devotees

09:24 - November 12, 2018

హైదరాబాద్: కార్తీకమాసం మొదటి సోమవారం కావటంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తలతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. పాతాళగంగలో స్నానంచేసి భక్తులు స్వామి వారిని దర్శించుకోటానికి క్యూలైన్లలో వేచి వున్నారు. ఆలయ అధికారులు తెల్లవారు ఝూమున 3 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. తెలంగాణలోని  వేములవాడ, కీసరగుట్ట, కాళేశ్వరం, వరంగల్ వేయిస్తంభాల గుడి, చెరువుగట్టు, యాదాద్రిలోని శివాలయాలు, నల్గొండ జిల్లా పానగల్ లోని ఛాయా సోమేశ్వరాలయం, కోటిలింగాల లో   పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

11:24 - October 24, 2018

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతోంది. నిత్యం లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలతో తిరుమలకు వచ్చినా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేది క్షణకాలం మాత్రమే...ఆ క్షణకాలం దర్శనానికి 15 నుండి 20 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిందే..మరోవైపు ప్రముఖుల తాకిడితో భక్తుల దర్శనం మరింత ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమలకు భక్తజన తాకిడి గత కొద్ది నెలలుగా నిరంతరం కొనసాగుతోంది. నిత్యం 80 వేల మందికి తక్కువ కాకుండా దర్శనాలు చేయిస్తున్నారు. గత పదేండ్లతో పోల్చితే తిరుమలకు భక్తుల రాక ప్రస్తుతం బాగా పెరిగింది. భక్తులు  పెరుగుతున్న కారణంగా టిటిడికి ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే దీన్ని నియత్రించేందుకు టిటిడి కొత్తగా ఆలోచిస్తోంది. ఇకపై విఐపీలకు బ్రేక్ దర్శనాన్ని నెలకు ఒక్కసారే కల్పించేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. 
Image result for tirumala huge crowdఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా రద్దీ రోజుల్లోనే అధికంగా వస్తున్నారు. వారి వల్ల సాధారణ భక్తులు దర్శనానికి ఆలస్యమవుతోంది. విఐపీల దర్శనం అయిపోయిన తరువాత కూడా దర్శనం  పునరుద్దరించడానికి పావుగంట సమయం పడుతుంది. ఈ సమయంలో సుమారు వెయ్యి మందికే దర్శనం ఆగిపోతుంది.
నిత్యం తిరుమలకు వెల్లువలా వచ్చే రద్దీని తట్టుకోవాలంటే భక్తులను తిరుపతిలోనే కట్టడి చేయాలన్నది టిటిడి ఆలోచన. దీనికోసం అలిపిరిలో సుమారు 2 వేల గదులు నిర్మించాలని ఇటీవలె పాలకమండలిలో తీర్మానించారు. మొదటి  దశలో 120 కోట్లతో 500 గదులు నిర్మించాలని టిటిడి పాలకమండలి తీర్మాణం చేసింది. Related image
గత నెలలో ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1,02,219 ఇది తిరుమలలో రెండవ రికార్డు. గతంలో 2016 లో 1,02,617 మంది ఒకేరోజు స్వామివారిని దర్శించుకోవడం ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి రికార్డులు భవిష్యత్‌లో బ్రేక్ చేయడం కష్టమేమి కాదు. మరి టిటిడి అందుకు తగ్గట్లుగా ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

16:49 - October 20, 2018

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు, దానికి తోడు వారాంతం.. దీంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనానికి దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు.

10:19 - October 17, 2018

తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి  ఆలయాన్ని నెలవారి పూజలు చేసే క్రమంలో భాగంగా  బుధవారం సాయంత్రం  తెరవనున్నారు. ప్రతినెల  దేవాలయం  తెరిచినప్పుడు 5 రోజులు  భక్తుల  దర్శనానికి అనుమతిస్తారు.  శబరిమల అయ్యప్ప స్వామి  ఆలయంలోకి అన్నివయసుల  మహిళలకు   ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత  ఆలయాన్ని భక్తుల కోసం  తెరవడం ఇదే మొదటిసారి.

