crime news

10:41 - June 19, 2018

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్‌ కేసుతో దుర్గగుడి భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వచ్చాయి. కొండ దిగువన ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని బయటపడింది. దీంతో పాలకమండలి సమావేశంలో.. సీసీ కెమెరాలపై సమీక్ష నిర్వహించారు. పాతబడ్డ సీసీ కెమెరాలను మార్చడమే కాకుండా నిరంతరం వాటిని పర్యవేక్షించేలా నిర్ణయం తీసుకున్నారు. 

ఆదివారం ఇంద్రకీలాద్రిపై చిన్నారి తప్పిపోవడంతో దుర్గ గుడి వైఫల్యాలు బయటపడ్డాయి. విజయవాడలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. దర్శనానంతరం చెప్పుల స్టాండ్‌ వద్ద చిన్నారి తప్పిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెతికినా చిన్నారి కనిపించకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. 

అయితే... పోలీసులు రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తుండగా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. ఇంద్రకీలాద్రిపై పలుచోట్ల సీసీ టీవీ కెమెరాలు పని చేయడం లేదని తేలింది. అంతేకాకుండా... కొండ కింది భాగంలో సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో చిన్నారి అదృశ్యం కేసును చేధించేందుకు 14 గంటల సమయం పట్టింది. దీంతో పాలకమండలి సమావేశంలో ప్రధానంగా గంటన్నరసేపు సీసీ టీవీ కెమెరాలపై చర్చించారు. పాతవాటి స్థానంలో కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కొండ దిగువన కూడా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు.. దృశ్యాలు రికార్డింగ్‌, స్టోర్‌ చేసేందుకు అవసరమైన నెట్‌వర్క్‌, సర్వర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 8 లక్షల రూపాయలు కేటాయించాలని ఆమోదించారు. ఇక వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సిబందిని కూడా నియమిస్తున్నట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. 

ఇక పాలకమండలి సమావేశంలో అగ్నిమాపక సామాగ్రితో పాటు సంప్‌ నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానంలోని కొన్ని కట్టడాలకు రంగులు వేయాలని, మల్లికార్జున మహామండపం వద్ద పవిత్ర వనం పరిసరాలు అభివృద్ధిపరిచేందుకు 58 లక్షల రూపాయలతో అంచనాలను ఆమోదించారు. మొత్తానికి చిన్నారి అదృశ్యంతో దుర్గ గుడి భద్రత వైఫల్యంపై మరోసారి చర్చనీయాంశమైంది. 

09:15 - June 16, 2018
08:26 - June 16, 2018

హైదరాబాద్ : చైతన్యపురి సత్యనారాయణపురంలో మానసిక వికలాంగులైన ఇద్దరు చిన్నారులను చంపిన ఘటన కలకలం రేపుతోంది. అభం..శుభం తెలియని ఆ చిన్నారులను ఎందుకు చంపేశారు ? ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు మృతదేహాలను తరలిస్తుండగా ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన లక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు 12 ఏళ్ల సృజనరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు కవల పిల్లలు. వీరు మానసిక వికలాంగులు. వీరిని ఎలాగైనా వదిలించుకోవాలని మేనమామ మల్లిఖార్జునరెడ్డి నిర్ణయించుకున్నాడు. స్విమ్మింగ్ నేర్పిస్తానని చెప్పి చైతన్యపురిలోని సత్యనారాయణపురానికి తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి కారులో మృతదేహాలను తరలిస్తుండగా ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు మల్లిఖార్జునరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు...మానసిక వికలాంగులైన పిల్లలతో తన అక్క బాధ చూడలేకే ఈ ఘాతుకానికి అతను పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా టెన్ టివి ఇంటి యజమాని, పోలీసులు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.

ఇంటి యజమాని...
'రాత్రి సమయంలో బయటకు రావడం జరిగింది. మల్లిఖార్జునరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని తీసుకొచ్చి కారులో వేశాడు. ఏమైంది అని అడిగాను. ఏదో తాగాడు. ఆసుపత్రికి తీసుకెళుతానని చెప్పాడు. మరలా కొద్దిసేపటి అనంతరం సృజనరెడ్డిలను తీసుకొచ్చి కారులో వేశాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీశా. పొంతనలేని సమాధానం చెప్పాడు. ఫొటోలు తీసి పోలీసులకు సమాచారం అందించా. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉందని తెలుస్తోంది'. అని ఇంటి యజమాని పేర్కొన్నారు.

