corruption

21:34 - October 19, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కూతురు మర్యామ్, అల్లుడు మహమ్మద్‌ సఫ్దర్‌లపై పాకిస్తాన్ అవినీతి వ్యతిరేక కోర్టు నేర అభియోగాలు నమోదు చేసింది. నేషనల్ ఎకౌంటబులిటీ బ్యూరో చేసిన అవినీతి ఆరోపణల మేరకు.. వీరిపై అభియోగాలు దాఖలు చేసింది. నవాజ్‌ షరీఫ్, అతని కుటుంబ సభ్యులు, ఆర్థిక మంత్రి ఈశాక్‌ డార్‌లకు వ్యతిరేకంగా మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఎన్ఏబి తనపై విడివిడిగా అవినీతి కేసులు నమోదు చేయడంపై నవాజ్‌ షరీఫ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పనామా పత్రాల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌ జూలై 28న ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. 

21:18 - October 12, 2017

అవినీతి రహిత పాలన అంటారు.. విపక్షాలను ఇరుకున పెట్టడానికి అన్ని అధికారాలను ఉపయోగిస్తారు. కానీ, కమల దళం చేస్తున్న ఘనకార్యాలను మాత్రం పట్టించుకోరు. దేనిపైనా సరైన దర్యాప్తు జరగదు. ఓ పక్క బీజెపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడి పుత్ర రత్నంపైనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ సంగతేమో కానీ, రివర్స్ కేసులు మాత్రం పెడుతున్నారు. కమలం దళం అవినీతి బురదలో కూరుకుపోతోందా? మోడీ పాలనలో ఏం జరుగుతోంది? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
16వేల రెట్లు పెరిగిన ఆ కంపెనీ ఆస్తులు  
ఏడాదిలోనే 16వేల రెట్లు ఆ కంపెనీ ఆస్తులు పెరిగాయి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక.. పెరిగిన అమిత్‌ షా కొడుకు సంపద అడ్డూ అదుపు లేకుండా పెరిగింది. చెప్పేదొకటి..చేసేదొకటిగా సర్కారు తీరు మారింది. ఓవరాల్ గా  పారదర్శకతలేని వ్యాపార లావాదేవీలు కనిపిస్తున్నాయి. అసలు స్థిరాస్తులేమీ లేని కంపెనీలకు కోట్లల్లో రుణాలెలా వచ్చాయి.. ఏం జరుగుతోంది?..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:57 - September 22, 2017

విజయవాడ : అవినీతి అధికారుల భరతం పట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి పనికీ కరెన్సీ నోట్లతో చేతులు తడపాలనే అధికారులపై కొరడా ఝుళిపించేందుకు అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతోంది. వచ్చే నెల 2 నుంచి అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అవినీతి అధికారులు 
ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారుల అవినీతి సర్కారుకు చెడ్డ పేరు తెప్పిపెడుతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందినకాడికి బొక్కడం,  దొరికినంత దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఇకపై ఇలాంటి వారి పప్పులు ఉడకవు. అవినీతి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 
అవినీతిని అంతం చేయాలని చంద్రబాబు పంతం 
రాష్ట్రంలో అవినీతిని అంతం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పంతం పట్టారు. ఇందుకు అనుగుణంగా  అధికారులకు సింహస్వప్నంగా మారేందుకు ఏసీబీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కొంతమంది అధికారులు ఆదాయాన్ని మించి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడుతున్నారు. ఈ జాడ్యాన్ని సమూలంగా రూపుమాపితే 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి ఉన్నారు. శాఖల వారీగా అవినీతి అధికారుల చిట్టా తయారుచేసి, పట్టుకుని చర్యలు తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. 
అవినీతి అధికారులపై ఏసీబీ కన్ను 
అవినీతి అధికారులపై ఏసీబీ ఓ కన్నేసి ఉంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకు 60 మంది అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. వీరిలో 39 మంది లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మరో 21 మంది ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తూ  ఏసీబీకి పట్టపడ్డ పాండురంగారావు  ఇటు ఏపీ, అటు తెలంగాణలో వందల కోట్ల భారీ ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌కు తిరుపతిలో పది కోట్ల రూపాయలకుపైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. కర్నూలు, విశాఖ జిల్లాల్లో పనిచేసిన  డీఎం అండ్‌ హెచ్‌వో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టిన వైనం ఏసీబీ సోదాల్లో తేలింది. తహశీల్దార్లు, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు.. ఇలా  60 మంది ఏసీబీ వలకు చిక్కారంటే అవినీతి ఎంత భారీ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.  దొరికితేనే దొంగ అన్నట్టు... ఏసీబీకి చిక్కకుండా అవినీతి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న అధికారులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాని ఆటకట్టించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. 
అవినీతి కేసుల్లో దర్యాప్తు వేగవంతం 
లంచాల కోసం ప్రజలను పీడిస్తున్నప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య తక్కువేమీలేదు. శ్రీకాకుళం జిల్లాలో మైన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బత్తు హనుమంతరావు ఇసుక రీచ్‌ల అనుమతి కోసం ఐదు లక్షల రూపాయలు డిమాండ్‌ చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. ఏపీ సచివాలయం సిబ్బంది హైదరాబాద్‌ నుంచి అమరావతికి తలివచ్చిన కొత్తలోనే హోం శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌... ఒక కాంట్రాక్టర్‌ నుంచి 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డారు. గత నాలుగు నెలల్లో 44 కేసులకు గాను... 27 కేసుల్లో ఏసీబీ అధికారులు కోర్టుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. 64 కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సకాలంలో అనుమతి లభించింది. శిక్ష ఖరారైన పది మంది అధికారులను సర్వీసు నుంచి తొలగించడంతోపాటు పెన్షన్‌ చెల్లింపును నిలుపుదల చేశారు. అవినీతి కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, మరింత మందికి శిక్షలు పడేవిధంగా చేయాలని ఏసీబీ నిర్ణయించింది. 
అవినీతిలో ఏపీ 19 వ స్థానం 
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసర్చ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారంలో అవినీతిలో గత ఏడాది ఏపీ మొదటి స్థానంలో నిలవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది 19 వ స్థానంలో ఉంది. వచ్చే ఏడాదికి  25 స్థానానికి చేరుకోవాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవినీతి అధికారులపై చర్యలతోనే ఇది సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. 

