cucumber

12:45 - March 9, 2018

ఎండాకాలం వచ్చేసింది..ఇప్పటి నుండే ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

  • కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది.
  • పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.
  • ప్రతి రోజు రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగితే కడుపు నొప్పి..అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
  • కీరలో 95 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చల్లదనం అందిస్తుంది.
  • వేసవిలో కీర ముక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిని వైద్యులు పేర్కొంటుంటారు. 
12:21 - March 14, 2017

ఎండకాలం వచ్చేసింది. చాలా మంది ఈ కాలంలో డీ హైడ్రేషన్ బాధ పడుతుంటారు. దీని నుండి తప్పించుకోవాలంటే 'కీర' తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇది దాహం తీరుస్తుంది. కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తేమ శాతం పెరిగి వేడి తగ్గుతుంది. కీరదోస రసంలో పోటాషియా, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. కీరను తినడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలని ధృడంగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఉంది. ఖనిజ లవణాలు ఉదర సంబంధిత వ్యాధులతో కీర పోరాడుతుంది. అజీర్తి లేకుండా చేయడం..శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు ఉదయం అల్పాహారంతో పాటు కొన్ని కీరదోస ముక్కల్ని తీసుకుంటే తక్కువ కెలొరీలు ఎక్కువ శక్తి అందుతాయి. 

12:52 - April 9, 2016

మనకు కీరా దోసతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి అని ఖచ్చితంగా తెలిసిందనుకోండి... కీరాను మన ఆహారంలో భాగం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించం?! తప్పక ప్రయత్నిస్తాం. అనేక వ్యాధులను దూరంగా ఉంచడంలోను, శరీర సౌందర్యాన్ని పెంచడంలోనూ, చివరికి బరువు తగ్గించడంలోనూ దోహదపడే కీరాను ఎవరైనా కొనకుండా ఉంటారా? అస్సలు ఉండరు కదా! అందుకే కీరాలో ఉన్న సుగుణాలేంటో వివరంగా తెలుసుకుని మీరు కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకోండి.
ఆరోగ్యపరంగా.... గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడే సుగుణాలు కీరాదోసలో ఉన్నాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  వీటిలోని పొటాషియం కండరాలకు మంచి చేయడమే కాదు, రక్తపోటును నియంత్రించడంలోనూ సాయపడుతుంది.  ఇందులోని మెగ్నీషియం రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది.  కీరా కేన్సర్‌ వంటివాటిని రాకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలింది. చర్మం కాలినా, కమిలినా కీరారసాన్ని రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఇందుకు కారణం కీరాలోని ఆస్కార్బిక్‌ యాసిడ్‌, సిలికాలే!
చిట్కా...
ఇంట్లో చీమలు ఉన్నాయా? అయితే, కీరాతొక్కలను గదిమూలల్లో ఉంచండి. చీమలు కనిపించవు.

18:51 - March 25, 2016

తూర్పుగోదావరి : గోదారి తీరం సాక్షిగా ఆయనో పండుటాకు. జీవజలం పుష్కలంగా ఉన్న సమయంలో లక్షలాది మంది అన్నదాతలు అరక పడితే ఏడు పదుల వయసులో ఆ రైతు ఏరువాక విభిన్నంగా సాగుతోంది. తడారిపోయిన తల్లి గోదావరి గుండె గర్భమే పెట్టుబడిగా ఇసుక తిన్నెల్లో చలువ పళ్లు పండించే తీరు అబ్బురపరుస్తోంది. మండు వేసవిలో ఎడారి సాగు తమ వల్ల కాదంటూ సాటి రైతులు ఒక్కొక్కరుగా చేతులెత్తేసినా.. మలిసంధ్య వయసులోనూ గోదారమ్మ ఒడిలో చలువ పళ్లు సాగుచేస్తున్న ఒకే ఒక్కడిపై 10టీవీ ప్రత్యేక కథనం. నాగిరెడ్డి వెంకట్రావు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో తనకు పట్టాగా సంక్రమించిన గోదావరి ఇసుక లంక భూమిలో దేశవాళీ దోసకాయలను సాగు చేస్తున్నాడు. సీతానగరం మండలం పరిధిలోని లంకల భూ యజమానులంతా పుచ్చ, దోస సాగుకు స్వస్తి చెప్పినా.. ఆ భూమిపై ఉన్న మమకారంతో నాగిరెడ్డి ఇంకా సాగు చేస్తూనే వున్నాడు. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దోస సాగు చేస్తున్న ఏకైక రైతుగా వెంకట్రావు నిలిచాడు.

