Dinakaran

17:30 - November 18, 2017

చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌గార్డెన్‌లో ఐటి దాడులు నిర్వహించింది. మద్రాసు హైకోర్టు అనుమతితో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఐటీ అధికారులు పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత పీఏ పూన్‌గుండ్రన్‌, శశికళ గదులు, రికార్డు రూమూల్లో సోదాలు చేశారు. ఓ ల్యాప్‌టాప్‌, పెన్‌ డ్రైవ్‌, డెస్క్‌ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐటి దాడులను నిరసిస్తూ జయ నివాసం వద్ద అన్నాడిఎంకే కార్యకర్తలు హంగామా చేశారు. ఐటి దాడులు మోసపూరిత దాడులని, రాజకీయ కక్ష సాధింపు చర్యలని శశికళ మేనల్లుడు దినకరన్‌ ఆరోపించారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం అమ్మకు నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువులను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి.  సుమారు వెయ్యి కోట్ల ఆస్తులను ఐటి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

10:29 - November 9, 2017

చెన్నై: దినకరన్‌, శిశికళ వర్గానికి షాక్ తగిలింది. శశికళ, దినకరన్‌ ఇళ్లల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జయ టీవీ, నమదు ఎంజీఆర్‌, మక్కల్‌ కురల్‌ కార్యాలయాలయాల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. బెంగళూరులోని శశికళ సన్నిహితుడు,అన్నాడీఎంకే కార్యదర్శి పుగళేంది నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఐస్‌ సినిమాస్‌ వివేక్ నివాసంలో దాడులు నిర్వహించారు.  190 చోట్ల దాడులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.

12:34 - September 20, 2017

తమిళనాడు : రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. అందరి చూపు మద్రాసు హైకోర్టుపైనే నెలకొంది. తీవ్ర ప్రభావితం చేయగల ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా తమిళనాడులో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అమ్మ మరణం అనంతరం అనేక రాజకీయ కోణాల నేపథ్యంలో ముక్కలైన అన్నాడీఎంకే పార్టీ బీజేపీ చొరవతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రస్తుత సీఎం పళనీ స్వామీ, పన్నీర్ వర్గాలు కలిసిపోయాయి. పన్నీర్ వర్గానికి పలు పదవులు కూడా దక్కాయి.

టిటివి దినకరన్ మాత్రం తనకు కొంతమంది ఎమ్మెల్యేల సపోర్టు ఉందని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆయనకు మద్దతు పలుకుతున్న 18 మందిపై అనర్హత వేటు వేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఈ నెల 20 వరకు అసెంబ్లీలో సీఎం పళని స్వామి బలపరీక్షకు ఆదేశించవద్దన్న హైకోర్టు గడువు ఇవాల్టితో ముగియబోతోంది. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనే ఉత్కంఠ పెరిగింది.

ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దినకరన్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారణకు స్వీకరించింది. అత్యవసర అంశం కింద విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు బుధవారం విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. అంతేగాకుండా పళనీ స్వామి సర్కార్ బలం నిరూపించుకోవాలని డీఎంకే వేసిన పిటిషన్ పై విచారణ జరుగనుంది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

21:52 - September 12, 2017

చెన్నై : అన్నాడిఎంకేలో చిన్నమ్మ శశికళ శకం ముగిసినట్లేనా? తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ అన్నాడిఎంకె నిర్ణయం తీసుకుంది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకే మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పాలని భావించిన చిన్నమ్మ
శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేపట్టిన నియామకాలు, ప్రకటనలను ఆమోదించమని స్పష్టం చేసింది. పార్టీ రెండాకుల గుర్తును తిరిగి కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాలని సమావేశం నిర్ణయించింది.

మరోవైపు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి ప‌ళ‌ని ప్రభుత్వం బ‌ల‌నిరూప‌ణ నిర్వహించాల‌ని డీఎంకే నేత స్టాలిన్ మద్రాస్‌ కోర్టుకు వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పీఎంకే పార్టీకి చెందిన బాలు కూడా పిటిష‌న్ వేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబ‌ర్ 10వ తేదీన  మద్రాస్ హై కోర్టు విచారణ చేపట్టనుంది. 

తమిళనాడు ప్రజలను, పార్టీ కార్యకర్తలను పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మోసం చేశారని దినకరన్‌ మండిపడ్డారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. అన్నాడిఎంకెకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌ వెంట ఉండడంతో పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. 

శశికళకు  కాలం కలిసి రాలేదు. జయలలిత మరణానంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టడం....పన్నీర్‌ సెల్వంను సిఎంను పదవి నుంచి తొలగించడం జరిగిపోయాయి. తదనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. సిఎంగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలో అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుపాలయ్యారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం పార్టీలో కొందరికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. శశికళ, దినకరన్‌కు  అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు  తాజాగా తీర్మానం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో  వేచి చూడాల్సిందే.