 

18:53 - September 9, 2017

విశాఖ : విశాఖ జిల్లా ఏపీలో గిరిజనులు అత్యధికంగా కలిగిన జిల్లాల్లో ఒకటి. గిరిజనులకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలన్న లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు అరకు నియోజకవర్గంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఇటీవలే అంతర్జాతీయ గిరిజన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే పెదలబుడు పంచాయతీ పరిధిలోని 20 గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కింద ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు 20 గ్రామాల్లో దాదాపు 1151 మరుగుదొడ్లను గిరిజనులు తమ సొంత డబ్బుతో నిర్మించుకున్నారు. దాదాపు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వానికి బిల్లులు కూడా పెట్టుకున్నారు. డబ్బులు కూడా అధికారులు మంజూరు చేశారు. కానీ ఆ డబ్బులు గిరిజనుల అకౌంట్లలోకి రాలేదు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం 15వేల చొప్పున మొత్తం 1151 మరుగుదొడ్ల కోసం కోటి 75 లక్షలు రూపాయలు మంజూరు చేసింది.

కాంట్రాక్టర్ల ఖాతాలోకి లబ్ది డబ్బులు
ఆ డబ్బులు లబ్ది దారుల ఖాతాల్లోకి వెళ్లకుండా కాంట్రాక్టర్లు స్కెచ్‌ వేశారు. ఆ డబ్బునంతా తమ బంధువుల అకౌంట్లలోకి వెళ్లిపోయాయి. పెదలబుడు మాజీ ఎంపీటీసీ శెట్టి వెంకటరావు, గుమ్య సన్యాసిరావు, గుమ్మ శివకృష్ణ, ఎస్‌. కనకరాజు ఖాతాల్లోకి వెళ్లాయి. శెట్టి వెంకటరావు ఖాతాలోకి 28 లక్షల 70వేల రూపాయలు, కే. రవిరాజు కుమార్‌ ఖాతాలోకి 13 లక్షల 30వేలు, పెదలబుడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దీనబందు అకౌంట్‌లోకి లక్ష 83వేలు, వంతాల గంగులు ఖాతాలోకి మరో 5లక్షల 60వేల రూపాయలు పడ్డాయి. వరకోటి కొండమ్మ అనే మహిళ ఖాతాలోకి 2 లక్షల 63వేల రూపాయలు, సన్యాసిరావు అకౌంట్లో 6లక్షల 34వేలు, శివకృష్ణ ఖాతాలో 6లక్షల 26వేలు, వంపూరు గంగాధర్‌ ఖాతాలో 11లక్షల 13వేలు, సుంకరమెట్ట అభిరాం ఖాతాలోకి మరో ఏడున్నర లక్షలు జమ అయ్యాయి.

