CPI Ramakrishna

20:17 - April 16, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజనచట్టంలోని హామీల అమలు డిమాండ్‌తో.. విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రభావం.. ఏపీ సచివాలయంపైనా కనిపించింది. ఉద్యోగులు, సందర్శకులు బంద్‌ కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఏపీ బంద్‌ ప్రభావం.. రాష్ట్ర సచివాలయంపైనా పడింది. బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీంతో సచివాలయం సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు బాగా ఇబ్బందులు పడ్డారు. ఆటోలపై కార్యాలయాలకు తరలివచ్చారు. ఇదే అదనుగా ఆటోల డ్రైవర్లు.. 50 రూపాయలున్న చార్జీలను.. ఏకంగా 150 రూపాయలకు పెంచేశారు. పైగా ఆటోల్లో ఎక్కువమందిని కూరి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. హోదా కోసం తాము ఇలాంటి చిన్న చిన్న కష్టాలు ఎన్నైనా ఎదుర్కొంటామని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 
సచివాలయానికి తగ్గిన సందర్శకుల తాకిడి 
మరోవైపు బంద్‌ ప్రభావంతో.. సచివాలయానికి సందర్శకుల తాకిడి రోజుకన్నా కూడా కొంత తగ్గింది. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా.. మంత్రులు అధికారులు తరలిరావడంతో.. వారిని కలిసేందుకు వచ్చిన వారు.. కొంతమేర ఇబ్బందులు పడ్డారు. 

 

20:15 - April 16, 2018

విజయవాడ : బంద్‌ సంపూర్ణంగా జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అంటున్నారు. ప్రత్యేక, విభజన హామీలపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా బంద్‌లో పాల్గొని సంపూర్ణం చేశారంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నారంటున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు మోసం చేశాయని విమర్శించారు. భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:58 - April 16, 2018

విజయవాడ : బీజేపీ అబద్ధాల ప్యాక్టరీగా తయారైందని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్ రావు విమర్శించారు. 24 పేజీల పుస్తకం కాదు..64 పేజీల పుస్తకం వేసిన బీజేపీ నేతల మాటలు నమ్మరని అన్నారు. ఏపీ ప్రజలు బీజేపీకి సమాధి కడతారని పేర్కొన్నారు. విపక్షాలు చేస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. బంద్ లో ప్రజలు రాజకీయాలకతీతంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. నిర్బంధాలకు, కేసులకు భయపడబోమని చెప్పారు. నిర్బంధం ప్రయోగిస్తే, అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని.. తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బిజిలీ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
జనపేన నేత  
'కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయొద్దు. 2014 నుంచి బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ ఇవ్వలేదు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కలను చంద్రబాబు కాపాడలేకపోయారు. ఢిల్లీలో ప్రజలు హక్కు కోల్పోయారు'.

 

18:39 - April 16, 2018

విజయవాడ : ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం దిగిరావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని...పార్లమెంట్ లో చేసిన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. 2014 ఏప్రిల్ 20న ఏ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ నేతలు అర్ధసత్యాలు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఆ పార్టీ నేతలు చదువుకోవాలని.. మ్యానిఫెస్టోను అమలు చేయాలన్నారు. లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, విజయవంతం చేసినందకు అభినందలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట..లేకుంటే మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వాన్నంగా మాటమార్చుతున్నారని చెప్పారు. మాటమార్చుకోవడం మానుకోవాలని హితవుపలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తమను ప్రశ్నిస్తున్న చంద్రబాబు ఏపీలో దీక్ష ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు. మోడీ, చంద్రబాబు పాపాలు చేశారని చెప్పారు. ఈ  పాపంలో వెంకయ్యనాయుడి పాత్ర కూడా ఉందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవపట్టించారని... మభ్య పెట్టారని మండిపడ్డారు. ఇద్దరి పాపాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మోడీకి దిమ్మతిరిగే విధంగా బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు బిజిలీ బంద్ పాటించాలన్నారు.

 

17:46 - April 16, 2018

విజయవాడ : బంద్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యత్నించిందని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా బంద్ విజయవంతమైందన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 24న చీకటిరోజుగా పాటించాలన్నారు. భవిష్యత్ లో ప్రత్యేకహోదా కోసం చేసే ఆందోళనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. 'మీరు తెలుగు వారేనని గుర్తుంచుకోవాలి' అని ఏపీ బీజేపీ నేతలను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. గుజరాత్ గీతాలను గుజరాత్ వెళ్లి పాడుకోండని సలహా ఇచ్చారు. బీజేపీ నేతల భాష బాగానే ఉంది... భావం ఘెరంగా ఉందని ఎద్దేవా చేశారు. చర్చా వేదికకు రండి అన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. 

