cpim

07:21 - August 17, 2017

తెలంగాణలో నిర్మాణ రంగం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇసుక మాఫియా..మరోవైపు జీఎస్టీ బాదుడు..ఇంకో వైపు నేరా నిబంధనలు..దీనితో నిర్మాణ రంగం భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ అనిశ్చితి వాతావరణం నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల ఉపాధిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు - నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎదరవుతున్న కొత్త కష్టాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ నాయకులు కోటం రాజు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:31 - August 16, 2017

విజయవాడ : విద్యుత్‌ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్‌ చేశారు. విజయవాడలో రైల్వేస్టేషన్‌ నుంచి అలంకార్‌ ధర్నా చౌక్‌ వరకు వందలాది మంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనకు సిఐటియు రాష్ట్ర నాయకులు ఎమ్‌డి గఫూర్‌ హాజరై తమ మద్దతు తెలిపారు. విద్యుత్‌ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో.. ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:55 - August 11, 2017
13:29 - August 10, 2017

జనగాం : ప్రకృతిపై పగబట్టారు. బాంబుల మోతలు మోగిస్తున్నారు. ఓ వైపు నిద్ర పట్టనివ్వని క్రషర్‌ శబ్ధం. మరోవైపు ఎప్పుడూ మబ్బు పట్టినట్లు కనిపించే దుమ్ము. నిత్యం దుర్వాసనతో నరకం చూపే డాంబర్‌ ప్లాంట్‌. ఇదీ బ్రతుకే భారంగా, నరకంగా సాగుతోన్న కాశీమ్‌ నగర్‌ ప్రజల జీవనం. గుట్టు చప్పుడు కాకుండా గుండె చప్పుడు ఆపేలా సాగుతున్న కాశీమ్‌ నగర్‌ అక్రమ మైనింగ్‌పై 10 టీవీ ప్రత్యేక కథనం..మొన్నటివరకూ పచ్చని ప్రకృతిలో ఉన్నామనుకున్నారు. కానీ వీళ్లున్నది ప్రాణం పోయే ప్రమాదపు అంచునని ఇప్పుడు తెలిసొచ్చింది. కొత్తగా పెట్టిన క్రషర్‌తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

కాశీమ్‌నగర్‌ చిన్న గూడెం..
జనగాం జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఇప్పగూడెం కాశీమ్‌నగర్‌ చిన్న గూడెం. సుమారు 40 ఏళ్ల నుంచి 40 కుటుంబాల ప్రజలు ఇక్కడే బతుకుతున్నారు. క్రషింగ్ పెట్టిన గుట్టకే వెళ్లి వీరంతా క్వారీ పనులు చేసేవారు. తరువాత ఇళ్లకు చుట్టుపక్కల వ్యవసాయ భూములు కొని వ్యవసాయం చేస్తున్నారు. క్రషర్‌ పెట్టే ముందు వరకు వీరికి ఎలాంటి సమస్యలు లేవు. అడవిలో నిశ్శబ్దపు జీవనం సాగిస్తున్న వీళ్లంతా ఇప్పుడు స్టోన్‌ కట్టింగ్ క్రషర్, డాంబర్ ప్లాంట్ దెబ్బకు నరకం అనుభవిస్తున్నారు.

క్రషర్ ల వత్తిడి..
ఈ ప్రాంతానికి చెందిన వారు ఇప్పుడు గూడు కట్టుకుందామనుకున్నా.. వీల్లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ అనుమతులో.. ఆర్థిక ఇక్కట్లో కాదు.. ఈ క్రషింగ్‌ యూనిట్‌ సృష్టిస్తోన్న ప్రకంపనలే దీనికి కారణం. ఇక్కడ ఇళ్లు కట్టుకుందామనుకున్నవారు ఇప్పుడు క్రషర్‌ ఎఫెక్ట్‌తో వెనక్కి తగ్గారు. ఫలితంగా చాలా ఇళ్లు బేస్‌మెంట్‌ దగ్గరే ఆగిపోయాయి. క్రషర్‌ కోసం 80 నుంచి 100 ఫీట్ల వరకు డ్రిల్‌ చేసి పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. దీంతో 400 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లూ కంపిస్తున్నాయి. బాంబుల బ్లాస్టింగ్ తీవ్రతకు కాశీమ్‌నగర్‌లో గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పిల్లలైతే ఉలికులికి పడుతున్నారు.