సీపీఎం నేతలు కూపీ లాగగా
గిరిజనులు కట్టుకున్న మరుగుదొడ్ల బిల్లులన్నీ 2016 మార్చినాటికే అక్రమార్కుల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. 2017 మార్చిలో జరిగిన సామాజిక తనిఖీలోనూ ఈ అవినీతి బాగోతం బయటపడకుండా అక్రమార్కులు జాగ్రత్తపడ్డారు. ఎక్కడా ఎలాంటి సర్వే నిర్వహించని అధికారులు..పైగా అన్ని సక్రమంగా ఉన్నట్టు నివేదికలు పంపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీపీఎం నేతలు కూపీ లాగగా అవినీతి బండారం బయటపడింది. గిరిజనులకు చెందిన డబ్బులు కాంట్రాక్టర్లు కాజేయడంపై సీపీఎం నేతలు మండిపడుతున్నారు. అధికారులను నిలదీశారు. ఫలితంగా కొంతమంది కాంట్రాక్టర్లు గిరిజనులకు తమ ఎకౌంట్లలో పడ్డ డబ్బులను ఇచ్చివేశారు. దీంతో మేల్కొన్న అధికారులు గిరిజనుల డబ్బులు కాజేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి సీఎం దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాల్లో అవినీతి ఎలా జరుగుతుందో ఊహించవచ్చు. పారదర్శక పాలన అని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

16:46 - September 3, 2017

తూర్పుగోదావరి : ఏలూరులో నిషేధిక ఆక్వా మందులను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.. కొంతకాలంగా శనివారపుపేటకు చెందిన రామస్వామి హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ నడుపుతున్నారు.. దేశవ్యాప్తంగా ఆక్వా కల్చర్‌లో నిషేధించిన మందుల్ని ఎటువంటి లైసెన్సులు లేకుండా అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్‌, విజిలెన్స్ అధికారులు రామస్వామి ఇంటిపై దాడి చేశారు.. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1150 కిలోల నిషేధిత ద్రావణాన్ని గుర్తించారు.. రామస్వాని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

15:19 - August 29, 2017

సిరిసిల్ల : పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కొంతమంది దండుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. అసలు ఫీజు కంటే అధిక మొత్తం వసూలు చేస్తూ దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... పత్రాలు సరిగాలేవని తిరస్కరిస్తున్నారు. దీంతో అడిగిన మొత్తం ఇచ్చి పత్రాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్వాకమంతా మంత్రి కేటీఆర్‌ ఇలాఖాలోని రాజన్న సిరిసిల్లలోనే జరగడం విశేషం. 
వివాహ సర్టిఫికేట్ల కోసం అధిక డబ్బు వసూలు 
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములోని సబ్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోని కొంతమంది సిబ్బందికి  కళ్యాణలక్ష్మి, షాది ముభారాక్  పథకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వం పేద వర్గాల కోసం తలపెట్టిన ఈ పథకాలు వారికి లాభాల పంటగా మారింది. అట్టడుగు వర్గాల వారికి కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వం.. వారిని ఆదుకునేందుకు డెబ్భై ఐదు  వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. అయితే వీటిని అందుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు లో వివాహం జరిగినట్టు ధ్రువ పత్రం అవసరం. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఉద్యోగులు వచ్చిన వారి దగ్గరి నుండి దండుకోవడం మొదలు పెట్టారు. అడిగినంత ఇచ్చుకోలేని వారిని పత్రాలు సరిగా లేవంటూ తిప్పిపంపడం సర్వ సాధారణంగా మారింది. 
రూ.200 బదులుగా రూ.500 వసూలు 
సాధారణముగా వివాహ ధ్రువ పత్రం తీసుకోవాలంటే రెండు వందల రూపాయలు కట్టి, రశీదుతో పాటుగా, వివాహ ధ్రువ పత్రం పొందడం ఎక్కడైనా బాధితులకు ఆనావాయితి. కాని సిరిసిల్ల పట్టణం లోని సబ్‌ రిజిస్టార్ ఆఫీసులో మాత్రం ఐదు వందల రూపాయలు ఇస్తేనే వివాహ ధ్రువ పత్రం చేతికి అందుతుంది. కాని ఇచ్చిన  డబ్బులకు రశీదు ఇవ్వరు. సుమారు రోజుకు పది నుండి పన్నెండు వరకు ఈ కార్యాలయానికి వివాహ ధ్రువ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ది దారులు  వస్తుంటారు. ఈ లెక్కన ప్రతి రోజు వీరి పైపై సంపాదన ఎంతో ఉహించుకోవచ్చు. ఇక్కడి ఉద్యోగి ఒక వ్యక్తి నుండి వివాహ ధ్రువ పత్రం ఇవ్వడానికి ఐదు వందల రూపాయలు తీసుకొని, రశీదు ఇచ్చేందుకు  నిరాకరించాడు.. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. 
నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బంది
మంత్రి కేటీఆర్. ఇలాఖాలో ఇలా జరగడం చర్చనీయాంశమయ్యింది. మంత్రి ప్రతి సందర్భములోనూ పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ పథకాలను ప్రవేశ పెట్టామని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెబుతుండేవారు. కానీ ఇక్కడి సిబ్బంది మాత్రం ఎవరేమన్నా మా లెక్కలు మాకు రావాలి అంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదిలావుంటే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజు 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని... రిజిస్ట్రేషన్‌కు కేవలం ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము కడితే సరిపోతుందంటున్నారు సబ్‌ రిజిస్ట్రార్‌. 
మంత్రి కేటీఆర్‌ ఇలాఖాలోనే సిబ్బంది అక్రమాలు
సాక్ష్యాత్తు మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇకనైనా ప్రభుత్వం మేల్కోని అవినీతిని అరికడతామంటూ మాటలు చెప్పకుండా అవినీతికి పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

