dantewada

21:57 - November 8, 2018

దంతెవాడ: చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని పోలిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. చత్తీస్ ఘడ్ కు చెందిన అభినందన్ పాఠక్ అచ్చు మోడీ లాగానే ఉంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బస్తర్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  గతంలో బీజేపీ కార్యకర్తగానే ఉన్న పాఠక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దంతెవాడ, కొండగావ్‌, జగ్దల్‌పూర్‌, బస్తర్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నపాఠక్ తో ఓటర్లు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

15:11 - November 8, 2018

దంతేవాడ: నవంబర్ 12 ఎన్నికల జరగనున్న చత్తీస్ ఘడ్  రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చత్తీస్ ఘడ్ లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక రోజు ముందు మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. చత్తీస్ ఘడ్  రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బచేలి సమీపంలో గురువారం మావోయిస్టులు ఒక బస్సుపై  దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తో సహా ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
గడచిన 2 వారాల్లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు పాల్పడటం ఇది మూడోసారి.  అక్టోబర్ 30 న ఎన్నికల వార్తల కవరేజ్ కు  వెళ్లిన దూరదర్శన్ టీంపై పైదాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానందన్ మరణించారు.  వారికి రక్షణగా వెళ్లిన  మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 27న  ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు  మరణించారు.
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చత్తీస్ ఘడ్ లో తొలిదశ పోలింగ్  నవంబర్ 12న జరుగుతుంది.  తొలిదశలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, మిగిలిన  72 నియోజకవర్గాలలో నవంబర్  20న పోలింగ్ జరుగుతుంది. 

07:58 - November 4, 2018

ఛత్తీస్‌గఢ్‌ : దంతేవాడలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను కాల్చివేశారు.  భాగ్యనగరం అడవుల్లో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులను దింపి రెండు బస్సులను కాల్చివేశారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

 

19:59 - September 19, 2017

దేశంలో పులుల లెక్కల తెలుసు కానీ, ఆదివాసీల లెక్కలు తెలియవు..ఇదీ మన ప్రభుత్వాల చిత్తశుద్ధి.. అడవి పుట్టినప్పటి నుంచి గిరిజనుడిదే భూమి. అక్కడి సాగుభూమిపై, గూడేలపై ఆదివాసీలకే హక్కు. ఒక్కమాటలో చెప్పాలంటే అడవికి గిరిజనుడే రాజు. కానీ జరుగుతున్నదేమిటి? కారణాలు అనేకం చెప్తూ ఆదివాసులను అడవులనుండి తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ దారుణాలకు తెలంగాణ వలస వచ్చిన గొత్తికోయలు బలవుతున్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌, జార్ఖండ్, తమిళనాడు, ఆంద్ర, తెలంగాణ ఇలా దేశంలో ఏ ఒక్క రాష్ట్రమూ దీనికి అతీతం కాదు.. అధికారంలో ఉన్న ఏ పార్టీలకి తేడాలేదు. అడవి బిడ్డలకు అన్యాయం చేయటంలో ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఇప్పుడు సొంత రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ అడవులకు వలస వచ్చిన గొత్తికోయల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. గత పదేళ్ల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోని అడవుల్లో పలు చోట్ల గుత్తికోయల ఆవాసాలు కనిపిస్తున్నాయి. చత్తీస్ ఘడ్ రాష్ట్రం దాడుల నుంచి తట్టుకోలేక గోదావరి దాటి జీవనోపాధి కోసం వలస వచ్చిన గుత్తికోయలకు ఇక్కడా అభద్రతే ఎదురవుతోంది. తలదాచుకోవాలని తెలంగాణకు వచ్చిన గుత్తికోయల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారైంది..