07:32 - April 13, 2018

ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇంకా సెగలు పుట్టిస్తోంది. హోదా ఇవ్వాల్సిందేనంటూ రాజకీయ పార్టీలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పలు విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అధికారం కావాలనే కాంక్ష అక్కడి పార్టీల్లో ఉందని..ప్రజలను ఏదీ ఆకర్షిస్తుంది ? తదితర విషయాలపై రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా ఉపయోగపడుతుందని అనుకున్న పార్టీలు ఆ దిశగా వ్యూహాలు రచించాయన్నారు. ప్రస్తుతం హోదాపై మాట్లాడుతున్న పార్టీలు నాలుగేళ్లు ఎందుకు మాట్లాడలేదు ? అని ప్రశ్నించారు. ఇక్కడ వైసీపీ..టిడిపి రెండు పార్టీలు బీజేపీతో మితృత్వం మెంటేన్ చేశాయని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తరువాత కూడా మద్దతినిచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ వద్దు..హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

హోదా అన్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ ఇదే ప్రభుత్వం హోదా కావాలంటూ ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వస్తున్నారన్నారు. టిడిపికి కోరిక కలిగినప్పుడే అందరికీ కోరిక కలగాలనే విధంగా వ్యవహరిస్తోందన్నారు. హోదా ముగిసిన అధ్యాయం..అంతకన్నా గొప్పది ప్యాకేజీ అంటూ టిడిపి సవాలక్ష మాటలు చెప్పిందని గుర్తు చేశారు. వామపక్షాలిచ్చిన బంద్ విజయవంతం కాగానే టర్న్ తీసుకుందని తెలిపారు.

ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తున్నారని కానీ నరేంద్ర మోడీ దుర్మార్గం..అన్యాయం..నమ్మక ద్రోహం చేశాడని అనడం లేదన్నారు. కేంద్రం..బిజెపి అంటూ విమర్శలు గుప్పిస్తారని..ఎక్కడో ఒకసారి మోడీ అంటారని తెలిపారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది....ప్రామీస్ చేసింది మోడీ అని తెలిపారు. ఎక్కడైనా నరేంద్ర మోడీ ద్రోహం చేశాడని పవన్ కళ్యాణ్ అన్నాడా ? అని ప్రశ్నించారు.

కర్నాటకలో ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ ఎందుకు పిలుపు ఇవ్వడని సూటిగా ప్రశ్నించారు. వైసీపీకి చంద్రబాబు నాయుడు మాత్రమే శత్రువు..బీజేపీ మాత్రం శత్రువు కాదన్నారు. స్వాతంత్రం ఇవ్వనని బ్రిటీష్...తెలంగాణ ఇవ్వదని కాంగ్రెస్...చెప్పిందని మరి ఎందుకు పోరాడారు ? ఏం చేస్తే హోదా వస్తుందో చెప్పాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి పెడుతుంటే సాధ్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా వచ్చే ప్రభుత్వమైనా ఇవ్వాల్సి ఉంటుందని,

కర్నాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మాత్రం జనతాదళ్ సెక్యూలర్ కాంగ్రెస్...బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందని..ఇక్కడ కేసీఆర్ ఆశించింది జరగదు కదా ? అని తెలిపారు. ఆంధ్రా జేఏసీగా ఎందుకు ఏర్పాటు కాదు ? అని తెలిపారు. ఇంకా మరింత విశ్లేషణ కోసం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

21:20 - April 8, 2018

కడప : ఏపీకి ప్రత్యేక హోదా విస్మరించిన బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. కడపలో సీపీఐ 26వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ నెల 15న సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా సభలు నిర్వహించి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా హోదాను సాధించుకుంటామని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

