Demonetization

11:15 - August 19, 2017

హైదరాబాద్: త్వరలో కొత్త రూ.50 నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ నోటు బ్యాంకుల ద్వారా ప్రజల్లోకి అందుబాటులోకి రానుంది. భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్‌భారత్‌ లోగో ఈ నోటు వెనుక వున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ నోట్లపై ఆర్బీఐ గవర్నరు సంతకం ఉంటుంది. ఫీచర్స్ విషయానికొస్తే.. ఫ్లోరెసెంట్‌ బ్లూ కలర్‌లోవున్న ఈ నోటు ముందు మహాత్మాగాంధీ ఫొటో, దేవనాగరి లిపిలో 50 సంఖ్య వుంది. ఆర్బీఐ అని మైక్రోలెటర్స్‌, ఇండియా అని దేవనాగరి లిపిలో రాసి వుంది. నోటు ముందు భాగాన కుడివైపు జాతీయ చిహ్నం, ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌, ఆరోహణ క్రమంలో నెంబరు ప్యానెల్‌ ఉండనుంది. కొత్తగా విడుదల కానున్న రూ.50 నోటు 66 ఎంఎం X 135 ఎంఎం పరిమాణంలో డిజైన్‌ చేశారు. కొత్త నోట్లు వచ్చినా, పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.

 

16:35 - July 27, 2017

హైదరాబాద్ : నేరేడ్ మెట్ పీఎస్ పరిధిలోని వాగ్ధేవినగర్ లో రద్దయిన నోట్లు బయటపడడం కలకలం రేగింది. పాతనోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ నోట్లు ఉన్న వారు బ్యాంకుల్లో జమ చేయాలని..పలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోట్లు కలిగి ఉంటే నేరమని కూడా ప్రకటించింది.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లోని నేరేడ్ మెట్ లోని వాగ్ధేవినగర్ లో చెత్తకుండిని శుభ్రం చేస్తున్న పారిశుద్య కార్మికుడికి రద్దయిన నోట్లు దర్శనమిచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా అందులో రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నోట్ల విలువ రూ. 16లక్షల విలువ ఉందని తెలుస్తోంది. 

16:36 - July 13, 2017

అనంతపురం : జిల్లాలో పాత నోట్లు మార్పిడి చేస్తున్న కానిస్టేబుల్‌ సహా 8 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయల పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:26 - April 26, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దయి చాలా రోజులవుతోంది. కానీ ఇప్పటికీ అక్కడక్కడ సమస్యలు ఇంకా తీరడం లేదు. నెల ప్రారంభంలోనే పలు ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య ఇలా ఉండగానే మరో సమస్య జఠిలమౌతోంది. రూ. 10 కాయిన్ చెల్లడం లేదంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రూ. 10 కాయిన్ ఉన్న వారు ఏం చేసుకోవాలా ? అని తర్జనభర్జనలు పడుతున్నారు. చిరు వ్యాపారులకు..వినియోగదారులకు తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బజార్ల నుండి మొదలు కొని ఆర్టీసీ..పెట్రోల్ బంక్..చిల్లర దుకాణాలు..ఇలా చాలా వరకు ఈ కాయిన్ ను ఎవరు తీసుకోవడం లేదు. డైరెక్ట్ గా ఈ కాయిన్ చెల్లదు..నోటు ఉంటె ఇయ్యండి అనడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. బ్యాంక్‌ అధికారులు సైతం ఈ పుకార్ల విషయమై ఎటువంటి ప్రకటనా సరిగా చేయలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా బ్యాంక్‌ అధికారులు స్పందించి రూ.10 కాయిన్స్‌ విషయంలో పుకార్లను ఖండించేలా కార్యక్రమాలు ప్రజల మధ్యలో నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు.