పోలీసులు
'
స్విమ్మింగ్ నేర్పిస్తానని సృజనరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలను నగరానికి తీసుకొచ్చాడు. సత్యానారాయణపురంలో శుక్రవారం రాత్రి చంపేసి కారులో తరలించే ప్రయత్నం చేశాడు. ఇంటి యజమాని సమాచారంతో నిందితుడిని పట్టుకోవడం జరిగింది. విచారిస్తున్నాం. గొంతు నులిమి చంపేసినట్లు సమాచారం. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతాం'. అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:34 - May 14, 2018

ప్రకాశం : జిల్లాలోని ఉలవపాడులో విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో భార్య భర్తల నిర్ణయంతో ఆరుగురు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు పిల్లలు మృతి చెందిన వారిలో ఉన్నారు. సునీల్..రమాదేవి దంపతులకు నలుగురు పిల్లలు. కందుకూరులో జరుగుతున్న వివాహ వేడుకకు వీరు హాజరయ్యారు. అక్కడ భార్య..భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. బంధువులు జోక్యం చేసుకుని సర్ధిచెప్పారు. తిరుగు ప్రయాణంలో ఉలవపాడు రైల్వే స్టేషన్ వద్ద మళ్లీ ఒకసారి వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీనితో పిల్లలతో సహా సునీల్..రమాదేవిలు రైలు కింద పడిపోయారు. మృతదేహాలు చెల్లాచెదురుగాపడి ఉన్నాయి. కల్యాణ్‌, కల్యాణి, ఉష, మరో 8 నెలల చిన్నారిగా మృతులుగా గుర్తించారు. నలుగురు చిన్నారులు చనిపోవడం అందరి హృదయాలను కదిలించింది.

15:38 - May 9, 2018

అనంతపురం : పార్థీ గ్యాంగ్‌...! కరడుగట్టిన నేరగాళ్ల ముఠా..! ఇప్పుడీ గ్యాంగ్‌.. అనంతపురం జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. చీకటి పడితే చాలు.. ప్రజలు ముఖ్యంగా గ్రామీణులు గజగజ వణికిపోతున్నారు. కొన్ని చోట్ల.. ప్రజలే వంతులవారీగా కర్రలు, వేటకొడవళ్లు.. కారంపొడి చేతబట్టి.. పహారా కాస్తున్నారు.
అనంత ప్రజల్లో పార్థీ గ్యాంగ్‌ భయం
అనంతపురం జిల్లా వాసులను మూడు నాలుగు రోజులుగా పార్థీ గ్యాంగ్‌ భయం వెంటాడుతోంది. మారణాయుధాలతో సంచరించే ఈ ముఠా.. దొంగతనాలు, అత్యాచారాలు, హత్యల్లో ఆరితేరిన వారని స్థానికులు విశ్వసిస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా.. వేటకొడవళ్లు ధరించిన కొందరి ఫోటోలు జిల్లా అంతటా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ముఠాలో మహిళలూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చీకటి పడితే చాలు జనం వణికిపోతున్నారు.
పామిడి, గుత్తి మండలాల్లో పార్థీగ్యాంగ్‌ సంచారం?
అనంతపురం జిల్లాలోని పామిడి, గుత్తి మండలాల్లో పార్థీ గ్యాంగ్‌ సంచారం విస్తృతంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. కొన్ని గ్రామాల్లో.. ప్రజలు సొంతంగానే రక్షణ చర్యలు చేపట్టారు. కర్రలు, కారంపొడి, వేటకొడవళ్లు చేతబట్టి.. వంతులవారీగా గస్తీకి దిగారు.
గౌతమాశ్రమం వైపు పార్థీగ్యాంగ్‌ పలాయనం?
గస్తీ సందర్భంగా.. సోమవారం అర్ధరాత్రి, తమకు పదిమంది సభ్యుల ముఠా కంటబడిందని.. వెంబడిస్తే గౌతమాశ్రమం వైపు పారిపోయారని.. గుత్తి సూరసింగనపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ముఠా సభ్యుడన్న అనుమానంతో ఓ వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
ప్రజలు ఆందోళన 
ఇటీవలి వరకూ చిత్తూరు జిల్లాలో హల్‌చల్‌ చేసిన పార్థీ గ్యాంగ్‌ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచరిస్తోందన్న వార్తలతో.. ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు తక్షణ చర్యలు చేపట్టి.. ప్రజల భయాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

13:10 - July 18, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ వేశారు. ఈ కార్యాక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:28 - July 12, 2017

