CPM MLA Sunnam Rajaiah

22:02 - July 19, 2018

హైదరాబాద్ : గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎస్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కలిశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. వారి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 నుంచి కార్మికులు సమ్మెకు పోకుండా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. తెలంగాణల్లో తప్ప మిగితా రాష్ట్రాల్లో కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, జీతాలు ఇస్తున్నారన్నారు. 

 

21:16 - June 27, 2018

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను తోసిరాజన్న బిఎల్‌ఎఫ్‌.. నిర్బంధాన్ని చీల్చుకుని కలెక్టరేట్లు ముట్టడించిన బిఎల్‌ఎఫ్‌.. తెలంగాణ జిల్లాలన్నింటా.. బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు నిరసన గళమెత్తాయి. అన్ని కలెక్టరేట్ల వద్దా.. ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలో కార్మికుల సమస్యల పరిష్కారం.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు, పెన్షన్లు, కౌలు, పోడు రైతులకు రైతుబంధు వర్తింపు తదితర డిమాండ్లతో బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలోని వివిధ వామపక్ష, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. బిఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ నల్లా సూర్యప్రకాశ్‌ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ తక్షణమే మేల్కొని.. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వివిధ పక్షాల కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించాయి. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు కదం తొక్కాయి. కరీంనగర్‌ జిల్లాలో బిఎల్‌ఎఫ్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన అనంతరం లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. తోపులాట జరిగింది. పోలీసులు పిడిగుద్దులతో ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. విద్యార్థినులను ఈడ్చుకుంటూ వెళ్లారు. దీంతో అమ్మాయిలు గాయాలపాలయ్యారు. పోలీసుల తీరును ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి.

మహబూబ్‌నగర్‌, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ప్రజాసమస్యలు, కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ.. పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బిఎల్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. బిఎల్‌ఎఫ్‌ పిలుపు మేరకు నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. అర్ధరాత్రి నుంచే బిఎల్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యకు నిరసనగా.. ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి.. బిఎల్‌ఎఫ్‌ పక్షాల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలి వచ్చారు. ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకిరువైపులా బారికేడ్స్‌ ఏర్పాటు చేసి.. ట్రాఫిక్‌ను మళ్లించారు. అయినా వందలాదిగా కార్మికులు తరలివచ్చారు. ర్యాలీగా వెళుతున్న బిఎల్‌ఎఫ్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

నమ్మి గెలిపిస్తే కేసీఆర్‌ ప్రజలను వంచిస్తున్నారని నాయకులు విమర్శించారు. ప్రజల మౌలిక సమస్యలు తీర్చని ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. వరంగల్‌, జనగాం, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తాము నిర్వహించిన సర్వేలో 40 రకాల సమస్యలు బిఎల్‌ఎఫ్‌ దృష్టికి వచ్చాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ప్రభుత్వం వాటి పరిష్కారానికి తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ సర్కారు విఫలమైందని నేతలు ఆరోపించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్‌లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

16:46 - June 27, 2018
16:11 - June 27, 2018

ఖమ్మం : నాలుగేళ్లు పాలనలో సమస్యలను పరిష్కరించాలని, డబుల్ బెడ్ రూం నివాసాలను కేటాయించాలని..తదితర సమస్యలపై బీఎల్ఎఫ్ గళమెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ను బీఎల్ఎఫ్ ముట్టడించింది. కానీ పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

కలెక్టర్ కు మెమోరాండం సమర్పించి తమ సమస్యలను విన్నవించుకుంటామని నేతలు పేర్కొన్నారు. కానీ దీనికి పోలీసులు సమ్మతించలేదు. దీనితో అసహనానికి గురైన నేతలు, కార్యకర్తలు బారికేడ్లను నెట్టివేసి లోనికి వెళ్లేందుకు యత్నించేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే సున్న రాజయ్య బైఠాయించారు. బలవంతంగా నేతలను, కార్యకర్తలను నెట్టివేశారు. మహిళలని చూడకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:06 - March 27, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం తామేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నగరంలో ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు సీపీఎం జాతీయ మహాసభలు జరగనున్నాయి. మహాసభల విజయవంతానికి విస్త్రత ప్రచారం చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏప్రిల్‌ 22న వేలాదిమందితో రెడ్‌ వాలంటీర్ల కవాతు, పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌లు ఏర్పాటు చేస్తామంటున్న నేతలు.. ఆ పార్టీల ఆర్థిక విధానాలనే అమలు చేస్తున్నారన్నారు. బీఎల్‌ఎఫ్‌కు విశేష ఆదరణ లభిస్తుందని తమ్మినేని పేర్కొన్నారు.

13:31 - March 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మోసపూరితంగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. గురువారం శాసనసభలో మంత్రి ఈటెల 2018-19 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లుగా ప్రకటించారు. బడ్జెట్ పై సున్నం రాజయ్య మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ మోసపూరితంగా ఉందని, అన్ని వర్గాల..ప్రజలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ప్రణాళిక నిధి పేరిట డైవెర్ట్ చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు లేవని..పోరాటాలు చేస్తేనే కొంతమందికి జీతాలు ఇచ్చారని...సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రూ. 1,74,453 కోట్లు అమలు చేస్తామంటే నమ్మశక్యంగా లేదన్నారు. మొత్తంగా బడ్జెట్ అంకెలగారడీగా ఉందన్నారు. 