17:47 - April 25, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై 'పట్నం' ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 10టీవీ ఎండీ వేణుగోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లధనం ఎంత వెలికి తీశారో కేంద్రం దగ్గర సరైన సమాధానం లేదన్నారు. అత్యవసర సమయంలో కూడా నగదు డ్రా చేయాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని. ఈ సమస్యపై బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

09:48 - April 21, 2017

ముంబై : అవినీతి భరతం పట్టాలంటే పెద్ద నోట్లు (రూ. 500, రూ. 1000) నోట్లు రద్దు ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రజలకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అనంతరం రూ. 2000 వేలు, రూ. 500 నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల కూడా సామాన్యుడు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తాజాగా అంధులు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్పర్శతో వాటి విలువను గుర్తించలేకపోతున్నారు. కొత్త నోట్లను ప్రింట్‌ చేసేటప్పుడు విలువను సూచించే అంకెలను కాస్త ఉబ్బెత్తుగా (ఎంబోసింగ్‌) ప్రింట్‌ చెయడం లేదు. దీంతో వాళ్లు రూ. 500, రూ. 2000 నోటు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నట్టు జాతీయ అంధుల సమాఖ్య(ఎన్‌ఏబీ) గురువారం వెల్లడించింది. పాత నోట్లు రద్దు చేసినప్పుడే ఈ సమస్యను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి మార్పులను కొత్త నోట్లలో గమనించలేదని ఎన్‌ఏబీ కార్యదర్శి జొవాకిమ్‌ రాపోజ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది అంధులు పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పద్ధతుల్లో కొత్త నోట్లను గుర్తించే విధానాన్ని నేర్పుతున్నట్లు ముంబైలోని ఓ అంధుల పాఠశాల ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు.

09:39 - April 20, 2017

ఢిల్లీ : డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణా రాష్ట్రం టాప్‌టెన్‌లో నిలిచింది. డిమానిటైజేషన్‌ నేపథ్యంలో.... ప్రభుత్వ అనుసరించిన ముందస్తు ప్రణాళికపై కేంద్ర ఆర్థికశాఖ సైతం ప్రశంసల వర్షం కురిపించింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆన్‌లైన్‌ ట్రాన్జక్షన్స్‌ జరిగేలా ప్రజలను చైతన్య పర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దనోట్ల రద్దుతో దేశం మొత్తం అతలాకుతలమైంది. అన్ని రాష్ట్రాలు ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఫలితంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటి పది రాష్ట్రాల్లో స్థానం సంపాదించుకుంది. గోవా, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలు ముందు వరుసలో నిలవగా.. తెలంగాణ ఆరోస్థానాన్ని సాధించింది.

టాప్‌టెన్‌లో నిలిచిన అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ..
డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం టాప్‌టెన్‌లో నిలిచిన అతిపెద్ద రాష్ట్రమని కేంద్ర ఆర్థిక శాఖ అభివర్ణించింది. ప్రజలకు తొలుత కొంత సమస్య వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని నిలదొక్కుకుందని కితాబునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 15కోట్ల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గతేడాది నవంబర్‌ వరకు స్వైపింగ్‌ మిషన్లు 34 వేలు ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 61 వేలకు చేరింది. అలాగే ఏటీఎంల సంఖ్య 8 నుంచి 9 వేల మధ్యలో ఉంది.