 

11:49 - July 20, 2017

చిత్తూరు : తూడ ప్లానింగ్ అధికారి కృష్ణా ఇంటిపై ఏసీబీ అధికారలు దాడులు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో కృష్ణా రెడ్డి కి చెందిన ఇళ్లలో, బంధువుల, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో భారీగా అక్రమాస్తుల గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:36 - July 13, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకన్న ఇంటిపై.. ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మియాపూర్, మదీనగూడ, కృషి నగర్‌లలోని వెంకన్న ఇళ్లలో.. తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు.. ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సూర్యపేట, నిజామాబాద్, మాసబ్‌ ట్యాంక్‌లోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు 2 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. తనిఖీలు పూర్తయ్యేవరకు మరిన్ని ఆస్తులు బయటపడనున్నాయని ఏసీబీ డీఎస్పీ సిద్ధికి తెలిపారు.

06:50 - July 10, 2017

విశాఖపట్టణం : జిల్లాలో వరుసగా భూ దందాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో భూ బాగోతాలపై ఇప్పటికే సిట్ విచారణ సాగుతుండగా.. తాజాగా వక్ఫ్‌ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి నియోజవర్గంలో వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములకు రెక్కలు వచ్చాయి. విశాఖజిల్లాలో సరికొత్త భూదందాకు నాయకులు, అధికారులు తెరతీశారు. 210 ఎకరాల వక్ఫ్ భూమిని ఓకే వ్యక్తి పేరుతో మార్చిన అధికారులు సరికొత్త మాయాజాలన్ని ప్రదర్శించారు.

210 ఎకరాల వక్ఫ్ భూములు..
అనకాపల్లీ నియోజకవర్గం కశికోట మండలంలో 210 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. దాదాపు 200 మంది రైతులు దశాబ్దాలుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఈభూములను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రైతులలో అత్యధికులు 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫానులో నష్టపరిహారం పొందినవారే. అటు ఏలేరు కాలువ కింద నష్టపోయిన రైతులకు కూడా 40:60 నిష్పత్తిలో ఇక్కడే ల్యాండ్స్‌ ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల కరీముల్లా అనే వ్యక్తి ఈ భూములు తనవే అంటూ కోర్టుకు ఎక్కారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ భూములు ఎవ్వరి వద్ద ఉన్నాయో విచారణ చెపట్టాలని ఆర్డీవోను అదేశించింది. దీంతో సమస్య మొదలయింది.