అడవుల్లో ఎంతకాలం ఉన్నా స్థానికులు కాలేని పరిస్థితి..ఓ పక్క పోడు వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానాన్ని ఆసరాగా చేసుకుని అటవీ సిబ్బంది సాగించే దుర్మార్గాలు.. మరోపక్క స్థానిక గిరిజనుల వ్యతిరేకత.. వెరసి గొత్తికోయలకు నిలువల నీడలేని పరిస్థితి ఏర్పడుతోంది.. స్వతంత్ర భారతంలో ఎవరైనా ఎక్కడైనా బతికే అవకాశం ఉంది. కానీ, ఆదివాసీల బడుగు బతుకులను ఆసరాగా తీసుకుని అధికార యంత్రాంగం దారుణంగా ప్రవర్తిస్తోంది.అసలీ అడవి ఎవరిది? ఆ అడవిని నిజంగా కాపాడుతున్నదెవరు? ఆ అటవీ సంపదను నాశనం చేస్తున్నదెవరు? కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే న్యాయాన్ని అనుసరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. చారెడు నేల అడిగితే లాఠీ ఝుళిపిస్తున్నారు.. పోడు వద్దంటూ తరిమే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు అడవికి, ఇటు మైదానానికి కాకుండా ఆదివాసీల ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారు.. మరి ఆదివాసుల్ని తరిమేస్తే అడవి కళకళలాడుతుందా? కానీ వీరిలో 40 శాతం మంది నివాసాలని కోల్పోయి వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారన్నది విషాదకరమైన వాస్తవం.. ముఖ్యంగా 1990ల నుంచి ప్రపంచీకరణలో భాగంగా ఆధిపత్య దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై కన్ను వేశాయి. ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే అక్కడ స్థానిక ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని కార్పొరేట్‌ శక్తుల ద్వారా తమ పంజా విసురుతున్నాయి. ఈ వేటలో ప్రధాన బలిపశువులు ఆదివాసీలే.

గత 30 ఏళ్లలో మొత్తం 35 లక్షల ఎకరాల అటవీ భూమి చట్టబద్ధంగా నాశనమైంది. దానిపై ఎలాంటి చర్యలు, పరిశీలనలు లేవు. కానీ, పొట్టకూటికోసం మాత్రం తనసొంతమైన అడవితల్లి ఇచ్చిన సంపదను ఉపయోగించుకుంటే, పండించుకుంటే, ప్రభుత్వాలకు నొప్పి కలుగుతోంది. ఈ దేశమూలవాసులను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటికీ వారికోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోగా, ఉన్న కాస్త ఆధారాన్ని పోగొట్టే ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:27 - February 2, 2017

హైదరాబాద్: ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఏవోబీలో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. సాలూరు-కొరాపుట్‌ రహదారిలోని సుంకిఘాటీ ముంగరు భూమి గ్రామం వద్ద ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు చనిపోగా..మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో 40 మంది జవాన్లు ఉన్నారు. మావోయిస్టుల దాడితో ఏవోబీ మళ్లీ వేడెక్కింది. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

సరిహద్దుల్లో చాలాకాలం తర్వాత ...

సరిహద్దుల్లో చాలాకాలం తర్వాత మావోయిస్టులు పెద్దఎత్తున పోలీసులపై దాడి చెయ్యడంపై ఒక్కసారిగా సరిహద్దుల్లో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఏవోబీలో గతేడాది అక్టోబర్‌ 24న జరిగిన రాంగూడ ఎన్‌కౌంటర్‌లో 30 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ఈ సంఘటనకు ప్రతీకారం తీర్చుకోడానికి కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా సుంకి ఘాటీని అనువుగా చేసుకుని పోలీసులపై ఒక్కసారిగా దాడిచేసి పోలీసులను మట్టుపెట్టారు. ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా పద్మ నియామకం తర్వాత సరిహద్దుల్లో మావోయిస్టులు మెల్లగా కార్యకలాపాలు విస్తృతం చేశారు. రాంగుడ ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీలో ఉన్న మిగతా కేడర్‌ మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా భారీ విధ్వంసానికి మావో అగ్రనాయకత్వం వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. దీన్ని అమలు చేయడానికి మావోయిస్టులు 3 నెలలుగా చాపకింద నీరులా తమ కార్యకలాపాలు సాగించారు. రాంగుడ ఎన్‌కౌంటర్‌ అనంతరం మావోయిస్టుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న నిఘా విభాగం మావోయిస్టుల మౌనం వెనుక పెద్ద విధ్వంసమే దాగిఉందని..దీనిని ఎదుర్కోడానికి అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో పోలీసులకు హెచ్చరికలు జారీచేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులోని విశాఖ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ముంచంగిపుట్టు మండలంలోని రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లు గుర్తించి వెలికితీశారు. తాజాగా మావోయిస్టుల విధ్వంసంతో అప్రమత్తమైన పోలీసులు ఆంధ్రా- ఒడిశా సరిహద్దులను జల్లెడ పడుతున్నారు. పోలీసు వాహనాన్ని పేల్చిన ఘటనకు పాల్పడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు విశాఖ మన్యంలోని అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల పర్యటనల్లో జాగ్రత్తలు తీసుకోవాలని..సూచించారు.