ప్రలోభం..కాదంటే భయ పెట్టడం..
ప్రలోభపెడుతున్నారు. కాదంటే భయపెడుతున్నారు. భూములు కౌలుకివ్వాలంటారు. లేదంటే అమ్మమంటారు. చిన్న క్రషర్‌ అని చెప్పి పెద్ద ఎత్తున భూములు లాక్కొని చేస్తున్న మైనింగ్‌తో యజమానులు పెద్ద ఎత్తున సంపాదిస్తుంటే.. ఉన్న భూముల్లో పంటలేసుకున్న రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా మంది భూములు లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమి ఇవ్వకపోతే..
క్రషర్‌కు భూమి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన సోమయ్య అనే రైతు భూమి మొత్తం.. ఇప్పుడు బ్లాస్టింగ్‌ రాళ్లతో నిండిపోయింది. చెప్పకుండా బ్లాస్ట్ లు చేస్తున్నారని.. బావి వద్ద పశువులను ఉంచాలంటే భయపడాల్సిన పరిస్థితని వాపోతున్నారాయన. లక్షల్లో పంట తీసుకొని బతుకుతున్నామనంటే ఎకరానికి ఐదు వేలు ఇస్తామని కౌలుకివ్వమని ఇబ్బంది పెడుతూ క్రషర్‌ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారంటున్నారు.

పాటించని నిబంధనలు..
అందరికీ బ్లాస్టింగ్ ఉందని చెప్పేందుకు సైరన్ వినిపించాలి. కానీ కాశీమ్‌ నగర క్రషర్‌ దగ్గర అలాంటి పరిస్థితి లేదు. వారి ఇష్టమొచ్చినట్లు బ్లాస్టింగ్‌ చేసి ఏం పట్టనట్లు ఉంటున్నారని రైతులు అంటున్నారు. బ్లాస్టింగ్‌లో ఎలుగుబంటి చనిపోయిందని తెలిసి చూద్దామని వెళ్లే సరికి దానిని మాయం చేశారని రైతులు చెబుతున్నారు. ఇక క్రషర్‌ నుంచి వచ్చే దుమ్ము పంట పొలాల్లో పడుతుండటంతో జంతువులు గడ్డిని మేయడం లేదు.

యజమానులకు నేతల సపోర్టు..
ఊర్లో నాయకులు క్రషర్‌ యజమానులకే సపోర్ట్‌ చేస్తున్నారు. అధికారులు, నాయకులు స్పందించకపోవడంతో గ్రామస్థులు సీపీఎం రాష్ట్ర నాయకులను ఆశ్రయించారు. చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ ఆపకపోతే పోరాటం తప్పదని సీపీఎం నాయకులంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కాశీమ్‌ నగర ప్రజలు జనగాం కలెక్టర్‌ దేవసేనను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే కలెక్టర్‌ మైనింగ్ ఏడీకి, మండల ఎమ్మార్వోకి విషయంపై విచారణ చేపట్టమని ఆదేశించారు. అధికారులు అక్కడికి వెళ్లారు కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సీపీఎం పార్టీ ఆఫీసుకు వెళ్లి.. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి తమ బాధను వినిపించారు.
క్రషర్‌ విషయమై అధికారులను, గ్రామానికి సంబంధించిన నాయకులను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. ఎవరూ మాట్లాడే ఆసక్తి చూపడం లేదు. 

13:21 - August 10, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడికి ఏపీ మంత్రి నారాలోకేష్‌ అభినందనలు తెలిపారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రోడ్డులోని వెంకయ్యనాయుడి నివాసంలో ఆయనను మంత్రి లోకేష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్‌..తెలుగువారు ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరు చేయని సేవలు వెంకయ్యనాయుడు చేశారని చెప్పారు. ఇవాళ కేంద్రమంత్రి నరేందర్‌ సింగ్‌ తోమర్‌తో తాను సమావేశమవుతున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. ఉపాధిహామీ పథకం, గ్రామీణాభివృద్ధి శాఖ పనులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ నిధుల అంశంపై మంత్రితో చర్చిస్తానన్నారు.  

10:13 - August 10, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పొత్తులకు అడుగులు పడుతున్నాయా? దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌ ముందుకు సాగుతోందా? విజయం కోసం అలయన్స్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందా?.. వారి వ్యూహం చూస్తే... అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా... పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి.. గెలుపేలక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు సిద్ధం చేసుకుంటున్నాయి.. గత ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి తేరుకుంటున్న హస్తం పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది... అధికారంలోకి రావడానికి ప్రత్యేక ప్లాన్‌లు రచిస్తోంది.

టిడిపి, వామపక్షాలకు..
సీఎం కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ తో కాంగ్రెస్‌ పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఈ బాధ నుంచి బయటపడ్డ హస్తం నేతలు.. ఈ ఎన్నికల్లో గెలుపుతో గులాబీదళపతికి చెక్‌పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటి నుంచే పక్కాప్రణాళికలు వేస్తున్నారు. తాము ఒక్కరమే పోరాడితే సరిపోదని... మిగతాపార్టీలను కలుపుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమకు అనుకూల వాతావరణం కనిపిస్తోందని హస్తం నేతలు భావిస్తున్నారు. కొత్త పొత్తులు పెట్టుకుంటే విజయం మరింత సులభమన్న ఆలోచనలోఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ, వామపక్షాలకు స్నేహహస్తం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కోదండరాం కొత్త పార్టీ..
ఇక 2019లో జేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో తెలంగాణలో కొత్త పార్టీ వస్తుందన్న అంశంపైనా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.. కోదండరాం పార్టీతో తమకు మేలే జరుగుతుందని హస్తం నేతలు అంచనావేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలు కోదండరాం వైపు మళ్లే అవకాశం ఉందని యోచిస్తున్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలన్న లక్ష్యంతో వస్తున్న ఆ పార్టీ త‌మ‌కు మిత్రప‌క్షమే అవుతుందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీని తమతో కలుపుకోవడం ద్వారా గులాబీ పార్టీపై విక్టరీ మరింత తేలికవుతుందని పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు సూచిస్తున్నారు. పార్టీల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి సీట్ల పంప‌కంలో జాగ్రత్తలు తీసుకుంటే విజయం తమదేనని కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.