12:17 - September 12, 2017

చెన్నై : అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలిలత అంటూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. రెండాకుల గుర్తు తమదేనంటూ కూడా తీర్మానం చేశారు. సమావేశం శశికళ, దినకరన్ పై వేటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించారు. దినకరన్ ను పార్టీ పదవుల నుంచి దినకరన్ తప్పించారు. మొత్తం 2 తీర్మానాలకు సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:32 - September 12, 2017

చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. శశికళ, దినకరన్ లపై పార్టీ సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు సమావేశం నిలిపివేయాలంటూ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దినకరన్ పిటిషన్ పై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అనవసరంగా తమ టైమ్ వృథా చేస్తున్నరని పిటిషన్ కొట్టివేసింది. పళనిస్వామి రాజీనామాకు దినకరన్ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కసం వీడియో చూడండి.

 

09:36 - September 11, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం విశ్వాస పరీక్షకు మొగ్గు చూపకపోడతంతో, ఈ అంశంపై కోర్టును ఆశ్రయించాలని ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలన్న విపక్షాల విజ్ఞప్తిపై  ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు స్టాలిన్‌...  ఇన్‌చార్జ్‌ గవర్నర్‌  విద్యాసాగర్‌రావును రెండు సార్లు కలిసి... పళనిస్వామి ప్రభుత్వ  బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. దీనికి విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించకపోవడంతో ఇకపై హైకోర్టును ఆశ్రయించాలని డీఎంకే నిర్ణయించింది. 
మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న సీఎం పళనిస్వామి   
ముఖ్యమంత్రి పళనిస్వామి మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్నారు. అన్నా డీఎంకేకి అసెంబ్లీలో తనిగన సంఖ్యాబలం లేకపోవడంతోనే బలనిరూపణకు పళనిస్వామి భయపడుతున్నారన్నది విపక్ష డీఎంకే వాదన. తమిళనాడు అసెంబ్లీలో 238 మంది సభ్యులు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. డీఎంకేకి 89 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు, ఐయూఎంఎల్‌కు ఒక సభ్యుడు ఉన్నారు.  అన్నా డీఎంకే చీలికవర్గం దినకరన్‌కు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. దినకరన్‌ వర్గం కూడా పళనిస్వామి మంత్రివర్గం బలపరీక్ష కోరుతోంది. గవర్నర్‌ను రెండుసార్లు కలిసి తన వాదాన్ని వినిపించారు. బలపరీక్ష కోరుతున్న డీఎంకే, అన్నా డీఎంకే చీలికవర్గం ఎమ్మెల్యేల సంఖ్య 119 ఉందని చెబుతున్నారు. పళనిస్వామి మంత్రివర్గాన్ని పడగొట్టే ఉద్దేశం తమకులేదని దినకరన్‌ చెబుతున్నా... ప్రభుత్వ బలపరీక్షకు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అంగీకరించకపోవడంతో... దినకరన్‌ కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయాలు గురించి ఆలోచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి తకు 124 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని చెబుతున్నారు. దినకరన్‌ వర్గం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమవైపు తిరిగిరావడంతో తమ బలం 124కు పెరిగిందని, ఈ పరిస్థితుల్లో మెజారిటీ తమకే ఉందని పళనిస్వామి  వర్గం వాదిస్తోంది. తమిళనాడు రాజకీయాలు ఏ  మలుపు తిరుగుతా చూడాలి. 

07:33 - August 29, 2017

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాసానికి ప్రధాన ప్రతిపక్షంతో పాటు శశికళకు చెందిన దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... పళణిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ నేతలు సమావేశమై మరో ఎత్తుగడ వేశాయి. శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించాలని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈసీకి ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశారు. అలాగే జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికను కూడా తమ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇక దినకరన్‌ వర్గంలోని ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి వారిని అనర్హులుగా ప్రకటించి.... తమపై పెట్టిన అవిశ్వాసాన్ని తప్పించుకోవాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. 

20:37 - August 22, 2017

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించవచ్చేమో కానీ.. తమిళ పాలిటిక్స్ మాత్రం అనూహ్యంగానే కపిస్తున్నాయి. అమ్మలేని ఖాళీని భర్తీ చేయటానికి తగిన స్థాయి ఉన్న నేతలు కనిపించకపోవటం పార్టీ ప్రయోజనాలకంటే... పదవులు కావాలనే దాహం వెరసి ఆదిపత్య పోరులో అధికార పార్టీ నానా చిక్కుల్లో ఉంది. ఇక విపక్షం తన ఆయుధాల్ని సిద్ధం చేసుకుంటుంటే... తెరవెనుక మత్రాంగంతో తమిళనాడుపై పట్టు సాధించే ప్రయత్నం మరొకరిది. వెరసి తమిళ్ పాలిటిక్స్ చాలా హాట్ గా మారాయి. దీనిపై టెన్ టివి ప్రత్యేక కథనం..శరవేగంగా మారిపోతున్న తమిళనాడు రాజకీయ పరిణామాలు. ప్రభుత్వానికి షాకులమీద షాకులిస్తున్న దినకరన్. పళని ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తీవ్ర ప్రయత్నాలు. మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ పెరుగుతున్న వార్తలు..విమర్శలతో, పొలిటికల్ సీన్ పై కనిపిస్తున్న కమల్ హాసన్ .. వెరసి చెన్నై పాలిటిక్స్ చాలా హాట్ గా మారాయి.