ఆరోగ్యానికి ఎంతో మంచిది..
ఒకప్పుడు గోదావరి లంక భూముల్లో రైతులు విరివిగా సాగు చేసేవారు. గోదావరి ఎగువన ఉన్న ఈ ప్రాంతంలో ఇసుక తిన్నెల్లోని పొరల్లో దాగి ఉన్న నీటి చుక్కలు ఒండ్రుమట్టిని ఆధారంగా చేసుకుని చలువ పళ్లు పుచ్చకాయ, దోసకాయలను పండించేవారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలోని లంక భూములో.. ఏటా నవంబర్‌ నుంచి జూన్‌ మాసాల మధ్య దేశవాళీ పుచ్చ, దోసకాయలు పండించేవారు. అయితే కాలక్రమేణా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఈ సాగు అంతర్ధాన దశకు చేరుకుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఇసుక మాఫియా పంజా విసరడం కూడా ఈ చలువ పళ్ల సాగు అంతరించి పోయేందుకు కారణమైంది. ఒకరి వెంట ఒకరుగా ఎంతమంది ఈ సాగుకు దూరమైనా అన్ని కష్టాలనూ భరిస్తూ.. ఇసుక తిన్నెల్లో సేద్యానికి నేడు వెంకట్రావు ఒక్కడే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవడం విశేషం. వెంకట్రావు పండిస్తున్న దోసకాయలకు రాజమండ్రి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందంటున్నారు వ్యాపారులు. హైబ్రీడ్‌ కాయలతో పోలిస్తే వెంకట్రావు పండించే దోసకాయలు అరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.

జీవ వైవిధ్య సదస్సులో..
తూర్పు తీరంలో సాగు చేస్తున్న అరుదైన పంటల జాబితాలో ఈ పుచ్చ, దోసలు చేరాయి. గతంలో హైదరాబాద్‌లో జరిగిన జీవ వైవిద్య సదస్సులో అంతరించుకుపోతున్న లంకల పంటల జాబితాలో వెంకట్రావు సాగు అంశం ప్రస్తావనకు వచ్చింది. 20 ఏళ్ల క్రితం వరకు లంక భూముల్లో విరివిగా రైతాంగం చేపట్టిన చలువ పళ్ల సాగు అంతరించిపోవడానికి గల కారణాలను ఆ సభలో విశ్లేషించారు. వేడిగాలుల ఉధృతితో లంకలోని భూముల్లోకి అడుగుపెట్టలేని పరిస్థితితో పాటు.. గోదావరి ఇసుక భూముల్లో దాగివున్న విలువైన ఖనిజ సంపదపై మైనింగ్‌ మాఫియా కన్నుపడడంతో కాలక్రమేణా ఈ సాగు తగ్గిపోయిందని నిపుణులు తేల్చారు. ఓ వైపు తరతరాల నుంచి వస్తున్న పంటను రక్షించేందుకు వెంకట్రావు ఒక్కడే తంటాలు పడుతుంటే.. మరోవైపు పలువురు వ్యాపారులు బెంగళూరు నుంచి హైబ్రిడీ రకాలను దిగుమతి చేసుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఒకప్పుడు లంక భూముల్లోని ఇసుక తిన్నెల్లో పండిన చలువపళ్లతో ఉపశమనం పొందిన ప్రజలు.. నేడు హైబ్రీడ్‌ పళ్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రోత్సాహం ఎక్కడ ? 
సంప్రదాయిక చలువ పళ్ల సేద్యాన్ని కాపాడేందుకు ఒంటరి పోరాటం చేస్తున్న వెంకటరావుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహమూ లభించలేదు. ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఇలాంటి సాగును రక్షించుకునేందుకు ఉద్యానవన శాఖ ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు లంక ఇసుక భూముల్లో కళకళలాడిన చలువ పళ్ల సేద్యం.. నేడు అంతరించిపోవడానికి గల కారణాలను తెలుసుకుని.. ఈ సాగును రక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గోదారి తీరంలోని తీగజాతి ఫలాల సాగు సంరక్షణపై దృష్టి సారించకపోతే వెంకట్రావుతోనే పళ్ల పాదులూ అంతరించేపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

Don't Miss

Subscribe to RSS - cucumber