congress party

17:03 - February 12, 2018

హైదరాబాద్ : స్వాతంత్రం అనంతరం గ్రామీణ భారతంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన చట్టాల్లో నరేగా చట్టం ఒకటని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకం సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా వేతనాలు ఇవ్వాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయడం లేదని తెలిపారు. ఈ పద్ధతిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని, నరేగా చట్టం అమలయ్యే విధంగా కాంగ్రెస్, ఐఎన్ టీయూసీ పోరాటం చేస్తుందన్నారు. 

15:54 - February 12, 2018

ఢిల్లీ : తాము తలుచుకొంటే కేవలం మూడు రోజుల్లో ఆర్మీని తయారు చేయగలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ స్పందించారు. భగవత్ చేసిన వ్యాఖ్యలు భారత సైనికులను అవమానపరిచేవిగా ఉన్నాయని, దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను..జాతీయ జెండాను అగౌరవపరిచాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోహన్ భగవత్ సిగ్గు పడాలని తెలిపారు. ఇదిలా ఉంటే భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్మీని..ఆర్ఎస్ఎస్ తో పోల్చలేదని..బీహార్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సమావేశంలో మోహన్ భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ తమ జవాన్లను సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పడితే అదే ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇస్తే మూడు రోజుల్లో స్వయం సేవక్ తయారవుతారని వ్యాఖ్యానించారు. 

13:12 - January 24, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ సిద్దమవుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కారెక్కడం తప్పనిసరా ? ముఖేష్‌గౌడ్‌ గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ఎంఐఎం కారణమా ? ముఖేష్‌ పార్టీ మారేందుకు ఒవైసీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారు. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
ముఖేష్‌గౌడ్‌ వ్యవహారం కాంగ్రెస్ లో చర్చనీయాంశం 
కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీమంత్రి ముఖేష్‌గౌడ్‌ వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాటి నుంచి ఇప్పటివరకు గాంధీభవన్‌ మెట్లు ఎక్కని ముఖేష్‌గౌడ్‌... ఆ పార్టీని వీడుతారా అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. 
వారి బాటలోనే ముఖేష్‌గౌడ్‌ ?
ఇప్పటికే ఎంతోమంది నేతలు టీఆర్‌ఎస్‌లో చేరగా... వారి బాటలోనే ముఖేష్‌గౌడ్‌ కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గులాబీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని... పార్టీలో చేరే ముహూర్తం మిగిలివుందని ముఖేష్‌గౌడ్‌ సన్నిహితులంటున్నారు. అంతా ఓకే అయితే... వచ్చే నెలలో ముఖేష్‌ గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
ముఖేష్ టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు ?  
అయితే.. ముఖేష్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నా రనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తమ్‌, భట్టి విక్రమార్క, జానారెడ్డిలతో పాటు ఎవరితో విభేదాలు లేని ముఖేష్‌.. మూడున్నరేళ్ల తర్వాత టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే.. పీసీసీ నాయకత్వంతో మంచి రిలేషన్‌ ఉన్న ముఖేష్‌గౌడ్‌ పార్టీ మారేందుకు ఎంఐఎం కారణమని తెలుస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సలహాతోనే ముఖేష్‌ కారెక్కనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేయనున్న ముఖేష్‌.. అక్కడ గెలవాలంటే మైనారిటీల ఓట్లు కీలకం. గతంలో కాంగ్రెస్‌-ఎంఐఎం పొత్తుతో ముఖేష్‌గౌడ్‌ ఈజీగా గెలిచారు. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజాగా టీఆర్‌ఎస్‌-ఎంఐఎంల దోస్తీ కొనసాగుతుండడంతో.. ముఖేష్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే... టీఆర్‌ఎస్‌లో చేరితే గెలుపునకు సహకరిస్తానని అసదుద్దీన్‌ ముఖేష్‌గౌడ్‌కు మాటిచ్చినట్లు సమాచారం. అలాగే ముఖేష్‌ కారెక్కెందుకు కేసీఆర్‌తో అసదుద్దీన్‌ మంత్రాంగం నడిపినట్లుగా తెలుస్తోంది. 
వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి
అయితే... టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముఖేష్‌గౌడ్‌ అయిష్టంగానే ఉన్నప్పటికీ... వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే... కారెక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న ముఖేష్‌గౌడ్‌ ముహూర్తం చూసుకొని గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలావుంటే... ఎంఐఎం ఆపరేషన్‌లో ముఖేష్‌ ఒక్కరే ఉన్నారా ? లేక ఇంకేవరైనా ఉన్నారా ? అన్నది ఇప్పుడు హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