13:12 - March 12, 2018

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు భిన్నంగా ఉందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. గవర్నర్ ప్రసంగం సమగ్రంగా లేదన్నారు. రైతుల రుణమాఫీ ప్రస్తావవ లేదని తెలిపారు. కౌలు రైతులకు కూడా రెండు పంటలకు  8వేలు ఇవ్వాలన్నారు. పండిన పంటలకు గిట్టుబాట ధర లేదని చెప్పారు. స్వామినాథన్, జయతిఘోష్ సిఫారసులను పాటించడం లేదున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. రైతాంగం, కార్మికులు, యువత, విద్యార్థలు,నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చారని అన్నారు. 

09:33 - January 27, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో మావోయిస్టులు అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో ఒకరిని పొట్టనపెట్టుకున్నారు. పినపాక మండలం భూపతిరావుపేట, సుందరయ్యనగర్‌లో అర్థరాత్రి మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు. పొడియం జోగయ్య అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. మడివి రమేష్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రమేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. భూపతిరావుపేటలో నాలుగు లారీలు, రెండు జేసీబీలను సైతం దహనం చేశారు. ఇసుక క్వారీలోని ఇద్దరు కూలీలను తీసుకెళ్లి మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. 

 

21:54 - December 9, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఆదివాసీలు కదం తొక్కారు. తమ హక్కుల కోసం ముక్త కంఠంతో నినదించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఆదివాసీల సంక్షేమాన్ని గత పాలకులు విస్మరించారని నేతలు మండిపడ్డారు. విద్యా, ఉద్యోగ, ఉపాధిలో ఆదివాసీలకు  నష్టం జరుగుతోందని అన్నారు. 

హక్కుల కోసం ఆదివాసీలు పోరుబాట పట్టారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ  డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో సభ నిర్వహించారు. ఆదివాసీల హక్కుల పోరాట సమితి - తుడుందెబ్బ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆదివాసీల ఆత్మగౌరవం పేరుతో జరిగిన  ఈ బహిరంగ సభకు వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో వచ్చారు.  ఈ సభకు గోండు, గోమ, చెంచు, నాయక్‌కోడ్‌, పర్టానా, కొల్లం, కొండరెడ్లు, ఎరుకల, యానాది, ఆదివాసీ, మన్నేవార్‌ తదితర ఉప కులాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. 

ఆదివాసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న  పార్లమెంటరీ ఎస్సీ,ఎస్టీ  కమిటీ చైర్మన్‌ పగాన్‌సింగ్‌ కుల్తే.. ఆదివాసీల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఆదివాసీల ఉద్యమానికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఆదివాసీల హక్కులను పూర్వంలో బ్రిటీష్‌, నైజాం నవాబులు అణచివేయాలని చూస్తే కుమ్రంభీం విల్లంబులతో వారిపై పోరాటం చేశారని కుమ్రంభీం మనువడు సోనేరావు అన్నారు. నేడు ఆదివాసీల ఉనికి కోసం మనం మరోసారి అదే  స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం ఉధృతం చేయాలన్నారు.

ఇదే సభకు హాజరైన సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య...గతంలో పాలించిన పాలకులు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. విద్యా, ఉపాధిలో ఆదివాసీలకు  నష్టం జరుగుతోందని చెప్పారు.  జీవో నంబర్‌ 3ను మార్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోంటే.. అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీల ఏకైక ఎమ్మెల్యేగా తాను  ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించానని గుర్తు చేశారు. వలసదారులు, చొరబాటుదారుల పేర్లతో ఆదివాసీలను  ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దీన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్‌ చేశారు.

ఆదివాసీల సభలో  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మీబాయి మాట్లాడుతుండగా ఆదివాసీలు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివాసీల కోసం కేసీఆర్‌ కుమ్రంభీం జిల్లా ఏర్పాటు చేశారని కోవా లక్ష్మి తెలిపారు. తమ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని చెప్పారు.

 

17:18 - November 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఫీయి రీయింబర్స్ మెంట్ పథకంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. బుధవారం అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరుగార్చిందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఆయన ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు వేశారు. పేదవర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాకర్ల మధ్య ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదా ? అని ప్రశ్నించారు. 13 లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందని, 80 మైనార్టీ స్కూళ్లు మూతపడ్డాయా ? లేదా ? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని సూటిగా ప్రశ్నించారు. చివరి సంవత్సరం నుండి బకాయిలు ఎంతుందో చెప్పాలన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. రూ. 4వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీనివ్వాలన్నారు.

దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని..2016-17 విద్యా సంవత్సరానికి మరో వారంలో ఫీజులు బకాయిలు చెల్లిస్తామన్నారు. చిన్న కాలేజీలకు మొదట..పెద్ద కాలేజీలకు తరువాత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు తాము 52.35 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం జరిగిందన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - CPM MLA Sunnam Rajaiah