22:04 - April 2, 2018

హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలో దేశంలో సాగుతున్న అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలందరూ ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటాలు  చేయాల్సిన అవసరమని ఉందన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే బలమైన ఉద్యమాలతోనే మోదీ పాలనలో జరుగుతున్న మోసాలకు ముగింపు పలకొచ్చని సీపీఐ తెలంగాణ మహాసభల ప్రారంభోత్సవంలో సురవరం చెప్పారు. 
సీపీఐ తెలంగాణ 2వ మహాసభలు
హైదరాబాద్‌లో సీపీఐ తెలంగాణ 2వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఈ మహాసభల్లో  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 
సురవరం ప్రారంభోపన్యాసం
ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. వ్యవసాయరంగ సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతులు ఆత్మహత్యలు, ఆర్థిక అసమానతల వరకు పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక నేరాలు, మోసాలు పెరిగిపోయాయని  సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటన్నింటికీ వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 
రాజ్యాధికారం బహుజనులకు దక్కితేనే సామాజిక న్యాయం : తమ్మినేని
ప్రస్తుతం కులాలకే పరిమితమైన రాజ్యాధికారం బహుజనులకు దక్కితేనే సామాజిక న్యాయం సాధమవుందని మహాసభలకు హాజరైన సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. 
ప్రజా సమస్యలపై వామపక్షాలు సమరశీల పాత్ర : రామకృష్ణ  
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో నెలకొన్న ప్రజా సమస్యలపై వామపక్షాలు సమరశీల పాత్ర పోషిస్తున్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో  ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. రాజకీయ, ఆర్థిక అంశాలతోపాటు పలు విషయాలపై తీర్మానాలు చేస్తారు. 
 

22:05 - March 26, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. ప్రజలను మోసం చేసిన బీజేపీ, దీనికి వంతపాడిన టీడీపీ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలపై బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమైన ప్రతిపక్ష వైసీపీ వైఖరిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని...హైదరాబాద్‌లో నిర్వహించిన భేటీలో జనసేన, వామపక్షాల నేతలు నిర్ణయించారు.

పవన్‌ కల్యాణ్‌.. వామపక్ష నేతలతో భేటీ..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో జరిగిన ఈసమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, పార్టీ నాయకుడు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖ, హోదాపై ఉమ్మడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

హోదాపోరులో మేధావులు, విద్యావేత్తలు, ప్రజల భాగస్వామ్యం
ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, వామపక్షాల భేటీలో నిర్ణయించారు. ఈ ఉద్యమంలో మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ముందుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో భారీ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ప్రజాస్యామ్య పరిరక్షణ దినం పాటించాలని, హోదాపోరులో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు మార్చి 28న విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 4న విజయవాడలో జరిగే జనసేన, వామపక్షాల భేటీలో ప్రత్యేక హోదా ఉద్యమంపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

మిత్‌ షా రాసిన లేఖపై స్పందించాల్సిన అవసరంలేదన్న నిర్ణయానికి జనసేనాని
ఏపీకి చేసిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖపై స్పందించాల్సిన అవసరంలేదన్న నిర్ణయానికి జనసేనాని వచ్చారు. ప్రధాని మోదీ లేదా ప్రభుత్వం నుంచి లేఖ వచ్చి ఉంటే ముందుగానే స్పందించేవాడినని పవన్‌ చెప్పారు. హోదా విషయంలో మొదటి నుంచి టీడీపీ అవలంబించిన రాజీ వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని పవన్‌ మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలతో భవిష్యత్‌లో కూడా రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశంలేదన్న నిర్ణయానికి వచ్చిన జనసేన, వామపక్షాల నేతలు.. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి.

నిధులను దుర్వినియోగం చేశారు : పవన్
ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... గోదావరి, కృష్ణా పుష్కరాలకు ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడాన్ని పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో చిన్న పిల్లల మరణాలను ప్రస్తావించారు. రాజధాని అమరావతిపై స్పందిస్తూ.. టీడీపీ నేతల కోసమే రాజధాని నిర్మాణం జరుగుతోందని, ప్రజా రాజధాని కాదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు... హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, వైసీపీలు అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడలువంచి హోదా సాధించే వరకు ఉద్యమాన్నకొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. హోదా ఉద్యమంలో భావసారూప్యత ఉన్న ప్రజా సంఘాలను కలుపుకుపోవాలని ఈ సమావేశంలో వామపక్షాలు, జనసేన నిర్ణయించాయి. 