 

22:15 - December 22, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోది, బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిజెపి ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పలు అంశాలపై చర్చించింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్షతన తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, 2జీ కేసులో తీర్పు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై సిడబ్లుసి చర్చించింది.

సమావేశం అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ బిజెపిని, ప్రధాని మోదిని టార్గెట్‌ చేశారు. నోట్లరద్దు, గబ్బర్‌సింగ్‌ టాక్స్‌... బిజెపి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఒక్కొక్కటిగా రుజువు అవుతోందని మండిపడ్డారు.  2జీ స్పెక్ట్రం కేసులో వచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ....నిజం ఏమిటో దేశ ప్రజలందరూ తెలిసుకున్నారని రాహుల్ అన్నారు.
బైట్‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

మోది గుజరాత్‌ అభివృద్ధి ఓ బూటకమని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని రాహుల్‌ తెలిపారు. రఫేల్ ఒప్పందం, అమిత్‌షా కొడుకు సంపాదనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్‌ నిలదీశారు. జయ్‌ షా 50 వేల పెట్టుబడి పెడితే అది మూడు నెలల్లో 80 కోట్లయిందని, అదెలా సాధ్యమని అడిగితే జవాబుండదని పేర్కొన్నారు. ఓ పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చేందుకే రాఫెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్‌ విమర్శించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు.

నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 వేలు జమ చేస్తామని మోదీ ప్రజలను నమ్మంచి...వంచించారని రాహుల్‌ అన్నారు. అసలు బీజేపీ ఫౌండేషనే ఓ అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు. 

 

16:15 - December 22, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఆరవరోజు కూడా వాయిదా పడ్డాయి. మన్మోహన్‌కు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ సజావుగా సాగేందుకు, బిల్లులను ఆమోదించేందుకు తాము సిద్ధమేనని ఆజాద్‌ అన్నారు. మాజీ ప్రధానిపై ప్రధాని చేసిన ఆరోపణల అంశంపై కమిటీ తేల్చేవరకు సభ జరగడం సబబు కాదని ఆనంద్‌ శర్త పేర్కొన్నారు. దీంతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను బుధవారానికి వాయిదా వేశారు. 

21:58 - December 19, 2017

ఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై చేసిన విమర్శలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. మన్మోహన్‌కు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. మన్మోహన్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. 
వాడి వేడిగా ప్రారంభమైన సమావేశాలు  
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడవరోజు కూడా వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ అట్టుడుకింది. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్... దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్‌ డిమాండ్‌ను స్పీకర్‌ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. విపక్షాల గందరగోళం మధ్యే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
కాంగ్రెస్‌ వాకౌట్‌ 
ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేసిన నేపథ్యంలో దీనిపై చర్చ అనవసరమని, సభను సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ కాంగ్రెస్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై జీరో అవర్‌లో చర్చకు అనుమతించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. ఆ పార్టీ నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్‌ అనుమతించక పోవడంతో సభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. మరోవైపు లోక్‌సభలో ఆర్జేడి చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌కు జడ్‌ ప్లస్‌ భద్రతను తగ్గించడంపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లాలుకు ఏదైనా జరిగితే ప్రధాని మోది బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్జేడి హెచ్చరించింది. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై చర్చించాలని టిఎంసి సభలో పట్టుబట్టింది.

 

18:45 - December 19, 2017

ఢిల్లీ : పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చే విషయాన్ని రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నందున... పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి  తెచ్చేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి ఏంటని కాంగ్రెస్‌ నేత చిదంబంరం ప్రశ్నించారు. దీనికి జైట్లీ సమాధానమిస్తూ...పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జీఎస్టీ కిందికి పెట్రోల్‌ను తీసుకురావాలంటే రాష్ర్టాలు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రాలు త్వరలో ఏకాభిప్రాయం సాధిస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. 