పొత్తులు ఫలిస్తాయా ? 
మొత్తానికి 2019లో మిత్రపక్షాలను కలుపుకొని గులాబీ బాస్‌కు చుక్కలు చూపించాలని హస్తం నేతలు తహతహలాడుతున్నారు.. అయితే ఈ ప్రతిపాదనలు ఢిల్లీ గడపలో పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. దీనిపై అధిష్ఠానం సానుకూలంగా ఉంద‌ని ఆక్టోబ‌ర్‌లో గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీనుంచి క్లారీటీ రాగానే కొత్త స్నేహాలతో గులాబీ పార్టీని చిదిమేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ పొత్తులు ఎంతవరకూ ఫలిస్తాయో... వేచిచూడాలి..

06:28 - August 10, 2017

రంగారెడ్డి : దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రజా సంఘాలు ఐక్యం కావాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక పిలుపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు బొందపెట్టేందుకు ఐద్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ సభలో ప్రసంగించిన నేతలు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిరాశే మిగిలిందని సామాజిక ప్రజా సంఘాల వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీ మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. తెలంగాణలో పలు ఉద్యమాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి. సామాజిక న్యాయం కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఈ చారిత్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక... టీ మాస్‌ ఆవిర్భావ సభను కూడా ఇబ్రహీంపట్నంలోనే నిర్వహించారు.

దొరల పాలనకు వ్యతిరేకంగా..
తెలంగాణలో సాగుతున్న దొరల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ప్రజా సంఘాలను ఏకం చేయాలని ఈ సమావేశంలో తీర్మానిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకులు పిలుపు ఇచ్చారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్‌ మాయమాటలతో ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని సభలో ప్రసంగించిన నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌, కూతురు కవితలు సాగిస్తున్న దందాలను ప్రశ్నిస్తుంటే.. వీరిరువురు నోరు పారేసుకుంటున్న విషయాన్ని టీ మాస్‌ నేతలు ప్రస్తావించారు. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నింటిని సంఘటితంచేసి... ఐక్య ఉద్యమానికి సిద్ధం చేయాలని నిర్ణయించారు.

టీమాస్ సభలు..
ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో స్కాముల స్వాములు ఎక్కువయ్యారని టీ మాస్‌ నేతలు విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుని దాచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్‌ నిరంకుశంగా పాలిస్తున్నారని ఆరోపిస్తూ, దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలను ఐక్యం చేసేందుకు టీ మాస్‌ సభలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయిచారు. 

21:51 - August 9, 2017

రంగారెడ్డి : పోరాడి సాధించుకున్న తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కొడుకు బండారం బయటపెట్టినందుకే ప్రజాసంఘాలపై సీఎం కేసీఆర్‌ నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీమాస్‌ సభకు తమ్మినేని హాజరయ్యారు.. ప్రజాగాయకుడు గద్దర్‌, టఫ్‌ అధ్యక్షురాలు విమలక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. గద్దర్‌ ఆటాపాటా అందరినీ అలరించింది.

17:47 - August 9, 2017

తూర్పు గోదావరి : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ ఎన్నికల్లో CPM నుంచి మాజీ సైనికుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు బరిలోఉన్నారు.. ఆర్మీలో కెప్టెన్‌గా రిటైర్‌అయిన తిరుమలశెట్టికి మద్దతుగా పార్టీ నేతలు కాలనీలన్నీ చుట్టేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:51 - August 9, 2017

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కేటీపీఎస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యకు నిరసనగా కార్మికులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికలు డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులకు సంఘీభావంగా వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అఖిలపక్షనేతలను అరెస్టు చేసి దమ్మపేట, అశ్వారావుపేట పీఎస్‌లకు తరలించారు. 15ఏళ్లుగా కేటీపీఎస్‌ లో పనిచేస్తున్నా తన పేరును క్రమబద్ధీకరణ లిస్టులో చేర్చలేదని కాంట్రాక్టు కార్మికుడు కే. నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యకు కేటీపీఎస్‌ అధికారులే కారణం అంటూ ఆందోళనకు దిగారు. నాలుగు నెలల సీనియార్టీ ఉన్న వారికి కూడా ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసిన అధికారులు.. 15ఏళ్లుగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు అన్యాయం చేశారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - cpim