15:54 - April 18, 2017

ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓ హైదరాబాదీ ఓ అమ్మాయికి అత్యవర సమయంలో సహాయం చేసి వార్తల్లోకి ఎక్కాడు. తనకు సాయం చేసింది ఈ ఆటోవాలా అంటూ ఆ యువతి సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఆమె తన ఫేస్‌బుక్‌లో అతనికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు పెట్టింది. ఆ ఆటోవాలా మరెవరో కాదు.. హైదరాబాద్‌కు చెందిన బాబా. వివరాల్లోకి వెళితే...వరిజ శ్రీ అనే యువతి నగరానికి వచ్చింది. వీసా ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది. ఆమె రూ. 5వేలు చెల్లించాల్సి ఉంది. కేవలం రూ. 2వేలు మాత్రమే నగదు ఉంది. దీనితో డబ్బును తీసుకొనేందుకు ఏటీఎంలను ఆశ్రయించింది. కానీ ఏటీఎంలో క్యాష్ లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలో డబ్బు ఉందో తెలుసుకొనేందుకు బాబా అనే వ్యక్తి ఆటో ఎక్కింది. హైదరాబాద్‌లో సుమారు 10 నుంచి 15 ఏటీఎంలకు వెళ్లింది. ఎక్కడా పనిచేయకపోవడం..క్యాష్ లేకపోవడంతో వరిజ దిగాలు చెందింది. తన కార్డు స్వైప్ చేసుకుని రూ. 3వేలు ఇవ్వాలని వివిధ దుకణదారులను కోరింది. కానీ వారు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడారు. ఆమె బాధ అర్థం చేసుకున్న బాబా... తన దగ్గర రూ.3వేలు ఉన్నాయని, అవి తీసుకుని చెల్లించండి అని చెప్పాడు. తన సమస్యను తీర్చిన అతనికి కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే ఆమె.. బాబాతో ఓ సెల్ఫీ తీసుకుని, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టును 6,093 మంది షేర్ చేసుకున్నారు. బాబాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

13:32 - April 17, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అవినీతి అధికారి బయటపడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. విద్యా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ జగదీశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు చెన్నై, విజయవాడ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌సహా ఎనిమింది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. జగదీశ్వర్‌రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16 కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మొత్తంగా 12 బృందాలు పాల్గొన్నాయి.

 

 

06:52 - April 15, 2017

చిత్తూరు : పాత కరెన్సీ నోట్లు టీటీడీకి పెనుభారంగా మారాయి. హుండీల్లో కుప్పలు.. తెప్పలుగా పడుతున్న పాత నోట్లతో అధికారులు సతమతమవుతున్నారు. ఈ విషయంలో ఆర్‌బీఐ ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతో అయోమయంలో పడ్డారు టీటీడీ అధికారులు. పాత కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయంతో కుదేలైన ప్రజలు దాని నుంచి బయటపడినా... శ్రీవారు మాత్రం ఇంకా బయటపడలేదు. ఇంకా తిరుమల శ్రీవారి హుండీలోకి రద్దైన పెద్దనోట్లు భారీగా వచ్చి చేరుతున్నాయి. స్వామివారికి మొక్కులే చెల్లించాలనుకున్నారో? పాతనోట్లు వదిలించుకోవాలనుకున్నారో తెలియదు కాని గడచిన వంద రోజుల్లో రూ.16 కోట్లకు పైగా చెల్లని పెద్దనోట్లను భక్తులు కానుకలుగా సమర్పించారు. చేసేది లేక టీటీడీ అధికారులు ఈ పాతనోట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచి కాపలా కాస్తున్నారు.

పరిష్కారం చూపని రిజర్వ్‌ బ్యాంక్‌..
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం 60 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వచ్చిన భక్తులు స్వామివారికి నిత్యం కోట్ల రూపాయల్లో కానుకలు వేస్తుంటాయి. అయితే కేంద్రం పాతకరెన్సీ నోట్లను రద్దు చేసినా భక్తులు మాత్రం కానుకల రూపంలో శ్రీవారికి పాతనోట్లనే హుండీల్లో వేస్తున్నారు. ఈ నోట్ల విషయంలో టీటీడీ అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. రిజర్వ్‌ బ్యాంకుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వారి నుంచి ఎటువంటి పరిష్కారం లభించలేదని.. వారి సమాధానం కోసం చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా చట్టరీత్యా రద్దైన పాత నోట్లు కలిగి ఉండడం నేరం.. దీంతో పాతనోట్ల విషయంలో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు రిజర్వ్‌బ్యాంక్‌ అధికారులకు రిపోర్ట్‌ చేస్తున్నారు. కానీ అక్కటి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆ నగదును టీటీడీ తమ ఖాజనాలోనే భద్రపరుస్తోంది. ఏదేమైనా ఆర్బీఐ నుంచి సానుకూల స్పందన వచ్చేవరకు శ్రీవారికి ఈ పాతనోట్ల కష్టాలు తప్పేలా లేవు.

Pages

Don't Miss

Subscribe to RSS - Demonetization