CPM central Committee

17:44 - March 28, 2018

ఢిల్లీ : కేంద్రం ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈమేరకు మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం అవిశ్వాసం... అయితే దీనిపై చర్చించేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందన్నారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని చర్చించకపోవడం దారుణమని చెప్పారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం తీరును దేశ ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. రోజురోజుకు బీజేపీ అపఖ్యాతి పాలవుతోందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఏపీ సమస్యలపై చర్చిస్తామని చెప్పారు.

07:29 - February 22, 2018

ఢిల్లీ : బొగ్గు గనుల ప్రయివేటీకరణకు అనుమతిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం ఖండించింది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలను అనుమతించేందుకు కేంద్రం సమ్మతించింది. మోది సర్కార్‌ చేపడుతున్న ఆర్థిక సంస్కరణల్లో భాగమే ఈ నిర్ణయమని విమర్శించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయివేట్‌ సంస్థల గుత్తాధిపత్యం పెరిగిపోయి ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియాకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కార్మికుల భద్రతకు ముప్పు కలిగే ఈ చర్యను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మరోవైపు బిజెపి ప్రభుత్వ హయాంలో ఆశ్రిత పెట్టుబడిదారి విధానం పెరిగిపోతుండడంపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. కుట్రపూరిత ఆలోచనతో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన నీరవ్‌ మోది ఉదంతమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. నీరవ్‌ విదేశాలకు పారిపోవడంపై ప్రభుత్వం నోరు విప్పడం లేదని విమర్శించింది.

18:48 - February 13, 2018

ఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి 21 వ తేదీ వరకు సీపీఎం జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించే రాజకీయ తీర్మానం ముసాయిదాను పార్టీ నాయకలు విడుదల చేశారు. 80 పేజీల తీర్మానంపై డివిజన్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు చర్చిస్తారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్‌ పోరాటాలు, సీపీఎం రాజకీయ పంథా... తదితర అంశాలను ముసాయిదాలో చేర్చారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

15:51 - October 16, 2017

ఢిల్లీ : సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సీపీఎం కేంద్ర కార్యాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్‌ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే బీజేపీ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. 
 

 

08:00 - October 16, 2017

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌ హాల్లో జరిగిన జిల్లా టీమాస్‌ ఆవిర్భావసభకు సింగరేణి కార్మికులు , ప్రజలు పెద్దఎత్తున తరిలి వచ్చారు. సింగరేణి కార్మికులకు టీమాస్‌ అండగా ఉంటుందని ఫోరం నేతలు అన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ..పేద ప్రజలజీవితాల్లో వెలుగులు కనిపించడంలేదని.. టీమాస్‌ ఫోరం నేతలు అన్నారు. సామాజిక న్యాయం సాధన కోసమే టీమాస్‌ ఆవివర్భవించిందని, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన ఎండగడతామని ఫోరం నేతలు అన్నారు. టీమాస్‌ ఆవిర్భావ సభకు జిల్లావ్యాప్తంగా సింగరేణి కార్మికులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళాకారుల ఆటపాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. 

18:43 - October 15, 2017

ఢిల్లీ : దేశంలో సెక్యులర్‌ వ్యవస్థను కాపాడ్డానికి సీపీఎం ఎల్లపుడూ ముందుంటుందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సంఘ్‌పరివార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రల్లో భాగంగానే సీపీఎం పార్టీపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేరళ, త్రిపురల్లో వామపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని రాఘవులు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల్లో ఈ అంశాలన్నీ చర్చించామని రాఘవులు చెప్పారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ 22వ జాతీయ మహాసభల సన్నాహకాలపై కూడా కేంద్రకమిటీలో చర్చించినట్టు రాఘువులు తెలిపారు. 

 

18:37 - October 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి సైలెంట్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. భూ కబ్జాల్లో సీఎం కేసీఆర్‌కు కూడా వాటాలు ఉన్నాయన్నాయనే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ తన బుద్ధిహీనతను బయటపెట్టుకుంటున్నారని తమ్మినేని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలను నిందించడం తగదని ఆయన హితవు పలికారు.

 

17:57 - October 15, 2017

ఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో.. ప్రజల దృష్టి మళ్లించడానికే లెఫ్ట్‌పార్టీలపై బీజేపీ ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఢిల్లో జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల్లో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. పెరుగుతున్న మతోన్మాద కలహాలు, దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, అమెరికన్‌ సామ్రజ్యవాదానికి మోదీ ప్రభుత్వం లొంగిపోతున్న విధానంపై పార్టీ కమిటీలో చర్చించినట్టు తమ్మినేని చెప్పారు. తప్పుడు ఆర్థిక విధానాలను కప్పిపుచ్చుకోడానికే లెఫ్ట్‌పార్టీలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందన్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రకమిటీలో చర్చించామని తెలిపారు. జీఎస్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లెఫ్ట్‌పార్టీల బీజేపీ విమర్శలు అన్నారు. 

11:54 - September 20, 2016

ఢిల్లీ : కశ్మీర్ సమస్యను పరిష్కరించకపోవడం వల్లే అక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నాయని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏచూరి కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌ పరిస్థితులపై అఖిలపక్షం చేసిన సూచనలు అమలు చేయాలని, కశ్మీరీలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఏచూరి కేంద్రానికి సూచించారు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని, నిరుద్యోగం పెరుగుతోందని, ధరల పెరుగుదలతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో సిపిఎం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు  ఏచూరి చెప్పారు. గోరక్షణ పేరిట దళితులపై దాడులకు పాల్పడుతున్న సంస్థలను నిషేధించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. 

Don't Miss

Subscribe to RSS - CPM central Committee