నిషేధిత వయస్సుకల మహిళలు  స్వామి వారి ఆలయంలోకి ప్రవేశిస్తే  ఆలయాన్ని ప్రతిరోజు శుధ్ది చేయాల్సి ఉంటుందని  ఆలయ పురోహితులు చెపుతున్నారు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కేరళలోని అన్ని జిల్లాలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈరోజు గుడి తెరవనుండటంతో ఆలయ ప్రధాన ద్వారమైన నిలక్కళ్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు చేరుకుని నిషేధిత వయస్సుగల స్త్రీలు కొండ ఎక్కకుండా అడ్డుకుంటున్నారు. కొండపైకి వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసి నిషేధిత వయసుకల మహిళలు ఉంటే వారిని వాహనాల్లోంచి దింపేస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. గుడిలోకి వెళ్లే మహిళలను అడ్డుకోబోమని, ఆలయానికి వెళ్లే మహిళలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరతామని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు.

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఇంతకాలం శబరిమల ఆలయంలోకి అనుమతిలేదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుప్రీం  కోర్టుకు వ్యతిరేకంగా ఇంత పెద్దఎత్తున  ఉద్యమం రావటం ఇదే మొదటిసారి. సుప్రీం తీర్పుపై  రివ్యూ పిటీషన్ వేసే అంశంలో  రాజకుటుంబీకులకు ,దేవస్ధానం బోర్డుకు మధ్య చర్చలు విఫలం అయ్యాయి. ఆలయంలోకి మహిళల ప్రవేశం పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసే ఉద్దేశ్యం లేదని  కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ  దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి  భక్తులు  సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేసారు. దసరా శలవుల తర్వాత  సుప్రీం ఈ పిటీషన్ల పై విచారణ చేపడుతుంది. ఎన్నోఉద్రిక్తల మధ్య ఈ సాయంత్రం శబరిమల ఆలయం తెరుస్తున్నారు. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తారా,లేదా,  మహిళా సంఘాలు, భక్తులు మధ్య  ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం దాకా వేచి చూడాలి. 

20:54 - August 21, 2018

తిరుమల : తిరుమలేశుని ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు.. ఈ ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇంతకీ ఈ పవిత్రోత్సవాల ఉద్దేశం ఏంటి..? ఈ సందర్భంగా నిర్వహించే విశేష పూజాధికాలు ఏంటి..?

కలియుగ వరదుడు.. శ్రీనివాసుడి సాలకట్ల పవిత్రోత్సవాలు.. ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం శాస్త్రోక్త పవిత్ర ప్రతిష్ఠ అనంతరం.. శ్రీదేవీ..భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామిని.. పవిత్ర మంటపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా.. తిరుమలేశుని ఆలయంలో జరిగే అర్చనలు.. ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ.. సిబ్బంది వల్లగానీ.. తెలిసో, తెలియకో జరిగే దోష నివారణార్థం.. ఆలయ పవిత్రతను పరిరక్షించే ఉద్దేశంతో.. ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ..

తిరుమలేశుని పవిత్రోత్సవం... అత్యంత శుభదం..! అనాదిగా.. వస్తోన్న సంప్రదాయం. 15-16 శతాబ్దాల నుంచే ఈ వేడుక ఉన్నా... మధ్యలో ఆగిపోయి.. 1962లో పునఃప్రారంభమైమనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

శ్రీవారికి వినియోగించే.. పవిత్రాల తయారీకి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలు దారం వినియోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. పవిత్రాలు చేసేందుకు.. టీటీడీ శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను పెంచుతోంది.

ఆలయ మొదటి ప్రాకారంలో గ డడడల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. అప్పట్లో ''పవిత్ర తిరునాళ్‌'' పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరలు ఈ శాసనంలో పొందుపరిచారు.

పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులూ.. ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్నపన తిరుమంజనం.. సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకూ నాలుగు మాడవీధుల్లో ఉభయదేవేరులతో శ్రీవారి విహారం.. కొనసాగుతుంది. తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.

పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాల సందర్భంగా.. మూడు రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. 