బాధితులను పరామర్శించిన విశాఖ ఎస్పీ...

ఏఓబీ సరిహద్దు ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు అసిస్టెంట్‌ డ్రైవర్లు మందుపాతర పేలుడు ఘటనలో గాయపడ్డారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విశాఖ జిల్లా SP రాహుల్‌దేవ్‌ శర్మ పరామర్శించారు. వీరికి అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తత ప్రకటించినట్టు రాహుల్‌దేవ్‌ శర్మ చెబుతున్నారు.

09:05 - February 2, 2017

విజయనగరం : గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మళ్లీ అలజడి మొదలయ్యింది.. సాలూరు- కొరాపుట్‌ రహదారిలోని సుంకి ఘాటీ ముంగరు భూమి గ్రామం వద్ద ఒడిశా రాష్ట్ర సాయుధ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చిన ఘటనలో 7గురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ వ్యాన్ కు సంబంధించిన శకలాలు 25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకోవడం చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో వుందో ఊహించవచ్చు. వ్యాన్ లోని పోలీసుల దుస్తులు, ఆహారం చిందరవందరగా, చెల్లాచెదురుగా పడిపోయాయి. అమాంతం గాల్లోకి లేచిన వ్యాన్ ఓ చెట్టును ఢీ కొట్టి, దగ్గర్లోని లోయలో పడిపోయిందని సాక్షులు చెబుతున్నారు. దీంతో వ్యాన్ తునాతునకలైంది. పేలుడు చీకటి పడిన తరువాత చోటుచేసుకోవడానికి తోడు సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడడం, కల్వర్టు కూలిపోవడంతో సహాయకచర్యలకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక, రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు. ఇది జాతీయ రహదారి 21 కావడంతో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

21:32 - February 1, 2017

ఒడిశా : ఏవోబీలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. భద్రతా బలగాల బస్సుపై మావోయిస్టులు దాడి చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపూర్‌ జిల్లా సుంకి వద్ద మావోయిస్టులు మందు పాతర పేల్చారు. బస్సులో 40 మంది జవాన్లు ఉన్నారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

 

18:34 - January 29, 2017

ఛత్తీస్ గడ్ : పోలీసులకు..మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పురంగోల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులో మహిళ ఉన్నట్లు తెలుస్తోంది.

11:27 - August 18, 2016

రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడజిల్లాలోని  కిరణ్‌-బచేలి ప్రాంతాల మధ్య రైలు పట్టాలను తొలిగించారు. కిరణ్‌గ్రామ సమీపంలోని స్టీల్‌ప్లాంట్‌లో పంప్‌హౌజ్‌కు నిప్పంటించారు. చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగాపడవేశారు.  నిన్నటి పోలీస్‌ కాల్పులకు నిరసనగానే ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. 

 

17:54 - August 17, 2016

చత్తీస్ గఢ్ : దంతెవాడలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 8 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. పలువురు పోలీసులకు గాయపడ్డారు. ఎన్ కౌంటర్ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - dantewada