విజయవాడ : ఏపీలో దోపిడి దొంగలు బరితెగించారు. రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖల్లో భారీ దోపిడీలకు పాల్పడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన రెండు దొంగతనాలు.. ప్రజలను ఉలికిపడేలా చేశాయి. మహారాష్ట్రకు చెందిన ముఠాలే ఈ దొంగతనాలు చేసి ఉండొచ్చని.. పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. దుండగులు చేతిలో ఆయుధాలు పట్టుకొని వచ్చి.. నిలువు దోపిడీ చేశారు. జరిగిన హఠాత్పరిణామంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంగారం, డబ్బు దొరికినంతా దోచుకెళ్లడంతో.. దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. 
7 కిలోల నగలను దోచుకెళ్లిన దుండగులు 
విజయవాడలో బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. గవర్నరుపేట, గోపాలరెడ్డి వీధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బెంగాల్‌కు చెందిన శంకర్‌ మన్నా గోపాలరెడ్డి వీధిలోని ఓ భవనంలో నగలు తయారు చేసే కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇందులో 30 మంది దాకా పని చేస్తుంటారు. వీళ్లంతా బెంగాల్‌కు చెందినవారే. రాత్రి పదిగంటల సమయంలో కార్మికులు నగలు తయారు చేస్తుండగా.. దాదాపు 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో వచ్చి బెదిరించారు. కార్మికులను ఒక చోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని ఆదేశించారు. అక్కడ ఉన్న 7 కిలోల నగలను బ్యాగులోకి సర్ధి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్‌ మన్నా, మరో వర్కర్‌ తేరుకొని వారిని వెంబడించారు. ఇది గుర్తించిన ఆగంతకులు కార్ఖానా సమీపంలో నిలిపిన తెల్లకారులో పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయినా వారు దొరకలేదు. ఈ తతంగాన్ని గమనించిన నైట్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ బైక్‌పై కారును వెంబడించినా.. ఫలితం లేకుండా పోయింది. 
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు 
సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో.. ఎనిమిది పోలీసు బృందాలు వాహనాలను తనిఖీలు చేపట్టాయి. దుండగుల కోసం పోలీసులు  గాలింపు ముమ్మరం చేశారు.  క్లూస్‌, డాగ్‌  స్క్వాడ్లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు హిందీలో మాట్లాడుతుండటంతో.. వాళ్లు మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో వారిని గుర్తు పట్టేలా లేకపోవడంతో.. గుంటూరు ఖాజా వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాడి చేసిన వాళ్లంతా 25 నుంచి 30 ఏళ్ల లోపు యువకులేనని కార్ఖానా కార్మికులు చెబుతున్నారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. 
మొత్తం 8 మంది దుండగులు 
విశాఖ నగరం.. దారపాలెంలోనూ సినీఫక్కీలో చోరీ జరిగింది. సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడి ఇంట్లోకి ముఖానికి ముసుగులు వేసుకున్న దుండగులు ప్రవేశించారు. కత్తులు, తుపాకులు చూపించి ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఉన్నదంతా దోచుకెళ్లారు. 20 తులాల బంగారు వస్తువులు పట్టుకుపోయారు. కాళ్లుపట్టుకున్నా దుండగులు వినిపించుకోలేదని సత్యనారాయణ తెలిపాడు.  బాధితుడి ఫిర్యాదుతో అరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కారులో ఎనిమిది మంది దుండగులు వచ్చారని.. వారిలో ఇద్దరు ఇంటి బయట ఉండగా.. ఆరుగురు లోపలకు ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రెండు దొంగతనాలు జనాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన దొంగల ముఠాల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.  

 

19:36 - July 12, 2017

కృష్ణా : విజయవాడ దోపిడి ఘటనలో దుండగులు వినియోగించిన... మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారును గుంటూరు శివారులో పోలీసులు గుర్తించారు. స్థానిక ఓబులు నాయుడు పాలెం సమీపంలోని కొండల వద్ద దుండగుల ఆనవాళ్లపై సమాచారం రావడంతో... ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. 

 

13:52 - June 24, 2017

విశాఖ : నగరలంలో ఎన్‌ఏడి జంక్షన్‌లో కంటైనర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్‌ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.

 

13:38 - June 23, 2017

గుంటూరు : ప్రజా ఆరోగ్య చీఫ్ ఇంజనీర్ పాము రంగారావు ఇంటి పై ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. గుంటూరులోని గౌతమి అపార్ట్ మెంట్ ఉన్న రంగారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు.య అలాగే రూ.30 కోట్ల విలువై ఆస్తుల పత్రాలను కూడు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - crime news