి పర్యాటకుడికి ఒక లైఫ్‌జాకెట్‌ ఇవ్వాలి. కానీ అవేవీ ప్రైవేట్‌ బోట్ల నిర్వాహకులు పట్టించుకోరు. మరోవైపు తాము అధికారులు సూచించిన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెబుతుంటారు.
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
బోటు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అధికారులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  తనిఖీలు చేసినా, నిర్వాహకుల పెత్తనం ముందు చర్యలు గాలిలో కలసిపోతున్నాయి. దసరా తరువాత పర్యాటకుల తాకిడి  పెరిగి వ్యాపారం జోరుగా సాగుతుంది. బోటు బయలుదేరిన తరువాత తొలుత పోలవరం , ఆ తర్వాత దేవీపట్నం దగ్గర పోలీసులు తనిఖీలు చేయాల్సినప్పటికీ అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. పర్యాటక వివరాల జాబితాను పోలీసులు పరిశీలించి తనిఖీలు చేయాల్సినప్పటికీ ఈ తంతు అప్పుడప్పుడూ చేసి చేతులు దులుపుకుంటున్నారు. బోట్లలో గ్యాస్‌ సిలిండర్లు తరలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దాదాపు అన్ని బోట్లలో ఉంటున్నాయి. పోలీసులు బోటు ఓనర్ల వద్ద మామూళ్లకు అలవాటు పడి భద్రతను గాల్లో కొదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
పర్యాటకుల ప్రాణాలకే ముప్పు
సాధారణంగా పాపికొండలు ప్రాంతానికి వెళ్లిన బోట్లు, లాంచీలన్నీ చీకటి పడకముందే దేవీపట్నం దాటేయాలనే నిబంధన ఉంది. అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రయాణించడం పరిపాటిగా మారింది. ప్రధానంగా గండిపోశమ్మ, కొండమొదలు మధ్యలో పూడుపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు, బండరాళ్లున్నాయి. ఈ ప్రాంతంలోనే నీటి సుడులు సైతం అధికంగా ఉంటాయి. ఇటీవల గండిపోశమ్మ ఆలయం వద్ద ఓ బోటును వెనుకకు మళ్లిస్తుండగా బండరాయికి బలంగా తాకడంతో బీటలువారి నీరు లోపలికి చేరింది. వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నిత్యం వేల మంది బోటులో విహార యాత్రకు వెళ్తున్నా..  వారి వివరాలు ఎక్కడా పూర్తిస్థాయిలో నమోదు కావడం లేదు. దీంతో పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారి వివరాలు సైతం తెలిసే పరిస్థితి లేదు. 
పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించాలి 
గతంలో గోదావరి నదీవిహారం చేసిన ఎంతోమంది పర్యాటకులు ప్రమాదాల్లో చిక్కుకున్న ఘటనలున్నాయి. తాజాగా కృష్ణానదీ పవిత్రసంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనతోనైనా అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో పాటు పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన అవసరముంది. 

 

08:08 - November 13, 2017

కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్యారడైజ్ పత్రాల్లో జగన్ పేరు ఉందని టిడిపి నేతలు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఇరుపక్షాల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో దుర్గా ప్రసాద్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), సీతారాం నాయక్ (టీఆర్ఎస్ ఎంపీ), సుధాకర్ బాబు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

06:26 - November 13, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్యక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు. పడవ ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ నిర్యక్ష్యానికి నిలువుటద్దం ఈ ఘటన అని ఏపీ పీసీసీ అధ్యక్షడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు కృష్ణా నదిలో బోట్లు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ప్రశ్నించారు. అనుమతిలేని బోట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. మరోవైపు పడవ ప్రమాదం దురదృష్టకర సంఘటన అని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వివిధ పక్షాల నేతలు కోరారు. 

18:49 - March 12, 2017

కృష్ణా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చేసిన తప్పులకు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాజీ విప్ సామినేని ఉదయభాను తండ్రి విశ్వనాథం మృతికి నివాళులు అర్పించారు. చట్టవిరుద్ధంగా రాజధాని నిర్మాణం, అక్రమంగా ప్రాజెక్టుల విలువ పెంచడం, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతితో.. చంద్రబాబు.. రాబోయే రోజుల్లో జైలుకెళతారని జోస్యం చెప్పారు. టీడీపీకి సొంత అజెండా అంటూ లేదని.. బీజేపీ ఏం చెబితే అదే చేస్తున్నారని రఘువీరా ఆరోపించారు.

Don't Miss

Subscribe to RSS - Congress Leader Raghuveera