పెద్దల హస్తం..
అయితే వక్ఫ్‌ భూములపై కోర్టుకు వెళ్లడం వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎకరం దాదాపు కోటిరూపాయలు పలుకుతున్న ఈ భూములపై రాజకీయ పెద్దల కళ్లు పడ్డాయి. వీటిని కాజేయడానికి స్కెచ్‌ వేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చకచకా పావులు కదిపారు. దీనికి రెవెన్యూ అధికారుల సహకారం తోడయింది. 1993జూన్‌లో ప్రభుత్వం వీటిని ఇనాం భూములుగా ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకుని షేక్‌కరీముల్లా రెహ్మాన్‌ పేరుతో మొత్తం 210 ఎకరాలను ఆన్‌లైన్‌లో మార్పు చేశారు. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

న్యాయం చేస్తామంటున్నారు..
రైతుల తిరుగుబాటుతో అధికారుల్లో హైరానా మొదలయింది. ఎటువంటి విచారణ లేకుండా భూములను ఒకే వ్యక్తి పేరుతో బదిలీ చేయడంపై ఇప్పటికే రైతులు సిట్ కు కూడా ఫిర్యాదు చెశారు. దీంతో రైతులకు న్యాయం చేస్తామని సెలవిస్తున్నారు రెవెన్యూ అధికారులు. రోజుకో భూ బాగోతం బయటపడుతుండటంతో విశాఖ జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని వేల కోట్ల రూపాయల భూదందాలకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు.

06:41 - July 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరు గారుతోంది. నత్తనడకన సాగుతున్న పనులతో వేల కోట్ల రూపాయ ప్రజాధనం మట్టిపాలవుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో చేట్టిన మిషన్‌ భగీరథ పనులపై టెన్‌టీవీ ఫోకస్‌..ప్రజల దాహార్తిని తీర్చడానికంటూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌భగీరథ పథకం కాంట్రాక్టర్ల జేబులు మాత్రమే నింపుతోందనే విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్‌ నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడంలేదు.

బాల్కొండ..
మిషన్‌భగీరథ పథకంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం జలాల్‌పూర్లో ఇంటెక్‌వెల్ నిర్మిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ఆధారంగా దీని నిర్మాణం చేపట్టారు. 2016 అక్టోబర్‌నాటికే ఇంటెక్‌వెల్ పనులు పూర్తిచేస్తామని మిషన్‌భగీరథ వైస్‌చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి అప్పట్లోనే చెప్పారు. అయితే ఆయన చెప్పిన గడువు ముగిసిపోయినా ఇప్పటికీ 80శాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రతిఇంటికి మంచినీటి సరఫరా అనేది ఎండమావే అంటున్నారు జిల్లా ప్రజలు.

కాంట్రాక్టర్ల జేబులు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం 718 గ్రామ పంచాయితీలతోపాటు 1645 అనుబంధగ్రామాలకు కూడా ఇక్కడ నుంచే మంచినీరు సరఫరా చేయాలని ఉద్దేశించారు. భవిష్యత్తులో పెరగబోయే జనభా అసరాలకు అనుగుణంగా అంటే 2033నాటికి రోజుకు 120 ఎంఎల్‌డీలు, అదే 2048 నాటికి 162 ఎంఎల్‌డీల తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇలా 30 సంవత్సరాల తాగునీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఇంటెక్‌వెల్‌ను నిర్మిస్తున్నారు. 2015 జనవరిలో పనులు ప్రారంభం అయినా.. ఇప్పటికీ 80శాతం కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం వరదమట్టానికి సమాంతరంగా మాత్రమే ఇంటెక్‌వెల్ పనులు పూర్తయ్యాయి. ఇంకా ఫుట్‌బ్రిడ్జిపై సేఫ్టీవాల్‌ , తర్వాత మోటార్లు బిగించాల్సి ఉంది.దాంతోపాటు వెల్‌చుట్టూ మట్టిపనులు కూడా పూర్తిచేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో పనులను ఉద్దేశపూర్వకంగానే నత్తనడకన సాగిస్తున్నారని.. దీంతో భగీరథ పథకం కాస్తా కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రక్రియగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

ఓట్లు దండుకోవడానికే..
వచ్చే వేసవి నాటికి కూడా పనులు పూర్తిఅయ్యే అవకాశం కనిపించడం లేదని నిజమాబాద్‌ జిల్లా ప్రజలు అంటున్నారు. 2019 ఎన్నికల వరకు పనులు చేస్తున్నట్టే ప్రజలను భ్రమల్లో పెట్టి.. మరోసారి ఓట్లను దండుకోడానికే అధికారపార్టీ సిద్ధం అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథపనులపై నజర్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మట్టిపాలుకాకుండా చూడాలని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ప్రజలు కోరుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - corruption