అందర్నీ కట్టిపడేసేలా.. ఒక బలమైన నేత లేకపోతే ఎలా ఉంటుందో తమిళనాడు రాజకీయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పదవులు, ఎత్తులు, పై ఎత్తుల తప్ప బాధ్యత పట్టని నేతలు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు ఎలా ఉంటాయో తమిళనాడు ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే ఎవరెవరు కలుస్తారో... ఎవరెవరు విడిపోతారో.. అర్ధంకాని విధంగా తమిళడ్రామా సాగుతోంది. దినకరన్ వర్గం ఏం చేయబోతోంది? రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? మద్దతు ఉపసంహరించుకుంటే ఏం జరుగుతుంది? డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయా? మ్యాజిక్ ఫిగర్ సాధించే సత్తా ఎవరికుంది?

నిజానికి పన్నీర్, పళనిలు ఏకంగా కావటమే చాలా చిత్రంగా సాగింది. ఆర్నెళ్ల పాటు అనేక వివాదాలు సాగిన తర్వాత.. మాజీ సీఎంగా మారిన పన్నీర్...తాజా డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు. ఇక శశికళకు పార్టీలో ఎదురేలేదనుకుంటున్న తరుణంలో జైలుపాలై సీన్ యూ టర్న్ తీసుకుంది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో దినకరన్ తెరపైకి వచ్చి నేనున్నా అంటూ కథను మరో మలుపు తిప్పాడు.. అసలు అన్నా డీఎంకే ఎప్పటికైనా కోలుకోగలదా? ఈ వివాదాలనుండి తేరుకోగలదా?

ఈ పరిణామాల వెనుక కమలదళం ఉందా? బీజెపీ తమిళనాట పాగా వేయటానికి అన్నాడీఎంకే లుకలకలను వాడుకుంటోందా? కేంద్రం కనుసన్నల్లోనే తమిళ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయా? అమిత్ షా పర్యటన ఉద్దేశ్యం ఏమిటి? రద్దుకు కారణాలేంటి? అసలు తమిళ రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న మంత్రాంగం ఏమిటి? ఎత్తులు, పైఎత్తులు, పదవీ దాహం కలిసి సాగితే ఎలా ఉంటుందో తమిళ రాజకీయాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. జయ మరణంతో ఒక్కసారిగా ఏర్పడిన గందరగోళం.. అన్నా డీఎంకేను అతలాకుతలం చేస్తోంది. ఎవరికి వారు కుర్చీకోసం ఎత్తులు వేస్తున్నారు. ఓ పక్క రిసార్టు రాజకీయాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. అమ్మ నామస్మరణ చేస్తూ ఎవరికి వారు పైచేయికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించటం లేదు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

17:40 - August 22, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజు రోజుకు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. రెండాకుల విలీన ప్రక్రియ జరిగిన కొన్ని గంటల్లోనే టీటీవీ దినకరణ్‌ షాక్‌ ఇచ్చారు. 19 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసిన ఆయన...పళనిస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బాంబు పేల్చారు. అంతేకాదు అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు పొలిటిక్స్ సస్పెన్స్ థ్రిలర్‌ను తలపిస్తున్నాయి. అన్నాడీఎంకే మాజీ సీఎం ఒ.పన్నీర్‌ సెల్వం వర్గం, సీఎం పళనిస్వామి వర్గం విలీనమై ఆనందోత్సాహాల్లో మునిగితెలుతుండగానే శశకళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ ఊహించని షాక్ ఇచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు. పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని కీలక ప్రకటన చేశారు. సీఎంను మార్చాలి ఈ సర్కార్ మాకొద్దు అని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో పళినిస్వామిపై ఉన్న నమ్మకంతోనే మద్దతిచ్చామని..అయితే ఆ విశ్వాసం ఇప్పుడు పోయిందని గవర్నర్‌కు వివరించారు.

19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు దినకరన్‌ స్పష్టం చేయడంతో పళనిస్వామి సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. అయితే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ రంగంలోకి దిగారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు తగ్గిందని స్టాలిన్ తెలిపారు.

ఇప్పటివరకు పళనిస్వామికి మద్దతుగా ప్రతిపక్షాలు, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కలిపి 117 మంది ఉన్నారు. డిఎంకె మిత్ర పక్షానికి 86 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు పళని వర్గం నుంచి శశికళ వర్గం దూరం కావడంతో 95 స్థానాలకు అన్నాడింఎకె వర్గం పడిపోయింది. అసెంబ్లీలో బలనిరూపణకు 117 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

దినకరన్ కు చెందిన 19 మందితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో, ఇప్పటికిప్పుడు బల ప్రదర్శన జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిణామాలను పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. బలనిరూపణ కోసం దినకరన్‌ వర్గం నుంచి ఎమ్మెల్యేలను లాగేందుకు లాబీయింగ్‌ చేస్తారా? లేక దినకరన్ కు చెక్‌పెట్టేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తారో చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - Dinakaran