19:22 - August 21, 2018

కలియుగ వైకుంఠ వాసుడు..శ్రీ తిరుమలేశుడు..శ్రీనివాసుడు. ఆయన సన్నిథిలో ఏడాదంతా ఆనందోత్సవాలే..భక్త జనులకు కన్నుల పండుగలే..వేడుకలే..ఈ నేపథ్యంలో తిరుమలేశుని పవిత్సోవాల నిర్వహణపై 10టీవీ చర్చా కార్యక్రమం..తిరుమలేశుని పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహించాలి? ఈ పవిత్రోత్సవాల వల్ల కలిగే శుభాలేమిటి? అనే అంశాలపై ప్రముఖ పంచాయగ సిద్ధాంతులు..యతేంద్ర ప్రవణాచారి, జ్యోతిష్కులు తేజస్వి శర్మ పాల్గొన్నారు. 

12:02 - June 4, 2018

నెల్లూరు : మర్రిపాడు మండలం తిమ్మానాయుడు పేటలో వింత ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామంలో ఎవరైనా అమ్మవారి ఎదుట మొక్కులు తీర్చుకోవాలంటే ముళ్లకంప మీద దొర్లాల్సిందే. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ముళ్లకంపపై దొర్లుతారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయని ఆగ్రామస్తుల నమ్మకం. మూడేళ్లకోసారి జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇలాంటి మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

19:03 - May 16, 2018

చిత్తూరు : టీటీడీ నూతన చైర్మన్‌ ఆధ్వర్యంలో జరిగిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్లకు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఉద్వాసనకు గురయ్యారు. మరోవైపు రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక టీటీడీ బ్యాంక్‌ డిపాజిట్లపై సబ్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. 

18:51 - May 16, 2018

తిరుమల : తిరుమల శ్రీవారి సేవల నిర్వహణలో పాలకమండలితోపాటు అధికారుల జోక్యం పెరిగిపోయిందని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖల దర్శనాల కోసం కైంకర్యాలను కుదించమని అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరించమని పాలకమండలి సభ్యులు, అధికారులు చెప్పడం తప్పని చెప్పారు. శ్రీవారి ఆలయం గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని రమణదీక్షితులు విమర్శించారు. 

06:45 - February 14, 2018

కర్నూలు : మహా శివరాత్రికి శ్రీశైలం ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఓం నమోః శివాయ నామస్మరణతో శ్రీ గిరి పొంగిపోయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నంది వాహనంపై విహరించారు. సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం అద్యంతం కన్నుల పండువగా సాగింది. పాగాలంకరణతో వరుడైన మల్లన్న కల్యాణోత్సవం అర్ధరాత్రి దాటిన తర్వాత అట్టహాసంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మల్లన్న పాగాలంకరణ ఘట్టాన్ని చూసి తరించేందుకు వచ్చిన వేలాది మంది భక్తజనంతో శ్రీశైలాలయం పోటెత్తింది. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి నిన్న రాత్రి 10గంటల తర్వాత లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం పంచామృతాలతో జల, క్షీర, ఫలరసాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

మల్లన్న వరుడయ్యే సమయం ప్రారంభం కావడంతో రోజుకో మూర చొప్పున నియమ నిష్టలతో పాగాను నేసిన పృథ్వీ వెంకటేశ్వర్లు ఒంటిపై నూలుపోగు లేకుండా గర్భాలయ కలశ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చేసే పాగాలంకరణ ఘట్టాన్ని ఆరంభించారు. రాత్రి పాగాలంకరణోత్సవంతో మల్లన్న వరుడిగా మారి భ్రమరాంబతో కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. పాగాలంకరణ సాగుతున్నంత సేపు ఆలయ ప్రాంగణంలోని అన్ని విద్యుత్‌ దీపాలను ఆర్పేశారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం చెందుతూ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ నామ భజన చేశారు.

ఘట్టం పూర్తవుతుండగానే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి కనుల పండువగా పుష్పాలంకరణతో సిద్ధమయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవ ఘడియలు రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి రోజున కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని.. మహా విష్ణువు కన్యాదానం.. బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తాడని శైవాగమం చెబుతోంది. శివమాలధారణ.. ఉపవాస దీక్షలు.. భక్తుల పుణ్య స్నానాలు.. పాగాలంకరణ సహిత స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంతో దీక్ష ముగిసిందని, తమ తనువులు పులకించాయంటూ శివస్వాములు మాల విరమణ చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రదక్షిణ చేసి తిరిగి నందివాహన సమేతులైన స్వామి వార్ల ఉత్సవమూర్తులను యథాస్థానానికి చేర్చారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - devotees