Dangerous Boat Roll in Krishna River

16:04 - November 14, 2017
14:20 - November 14, 2017

విజయవాడ : కృష్ణా నదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఏపీ అసెంబ్లీలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బాధ్యులైన వారికి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందుకు ఒక కమిటీ వేసి 24గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు.

మంగళవారం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక అందించారు. 25 మంది సామర్థ్యం ఉంటే 45 మందిని ఎక్కించారని, సదస్సులో తిప్పే బోటును కృష్ణా నదిలో తిప్పడానికి అనుమతి లేదని, రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థకు పెద్ద బోట్లు నడిపే అనుమతి లేదని నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. గతేడాది వరకు కాకినాడలో ఉన్న బోటును విజయవాడ తెచ్చి మరమ్మత్తులు చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ యజమానిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

బోటు ప్రమాద ఘటనపై చర్యలు...
బోటు ప్రమాదానికి కారణంగా భావించిన పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగి గేదెల శ్రీనుపై వేటు పడింది. బోటు ప్రమాదం ఘటనలో మరో 8 మందిపై ప్రభుత్వం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టూరిజం, జలవనరుల శాఖ మంత్రులు..అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలు అమలు చేయకపోవడంపై బాబు వివరణ కోరినట్లు సమాచారం. 

13:56 - November 14, 2017

నెల్లూరు : బోటు ప్రమాదంలో మృతి చెందిన లలితమ్మ, హరిత, అశ్విక మృతదేహాలు జిల్లాలోని వారి స్వగ్రామం కురుగొండకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. వీరి మృతితో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులతోపాటు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇవాళ సాయంత్రం మృతదేహాలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వం బాధ్యత ఉందన్నారు.

 

13:19 - November 14, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ప్రైవేట్ బోటు ఆపరేటర్లుతో మంత్రి అఖిలప్రియ సమావేశమయ్యారు. ఫెర్రీఘాట్‌ పడవ ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులు రద్దు చేస్తూ పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. కమిటీ సూచన మేరకు కొత్తగా లైసెన్సులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు అమలు చేస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. 

 

09:41 - November 14, 2017

కృష్ణా : జిల్లాలోని పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఏడేళ్ల చిన్నారి పోపూరి అశ్విత మృతదేహాన్ని రెస్క్యూబృందం వెలికితీసింది. చిన్నారి మృతదేహాన్ని పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ సందర్శించి..కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాద బాధ్యులపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. పర్యాటకశాఖ కాంట్రాక్ట్‌ బోటు డ్రైవర్‌ గేదెల శ్రీను సస్పెండ్‌ చేసింది. బాధ్యులైన ఇతరులను అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బోటు ఆపరేటర్లతో నేడు సచివాలయంలో పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ కానున్నారు.

21:53 - November 13, 2017

కృష్ణా : విజయవాడ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. నిన్న సాయంత్రం ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్‌.. ఈ సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇద్దరు మహిళల ఆచూకీ కోసం కృష్ణానదిలో గాలింపు కొనసాగుతూనే ఉంది. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు బరువెక్కిన గుండెలతో నిరీక్షిస్తున్నారు. ఇంకోవైపు, పలువురు ప్రముఖులు.. ప్రమాద స్థలిని సందర్శించి, వివరాలు ఆరా తీశారు. 

కృష్ణాజిల్లా ఫెర్రీఘాట్‌ వద్ద పడవ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికి 16 మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ సిబ్బంది ఈరోజు మరో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. అటు ఆంధ్రా ఆసుప్రతిలో చికిత్స పొందుతోన్న భూలక్ష్మి అనే మహిళ తుది శ్వాస విడిచారు. ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇద్దరు మహిళల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

బోటు ప్రమాదం నుంచి..  రెస్క్యూ టీమ్‌ వారు రక్షించిన వారిలో 17 మంది ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. మరో ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. స్వస్థలాలకు తరలించారు. మృతుల్లో ఎక్కువమంది ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు వాసులే కావడం... అంతా వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు కావడంతో..  వారితో పరిచయం ఉన్నవారంతా విషణ్ణులయ్యారు. మృత దేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. మంత్రి శిద్దారాఘవరావు, వైసీపీ నేతలు కూడా మృత దేహాలకు నివాళులు అర్పించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 

ఒంగోలులో.. మృతురాలు లీలావతి కుటుంబంలో వెన్వెంటనే మరో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మంగమూరులో కూతురు  మృతదేహాన్ని చూసి.. తట్టుకోలేక గుండెపోటుతో ఆమె తల్లి లక్ష్మీకాంతమ్మ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో అందరూ దిగ్భ్రాంతిలో ఉండగానే.. లీలావతి తండ్రి కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. 

మరోవైపు, ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో ప్రమాదస్థలిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదంలో చనిపోయిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోదరి బంధువులను పరామర్శించారు. అనంతరం ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఫెర్రీఘాట్‌ ఘటనను తీవ్రంగా భావిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు ప్రారంభించింది. రివర్‌బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌ పార్టనర్స్‌ సంస్థ నిర్వాహకులు శేషం మోదకొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టిపై పోలీసులు ఐపీసీ 304 సెక్షన్‌ 2 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తరువాత ఆరుగురు సిబ్బంది పరారు కాగా.. పడవ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు కారకులైన వారెవరినీ వదలబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అటు, వైసీపీ నాయకులు కూడా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి తదితరులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రభుత్వ వైఫల్యమే 21 మందిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. బోట్ల సామర్థ్యాన్ని పరీక్షించే వ్యవస్థ పర్యటక శాఖకు లేదని, ఈ శాఖ మొత్తం ఔట్‌ సోర్సింగ్‌పైనే ఆధారపడి పనిచేస్తోందని అన్నారు. నదిలో తిరిగే బోటులో కనీసం లైవ్‌ జాకెట్స్‌ లేకపోవడం దారుణమన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పదేసి లక్షల రూపాయల మేర పరిహారాన్ని ప్రకటించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదించేందుకు... ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి అధికారులతో కమిటీని వేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తానికి.. బెజవాడ బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

Don't Miss

Subscribe to RSS - Dangerous Boat Roll in Krishna River