22:04 - March 26, 2018

అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించారంటూ కేంద్రంపై టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతోంది. నిన్న కాంగ్రెస్‌ తోడుకాగా... తాజాగా సీపీఎం, ఆర్‌ఎస్పీ కూడా అండగా నిలిచాయి. ఈ రెండు పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. మరోవైపు నిన్నటివరకు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌.. కాస్త వెనక్కి తగ్గి వెల్‌లోకి వెళ్లకూడదని నిర్ణయింది. దీంతో అవిశ్వాసంపై కేంద్రం చర్చ పెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు... మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉందని... టీడీపీ ఎంపీలంతా పార్లమెంట్‌కు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో రేపు పార్లమెంట్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

అవిశ్వాస తీర్మానానికి రోజురోజుకు పెరుగుతున్న మద్దతు
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నిన్నటివరకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా... తాజాగా సీపీఎం కూడా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. సీపీఎం లోక్‌సభ పక్షనేత కరుణాకరన్‌, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే 50 మంది ఎంపీల బలం కావలసి ఉండగా... ఇప్పటికే ఆ సంఖ్య 80 దాటింది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన పార్టీల్లో.. కాంగ్రెస్‌కు-48, టీడీపీకి-15, సీపీఎంకి-9, వైసీపీకి-8, ఆర్‌ఎస్పీకి-ఒకరు చొప్పున మొత్తం 81 మంది ఎంపీలు ఉన్నారు.

వ్యూహం మార్చుకున్న టీఆర్ఎస్
ఇప్పటివరకూ.. రిజర్వేషన్‌లపై అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ వచ్చిన టీఆర్ఎస్‌ వ్యూహం మార్చుకుంది. మంగళవారం నాడు.. అవిశ్వాస తీర్మానాల ప్రస్తావన వచ్చినప్పుడు.. వెల్‌లోకి వెళ్లరాదని నిర్ణయించుకుంది. తమ ఆందోళనల వల్లే.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండాపోతోందన్న ఏపీ నాయకుల ఆరోపణల నేపథ్యంలో.. తెలంగాణ భవన్‌లో సమావేశమైన టీఆర్‌ఎస్‌ ఎంపీలు... రిజర్వేషన్లపై చేస్తున్న పోరాటంపై కాస్త వెనక్కి తగ్గాలని నిర్ణయించారు. అయితే పార్లమెంట్‌లో నిరసనలు చేస్తామని.. కానీ వెల్‌లోకి వెళ్లకూడదని నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలిపారు. తాము పార్లమెంట్‌ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నా... అవిశ్వాస తీర్మానాన్ని తాము అడ్డుకుంటున్నామని ఏపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకోకుండా.. కలిసి పోరాటం చేస్తేనే విజయం సాధిస్తామన్నారు.

అవిశ్వాస తీర్మానంపై వైసీపీ మరో అడుగు
ఇక ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేసిన వైసీపీ మరో అడుగు ముందుకేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎంపీలతో సమావేశమైన జగన్‌... పార్లమెంట్‌ వాయిదా పడితే అదేరోజున రాజీనామాలు చేయాలని ఎంపీలకు ఆదేశించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపిస్తోన్న వైసీపీ... లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించింది. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచించుకోవాలని వైసీపీ నాయకత్వం పిలుపునిచ్చింది.

ఎంపీలంతా కచ్చితంగా పార్లమెంట్‌ హాజరవ్వాలి :
ఇదిలావుంటే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు.. సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంగళవారం ఎంపీలంతా కచ్చితంగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. అందరూ పచ్చ కండువాలతో పార్లమెంట్‌కు వెళ్లాలన్నారు. సోమవారం అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం ఉందని... లేకపోతే పదిరోజుల్లో చర్చకు తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల నేతలను కలిసి వివరించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని... ఏపీని ఒంటరి చేయాలనే బీజేపీ కుట్రను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై ఇంతకాలం ఒంటెత్తు పోకడలకు పోయిన టీడీపీ.. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర పార్టీల సంఘాలనూ కలుపుకు పోవాలన్న భావనకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు అఖిల సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అవిశ్వాసంపై కేంద్రానికి అనివార్యంగా మారనుందా?
మొత్తానికి, అవిశ్వాస తీర్మానాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. బీజేపీ చర్చకు సిద్ధపడాల్సిన అనివార్యత ఏర్పడింది. తాము అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం క్లైమాక్స్‌కు చేరినట్లయింది. అయితే... మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా ? లేక బీజేపీ మరో ఎత్తుగడ వేస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - CPI Ramakrishna