delhi

08:29 - March 28, 2017

గుంటూరు : ఏపీలో మరో రెండు నీట్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం విశాఖ, విజయవాడలకు తోడుగా కొత్తగా గుంటూరు, తిరుపతిల్లో నీట్‌  పరీక్షా కేంద్రాలు మంజూరు చేశారు. కర్నూలు, రాజమండ్రిలో కూడా నీట్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెబుతున్నారు. 
 

22:35 - March 27, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు. కార్పోరేట్లకు 11 లక్షల కోట్లను మాఫీ చేసిన కేంద్రం- రైతుల రుణాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత రెండు వారాలుగా జంతర్ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న తమిళనాడు రైతులను పరామర్శించిన ఏచూరి- వారికి తమ మద్దతు తెలిపారు. రైతుల సమస్యను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని వారికి హామీ ఇచ్చారు. ఎలుకలను నోట్లో పెట్టుకుని రైతులు నిరసన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తమిళ రైతులకు 20 వేల కోట్ల నష్టం జరిగింది. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి రైతులకు తక్షణమే కేంద్రం నిధులు విడుదల చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

22:28 - March 27, 2017

ఢిల్లీ : దేశంలో రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖెహర్... దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోగా తెలపాలని.. కేంద్రానికి నోటీసులు జారీచేశారు. గుజరాత్ రైతు సమస్యలపై సిటిజన్ రిసోర్స్ యాక్షన్ ఇనిషియేటివ్ అనే ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ ధర్మాసనం విచారించింది. దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... కేంద్రప్రభుత్వం వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా పాలసీ తీసుకురావడం లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్.. కేంద్రానికి నోటీసులు జారీచేశారు.

21:45 - March 27, 2017

ఢిల్లీ : జీఎస్టీకి సంబంధించిన 4 సహాయక బిల్లులు-ఐజీఎస్టీ, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ పరిహార చట్టాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై మంగళవారం చర్చించే అవకాశం ఉంది. మార్చి 30లోపు లోక్‌స‌భ‌లో జీఎస్టీ బిల్స్‌ను పాస్ చేయించాల‌ని కేంద్రం భావిస్తోంది. అనంతరం 4 జిఎస్‌టి బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఏమైనా స‌వ‌ర‌ణ‌లు సూచిస్తే.. వాటిపై చ‌ర్చించ‌డానికి లోక్‌స‌భ‌కు త‌గిన స‌మ‌యం దొరుకుతుంది. ఆ స‌వ‌ర‌ణ‌ల‌ను లోక్‌స‌భ ఆమోదించ‌వ‌చ్చు లేదా తిరస్కరించ‌వ‌చ్చు. వీటిని ద్రవ్య బిల్లులుగానే ప్రవేశ‌పెడుతున్నా.. పార్లమెంట్‌ ఉభయ స‌భ‌ల్లోనూ త‌గిన చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లులు పాసయ్యాక వీటిని విధానసభలకు పంపనున్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీని అమ‌లు చేయాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. 
 

21:43 - March 27, 2017

ఢిల్లీ : ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం తప్పుపట్టింది. ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న బిల్లును తాము వ్యతిరేకిస్తామని రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందని ఆరోపించారు. 

 

21:38 - March 27, 2017

ఢిల్లీ : సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని సూచించింది. అయితే బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, ఆదాయపు పన్ను వివరాల నమోదు లాంటి వాటికి మాత్రం ప్రభుత్వం ఆధార్‌ను తొలగించబోదని న్యాయస్థానం వెల్లడించింది. ఆధార్‌ అనుసంధానంపై పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావట్లేదని తెలిపింది.

 

21:36 - March 27, 2017

ఢిల్లీ : ఎయిర్‌ ఇండియా అధికారిపై దాడి చేసిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ త్వరలో విమానం ఎక్కనున్నారా...? ఆయనపై ఏడు విమానసంస్థలు విధించిన నిషేధం సమసిపోనుందా? గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలన్న శివసేన ఎంపీలు చేసిన విజ్ఞప్తికి కేంద్రం దిగివచ్చినట్లే కనిపిస్తోంది.
నిషేధ అంశం లోక్‌సభలో చర్చ
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను విమాన సంస్థలు నిషేధించిన అంశం లోక్‌సభలో చర్చకు వచ్చింది. జీరో అవర్‌లో శివసేన ఎంపీ ఆనందరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎయిర్‌ ఇండియా అధికారి ఎంపీతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే గైక్వాడ్‌ సహనం కోల్పోయారని అన్నారు. అయితే అధికారిని కొట్టడం తప్పేనని  ఒప్పుకున్నారు.  గ్వైక్వాడ్‌ను  విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించడం సరికాదని ఆనందరావు చెప్పారు. ఎయిర్ ఇండియా ఉద్యోగుల‌తో దురుసుగా ప్రవ‌ర్తించిన కపిల్‌ శర్మను ఎందుకు బ్యాన్‌ చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.  
ఎంపీ కూడా ఓ ప్రయాణికుడే : అశోక్ గజపతిరాజు 
శివసేన లేవనెత్తిన అంశంపై కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు స్పందించారు. ఎంపీ కూడా ఓ ప్రయాణికుడేనని, ప్రయాణికుల విషయంలో అధికారులు భేదభావం చూపరని స్పష్టం చేశారు. ఓ ఎంపి ఇలాంటి గొడవలో ఇరుక్కుంటారని తాను ఊహించలేదన్నారు.  గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలన్న శివసేన డిమాండ్‌ను మంత్రి తోసిపుచ్చారు. ప్రయాణికుల సంరక్షణ విషయంలో రాజీ పడేది లేదన్నారు.  
నిషేధం ఎత్తివేసేందుకు రంగంలోకి శివసేన ఎంపీలు 
రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు శివసేన ఎంపీలు రంగంలోకి దిగారు. కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తిరాజు, స్పీకర్‌ సుమిత్రామహాజన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో సదరు ఎంపీపై నిషేధం ఎత్తివేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రయాణించే హక్కుకు గౌరవం కల్పించాలన్న కారణంతో గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని త్వరలో ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది.
విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం 
ఇటీవ‌ల ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన శివసేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానశ్రయంలో ఓ అధికారిని చెప్పుతో కొట్టారు. దానికి క్షమాప‌ణ చెప్పేందుకు కూడా ఆయ‌న నిరాక‌రించారు. దీంతో 7 విమాన సంస్థలు విమానంలో ప్రయాణించకుండా గైక్వాడ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

 

21:30 - March 26, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను-జీఎస్టీ అనుబంధ బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్‌టీలో భాగమైన సీ, జీఎస్టీ, ఐ, జీఎస్టీ యూటీ, జీఎస్టీ, మొదలైన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మార్చి 28న చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్‌టీ అమలైతే ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ చట్టంలో ఉన్న వివిధ సెస్సులను రద్దు చేస్తారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన బిల్లులన్నీ జీఎస్‌టీ కిందకు వస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయాన్ని, ఇతర విషయాలపై రేపు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మార్చి 29 లేదా 30లోపు జీఎస్‌టీ బిల్లుకు సభ ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

18:18 - March 26, 2017
14:33 - March 26, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - delhi