13:39 - December 19, 2017

హైదరాబాద్ : కులం, మతం, అబద్ధాల ప్రాతిపదికన గుజరాత్‌లో మోడీ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో నెగ్గారని ఆరోపించారు. సొంత ఊరిలో ఓటమి పాలైన మోడీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానితో పోటీపడి బీజేపీని ఎదుర్కున్న గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తలను అభినందించి తీరాలన్న రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరపున వారికి అభినందనలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. 

13:38 - December 19, 2017

ఢిల్లీ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా స్పందించారు. ఎప్పుడూ అవినీతి, అభివృద్ధిపై మాట్లాడే ప్రధాని ఈ ఎన్నికల్లో వాటి ప్రస్తావనే తీసుకురాలేదని రాహుల్‌ విమర్శించారు. అమిత్‌ షా కుమారుడు జయ్‌షా, రాఫెల్‌ విమానాల స్కాంపై మోది నోరు విప్పలేదని ధ్వజమెత్తారు. జిఎస్‌టి, నోట్లరద్దుపై కూడా ఆయన మాట్లాడలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమకు మంచి ఫలితాలే ఇచ్చాయనే రాహుల్‌ అన్నారు. డబ్బు, విద్వేషాలుప్రేమను పంచిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన బిజెపికి అభినందనలు తెలిపారు.

11:40 - December 19, 2017

ఆహ్మాదాబాద్ : నన్ను చంపడానికి కాంగ్రెస్‌పార్టీ కుట్రలు చేసింది.. హస్తంపార్టీ నేతలు పాకిస్థాన్‌తో చేతులు కలిపారు.. పాక్‌లో కొందరికి సుపారీ ఇచ్చారు. ఇదీ.. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు. సరిగ్గా ఇదే అంశం గుజరాత్‌ ఓటర్లపై పనిచేసిందా..? అవుననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.

మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలే
మాజీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలే గుజరాత్‌లో తమ పార్టీ ఆశలు గల్లంతు చేశాయని కాంగ్రెస్‌ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మణిశంకర్‌ అయ్యర్‌ పెట్టిన చిచ్చుతో రెండో దశ ఎన్నికల్లో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వాస్తవానికి మొదటి దశ ఎన్నిక ఎన్నికలు జరిగిన 19 జిల్లాల్లోని 98 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటింగ్‌ శాతం పెరగింది. కాని తుదిదశలో మోదీ అమిత్‌షా టీం సాగించిన ప్రచారంతో కాంగ్రెస్‌ ఆశలు గల్లంతయ్యాయంటున్నారు. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌ జిల్లాల్లో మొత్తం 93 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఖచ్చితంగా ఈ ఏరియాల్లోనే బీజేపీకి భారీగా ఓటింగ్‌ జరగడం.. కాంగ్రెస్‌పై చేసిన విషప్రచారమే అంటున్నారు హస్తంపార్టీ నేతలు.

బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని
గెలవడం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని పాటీదార్‌ ఉద్యమనేతలు మొందటి నుంచి విమర్శలు మొదలు పెట్టారు. సరిగ్గా అదే సరళిలో .. సానుభూతికోసం.. పొరుగుదేశంతో కలిసి కుట్రపన్నారంటూ.. దాంతోపాటు తనను నీచుడంటూ విమర్శించారంటూ మోదీ ప్రచారాన్ని హోరెత్తించారు. మణిశంకర్‌ అయ్యర్‌ సారీ చెప్పినా.. ఇదే విషయాన్ని మోదీ పదేపదే ప్రజల ముందు ప్రస్తావించారు. దీంతో గెలుపు వరిస్తుందనుకున్న గుజరాత్‌లో ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి గుజరాత్‌లో 20ఏళ్లుగా అధికారన్ని అంటిపెట్టుకుని ఉన్న కమలం పార్టీలో మొదటిసారి కలవరం మొదలైందని హర్షం వ్యక్తం అవడం కొసమెరుపు. 

Pages

Don't Miss

Subscribe to RSS - congress party